.
చిన్న కథ…
అలా రాసుకుంటూ వెళ్ళాను.
నచ్చుతుందో లేదో…
చదివి చెప్పండి.
**
ప్రశ్న కూడా ఇక్కడ ఓ ప్రార్థనలాంటిదే.
భూటాన్‌లో కొన్ని ప్రశ్నలు అడగరు…
వాటిని నడుచుకుంటూ తీసుకెళ్తారు.
ఎత్తైన పర్వతాల ఒడిలో, ప్రార్థనా జెండాల మధ్య ఊగిసలాడుతూ, మన ఊపిరితో కలిపి వదిలేస్తారు.
ఆ రోజు ఉదయం…
Ads
టైగర్ నెస్ట్ మఠం దిగువనుండి వచ్చే మబ్బు మెల్లగా నడుస్తోంది.
నేను మాత్రం బూట్లు విప్పి, చలితో గట్టిపడిన నేలపై నగ్న పాదాలతో నడుస్తున్నాను.
ఇసుక కాదు ఇది…
రాయి కాదు….
ఏదో జీవంతో ఉన్న నేల.
పాదాన్ని పెట్టగానే తిరిగి ప్రశ్న వేసే నేల.
నేలకి పాదానికి మధ్య ఏదో సంయోగ క్రియ జరుగుతోంది.
అది స్పర్శ కాదు…
అది గుర్తింపు.
అక్కడ గాలి కూడా భూటాన్‌దే.
మనల్ని తాకే ముందు మనసుని ఒకసారి చూసి వస్తుందేమో అనిపిస్తుంది.
విజృంభించి తాకదు.
అడుగుల్ని లెక్కపెట్టి, ఊపిరిని వినిపించుకుని,
దేహాన్ని కాదు లోపలున్న ఖాళీని తాకుతుంది.
అణువణువూ స్పందిస్తోంది.
మనమేమీ చెప్పకపోయినా, ఈ దేహంలో ఉన్న ప్రతి అణువు “ఇక్కడే ఉండు” అని అడుగుతోంది.
ఎంత విచిత్రం కదా…
మనసు మాత్రం ఎప్పుడూ దూరం కోసం పరుగులు పెడుతుంది.
ముందుకు నడుస్తూ ఉంది ఆమె.
లేదంటే… నేను ఆమెతో నడుస్తున్నానో…
లేదా ఆ ప్రశ్నతో నడుస్తున్నానో తెలియదు.
“నిన్నే అడిగేది… ఇప్పుడెక్కడికి?”
అన్నాను.
ఆమె నవ్వలేదు.
నవ్వాల్సిన అవసరం కూడా లేదన్నట్టు
గాలికి రెపరెపలాడుతున్న ప్రార్థనా జెండాల్ని చూస్తూ నిలబడింది.
“ఇక్కడే,” అంది.
“ఈ మబ్బు కరిగే వరకూ.
ఈ ప్రశ్న అలసే వరకూ.”
భూటాన్‌లో దారులు కూడా అలా ఉంటాయి.
ఎక్కడికి తీసుకెళ్తాయో చెప్పవు.
ఎందుకు తీసుకెళ్తున్నాయో మాత్రం అర్థమయ్యేలా చేస్తాయి.
ఆమె ధరించింది. భూటాన్ కీరా.
కాటన్ కాదు…
ఏదో చేతితో నేసినట్టు ఉంటుంది.
దేహానికి కాదు. శ్వాసకు కుట్టినట్టుంది.
నుదురునుండి విడిచిపోయిన కురులు
పర్వతాల వెంట నడిచే నదిలా ఉంటాయి.
ఆ కురులకు గాలికి ఎక్కడ ఆగాలో తెలుసు.
ఎక్కడ ఊగాలో తెలుసు.
ఒక్కసారిగా గంటల శబ్దం.
ఎవరో దూరంగా ప్రార్థన చక్రం తిప్పుతున్నారు.
భూటాన్‌లో చలి కూడా ఆకలిలానే ఉంటుంది.
మెల్లగా గుర్తొస్తుంది.
