.
నిజం చెప్పాలంటే… రాజమౌళి స్వయంగా పూనుకున్నా సరే, ఓ నాలుగైదు సీక్వెల్స్ తీస్తే గానీ ఎల్ మెంచోను పూర్తిగా ఆవిష్కరించలేడేమో..! ఓ లక్ష మంది పుష్పరాజుల పెట్టు… ఇంతకీ ఎల్ మెంచో ఎవరు అనేదేనా మీ ప్రశ్న…
నిన్న మెక్సికోలో స్పెషల్ పోలీసులు కాల్పుల్లో గాయపడి, మరణించిన భీకరమైన డ్రగ్ డాన్… డ్రగ్స్ మాత్రమే కాదు, తనది ఓ భారీ మాఫియా నెట్‌వర్క్… ఒక్కసారి తన కథలోకి వెళ్దామా…?
Ads
మెక్సికో అడవుల్లో ఒక సామాన్య అవకాడో తోటమాలిగా మొదలైన ప్రయాణం… ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ లార్డ్‌గా ముగిసింది… 125 కోట్ల రూపాయల (15 మిలియన్ డాలర్లు) వెల తన తలకు… అంత భారీ రివార్డు అంటేనే అర్థం చేసుకోవాలి తను ఎంత నొటోరియస్, వాంటెడ్ క్రిమినలో…
కంటికి కనిపించని రూపం, సొంతంగా ఒక ప్రైవేట్ ఆర్మీ… ఇదీ నెమెసియో ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ “ఎల్ మెంచో” ప్రస్థానం…
1. అవకాడోల వెనుక రక్త చరిత్ర…: “గ్రీన్ గోల్డ్” సామ్రాజ్యం ఎల్ మెంచో మొదట్లో ఓ చిన్న కూలీ… అవకాడో తోటల్లో పనిచేసేవాడు… మెక్సికోలో అవకాడో తోటలు ఎక్కువ… మెల్లిమెల్లిగా అవకాడో (Avocado) తోటలను తన అదుపులోకి తెచ్చుకున్నాడు… ప్రతి కిలో అవకాడో ఎగుమతిపై ‘టాక్స్’ వసూలు చేసేవాడు… ఎవరైనా ఎదురుతిరిగితే వారి తోటలను తగలబెట్టడం లేదా వారి తలలు నరకడం చేసేవాడు… అందుకే దీన్ని అక్కడ “బ్లడ్ అవకాడోస్” అని పిలుస్తారు…
2. అజేయమైన సైన్యం: ఒక చిన్న దేశపు సైన్యమంత బలం మెంచో తన గ్యాంగ్‌ను (CJNG) రౌడీల్లా కాకుండా, ఒక ప్రొఫెషనల్ ఆర్మీలా తయారు చేశాడు…
-
మాన్‌స్టర్ ట్రక్కులు (Monstruos)…: సాధారణ ట్రక్కులకు భారీ స్టీల్ ప్లేట్లు, మెషిన్ గన్లు అమర్చి యుద్ధ ట్యాంకులుగా మార్చేవాడు… ఇవి గ్రెనేడ్ దాడులను కూడా తట్టుకోగలవు….
-
డ్రోన్ బాంబులు…: ఆకాశం నుంచి బాంబులు కురిపించే టెక్నాలజీని వాడుతూ పోలీసు క్యాంపులపై దాడులు చేయడంలో ఇతను సిద్ధహస్తుడు….
-
పరేడ్ వీడియోలు…: వందలాది వాహనాలతో తన సైనికులు మిలిటరీ తరహాలో పరేడ్ చేస్తున్న వీడియోలను విడుదల చేసి, ఏకంగా ప్రభుత్వానికే యుద్ధ ప్రకటన చేసేవాడు….
3. క్రూరత్వం – ‘రాబిన్ హుడ్’ ఇమేజ్ మెంచో రెండు రకాలుగా మెక్సికో మాఫియా రాజ్యాలపై తన అధికారాన్ని నిలబెట్టుకున్నాడు…
-
పోలీసుల తలలు నరకడం…: తన దారికి అడ్డువచ్చిన పోలీసులను కిడ్నాప్ చేసి, వారి తలలు నరికించి బహిరంగంగా వంతెనలకు వేలాడదీసేవాడు… 2015లో ఏకంగా ఆర్‌పిజి (RPG) వాడి ఆర్మీ హెలికాప్టర్‌నే కూల్చేశాడంటే అతని తెగింపు అర్థం చేసుకోవచ్చు…
-
పేదల పెన్నిధి…: మెక్సికోలోని కొన్ని పేద ప్రాంతాల్లో అతను ప్రజలకు డబ్బులు, ఆహారం పంపిణీ చేస్తూ “రాబిన్ హుడ్” ఇమేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు… దీనివల్ల పోలీసులకు సమాచారం ఇచ్చే వారు కరువయ్యారు…
4. ఫ్యామిలీ నెట్‌వర్క్: కొడుకు, భార్యల కీలక పాత్ర మెంచో తన వ్యాపారాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఒక కార్పొరేట్ కంపెనీలా నడిపాడు…
-
భార్య (రోసాలిండా)…: ‘లా జెఫా’ (The Boss) అని పిలవబడే ఈమె, డ్రగ్ మనీని లీగల్ బిజినెస్‌లలోకి మళ్లించే మనీ లాండరింగ్ నెట్‌వర్క్‌ను నడిపేది….
-
కొడుకు (మెంచీతో)…: తండ్రికి వారసుడిగా ఉండి ఆపరేషన్స్ చూసుకునేవాడు… ప్రస్తుతం భార్య, కొడుకు ఇద్దరూ జైల్లోనే ఉన్నారు… వాళ్లను విడిపించడానికి పలు ప్రయత్నాలు చేశాడు కానీ సక్సెస్ కాలేదు అందులో…
5. అజ్ఞాతవాసం: మొబైల్ ఆసుపత్రులు, అంబులెన్సులు పోలీసులు అతన్ని పట్టుకోలేకపోవడానికి అతని రహస్య జీవనశైలి ప్రధాన కారణం. అతనికి తీవ్రమైన కిడ్నీ వ్యాధి ఉండటంతో, పర్వత ప్రాంతాల్లో తన కోసమే రహస్యంగా మొబైల్ ఆసుపత్రులను, ఆపరేషన్ థియేటర్లను నిర్మించుకున్నాడు… అతని వెంట ఎప్పుడూ స్పెషలిస్ట్ డాక్టర్లు, అంబులెన్సులు ఉండటమే అతని ప్రాణాలను ఇన్నాళ్లు కాపాడింది…
ఐనా సరే, ఎప్పటికప్పుడు మెంచో మరణించాడనే వార్తలు వచ్చేవి… కొద్దిరోజులకే అది ఫేక్ అని తేలిపోయేది,.. మరోచోట తన భారీ ఆపరేషన్‌తో తన ఉనికిని బహిర్గతం చేసేవాడు… మళ్లీ వేట, మళ్లీ ఆట…
6. ది ఫైనల్ ఆపరేషన్: తపల్పలో జరిగిన ఆఖరి యుద్ధం ఎట్టకేలకు నిన్న ( ఫిబ్రవరి 2026లో) మెంచో వేట ముగిసింది…
-
ఆపరేషన్…: మెక్సికోలోని జాలిస్కో (Jalisco) రాష్ట్రం, తపల్ప (Tapalpa) పట్టణంలో మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్ మెరుపు దాడి చేశాయి… ఈ ఆపరేషన్‌లో అమెరికా నిఘా వర్గాల సహకారం ఉంది… అందుకే ఈ ఎన్‌కౌంటర్ తనకూ క్రెడిట్ అని ట్రంప్ ఆనందంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు…
-
అంతం..: భీకరమైన కాల్పుల మధ్య మెంచో తీవ్రంగా గాయపడ్డాడు… అతన్ని చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో మెక్సికో సిటీకి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే అతని ప్రాణాలు పోయాయి…
7. ఇప్పుడు ఏం జరగబోతోంది? మెంచో మరణం తర్వాత మెక్సికోలో రెండు ప్రధాన యుద్ధాలు మొదలయ్యే అవకాశం ఉంది…
-
అంతర్గత యుద్ధం (Internal Purge)…: వారసత్వం కోసం అల్లుడు జూలియో, ఇతర కమాండర్లు ఒకరినొకరు చంపుకునే ప్రమాదం ఉంది… ఆల్రెడీ మెక్సికోలోని కొన్ని పట్టణాల్లో అల్లర్లు మొదలయ్యాయి… పలుచోట్ల ఎమర్జెన్సీ ప్రకటించారు…
-
సినలోవా కార్టెల్ అటాక్…: మెంచో లేని లోటును క్యాష్ చేసుకోవడానికి ‘ఎల్ చోపో’ గ్యాంగ్ (Sinaloa Cartel) మెంచో ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి సిద్ధమవుతోంది… ఎల్ చోపా అంటే మెంచో మొదట్లో పనిచేసిన మాఫియా గ్యాంగ్, చివరకు దాన్ని తొక్కేసి తను ఎదిగాడు, ఇప్పుడు ఆ గ్యాంగుకు మళ్లీ ఆధిపత్యం ప్రదర్శించే చాన్స్ దొరికినట్టే…
ముగింపు…: 125 కోట్ల రివార్డు ప్రకటించినా దొరకని మెంచో, చివరికి అనారోగ్యం, ఆర్మీ దాడికి తలవంచాల్సి వచ్చింది… ఒక క్రూరమైన బాస్ పోయినా, అతను సృష్టించిన వ్యవస్థ, ఆయుధ సంపత్తి ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్తాయనేది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తోంది….
Share this Article