.
‘కాంతారావు అంటే ఎమ్.జీ.ఆర్. ఉచ్చపోసుకుంటాడు’ ఇలాంటి మాటను నటుడు రాజేంద్రప్రసాద్ ఒక వేదికపై బహిరంగంగా పేలడం తెలిసిందే. నోటిదూల వల్ల వచ్చిన లూస్ టాక్ ఇది. సభ్యత, ఇంగితం లేకపోవడం ఇది. తొందరపాటుతనం ఇది. అవతలి వాళ్లు ఎలాంటి వాళ్లు, ఎంతటి వాళ్లు అన్న స్పృహ లేకపోవడం ఇది.
ఇవి పెద్దశాతం తెలుగువాళ్ల లక్షణాలు. ఈ దుర్లక్షణాలు లేని తెలుగువాళ్లు కచ్చితంగా ఉన్నారు. కానీ ఇవి ప్రధానంగా తెలుగువాళ్ల ప్రాకృతిక లక్షణాలు; తెలుగువాళ్లను పట్టించే లక్షణాలు! దేశ వ్యాప్తంగా తెలుగువాళ్ల ఐడెంటిటి ఈ లక్షణాలు. నాకు తెలిసినంత వరకూ ఒక శతాబ్ది కాలానికి పైగా ఇవి తెలుగుల ప్రధాన అవలక్షణాలు.
Ads
నా చిన్నప్పటి నుంచీ ఈ అవలక్షణాలను ఇతరుల్లో కన్నా నేను తెలుగువాళ్లలోనే ఎక్కువగా చూస్తున్నాను. నాకు బాగా అలవాటు ఉన్న పెద్దలు కొందరు (వాళ్లల్లో 95 యేళ్ల వాళ్లు కూడా ఉన్నారు) వాళ్లకు ముందు తరం నుంచీ తెలుగుల్లో ఈ అవలక్షణాలు ఉన్నట్టు నాకు నా చిన్నప్పుడు గట్టిగా చెప్పేవారు. ఆ పెద్దలు కూడా తెలుగువాళ్లే. తెలుగువాళ్లలో ప్రబలంగా ఉండే ఈ అవలక్షణాల వల్ల తెలుగువాళ్లతో జాగ్రత్తగా ఉండమని ఆ పెద్దలు నాకు చెప్పేవారు.
నా పుణ్యం కొద్దీ నేను పసితనం నుంచీ చెన్నైలో పెరగడం వల్ల నాకు ఈ అవలక్షణాలు రాలేదు. తెలుగు నేలలో పెరిగి ఉంటే నాకూ ఇవి తప్పేవి కావేమో?
కాంతారావు అంటే ఎమ్.జీ.ఆర్.కు ఉచ్చా? ఎక్కడ కాంతారావు, ఎక్కడ ఎమ్.జీ.ఆర్.? ఎమ్.జీ.ఆర్. ఒక cult actor! దక్షిణాదిలో తొలి cult actor ఎమ్.జీ.ఆర్. ఎమ్.జీ.ఆర్. కన్నా మన ఎన్. టీ.ఆర్., ఎస్.వీ. రంగారావు, శివాజీ గణేసన్, కన్నడ రాజ్ కుమార్ వంటి పలువురు గొప్ప నటులు ఉన్నారు దక్షిణాదిలో. కానీ ఎమ్.జీ.ఆర్. cult హీరో. Film instituteలో చదువుకున్న రాజేంద్ర ప్రసాదుకు ఈ విషయం తెలియకపోవడం ఆయన తెలుగు వ్యక్తి అవడమే.
తెలుగువాళ్లలో పెద్ద శాతంకు అవతలి వాళ్లు ఎంతటి వారో తెలియదు. నాణ్యతపై తెలుగులకు సరైన ఆలోచన, అవగాహన ఉండవు. ఆ ఎమ్.జీ.ఆర్. కు మన రామారావు అంటే ఎంతో అభిమానం! కత్తి హీరోగా, జానపద హీరోగా ఎమ్.జీ.ఆర్. చేసిన దాంట్లో 20% కూడా కాంతారావు చెయ్యలేదు.
ఈజ్… ఎమ్.జీ.ఆర్. ఈజ్ చాల గొప్పది. కాంతారావుకు ఆ ఈజ్ పరంగా ఉండాల్సిన అవగాహన లేదు. Body language … ఒక జానపద హీరోగా ఎమ్.జీ.ఆర్. Body language చాల గొప్పగా ఉంటుంది. కాంతారావు ఈ విషయంగా అనర్హుడు. ERROL FLYNN స్ఫూర్తితో ఎమ్.జీ.ఆర్. తనను ఒక గొప్ప జానపద హీరోగా రూపొందించుకున్నారు.
కాంతారావు తెలుగు నాసిరకం చింతనను దాటి ఎదగలేదు. ఈ తెలివిడి రాజేంద్ర ప్రసాదుకు లేకపోవడం ఆయన తెలుగుతనమే. ఒక తెలుగువ్యక్తి ఆలోచన, మాట, తీరు ‘in general’ స్థాయిలో ఉండకపోవడం, rustic స్థాయిలోనే ఉండడం బాధాకరం.
తెలుగులో ఘంటసాల రాణించడం కూడా తెలుగువాళ్ల ఈ rustic స్థాయి వల్లే. అందుకే ఘంటసాల ఇతర భాషల్లో రాణించలేదు; కనీసం ఆమోదం కూడా పొందలేదు. తెలుగు rustic స్థాయిని దాటి posh and polished స్థాయితో పీ.బీ. శ్రీనివాస్, ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి, బాలమురళీకృష్ణ తెలుగు ఎల్లల్ని దాటి వ్యాప్తం అయ్యారు. ఈ మౌలిక అంశం మన తెలుగు మధ్యతరగతి మాంద్యానికి ఇవాళ్టికీ తెలియరాలేదు. పైగా ఇలాంటివి ఉంటాయి, ఉన్నాయి అని నాలాంటి మామూలు వాళ్లు చెప్పడాన్ని కూడా సహించలేరు తెలుగువాళ్లు.
మంగళంపల్లి బాలమురళీకృష్ణ అంతటి కళాకారుణ్ణి అసంస్కారంతో తెలుగు వాళ్లు కొందరు ఆడిబోసుకుంటూండడం తెలుగు జాతిలో కొందరి అల్పత్వాన్ని తెలియజేస్తోంది. బాలమురళిని అనగలవాళ్లా తెలుగువాళ్లు?
‘కాంతారావు అంటే ఎమ్.జీ.ఆర్. ఉచ్చపోసుకుంటాడు’ వంటి మాటలు రాజేంద్ర ప్రసాద్ బహిరంగంగా అనడం అత్యంత దౌర్భాగ్యం కాదు అత్యంత హేయం. చాల కాలంగా తెలుగులో నెలకొన్న హేయం. ‘ఉచ్చ’ వంటి హేయమైన భాషను కూడా తెలుగువాళ్లే ఎక్కువ వాడతారు. కళాకారుల విషయంలో అసభ్య పదజాలం వాడడం తెలుగులకే చెల్లు.
ఈ మాటలు చెబుతున్నందుకు తెలుగులో ఉన్న మెదడు, సంస్కారం లేని కొందరు నన్నూ ఆడిబోసుకుంటారు. “ఉరిమి మొరుగు కుక్క యోగి నేమెరుగురా?” అని అన్నాడు వేమన. ఈ వేమన మాటలు మన తెలుగులకు ఇప్పటికీ తగినవే అని మనం తెలుసుకుంటున్నాం.
తెలుగులో పెద్దగా ఉండని మరో మంచి లక్షణం కృతజ్ఞత. తెలుగుల్లో కృతజ్ఞత అన్నది తమిళుల్లో ఉన్న స్థాయిలో ఉండదు. రాజేంద్ర ప్రసాద్ నటుడిగా మొదటి దశ తమిళ్లోనే! తన నట జీవితంలోని తొలిదశలో పెద్ద పాత్రలు ‘ఇనిమై ఇదో ఇదో’ వంటి తమిళ్ సినిమాలతోనే మొదలయ్యాయి. హిట్ పాటల నటన రాజేంద్ర ప్రసాదుకు తమిళ్ పెట్టిన భిక్షే! రాజేంద్ర ప్రసాద్ ఒక తెలుగు వ్యక్తిగా ఈ విషయంలో కృతజ్ఞతా రాహిత్యంతోనే బతుకుతున్నట్టు తెలుస్తోంది.
రాజేంద్ర ప్రసాద్ మాటలు వయసు రీత్యా వచ్చిన దోషంగానో, వ్యక్తిగత జీవితంలోని పరిస్థితుల ప్రభావంతోనూ వచ్చిన దోషంగానో పరిగణించడం కన్నా ‘రాజేంద్ర ప్రసాద్ ఫక్తు తెలుగు వ్యక్తి కావడం వల్ల వచ్చిన మాటలవి’ అన్నది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.
ఇంకో శతాబ్దికైనా మన తెలుగులకు నోటి దూల, లూస్ టాక్, సభ్యత, ఇంగితం లేకపోవడం, తొందరపాటుతనం, అవతలి వాళ్లు ఎలాంటి వాళ్లు, ఎంతటి వాళ్లు అన్న స్పృహ లేకపోవడం, కృతజ్ఞతా రాహిత్యం, నాణ్యతను గుర్తించకపోవడం వంటి అవలక్షణాలు పోతాయా?
తెలుగుల మరో ముఖ్యమైన అవలక్షణం తప్పు తెలుసుకుని దిద్దుకోకపోవడం. రాజేంద్ర ప్రసాద్ తన తప్పును తెలుసుకుని దిద్దుకుంటారా? లేక ‘నేను తెలుగువాణ్ణే’ అని తన తెలుగు నైజాన్ని ధ్రువీకరించుకుంటారా?
రోచిష్మాన్
9444012279
- (ఈ కథనంపై చాలామందికి అభ్యంతరాలు ఉండవచ్చు… ఎవడో ఒకరిద్దరు మూర్ఖుల పేలాపనలతో మొత్తం తెలుగు జాతిని తిట్టుకోవడం దేనికి అనేదే ప్రధాన అభ్యంతరంగా ఉండవచ్చు… ఈ అభిప్రాయం రచయిత సొంతం… ఐతే ‘మనం ఇక మారలేమా’ అనే ఆవేదన నుంచి వచ్చిన అక్షరాలే ఇవి…
- ఒక నాజర్, ఒక విశాల్ తదితరులు సీరియస్‌గా రాజేంద్రప్రసాద్ క్షుద్ర వ్యాఖ్యల్ని ఖండించారు… రాజేంద్ర ప్రసాద్ పిచ్చి కూతలు కొన్నాళ్లుగా వింటున్నవే… జనం మళ్లీ ఛీకొట్టేసరికి, తనకు అలవాటైన రీతిలో మళ్లీ ఏదో వీడియోలో క్షమాపణలు చెప్పాడు…
- తనను పిలిచేవాళ్లు పిలుస్తూనే ఉంటారు… తను మళ్లీ మళ్లీ పిచ్చిగా ఏదో పేలుతూనే ఉంటాడు… మరి తెలిసీ తనను ఎందుకు పిలుస్తున్నారు… ఎందుకంటే, అదీ తెలుగువాళ్ల అవలక్షణాల్లో ఒకటి కాబట్టి…….. అవునూ, కత్తి కాంతారావు పురస్కారానికి రాజేంద్ర ప్రసాద్ ఎలా అర్హుడు..?! —– ముచ్చట)
Share this Article