.
Mohammed Khadeerbabu ….. నాట్ టుడే … వాడికి మొదట వాడి క్లాస్‌మేట్లు గుర్తుకొచ్చారు. తనతో పాటు కలిసి భక్తి గీతాలు ఆలపించే మరో స్నేహబృందం ఉంది. వాళ్లు గుర్తుకొచ్చారు. వాడికి ఫ్రెండ్ ఒకమ్మాయి ఉంది. ఇంచుమించు గర్ల్ ఫ్రెండే. అమ్మ, తమ్ముడు, చెల్లాయితో కలిసి విహారానికి పోతున్నానంటే చిన్న బహుమతి ఇచ్చింది. ఆ బహుమతి గుర్తుకొచ్చింది. అందరూ పదేపదే గుర్తుకొస్తున్నారు. మళ్లీ వాళ్లను కలుస్తాడా తను?
చనిపోతే?
‘నాట్ టుడే… నాట్ టుడే… నాట్ టుడే’ మూడుసార్లు అనుకున్నాడు.
అప్పటికి రెండు గంటలుగా సముద్రం మీద ఈదుతున్నాడు. ఒంటి మీదున్న లైఫ్ జాకెట్ ఉబ్బిపోయింది. అది ఉంటే ఈత ఏమాత్రం సౌకర్యంగా లేదు. ఇంకా చాలాసేపు ఈదాలి తను. ఎంతసేపు? ఎంతసేపో!
Ads
అప్పటికి హిందూ మహా సముద్రం తాను చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతోంది. ఈ ఘనకార్యమా తను చేయాల్సింది? ఒక పసివాణ్ణి, çపదమూడేళ్ల పిల్లవాణ్ణి నట్ట నడి సముద్రంలో ముంచెత్తడమా తన ప్రతాపం?
పశ్చిమ ఆస్ట్రేలియాలో ఫ్యామిలీ డే ఆ రోజు. జనవరి 30, 2026. కుటుంబాలు సరదాగా గడిపే సెలవు రోజు. ఆస్టిన్ ఆపెల్‌బీ తన తల్లితో కలిసి ‘పెర్త్’ పక్కనే ఉన్న తమ పల్లె నుంచి రెండున్నర గంటల దూరంలో ఉన్న బీచ్ టౌన్ ‘బన్స్‌బరో’కు వచ్చాడు. తోడుగా పన్నెండేళ్ల తమ్ముడు, పదేళ్ల చెల్లెలు ఉన్నారు.
బన్స్‌బరోలో సముద్రం ఒడ్డున రిసార్ట్‌లు ఉన్నాయి. బస చేసిన వారు సముద్రం మీదకు వెళ్లాలంటే కయాక్ (తెడ్డుతో నడిపే చిన్న పడవ), పెడల్‌బోర్డ్ (నిలుచుండి తెడ్డు వేసే పలక) ఎన్ని కావాలంటే అన్ని పడి ఉంటాయి.
బన్స్‌బరో సముద్రం సరస్సుతో సమానం. పిల్లలు ఆడుకునే నీటితొట్టెలాంటిది. అందుకే టూరిస్ట్‌లు ఎక్కువ. రిసార్ట్‌లో దిగాక తల్లి, పిల్లలు ఒక కయాక్, రెండు పెడల్‌బోర్డ్స్ తీసుకుని సముద్రం మీదకు వెళ్లారు. తల్లి తన కుమార్తెతో కయాక్‌లో కూచుని తెడ్డు వేసుకుంటూ ముందుకు వెళుతుంటే పన్నెండేళ్ల తమ్ముడు ఒక బోర్డ్ మీద, ఆస్టిన్ మరో బోర్డ్ మీద ఆమెను ఫాలో అయ్యారు.
గంట గడిచింది. వాతావరణం బాగుంది. మరో గంట గడిచింది. సముద్రానికి ఒంట్లో బాగుండక పోయింది. హటాత్తుగా అలలు పెరిగాయి. ఎగిశాయి. ఈ బుజ్జిబుజ్జి బల్లలను ఎత్తి గిరవాటు వేశాయి. కయాక్ తిరగబడి తల్లి, పాప సముద్రంలో పడ్డారు. ఆస్టిన్, వాడి తమ్ముడు ఉన్న బోర్డులు డింకీలు కొట్టాయి. అరుపులు, కేకలు, భయంతో వెర్రి పిలుపులూ…
పరిస్థితి సద్దుమణిగే సమయానికి తల్లి, పాప, తమ్ముడు పెడల్‌బోర్డును పట్టుకుని ఒకరితో ఒకరు దగ్గరగా కూడారు. ఆస్టిన్ మరో పెడల్‌బోర్డును పట్టుకున్నాడు. అందరి ఒంటి మీద లైఫ్ జాకెట్లు ఉన్నాయి. మునిగిపోరు. కాని ఒడ్డుకు కూడా చేరరు.
