ఎహె, బయటికి పొండెహె… దిక్కుమాలిన సంత… అని చిరంజీవి ఎంత చీదరించుకున్నా సరే… ఏపీ కాంగ్రెస్‌కు సిగ్గు లేనట్టుంది… నో, నో, మా చిరంజీవి, మావాడు, మా పార్టీలోనే ఉన్నాడు తెలుసా అని చెబుతోంది… రాహుల్ గాంధీతో, సోనియా గాంధీతో మస్తు మంచి సంబంధాలు కూడా ఉన్నాయని సారుకు..! ఇప్పుడంటే పార్టీ పరిస్థితి బాగాలేక, పొద్దుపోక సినిమాలు తీసుకుంటున్నాడు గానీ, పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగుపడినా సరే, మళ్లీ వచ్చేసి తెగ ఉద్దరించేయడం ఖాయం… అంతేనా గిడుగు రుద్రరాజన్నా…
బాబ్బాబు… ఒక్క మాట… సదరు మీ మెగాస్టారుడితోనే చెప్పించవచ్చు కదా… నేను కాంగ్రెస్‌లోనే ఉన్నాను, సమయం రాగానే వచ్చి పార్టీని తెగ ఉద్దరిస్తాను అని..! పోనీ, సారు గారు తన పదవీకాలం ముగిశాక కనీసం ఒక్క కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొంటే ఓ ఫోటో చూపించు… ప్రజారాజ్యాన్ని నిమజ్జనం చేశాడు, ప్రతిగా కేంద్ర మంత్రిగా చేశాడు, సరిపోయింది… లెక్క ఖతం… ఇంకా జనంలో ఉంటే, పార్టీ కోసం పనిచేస్తే ఏమొస్తుంది..?
ఏదో నాలుగు సినిమాలు చేసుకుంటే నాలుగు డబ్బులొస్తాయి… అసలే కటకటగా ఉంది… సమయమొస్తే తమ్ముడు పవన్ కల్యాణ్‌కు సలహాలు ఇస్తూ, కనీకనిపించని పెద్ద దిక్కుగా ఉండి… తమ్ముడిని ఉన్నత పదవిలో చూడాలనేది కోరిక కదా… మీ కాంగ్రెస్‌లో ఉంటే ఏమొస్తుంది తనకు..? అసలు కేంద్ర మంత్రులుగా ఉండి, మస్తు సంపాదించుకున్న పెద్ద పెద్ద నేతలే కాంగ్రెస్‌లో ఉండీలేనట్టుగా ఉన్నారు కదా… చిరంజీవి ఒక్కడే పార్టీలో ఉన్నాడా లేదా అనే చర్చ దేనికి..?
Ads
అప్పట్లో కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ ఎక్కడో మాట్లాడుతూ చిరంజీవి తమ పార్టీలో లేడు అని కుండబద్ధలు కొట్టేశాడు… కానీ ఏపీసీసీ మాత్రం వెంటనే ఉలిక్కిపడి, కొంపలు మునిగిపోతున్నట్టు ఆందోళన పడిపోయి, నో, నో, చిరంజీవి మా పార్టీలోనే ఉన్నాడు, కరోనా సేవల్లో బిజీగా ఉన్నాడు, లేకపోతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు అని వివరణ ఇచ్చుకుంది… మధ్యలో ఎఐసీసీ ఎన్నికల కోసం ఓ డెలిగేట్ కార్డు కూడా చిరంజీవికి జారీ చేసినట్టు కూడా వార్తలొచ్చాయి…
రెండుమూడేళ్లుగా ఈ చర్చ జరుగుతున్నా సరే, చిరంజీవి ఒక్కమాట కూడా మాట్లాడలేదు… ఉన్నాడో లేడో చెప్పాల్సింది తనయితే, పీసీసీ ఎందుకు పదే పదే ‘మా వాడే మా వాడే’ అని చాటుకోవడం దేనికి..?
ఏమాటకామాట… చిరంజీవి ఎప్పుడూ ఓమాట మాత్రం అంటున్నాడు… కాంగ్రెస్ గురించి కాదు… నాకు ప్రస్తుతం సినిమాలే ముఖ్యం, రాజకీయాల్లో యాక్టివ్‌గా లేను అని..! మరి పార్టీలో ఉన్నట్టా లేనట్టా మాత్రం తేల్చిచెప్పడు… అదేదో సినిమాలో ఓ పొలిటికల్ డైలాగ్ మాత్రం వినిపించాడు… ‘‘‘‘రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను, కానీ నాకు రాజకీయాలు దూరంగా లేవు’’…. దాన్ని గిడుగు రుద్రరాజు భాషలో చెప్పాలంటే… ‘‘కాంగ్రెస్‌కు నేను దూరంగా ఉన్నాను, కానీ నాకు కాంగ్రెస్ దూరంగా లేదు…’’ ఎహె, అర్థం కావడం లేదు అంటారా..? అవును మరి, చిరంజీవి పోకడే అలా ఉంది..!!
Share this Article