ఒక చిన్న దుకాణం.
చెక్కతో చేసినది.
లోపల అగ్ని.
అగ్ని చుట్టూ మనుషులు.
ఆ క్షణంలోనే
మనసు మళ్లీ బాల్యంలోకి జారిపోయింది.
భాష లేదు.
ప్రశ్న లేదు.
కాలం లేదు.
భూటాన్‌లో అద్భుతమేమిటంటే
ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలు దొరకవు.
ప్రశ్నలే నెమ్మదిగా కరిగిపోతాయి.
చీకటి తొందరగా దిగింది.
ఇక్కడ సాయంత్రం కూడా ధ్యానమే.
పర్వతాల వెనక సూర్యుడు వెళ్లిపోతుంటే
ఆమె నీడ నా మీద పడింది.
నీడ కూడా ఇక్కడ మాటాడుతుంది.
“ఇంకెన్ని రోజులు ఉంటావ్?” అంది.
“తెలీదు…
ఇక్కడ సమయానికి కూడా పేర్లు లేవు,” అన్నాను.
ఆమె చూసింది.
నేరుగా కాదు.
మధ్యలో మబ్బు దాచుకొని.
“అయితే
ప్రశ్నల్ని ఇక్కడే వదిలెయ్యి,” అంది.
“భూటాన్ వాటిని చూసుకుంటుంది.”
మనుషులు
దారులు చూపించడానికి రావు.
నిలబడటం నేర్పించడానికి వస్తారు.
భూటాన్ కూడా అంతే.
ఇక్కడ నేల కూడా అడుగుతుంది
“ఇప్పుడెక్కడికి?”
మనం చెప్పలేకపోతే
అది నవ్వుతుంది.
ఆమెతో గడిచిన ఆ రోజులు
భూటాన్ మ్యాప్‌లో గుర్తు పెట్టుకునే ప్రదేశాలు కాదు.
మనసులో గుర్తుండిపోయే మలుపులు.
పారోలో మొదలైంది మా నడక.
పారో లోయ ఉదయాన్నే చాలా మౌనంగా ఉంటుంది.
పర్వతాలు మాట్లాడవు…
కానీ వినిపిస్తాయి.
చెక్కతో చేసిన చిన్న హోమ్‌స్టే.
కిటికీ బయట ప్రార్థనా జెండాలు.
వాటికి మధ్యగా ఉదయం గాలి
చిన్న చిన్న రాగాలు వాయిస్తున్నట్టు అనిపించేది.
“ఇక్కడ ఉదయాలు చాలా నెమ్మదిగా లేస్తాయ్,” అన్నాను.
“అందుకే కదా బాగుంటాయి,” అంది.
“మనల్ని మేల్కొలపవు…
మనతో పాటు మెల్లగా లేస్తాయి.”
అమ్మాయి చేతిలో కప్పు.
సుజా టీ.
వెన్నెపాలు, ఉప్పు, టీ కలిసి
మొదట వింతగా అనిపించినా
రెండో సిప్ కు మనసు అలవాటు పడిపోయింది.
“నీకు నచ్చిందా?” అంది.
“నచ్చడం కాదు,” అన్నాను.
“ఇది కూడా నేల లాంటిదే…
తొందరగా అర్థం కాదు.”
ఆమె నవ్వింది.
ఆ నవ్వులో పారో ఉదయం కలిసిపోయింది.
తర్వాత థింఫూ.
రాజధాని…
కానీ రాజసికత లేదు.
అడుగులకన్నా మనుషులే నెమ్మదిగా ఉంటారు.
మెమోరియల్ చోర్తెన్ దగ్గర కూర్చున్నాం.
వృద్ధులు ప్రార్థనా చక్రాలు తిప్పుతున్నారు.
వాళ్ల చేతుల్లో కాలం కూడా తిరుగుతున్నట్టు.
“ఇక్కడ వాళ్లు ఎందుకు అంత ప్రశాంతంగా ఉంటారు?” అన్నాను.
“ఏమో,” అంది.
- “బహుశా వాళ్లు జీవితం మీద గెలవాలనుకోరు.
తోడు నడవడమే సరిపోతుంది అనుకుంటారు.”
ఆ మాట నాలో ఎక్కడో తాకింది.
మనమంతా
జీవితం మీద గెలవాలనే తపనలో
జీవించడమే మర్చిపోయామేమో.
సాయంత్రం మోమోస్ తిన్నాం.
రెడ్ రైస్‌తో పాటు ఎమ్మా దత్సీ.
మిరపకాయల మంట
నోట్లో కాదు…
నేరుగా మనసులోకి ఎక్కింది.
“ఇది చాలా కారంగా ఉంది,” అన్నాను.
“అలవాటు అవుతుంది,” అంది.
“ఇక్కడ చాలా విషయాల్లానే.”
ఆమె మోమోని రెండు భాగాలుగా విరిచింది.
ఒకటి నాకిచ్చింది.
అది ప్రేమా?
లేదా సహజత్వమా?
తెలియలేదు.
తెలియకపోవడమే బాగుంది.
పునాఖా వెళ్లిన రోజు
నది మీద వంతెన.
పునాఖా జోంగ్ నిశ్శబ్దంగా నిలబడి ఉంది.
రెండు నదులు కలిసే చోట.
“ఇది చూడూ,” అంది.
“రెండు నదుల నీళ్లు కలుస్తాయి…
కానీ ఒకటిగా మారవు.”
“అలాగే ఉంటే బాగుంటుందా?” అన్నాను.
ఆమె చూసింది.
ఈసారి నవ్వలేదు.
“అవును,” అంది.
“లేకపోతే రెండింటి స్వరూపం పోతుంది.”
ఆ క్షణంలో
మేమిద్దరం కూడా
అలా కలిసే ఉన్నామేమో అనిపించింది.
రాత్రి
చెక్క నేలపై కూర్చుని
బక్‌వీట్ ప్యాన్‌కేక్స్ తిన్నాం.
బయట చలి.
లోపల వేడి.
“నువ్వు మళ్లీ వస్తావా ఇక్కడికి?” అంది.
“వచ్చేలా ఉంటే వస్తాను,” అన్నాను.
“అంటే?”
“కొన్ని చోట్లకి అక్కడి
మనసే పిలిస్తేనే రావాలి.”
ఆమె తల ఊపింది.
అర్థమయ్యిందన్నట్టు.
ఆమెతో గడిచిన మధుర క్షణాలు
ఏ ఫోటోల్లోనూ లేవు.
ఏ మాటల్లోనూ పూర్తిగా రావు.
అవి
పారో గాలిలో
థింఫూ గంటల శబ్దంలో
పునాఖా నదుల కలయికలో
ఎమ్మా దత్సీ మంటలో
మోమో ఆవిరిలో
నెమ్మదిగా కలిసిపోయాయి.
ప్రేమా?
తపనా?
విరహమా?
కవిత్వమా?
తనతో ప్రయాణం ఒకటే చెప్పింది.
కొన్ని అనుభూతులకు
పేర్లు అవసరం లేదు.
ఉండటం చాలు.
ఆమెతో గడిచిన ఆ రోజులు కూడా అంతే.
ఆమెతో గడిచిన రోజులు రోజుల్లా అనిపించలేదు.
భూటాన్‌లో సమయం కూడా నడవదు…
కూర్చుంటుంది.
మన పక్కనే.
ఉదయాన్నే మబ్బు ముందుగా లేచేది.
మేము కాదు.
మబ్బు వెళ్లే దారిని చూస్తూ కూర్చునేవాళ్లం.
వేడెక్కని టీ గ్లాసులోంచి ఆవిరి లేచేలోపు
సూర్యుడు పర్వతాల వెనకనుంచి జాగ్రత్తగా తొంగి చూసేవాడు.
“ఇక్కడ సూర్యుడికీ తొందర ఉండదా?” అన్నాను.
ఆమె నవ్వింది.
“ఉంటుంది,” అంది.
“కానీ ఇక్కడ తొందర అంటే
వచ్చేలోపు అడుగుల్ని లెక్క పెట్టుకోవడం.”
ఆమె మాటలు ఎప్పుడూ అలా ఉంటాయి.
సూటిగా కాదు.
పర్వత దారుల్లా.
ఆ రోజు మేము నది వెంట నడిచాం.
నీరు చాలా నెమ్మదిగా ప్రవహిస్తోంది.
కానీ శబ్దం మాత్రం లోతుగా ఉంది.
“నీరు ఎందుకు అలా ఉంది?” అన్నాను.
“దీనికీ గమ్యం ఉంది,” అంది.
“కానీ తొందర లేదు.”
ఆ మాట నాలో ఎక్కడో తాకింది.
మనకున్న గమ్యాలన్నీ తొందరతోనే విషమయ్యాయేమో.
మధ్యలో ఆమె ఆగిపోయింది.
నదిని చూస్తూ.
“ఇక్కడ నిలబడదామా?” అంది.
“ఎందుకు?” అన్నాను.
“అలా… కాసేపు.”
అంది.
అంతే.
భూటాన్‌లో “అలా” అనడం కూడా ఒక సరైన కారణమే.
చలికి చేతులు గట్టిపడుతున్నాయి.
ఆమె మాత్రం కళ్లను మూసుకుంది.
గాలిని వింటోంది.
“ఏం వింటున్నావ్?” అన్నాను.
“మనల్ని,” అంది.
“మనిద్దరం మాట్లాడుకోని మాటల్ని.”
ఆ క్షణంలో
ఇది ప్రేమా?
తాపమా?
విరహమా?
అని అడగాలనిపించలేదు.
అడిగితే పాడవుతుందేమో అన్న భయం.
లేదంటే…
పేరు పెట్టగానే చిన్నదైపోతుందేమో అన్న అనుమానం.
సాయంత్రం ప్రార్థనా మఠం దగ్గర కూర్చున్నాం.
గంటల శబ్దం ఆకాశం వరకూ వెళ్తోంది.
మళ్లీ మనలోకి వస్తోంది.
“నీకు దేవుడు మీద నమ్మకం ఉందా?” అంది.
“ఉంది,” అన్నాను.
“కానీ దేవుడిలా కాదు.”
“అయితే ఎలా?”
“ఇలా,” అన్నాను.
“ఈ క్షణంలా.”
ఆమె నిశ్శబ్దంగా తల ఊపింది.
అది అంగీకారమో…
అర్థమయ్యిందో…
లేదా నాకోసం వదిలేసిందో తెలియదు.
రాత్రిళ్లు మేము ఎక్కువగా మాట్లాడేవాళ్లం కాదు.
నిప్పు పక్కన కూర్చుని
చేతుల్లో టీ పట్టుకుని
నీడల్ని చూస్తూ.
“నువ్వు వెళ్లిపోతావు కదా,” అంది ఒక రాత్రి.
“అవును,” అన్నాను.
“ఎప్పుడు?”
“తెలీదు.”
ఆమె నవ్వలేదు.
ఏమీ అనలేదు.
నిప్పులో ఒక కట్టె వేసింది.
ఆ నిప్పు ఒక్కసారిగా ఎగసింది.
ఆమె ముఖం వెలిగింది.
అప్పుడు అర్థమైంది.
ఇది ప్రేమ కాదు.
ఇది విడిపోవడమూ కాదు.
ఇది…
రెండు మనసులు ఒకే మౌనంలో
కొంచెం దూరం నడిచిన ఆనందం.
భూటాన్‌లో కొన్ని ప్రయాణాలు
చేతులు పట్టుకుని సాగవు.
మనసులు తాకి
తర్వాత నెమ్మదిగా వదిలేస్తాయి.
ఆ రోజు ఉదయం
మబ్బు చాలా దగ్గరగా ఉంది.
ఆమె కనిపించడమే కష్టం.
“ఇప్పుడెక్కడికి?” అన్నాను.
ఆమె చూశింది.
ఈసారి నేరుగా.
“ఇక్కడినుంచి
నీలోకి,” అంది.
ఆ మాటకి
సమాధానం అవసరం లేదు.
భూటాన్ నేర్పిన అతి పెద్ద పాఠం అదే.
కొన్ని పరిచయాలు
ఉండటానికి రావు.
మిగిలిపోవడానికి వస్తాయి.
కొన్ని ప్రయాణాలు
ముగియవు.
మన లోపలే నడుస్తుంటాయి…
తిరుగు ప్రయాణానికి ముందు రోజు రాత్రి
భూటాన్ అసలు రూపం చూపించింది.
పగలంతా నెమ్మదిగా నడిచిన ఈ నేల
రాత్రి వచ్చేసరికి
మనసును అడగడం మొదలుపెడుతుంది.
ఆ రోజు పునాఖాలోనే ఉన్నాం.
నదుల మధ్య నిశ్శబ్దంగా నిలబడ్డ జోంగ్ వెనక
చీకటి మెల్లగా దిగుతోంది.
వీధిదీపాలు తక్కువ.
నక్షత్రాలు మాత్రం ఎక్కువ.
చెక్కతో చేసిన చిన్న అతిథి గృహం.
బయట చలి.
లోపల నిప్పు సెగ చుట్టు.
ఆ నిప్పు చుట్టూ మేమిద్దరం.
ఎమ్మా దత్సీ వాసన ఇంకా గాలిలోనే ఉంది.
రెడ్ రైస్ పళ్లెం పక్కకి నెమ్మదిగా జారిపోయింది.
ఇప్పుడు ఆకలి లేదు.
మాటలే కడుపు నింపాయి.
ఆమె అలా కూర్చుంది.
కళ్లలో వెలుగు కాదు.
ప్రశాంతత.
“రేపు వెళ్తున్నావు కదా,” అంది.
ప్రశ్నలా కాదు.
నిజంలా.
“అవును,” అన్నాను.
ఈసారి తెలీదు అని అనలేకపోయాను.
నిప్పులో కట్టె చిటపటలాడింది.
ఆ శబ్దం మా మాటల మధ్య ఖాళీని నింపింది.
“వెళ్లిపోవడం ఎందుకు ఇంత సహజంగా ఉంటుంది?” అంది.
“ఉండటం మాత్రం ఎందుకు అంత కష్టంగా ఉంటుంది?” అంది.
ఆమె ప్రశ్న
నన్ను కాదు
నాలోని ఏదో లోతును తాకింది.
“బహుశా, ఉండటానికి మనం కారణాలు వెతుకుతాం.
వెళ్లిపోవడానికి కారణాలు అవసరం ఉండవు” అన్నాను.
ఆమె నవ్వింది.
చిన్న నవ్వు.
కానీ ఆ నవ్వులో ఏదో ముగింపు ఉంది.
ఆమె నన్ను చూడలేదు.
నిప్పునే చూస్తోంది.
నిప్పును చూస్తూనే…
“మనసు ఎప్పుడూ ప్రశ్నలతోనే పుడుతుందా?” అంది.
“లేదా మనమే ప్రశ్నల్ని నేర్పుతామా?”
“మనసు ఖాళీగా పుడుతుంది,
మనమే దాన్ని ప్రశ్నలతో నింపేస్తాం.” అన్నాను
“అయితే ప్రేమ?” అంది.
“అది ప్రశ్నా?
లేదా సమాధానమా?”
ఆ ప్రశ్నకి
నాకు ఏ మాట రాలేదు.
కొన్ని సమాధానాలు
మాటలుగా రావు.
ఉండిపోయే మౌనంగా మారతాయి.
ఆమె చేతిని నిప్పు దగ్గరకు చాపింది.
వెచ్చదనపు సెగను తీసుకున్నట్టు.
“నువ్వు వెళ్లిపోయాక,
నన్ను గుర్తుపెట్టుకుంటావా?”
“అవును,” అన్నాను.
చాలా స్పష్టంగా.
“ఎలా?” అంది.
“ఈ రాత్రిలా,” అన్నాను.
“పేరు పెట్టకుండా.”
ఆమె కళ్లలో ఒక్కసారిగా తేమ.
కానీ కన్నీళ్లు కాదు.
అవి కూడా భూటాన్‌లానే
వెల్లువ కావు.
“మనిద్దరం ఏం అయ్యాం?” అంది.
“ప్రేమా?
స్నేహమా?
ప్రయాణమా?”
“మనిద్దరం,” అన్నాను,
“ఒకే నిశ్శబ్దంలో కొంచెం దూరం నడిచాం.”
ఆమె నవ్వింది.
ఈసారి నిండుగా.
బయట గాలి బలంగా వీచింది.
జెండాలు గాలికి కదిలాయి.
అవి ఏదో చెబుతున్నట్టు.
ఆ రాత్రి
మేము ఎక్కువగా మాట్లాడలేదు.
కానీ మనసులు చాలా మాట్లాడుకున్నాయి.
నిద్ర పట్టలేదు.
నిద్ర అవసరం కూడా అనిపించలేదు.
తెల్లవారే ముందు
ఆమె అంది
“రేపు వెళ్తావు.
కానీ ఇక్కడ ఏదో వదిలేసి వెళ్తావు.”
“ఏమిటది?” అన్నాను.
“నిన్ను,” అంది.
ఆ మాటకి
నేను ఏమీ చెప్పలేదు.
ఎందుకంటే
కొన్ని సత్యాలు
అంగీకరించడమే సరిపోతుంది.
ఆ రాత్రి
భూటాన్ నాకు ఒక విషయం నేర్పింది.
పుట్టుక అంటే
శరీరం మొదలవడం కాదు.
మనసు తొలిసారి నిజంగా తాకడం…
చావు అంటే
శ్వాస ఆగిపోవడం కాదు.
మనసులో మిగిలినదాన్ని వదిలేయడం.
మధ్యలో ఉన్నదే జీవితం.
ఆ జీవితం
ఆ రాత్రి
ఆమెతో
పూర్తిగా జరిగింది.
రేపు నేను వెళ్తాను.
ఆమె అక్కడే ఉంటుంది.
కానీ ఆ రాత్రి మాత్రం
ఎక్కడికీ వెళ్లదు.
మా మధ్యే
శాశ్వతంగా ఉంటుంది.
తిరుగు ప్రయాణం రోజు ఉదయం
భూటాన్ నన్ను లేపలేదు.
నేనే మెల్లగా లేచాను.
లేవడం కాదు…
ఏదో లోపలినుంచి విడిపోవడం.
బయట చూస్తే
మబ్బు ఈసారి పర్వతాల్ని కప్పలేదు.
వాటిని ఆలింగనం చేసుకుంది.
ఆకాశం నీలం కాదు.
తెలుపు కాదు.
రెండింటి మధ్య ఉన్న
ఏకాంత రంగు.
గాలి చాలా నెమ్మదిగా ఉంది.
అలా ఉంటేనే
విడిపోవడం భరించగలమన్నట్టు.
ఆ ఉదయం
నాకోసం ఎన్నో జ్ఞాపకాలు
మూట కట్టి ఇచ్చింది.
కొన్ని మాటలుగా…
కొన్ని మౌనంగా…
కొన్నిటిని మాత్రం
ఎప్పటికీ తెరవకూడని మూటలుగా.
ఆమె అప్పటికే లేచి ఉంది.
కిటికీ దగ్గర నిలబడి.
ఏమి చూస్తుందో తెలియదు.
కానీ చూస్తోంది.
“ఇంత అందంగా ఉంది కదా ఉదయం,” అన్నాను.
ఆమె తల ఊపింది.
“అందం కాదు,” అంది.
“ఇది వీడ్కోలు ముందు ఉండే నిజాయితీ.”
ఆ మాట
ఆ ఉదయాన్ని ఇంకాస్త లోతుగా మార్చింది.
టీ మరుగుతోంది.
కప్పుల్లోకి పోసేటప్పుడు
ఆవిరి కళ్లద్దాలు పెట్టినట్టుంది.
ప్రపంచం మసకగా కనిపిస్తోంది.
“మనసు కూడా ఇలానే ఉంటుంది కదా,” అంది.
“విడిపోవడం దగ్గరగా వచ్చేసరికి
అన్నీ మసకబారిపోతాయి.”
“అవును,” అన్నాను.
“కానీ అదే మసకలో
నిజం స్పష్టంగా కనిపిస్తుంది.”
ఆమె నన్ను చూసింది.
ఈసారి చాలా సేపు.
“మనము మళ్లీ కలవొచ్చు,” అంది.
మళ్ళీ తానే ఆగి…
“లేదా కలవకపోవచ్చు.”
ఆ మాట మధ్యలో
ఏ బాధ లేదు.
ఏ ఆశ లేదు.
ఉన్నది ఒక్క అంగీకారం.
“కలిస్తే,” అన్నాను,
“అది యాదృచ్ఛికం కాదు.”
“కలవకపోతే?” అంది.
“అది కూడా తప్పు కాదు,” అన్నాను.
“కొన్ని బంధాలు
కలవకపోవడంలోనే పూర్తి అవుతాయి.”
ఆమె నవ్వింది.
కానీ ఆ నవ్వు
కళ్లకు రాలేదు.
మేము నడిచాం.
చివరిసారిగా.
అదే దారి.
అదే మబ్బు.
కానీ అడుగులు బరువుగా.
ఆమె మనసు నడుస్తోంది.
నాకు వినిపిస్తోంది.
ఇక్కడే ఉండిపోవచ్చేమో…
కానీ అతను వెళ్లాలి…
అతను వెళ్లకపోతే, ఇది జ్ఞాపకం కాదు…
బరువవుతుంది…
నా మనసు కూడా మాట్లాడుతోంది.
నేను వెళ్తున్నాను…
కానీ నేను వెళ్లిపోవడం లేదు…
నేను ఇక్కడే ఏదో వదిలేస్తున్నాను…
మేము ఆగాం.
ఇక ముందుకు దారి లేదు.
“ఇంతేనా?” అంది ఆమె.
“ఇంతే,” అన్నాను.
“ఇంతే చాలనిపించేంత.”
ఆమె ఒక్క అడుగు వెనక్కి వేసింది.
నేను ఒక్క అడుగు ముందుకు వేయలేదు.
మధ్యలో గాలి ఉంది.
మబ్బు ఉంది.
మనసు ఉంది.
“నన్ను గుర్తు పెట్టుకుంటావా?”
అది ప్రశ్న కాదు.
ఒక నిశ్చయం కోరుకునే ప్రయత్నం.
“నేను నన్ను గుర్తుపెట్టుకున్నప్పుడల్లా,
నువ్వూ ఉంటావు.” అన్నాను
ఆమె కళ్లు నిండాయి.
ఈసారి కన్నీళ్లు ఆగలేదు.
“అయితే సరిపోతుంది,” అంది.
నేను ఏమీ చెప్పలేదు.
ఎందుకంటే
ఆ ఉదయానికి
మాటల కన్నా
నిశ్శబ్దమే ఎక్కువ అర్థం తెలుసు.
నేను తిరిగి చూస్తూ నడవలేదు.
ఆమె కూడా పిలవలేదు.
కానీ…
మనసు మాత్రం
అక్కడే నిలబడిపోయింది.
భూటాన్‌లో.
ఆ ఉదయంలో.
ఆ మబ్బులో.
ఆమె దగ్గర.
కన్నీళ్లు వచ్చాయి.
వచ్చి వెళ్లిపోయాయి.
కానీ లోపల ఏదో
అక్కడే ఉండిపోయింది.
అది బాధ కాదు.
అది ప్రేమ కాదు.
అది విరహం కూడా కాదు.
అది
ఒక మనసు
మరో మనసుని
నిజంగా తాకిన తర్వాత
ఎప్పటికీ మరిచిపోని
స్థితి.
నేను తిరిగివచ్చాను.
కథ ముగిసింది.
కానీ
మనసు మాత్రం
ఇంకా అక్కడే ఉంది.
.
.
.
.
.
.
రఘు మందాటి
Share this Article