Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమెరికా చమురు దాహం – రక్త పిపాస ఉగ్రవాదం! పశ్చిమాసియా ప్రకంపనలు

March 4, 2026 by M S R

.

Suraj Kumar అమెరికా చమురు దాహం – రక్త పిపాస ఉగ్రవాదం! #పశ్చిమాసియాప్రకంపనలు… చీమా చీమా ఎందుకు కుట్టావ్? అంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా!? అందట. సరిగ్గా ఇలాంటిదే పశ్చిమ ఆసియా పరిణామాలపై ఇండియా స్టాండ్.

దాయాది పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ [#ISI] తో జతకట్టి, కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ హమాస్ పాక్ ఆక్రమిత కశ్మీర్ [#PoK] వరకు వచ్చేసింది! ఇరాన్ ప్రాక్సీలుగా వ్యవహరిస్తూ రక్తదాహంతో పని చేస్తున్న హమాస్ [#Hamas], హిజ్బొల్లా [#Hezbollah], హౌతీస్ [#Houthis] లాంటి టెర్రరిస్ట్ ఔట్ ఫిట్స్, మధ్యప్రాచ్యం [#MiddleEast] లో పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్న వైనాలు అనేకం తరచూ మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తూనే ఉన్నాయి!

Ads

ముడిచమురు [#CrudeOil] అవసరాల రీత్యా భారత్, ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ తో సత్సంబంధాలు నెరుపుతూ వస్తోంది! ఒకరకంగా అది మనకు మిత్రదేశం అన్నది కాదన లేని సత్యం! కానీ, పాకిస్తాన్ మన శత్రుదేశం అన్నది కూడా మరువలేని నిజం!

ఐతే, ఇరాన్ ఒక్కమాట చెప్తే, హమాస్ వెనకడుగు వేయక తప్పదు! మరి, మిత్రదేశమే కదా? ఇరాన్ ఎందుకు ఆ పని చేయడం లేదు? అంటే, మతమౌఢ్యం, పాకిస్తాన్ తో దానికున్న సన్నిహిత సంబంధాలే ప్రధాన కారణం! సరిగ్గా, ఈ పరిణామాలకు, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి మన కంటికి కనిపించని, ఆలోచనలకు తట్టని ఒక కనెక్షన్ ఉంది!

కట్ చేస్తే, ఉగ్రవాదంపై తమ విధానం జీరో టాలరెన్స్ అని ఇజ్రాయెల్ పార్లమెంట్ కెనెసెట్ [#Knneset] లో భారత్ ప్రకటన! ఆ మరుసటి రోజే ఆపరేషన్ రోరింగ్ లయన్ [#OperationRoaringLion] లో భాగంగా ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాల సంయుక్త దాడి! ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ [#OperationEpicFury] పేరిట శత్రు దుర్భేద్యమైన కోటలో దాక్కున్న సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతం చకచకా జరిగిపోయాయి!

ఐతే, ఈ హఠాత్పరిణామాలకు ముందు చోటు చేసుకున్న కొన్ని ఘటనలను పరిశీలిస్తే, అసలేం జరిగిందన్న దానిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మిత్రదేశం ఇరాన్ మాయలో పడి భారత్ చాలాకాలం ఉగ్రవాద సంస్థ హమాస్ ను ఒక రాజకీయ పార్టీగానే చూస్తూ వచ్చింది!

కానీ, ఎప్పుడైతే ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ [#Mossad], ఇండో – పాక్ సరిహద్దుల్లో హమాస్ కదలికలపై మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ [#RAW] కు ఉప్పందించిందో, ఆనాటి నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి! మొస్సాద్, రా మధ్య ధృడమైన అవగాహన ఏర్పడింది! ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించడానికి రెండింటి మధ్య సమాచార మార్పిడి మొదలైంది.

ఐతే, అంతర్జాతీయ యవనికపై ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలు ప్రధానంగా మూడు! అవి పాకిస్తాన్, ఇరాన్, టర్కీ దేశాలు! మూడూ ఇస్లామిక్ కంట్రీస్ కావడం గమనార్హం! ఇక, ప్రపంచ పెద్దన్న [#GlobalSuperCop] పాత్ర పోషిస్తున్న అమెరికా ఆయిల్ అవసరాల ప్రధాన వనరు మధ్యప్రాచ్య, గల్ఫ్ దేశాలు!

తన చమురు దాహం తీర్చుకునేందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆసియాలో పాగా వేసింది. లేని పెత్తనం చేయడం ప్రారంభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ [#UAE], సౌదీ అరేబియా, ఖతర్, బహ్రెయిన్, కువైట్, ఒమన్లలో వ్యూహాత్మక మిలట్రీ బేస్ లను ఏర్పాటు చేసుకొంది! ఖతర్ లాంటి చోట్ల ఈ భూగోళం మీదనే అతిపెద్ద రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆ చుట్టూ ఉన్న దేశాల కదలికలను గమనించడం మొదలుపెట్టింది. ఆయా దేశాల సైనిక స్థావరాలు, అణుకేంద్రాలపై నజర్ వేసి ఉంచింది.

ఇజ్రాయిల్ ఒక దేశంగా అవతరించిన మొదట్లో ఇరాన్ తో సత్సంబంధాలనే కలిగి ఉండేది. కానీ, ఆ తరవాత అనేక నాటకీయ పరిణామాల నడుమ రెండు దేశాలు శాశ్వత శత్రువులుగా విడిపోయాయి. ప్రధానంగా 1979 లో ఇరాన్ లో ముస్లిం విప్లవం [#IslamicRevolution] రావడం, అక్కడ పశ్చిమ దేశాల పట్ల వ్యతిరేక ధోరణులు ప్రబలడం ఇరాన్ – ఇజ్రాయిల్ ల మధ్య చిచ్చురేపాయి!

వాటి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ప్రపంచపటం మీద నుంచి ఇజ్రాయిల్ ను తొలగించాలని ఇరాన్ కంకణం కట్టుకునేంతగా వాటి మధ్య వివాదం ముదిరింది! సహజసిద్ధమైన షియా, సున్నీ వర్గ వైరుధ్యాన్ని సైతం పక్కన పెట్టి, ఇరాన్, ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా, సున్నీలు ఎక్కువగా ఉండే పాలస్తీనాకు మద్దతు పలికింది!

హమాస్, హిజ్బొల్లా, హౌతీస్ లాంటి రక్త పిపాస ఉగ్రవాద సంస్థలను ప్రేరేపించి ఇజ్రాయిల్లో అశాంతిని సృష్టించే కుట్రలకు తెగబడటం మొదలుపెట్టింది. అలా శత్రుదేశాలను ఎదుర్కొనేందుకు ఇరాన్ రహస్యంగా ఆయుధ సంపత్తిని పోగేయడం ప్రారంభించింది. తన అమ్ముల పొదిలో అణ్వాయుధం [#AtomBomb] ను సైతం సమకూర్చుకుంది!

ఈ చర్యలు సహజంగానే అగ్రరాజ్యం అమెరికాకు కంటగింపుగా మారాయి. మరోవైపు, ఇజ్రాయిల్ దేశం యూదుల [#Jews] కు పుట్టిల్లు! కాగా, యూదుజాతి మానవుల్లోకెల్ల అత్యంత తెలివైన జాతి అన్న సంగతి తెలిసిందే! అమెరికన్ అడ్మినిస్ట్రేషన్లో మెజారిటీ యూదులే ఉంటారన్నది జగమెరిగిన సత్యం! ఇక, పాశ్చాత్య దేశాలవడం, భౌగోళిక, సైద్ధాంతిక సారూప్యతలు ఉండటం వల్ల అమెరికా, ఇజ్రాయిల్లు ఒక జట్టుగా మారాయి!

విస్తీర్ణంలో చూస్తే, కేవలం హైదరాబాదు అంత కూడా లేని ఇజ్రాయిల్ సాంకేతికంగా మాత్రం అత్యంత శక్తివంతమైన ఆధునిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటుంది! అందుకే, అక్కడి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొస్సాద్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన సంస్థగా ప్రసిద్ధి చెందింది. చుట్టూ శత్రుదేశాలే ఉన్నా, ఆ దేశాన్ని ఏం చేయలేకపోవడానికి కారణం పటిష్టమైన వాళ్ల నిఘా వ్యవస్థనే అనడం కద్దు!

ఇదిలా ఉంటే, అత్యాధునికమైన, విధ్వంసకర ఆయుధాల ప్రయోగానికి ఉరకలేస్తూ ఇరాన్, దాని చుట్టుపక్కల ఉన్న దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నది అమెరికా, ఇజ్రాయిల్, ఇతర పాశ్చాత్య దేశాల అభియోగం! ఇరాన్ దుందుడుకు ధోరణి వల్ల తమకు సైతం ఎప్పటికైనా ముప్పు తప్పదన్నది ఆ రెండు దేశాల ఆందోళన! పైగా, ఇరాన్ కు చైనా మద్దతుంది. రెండో అగ్రరాజ్యం రష్యా దానికి ఆయుధాలు సమకూరుస్తుంది.

అసలుకు కొసరుగా, ఈ భౌగోళిక రాజకీయాలు [#GeoPolitics] కూడా తోడవడంతో, సందు దొరికితే ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్లు కాలు దువ్వడం మొదలైంది! ఈ దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును తిప్పి కొట్టేందుకు ఇరాన్ అనేక ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ చేస్తూ, ఆ దేశాలపైకి ఉసిగొల్పుతూ వస్తోంది! విచ్చలవిడిగా ధ్వంసరచన చేస్తూ పబ్బం గడుపుకుంటోంది!

అలా, అమెరికా చమురు దాహం [#OilThirsty], ఇస్లామిక్ ఉగ్రవాదుల రక్తదాహం [#BloodThirsty] ప్రపంచకంటకంగా మారాయి! సముద్రమార్గం [#SeaRoute] గుండా జరిగే వాణిజ్య, వ్యాపార కలాపాలపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. సరిగ్గా, ఇక్కడే భారతదేశ అవసరాలు కూడా ముడిపడి ఉన్నాయి!

వాస్తవానికి ఇరాన్ లోని చాబహార్ పోర్టు [#ChabaharPort] ను ఇండియా తన వాణిజ్య అవసరాల కోసం వాడుకుంటోంది! మొదట్లో ఆ పోర్టుపై ₹100 కోట్ల పెట్టుబడి పెట్టిన భారత్, ఆ తరవాత ఆ మొత్తాన్ని ₹400 కోట్లకు పెంచింది! హార్ముజ్ జలసంధి [#HarmuzStrait] గుండా పశ్చిమ దేశాలతో వాణిజ్య కార్యకలాపాలు నెరపాలంటే భారత్ కు చాబహార్ పోర్టు కీలకం!

కానీ, 2026-27 బడ్జెట్ లో ఆ పోర్టు నిర్వహణ కోసం భారత ప్రభుత్వం కేటాయించింది శూన్యం [#ZeroAllocation]. అతి త్వరలో పశ్చిమాసియా [#WestAsia] లో ఏదో విపత్తు సంభవించబోతోంది అనడానికి అప్పట్లో ఇది ఒక సంకేతంగా మారింది! కొత్త ఢిల్లీ సౌత్ బ్లాక్ లోని ప్రధానమంత్రి కార్యాలయానికి మిడిల్ ఈస్ట్ భవిష్యత్ పరిణామాల పట్ల ఏదో సమాచారం ఉండటం వల్లనే చాబహార్ పోర్టును వదులుకోవడానికి సిద్ధపడ్డారని ఒక అంచనా!

మరోవైపు, విధ్వంసకర శక్తిగా మారిన ఇరాన్ పై విరుచుకుపడే అవకాశం కోసం ఇటు అమెరికా ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది! దినదిన గండంగా మారిన ఇరాన్ పై అదును చూసి పంజా విసిరేందుకు అటు ఇజ్రాయిల్ వేచి చూస్తోంది! మధ్యమధ్యలో ఉద్రిక్తతలు, క్షిపణి దాడులు [#MissileAttacks], బాంబుల మోత షరా మామూలుగా తయారైంది!

ఈలోపు, ఖతర్ లోని అమెరికా రాడార్ వ్యవస్థపై ఇరాన్ విరుచుకుపడింది! దాన్ని పూర్తిగా నాశనం చేసింది. మరోపక్క, చాపకింద నీరులా ఇస్లామిక్ టెర్రరిజం ఆసియా వ్యాప్తమవడం ముమ్మరమైంది! ఆ కోరలు భారత్ ను తాకాయి! అంతర్జాతీయంగా పౌర సమాజాలకు ఇరాన్ ముప్పుగా పరిణమిస్తోంది అన్న కారణంపై అమెరికా ఆ దేశంపై, దానితో వాణిజ్య సంబంధాలు నెరుపుతున్న దేశాలపై ఆంక్షలు విధించింది.

ఫలితంగా, 2019 తరవాత ఇరాన్ నుంచి భారత్ చమురు దిగుమతులు ఆపేసింది! రష్యాతో ఒప్పందాలు చేసుకొని ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటోంది! ఈలోపు, జర్మనీ మ్యూనిచ్ కేంద్రంగా మరో పెద్ద మలుపు చోటు చేసుకుంది. మొన్న ఫిబ్రవరిలో అక్కడ జరిగిన రక్షణ సమావేశం [#SecurityConference] సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ కీలక అడుగు వేసింది.

చీటికిమాటికి రంకెలేస్తున్న అమెరికా పుణ్యమాని పశ్చిమాసియా మీద యుద్ధమేఘాలు అలుముకున్న ప్రతీసారి అరేబియా సముద్రానికి చేరాల్సిన పెట్రోలియం ఓడలన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోతున్నాయి. ఆసియాలో ఎక్కువ చమురును కొనుగోలు చేసేది అధిక జనాభా ఉన్న పెద్ద దేశాలు ఇండియా, చైనాలే!

పశ్చిమాసియా దేశాల నుంచి సరఫరా ఆగిపోతే, భారత్, చైనాలు ముడి చమురు అవసరాల కోసం అనివార్యంగా అమెరికాపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ సంక్షోభం నుంచి బైట పడటానికి భారతదేశం, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోపియన్ ఎకనమిక్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఆ దిశలో ఇజ్రాయిల్ హెగ్జగాన్ అలయన్స్ [#HexagonAlliance] ప్రపోజల్ కూడా ఇంచుమించు ఇలాంటిదే!

ఒకవేళ, ఈ ఒడంబడిక [#Pact] కుదిరితే భారత్ కు రెండు రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక భారంతో కూడిన చాబహార్ పోర్టు, ఉద్రిక్తతల నడుమ నిరంతరం మూతపడే హార్మూజ్ జలసంధిలతో ఇక పని ఉండదు. ఫ్యూచర్ ట్రేడింగ్ లో చైనా నుంచి ఇండియా, గల్ఫ్ కంట్రీస్, ఇజ్రాయిల్, గ్రీస్ మీదుగా ఐరోపా ఖండం వరకు సుళువైన రవాణా మార్గం ఏర్పడి వాణిజ్య అవసరాలు తీరుతాయి. దక్షిణ అమెరికా ఖండంలోని వెనిజులా లాంటి దేశాల నుంచి సైతం సులభంగా ముడిచమురు కొనుగోలు చేసి తెచ్చుకోవచ్చు.

వీటన్నిటి నేపథ్యంలో భారత్, ఇజ్రాయిల్ నడుమ బంధం గట్టిపడటం కొత్త కోణాలు ఆవిష్కరిస్తోంది. ఇరాన్ తో ఎలాగూ వాణిజ్య సంబంధాలు తెగిపోయాయి. పైపెచ్చు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలతో కలిసి భారత్ మీద హమాస్ పన్నుతున్న కుట్రలపై ఇరాన్ మౌనం వహిస్తోంది. అందుకే, ఇరాన్ పై దాడి సమాచారాన్ని సైతం రెండు దేశాలు ముందే పంచుకున్నాయన్నది ఒక టాక్!

కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతం కోసం ఇజ్రాయిల్ చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సాంతం అచ్చం ఆపరేషన్ సిందూర్ [OPERATION SIND🔴🔘R] తరహాలోనే జరిగిందన్నది మరో విశ్లేషణ. ఇండియన్ స్పై ఏజెన్సీ రా, ఆ మోడల్ బ్లూ ప్రింట్ ను మొస్సాద్ కు అందించిందన్నది ట్విస్ట్!

ఇక, ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు చేయూత అందిస్తోన్న చైనా, ఇరాన్ కు కూడా సపోర్ట్ గా నిలబడుతోంది. కేవలం ఆయుధాల సరఫరాకే పరిమితమైన రష్యా మాత్రం మిగిలిన అంశాలపై వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఇదే అదనుగా భారతదేశం అంతర్జాతీయంగా తన సత్తా చాటుకుని, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోంది! సూరజ్ వి. భరద్వాజ్.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమెరికా చమురు దాహం – రక్త పిపాస ఉగ్రవాదం! పశ్చిమాసియా ప్రకంపనలు
  • చంద్రబాబును భయపెట్టిన ఇజ్రాయిల్… ఓ జర్నలిస్ట్ జ్ఞాపకాలు …
  • అమెరికాను నమ్మి… చివరకు ఎడ్డిమొహం వేసేది మళ్లీ పాకిస్థానే…
  • సొంత కోతలు, తిక్క కూతలు… పాకిస్థాన్ ప్లేయర్లు ఇక అస్సలు మారరు…
  • సొంతూళ్లో… సొంతింట్లో… వ్రతం, విందు… భేష్ విజయ్ దేవరకొండా…
  • చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌‌ను నమ్మి… ఇరాన్ నిండా మునిగిందా..?!
  • 70 ఏళ్ల మాస్ ముసలమ్మ..! ఈ వయస్సులోనూ రాధిక అదరగొట్టేసింది..!!
  • తమ్మినేనికి అభిశంసన..! సీపీఎం కేంద్ర కమిటీ మండిపాటు..?!
  • ఆ రష్మిక మంధన్నా గురించే కాదు… ఈ రష్మి గౌతమ్ గురించీ ఓసారి చెప్పుకోవాలి…
  • విజయ శాంతిని ఏకంగా ఫైర్ బ్రాండ్ లేడీ అమితాబ్‌ను చేసింది..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions