Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘బడా సాహెబ్’కు తలొగ్గలేదు… సవాల్ చేసి వణికించాడు కూడా…

April 2, 2026 by M S R

.

(     రమణ కొంటికర్ల    )  ….. హుస్సేన్ ఉస్తారా… దావూద్ ఇబ్రహీంనే సవాల్ చేసిన బ్లేడ్ డాన్ గుర్తున్నాడా..? ఈ మధ్యే ఫిబ్రవరిలో రిలీజై… ఇప్పుడు రెంటుకు అమెజాన్ ప్రైమ్ లో కూడా అందుబాటులో ఉన్న ఓ రోమియో మూవీతో ఇప్పుడు మళ్లీ ఓసారి హుస్సేన్ ఉస్తారా కథ వెలుగులోకొచ్చింది.

ముంబై అండర్ వరల్డ్ కు గ్లామర్ అద్దే క్రైమ్ డ్రామాలు, స్టైలిష్ గ్యాంగ్ స్టర్ సినిమాలు చూసేకంటే ముందే… భయం కంటే వేగంగా ముంబైని వణికించిన పేర్లు కొన్ని ఉన్నాయి. అందులో హుస్సేన్ ఉస్తారా పేరు కూడా తప్పకుండా చెప్పుకోవాల్సిన పేరు. వాస్తవానికి హుస్సేన్ పెద్ద మాఫియా డానేం కాదు.. అలాగని, పెద్దగా రాజకీయ పరిచయాలు కూడా లేవు. కానీ, తిరుగుబాటుదారుడు. అదే ఆయన్ను అండర్ వరల్డ్ లో బలంగా నిలబెట్టింది.

Ads

దావూద్ ఇబ్రహీం ముంబై క్రైమ్ నెట్వర్క్ పై తన ఆధిపత్యాన్ని పెంచుకుంటున్న కాలంలో హుస్సేన్ ఉస్తారా మాత్రం దావూద్ కు తలొగ్గలేదు. అదే అతణ్ని ముంబైలో ప్రత్యేకంగా నిలబెట్టింది. అదే సమయంలో దావూద్ గ్యాంగుకు లక్ష్యంగా మార్చింది.

హుస్సేన్ ఉస్తారా మూలంతోనే షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి నటించిన ఓ రోమియో తెరకెక్కింది. కానీ, సినిమాలో చూపించిన దానికంటే కూడా హుస్సేన్ ఉస్తారా నిజజీవిత కథ మరింత ఇంటెన్సివ్ గా సాగింది.

హుస్సేన్ షేక్ కాస్తా ఉస్తారాగా మారడానికి గల కారణమేంటి..? హుస్సేన్ ఉస్తారా జన్మత: క్రిమినల్ ఏం కాదు. అసలు పేరు హుస్సేన్ షేక్. 1980ల్లో ముంబైలోని చాలామంది యువకుల్లాగే క్రైమ్ వైపు హుస్సేన్ షేక్ జీవితం మళ్లింది. మొదట చిన్న చిన్న గొడవలతో ఆరంభమైంది. ఆ తర్వాత మెల్లిగా పెద్ద క్రిమినల్ గ్యాంగ్స్ తో తిరగడం మొదలెట్టాడు. నేరముఠాల్లో ఎందరో ఉన్నా… అతడి పని తీరు, ధైర్యం హుస్సేన్ ను మిగిలినవారితో ప్రత్యేకంగా నిలబెట్టింది.

హింస సృష్టించడంలో నరరూప రాక్షసుడు. పబ్లిసిటీకి దూరంగా ఉండేవాడు. నిశ్శబ్దంగా పనిచేసేవాడు. తర్వాత్తర్వాత ఆ నిశ్శబ్దమే అతడిలో భయానికీ కారణమైంది.

అసలు ఉస్తారాగా మార్పు వెనుక ఏం జరిగింది..? గ్యాంగ్ స్టర్ క్రైమ్ సినిమా రచయితైన హుస్సేన్ జైదీ చెప్పేదాని ప్రకారం… హుస్సేన్ తన ప్రత్యర్థులపై పదునైన బ్లేడ్ తో దాడి చేసేవాడు. ఆ గాయాలు లోతుగా ఉండడంతో డాక్టర్లు కూడా నిర్ఘాంతపోయేవారట. అలా హుస్సేన్ షేక్ పేరు కాస్తా మాయమైపోయి.. హుస్సేన్ ఉస్తారాగా అండర్ వరల్డ్ లో స్థిరపడిపోయాడు.

దావూద్ ఇబ్రహీంను ఎదిరించిన ఏకైక గ్యాంగ్ స్టర్! 1980ల చివర్లో… 1990ల ఆరంభంలో ముంబై అండర్ వరల్డ్ లో దావూద్ ఇబ్రహీం వడివడిగా ఎదుగుతున్న రోజులవి. ఆ సమయంలో చాలామంది గ్యాంగ్ స్టర్స్ దావూద్ ఇబ్రహీంను వచ్చి కలిసేవారు. లేకపోతే వారి పని ఫినీషే. మధ్యస్థంగా ఉండటం కూడా కష్టం. తప్పకుండా దావూద్ కనుసన్నల్లోనే ఏదైనా జరగాలన్నట్టుగా నడుస్తున్న కాలమది. కానీ, హుస్సేన్ ఉస్తారా మాత్రం స్వతంత్రంగానే పనిచేశాడు. దావూద్ గ్యాంగుతో చేతులు కలిపేందుకు ససేమిరా అన్నాడు. అది కేవలం దావూద్ పైన తిరుగుబాటు మాత్రమే కాదు… దావూద్ నేతృత్వంలో పనిచేస్తున్న అండర్ వరల్డ్ మాఫియాకే ఓ పెను సవాల్ విసిరాడు ఉస్తారా.

స్వప్నా దీదీ ఎవరు..? హుస్సేన్ ఉస్తారా కథలో స్వప్నా దీదీది కూడా కీలకపాత్ర. ఆమె అసలు పేరు ఆష్రాఫ్ ఖాన్. మొదట ఆమెకు క్రైమ్ వరల్డ్ తో సంబంధాలేమీ లేకుండే. ఆమె భర్త మెహమూద్ ఖాన్ ను దావూద్ గ్యాంగ్ చంపిన తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. భర్త దూరమైన దుఖం, చంపినవారిపై చెలరేగిన కోపం, ఎలాగైనా పగ తీర్చుకోవాలన్న ప్రతీకారం వెరసి ఆమె దావూద్ ఇబ్రహీంనే మట్టుబెట్టాలని ప్లాన్ చేసింది. అందుకు హుస్సేన్ ఉస్తారా అండగా నిల్చాడు.

బైక్ వేగంగా నడపడం నుంచి ఆయుధాలెలా ఉపయోగించాలి… అండర్ వరల్డ్ లో ఎలా జీవించాలో స్వప్నా దీదీకి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చాడు హుస్సేన్ ఉస్తారా. ఇద్దరూ కలిసి దావూద్ కు సవాళ్లు విసురుతూ ప్రతీకారంతో రగిలిపోతున్న అసాధారణ జోడీగా మారారు. దావూద్ కు.. ఆయన నేతృత్వంలోని అండర్ వరల్డ్ మాఫియాకు కంట్లో నలుసులా మారారు.

షార్జాలో దావూద్ ను మట్టుబెట్టే యత్నం! స్వప్నా దీదీ కథలో అత్యంత సంచలనమైన ఘటన షార్జా ప్లాన్. క్రికెట్ అంటే ఇష్టపడే దావూద్ షార్జాలో జరుగుతున్న ఇండియా పాకిస్థాన్ మ్యాచుకు వెళ్తున్నాడని తెలిసి ఆ సమయంలో అక్కడే అతణ్ని లేపెయ్యాలని స్కెచ్ వేసింది స్వప్నా దీదీ. ఆ ప్రణాళిక పారితే గనుక.. అసలు ముంబై అండర్ వరల్డ్ సమీకరణాలే పూర్తిగా మారిపోయేవి. కానీ, ప్లాన్ ఫలించలేదు. దావూద్ తప్పించుకున్నాడు. ఆ తర్వాత 1994లో స్వప్నా దీదీని అతి కిరాతకంగా పట్టపగలే నడిరోడ్డుపై మర్డర్ చేశారు. ఆమె ప్రతీకార కథ అక్కడితో ముగిసిపోయింది.

హుస్సేన్ ఉస్తారా గురించి ఎక్కువ సమాచారం క్రైమ్ రిపోర్ట్స్ ద్వారానే అందుబాటులోకొచ్చింది. అలాగే, డోంగ్రీ టూ దుబాయ్ అనే పుస్తకంలోనూ ముంబై అండర్ వరల్డ్ చరిత్ర సవివరంగా రాశారు. అందులోనూ హుస్సేన్ ఉస్తారా జీవిత కథ ఉంది. క్రిమినల్ గా ఉస్తారా ఎలా వ్యవహరించేవాడు.. రాజకీయాలు, ముంబై జీవితం, అండర్ వరల్డ్ వాస్తవాలు ఇలా అన్నీ ఆ పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నారు. హుస్సేన్ ఉస్తారా ప్రధాన డాన్ గా గుర్తింపు సంపాదించకపోయినా.. దావూద్ ను, ఆయన టీమ్ ను సవాల్ చేసిన గ్యాంగ్ స్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

బాలీవుడ్ దృష్టి ఎప్పుడూ అండర్ వరల్డ్ మాఫియా సినిమాల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఓ రోమియో సినిమాకు హుస్సేన్ ఉస్తారా జీవిత కథకు కొంత కల్పిత కథను జోడించి తెరకెక్కించారు. ప్రేమ, హింస, తిరుగుబాటు, దుఖం, ప్రతీకారం ఇవే మెయిన్ థీమ్స్ గా ఈ సినిమా ఉంటుంది.

మొత్తంగా ఓ రోమియో మూవీ ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో తీసిన ఓ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్. షాహిద్ కపూర్ కాంట్రాక్ట్ కిల్లర్ గా.. త్రిప్తి దిమ్రి స్వప్నా దీదీ పాత్రలో కనిపిస్తారు. నిజ సంఘటనల ఆధారంగా అల్లిన ఓ కల్పిత కథ ఇది.

2026, ఫిబ్రవరి 13న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటుకు అందుబాటులో ఉంది. ఏప్రిల్ నుంచి ఫ్రీ స్ట్రీమింగ్ కు రానుంది. షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి, నానా పటేకర్, విక్రాంత్ మాస్సే, అవినాశ్ తివారీ, ఫరీదా జలాల్ వంటి నటీనటులతో క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లు ఎంజాయ్ చేయొచ్చు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బెంగాల్ ఎన్నికలు..! నట్లు బోల్టులు టైట్ చేస్తున్న ఎన్నికల సంఘం…!
  • చిట్టిబాబు లీక్స్..! తనకూ ఓ పేజీ ఉంది టాలీవుడ్ చరిత్ర పుస్తకంలో..!!
  • కాళేశ్వరం తీర్పు… క్లీన్ చిట్ కాదు… కమిషన్ రూల్స్ పాటించలేదు అని…
  • Inter Caste Marriages… ‘కులాన్ని’ దాటేస్తున్న కొత్త తరం…
  • పొద్దున్నే పుట్టింది చందమామ… మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ…
  • వీడు ఓ ఎంపీ… మహిళా నేతలపై రోత వ్యాఖ్యలు… కిక్కుమనని విపక్షం…
  • ‘యాంటీ హిందూ’ లెన్స్‌కార్ట్‌… స్టాక్‌మార్కెట్ బాగానే శిక్షిస్తోంది…
  • సిక్సర్ల అభిషేకుడిని పడేసిన లైలా..! పాత ట్రాజెడీ మరిచి కొత్త బంధం…!
  • పూసల పిల్ల మోనాలిసా కేసులో మరో ట్విస్టు… పోలీసులతో గేమ్స్…
  • ఏమైంది ఈ గ్రూపుకి..? రతన్ టాటా గనుక బతికి ఉంటే ఏమైపోయేవాడో…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions