.
హిందీ బెల్టులో శృతి ద్వివేది అని ఓ ప్రముఖ జ్యోతిష్కురాలు… మన తెలుగు వేణుస్వామికెి ఫిమేల్ రూపం… తనలాగే సినిమా తారలు, రాజకీయ నాయకులు వంటి సెలబ్రిటీల గండాలు, ప్రాణాపాయాలు, ప్రమాదాల జాతకాలతో వార్తల్లో ఉంటుంది… పాపులర్…
తరచూ నేషనల్ మీడియా చానెళ్ల డిబేట్లకు వస్తుంటుంది… ఏదైనా సంఘటన జరిగితే ‘నేను అప్పుడే చెప్పాను తెలుసా’ అంటుంది… చాలామంది జ్యోతిష్కుల్లాగే..! నిన్న మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ఓ విమాన ప్రమాదంలో మరణించాడు కదా…
Ads
ఆమె 2019లో తను పెట్టిన ట్వీట్‌ను పోస్ట్ చేసి… ‘నేను ముందే చెప్పాను, జరిగింది’ అని అమర్ ఉజాలా చానెల్‌తో మాట్లాడుతూ క్లెయిమ్ చేసుకుంది… కాకపోతే అప్పటి వీడియో సాక్ష్యం ఏమీ లేదు…

హఠాత్ విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణం సంభవిస్తుంది అని ఆమెది పాత ట్వీట్… (విమాన ప్రమాదాలు హఠాత్తుగానే జరుగుతాయి) మరి ఏడేళ్ల తరువాత ఈ విమాన ప్రమాదం జరిగింది కదా, అంటే ఆమె జోస్యం నిజమైంది గ్రేటే అనుకోవాలా..? ఏడేళ్లయిపోయింది, అనుకోకుండా ఇప్పుడు విమాన ప్రమాదం జరిగింది కాబట్టి, అనుకోకుండా ఓ చాన్స్ దొరికింది కాబట్టి క్రెడిట్ తీసుకుంటోందా..?
సరే, జ్యోతిష్కులందరూ చేసే పనే… పైగా 100 శాతం స్ట్రయిక్ రేట్ కూడా ఏ జ్యోతిష్కుడికీ లేదా జ్యోతిష్కురాలికీ ఉండదు…. స్ట్రయిక్ రేటు శాతాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు… అదీ జాతకాలపై, గ్రహచారాలపై, జ్యోతిష్యంపై నమ్మకం ఉన్నవారు మాత్రమే…

కానీ ఇక్కడ మరో విషయమూ చెప్పుకోవాలి… 18 నెలల క్రితం… అంటే 2024 జూలై నెలలో… నాగపూర్ నుంచి ఓ హెలికాప్టర్‌లో అజిత్ పవార్, మరో మంత్రి ఉదయ్ సామంత్ కలిసి గడ్చిరోలిలో స్టీల్ ప్రాజెక్టు పనుల శంకు స్థాపనకు వెళ్తున్నారు… గడ్చిరోలికి వెళ్తుంటే మావోయిస్టు దాడుల భయం సహజం… కానీ ఈసారి దట్టంగా కమ్ముకున్న మేఘాలతో భయం…
- మన దేశంలో చాలామంది ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు కూడా గగన ప్రమాదాల బారినపడ్డారు కదా… కొన్ని సందేహాస్పదాలు, మరికొన్ని సహజ ప్రమాదాలు… దట్టమైన మేఘాలు హెలికాప్టర్‌ను కమ్మేయడంతో అజిత్ పవార్ భయపడిపోయాడు… హెలికాప్టర్ నిజంగానే దారితప్పింది… కాసేపటికి పైలట్ తన నైపుణ్యంతో పరిస్థితిని చక్కదిద్ది సేఫ్ ల్యాండింగ్ చేశాడు…
తనెంత భయాందోళనకు గురయ్యాడో అజిత్ పవార్ తరువాత కూడా చెప్పుకున్నాడు… సీన్ కట్ చేస్తే… 28 జనవరి 2026… మళ్లీ ఇప్పుడు… ఇది చార్టర్డ్ ఫ్లయిట్… ఈసారి మంచి అనుభవం ఉన్న పైలట్, ఓ లేడీ కోపైలట్ ఉన్నారు… కానీ ఈసారి అజిత్ పవార్‌కు విధి అనుకూలించలేదు… కూలిపోయింది, కాలిపోయింది… అందరూ స్పాట్ డెడ్…
కుట్ర కోణాలేమీ లేవు... సాంకేతిక కారణాలే... డీజీసీఏ ప్రాథమిక అంచనాలు కూడా అవే... సో, విమాన ప్రమాదాల్లో మరణించిన నాయకుల జాబితాలో అజిత్ పవార్ పేరు కూడా చేరిపోయింది దురదృష్టవశాత్తూ... విధి వశాత్తూ... అవును, విధి ఓసారి కరుణించి వదిలేసింది... ఈసారి వదిలేయలేదు, బలి తీసుకుంది..!!
Share this Article