.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈసారి పవర్ లో వాటా దక్కింది. సో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఏమి చేసుకున్నా ఇక ఆయనకు ఓకేనా?
చంద్రబాబు తన తొలి టర్మ్ లో వైజాగ్ లో వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి కేటాయించారు. అప్పుడు కూడా ఐటి శాఖ మంత్రిగా ఉన్నది నారా లోకేషే. ఇందులో పెద్ద స్కాం జరిగిన విషయాన్ని వైసీపీ కాదు, మీడియా బయటపెట్టింది.
Ads
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై అప్పట్లో స్పందించారు. అమెరికాలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ప్రధాన కార్యాలయం పది ఎకరాల్లో ఉంటే వైజాగ్ లో పెట్టే యూనిట్ కు 40 ఎకరాల భూమి ఎందుకు అని అయన ప్రశ్నించారు.
కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇలా చేయటం కరెక్ట్ కాదు అంటూ విమర్శలు గుప్పించారు. సీన్ కట్ చేస్తే బ్రాండ్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరున్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భూమి కేటాయింపులను తప్పుపట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉర్సా క్లస్టర్స్ కు వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములు కేటాయించినా మౌనంగా ఉండటం చర్చనీయాంశగా మారింది.
99 పైసలకు ఎకరం చొప్పున టీసీఎస్‌కు భూకేటాయింపులు బాగా విమర్శలకు గురవుతున్న నేపథ్యంలో… ఈ ఉర్సా కథ కూడా అంతే… దీని వెనక ఉన్న ఎజెండా ఏంటో అన్న చర్చ రాజకీయ, అధికార వర్గాల్లో సాగుతోంది.
గత కొన్ని నెలలుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్పుడే పుట్టిన కంపెనీలకు అప్పనంగా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు అప్పగించటం…. వందల కోట్ల భూములు కేటాయించటం కలకలం రేపుతోంది. పెందుర్తి విజయకుమార్, సతీష్ అబ్బూరి డైరెక్టర్లు గా ఉన్న ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా లో రిజిస్టర్ అయిందే రెండు నెలల క్రితం.
కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం, క్యాబినెట్ ఆమోదం మాత్రం ఆగమేఘాల మీద జరిగిపోయాయి. వాస్తవంగా చెప్పాలంటే దేశంలోని నంబర్ వన్ కంపెనీ టిసిఎస్ కు కూడా ఇంత స్పీడ్ గా పని కాలేదు అని చెప్పొచ్చు.
ఉర్సా క్లస్టర్స్ విషయంలో మాత్రం ఫైల్స్ జెట్ స్పీడ్ లో కదిలాయి అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. నారా లోకేష్ తన ఫస్ట్ టర్మ్ లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భూ కేటాయింపులతో వివాదంలో చిక్కుకోగా.. ఇప్పుడు మాత్రం ఉర్సా క్లస్టర్స్ విషయంలో మరో సారి వివాదంలో చిక్కుకున్నట్లనే చర్చ సాగుతోంది.
పైగా ఈ కంపెనీకి ఐటి సెజ్ లోని హిల్ నెంబర్ త్రీలో 3 .5 ఎకరాలు… కాపులుప్పాడలో 56 .36 ఎకరాలు కేటాయించటం విశేషం. అంటే ఒకే కంపెనీకి రెండు చోట్ల భూకేటాయింపులు అన్న మాట. ఇదే ఉర్సా క్లస్టర్ కొద్ది నెలల క్రితమే దావోస్ లో తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఎంఓయూ చేసుకుని 5000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని ప్రకటించింది.
ప్రభుత్వం విధానపరంగా ఐటిని ప్రోత్సహించేందుకు తక్కువ ధరలకు భూములు ఇవ్వాలని క్యాబినెట్ లో పెట్టి నిర్ణయం తీసుకున్నా కూడా అందులోని హేతుబద్దత కచ్చితంగా చర్చనీయాంశమే అవుతుంది. ఆయా కంపెనీలకు ఉన్న బ్రాండ్ ను బట్టి కూడా వీటి విషయంలో వాదనలు మారుతుంటాయి…… వాసిరెడ్డి శ్రీనివాస్
Share this Article