ఎందుకంటే అప్పటికి వారు ఒడ్డు నుంచి సరిగ్గా 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు.
మధ్యాహ్నం ఒంటి గంట. సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. కలతగా ఉన్న సముద్రం తమను ఇంకా లోపలికి ఎంతదూరం తీసుకు పోతున్నదో తెలియదు. ఈ ప్రమాదం జరిగినట్టు ఒడ్డుకు తెలియాలి. అప్పుడే సాయం. లేకుంటే ఇలా నాని నాని దప్పికతో చచ్చిపోవాలి. లేదా మళ్లీ కెరటాలు శివాలెత్తితే చెదిరిపోయి ఆ ఎడబాటుకు మరణించాలి.
చావు ఉంది ఆ తావులో.
దానిని ఎదిరించే ఆస్టిన్ కూడా ఉన్నాడు.
ఆ తల్లి తన జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది.
‘ఒడ్డుకు ఈదగలవా నా బంగారుతండ్రీ’…
‘ఈదగలను అమ్మా’…. వెంటనే గట్టిగా, నమ్మకంగా అన్నాడు ఆస్టిన్.
పన్నెండేళ్ల తమ్ముడు అన్న వైపు చూశాడు. అంతకు పది రోజుల ముందు ఊళ్లో 350 మీటర్ల స్విమింగ్ పోటీలో పూర్తిగా ఈదలేక చతికిల పడ్డాడు ఆస్టిన్. ఇప్పుడు సముద్రాన్ని ఈదుతాడా?
‘అమ్మను, తమ్ముణ్ణి, చెల్లాయిని నువ్వే కాపాడాలిరా’
‘నేను కాపాడుతానమ్మా’….

సమయం మధ్యాహ్నం రెండు.
ఆస్టిన్ తన తల్లి వైపు, తమ్ముడి వైపు, మాట రాక బిగుసుకుపోయి చూస్తున్న చెల్లాయి వైపు చూసి ఒడ్డును అంచనా వేసుకుంటూ ఈదడం మొదలెట్టాడు.
సముద్రాన్ని ఆ చిన్నారి చేతులు చీలుస్తున్నాయి. అలిగిన పిల్లలు పెద్దల పై పిడిగుద్దులు విసిరినట్టు వాడి చేతులు సముద్రం మీద లెంపకాయలు కొడుతున్నాయ్. వాడి కాళ్లు తోక. వాడి చేతులే మొప్పలు. వాడి ఒళ్లు వలను కొరికి బయట పడ్డ చేపపిల్ల.
వెనుక తన వాళ్లను ఒదిలి వచ్చాడు. భయం. ముందు ఒడ్డుకు చేరుతాడో లేదో. భయం.
పదమూడేళ్ల పిల్లవాడు. వీరుడు. శూరుడు. బంగారుతండ్రి. వాణ్ణి చూసి, సముద్రం సిగ్గుతో చచ్చి దోసిలిలో తేలుస్తున్నంత ప్రశాంతంగా మారింది. వాడు ఈదాడు… ఈదాడు.. ఈదాడు… రెండు గంటలు ఈదాడు. ఇంతా చేస్తే రెండు కిలోమీటర్లు ఈదాడు. ఇంకా రెండు కిలోమీటర్లు ఈదాలి.
వెనుక అమ్మ ఎలా ఉందో. తమ్ముడూ… చెల్లాయి.
లైఫ్ జాకెట్‌తో ఈదడం ఇక మీద అసాధ్యం. తీసి పారేశాడు. అది లేకుండా… ఈదడం… ఒడ్డు వరకు… అవుతుందా? మునిగిపోతే?
‘నాట్ టుడే… నాట్ టుడే… నాట్ టుడే’…
గట్టిగా సంకల్పించి మళ్లీ చేతులు సముద్రం మీద సాచాడు.
భయం పోవడానికి సంతోషకరమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు. పాటలను గుర్తు చేసుకుంటున్నాడు. వాటిని హమ్ చేస్తూ స్నేహితులతో చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటున్నాడు. ఈదుతున్నాడు. వాడి కాళ్లు నీళ్లు చరిచి, తట్టి, తోసి, ఆ ఉప్పునీటి కోతకు మెల్లగా చచ్చు పడుతున్నాయి. అవి తన ఒంటితో పాటు ఉన్నట్టుగా కూడా తెలియడం లేదు.
అయినా ఈదాలి.
ఇవాళ తను చనిపోడు. ఏమైనా సరే చచ్చిపోడు. నాట్ టుడే.
ఒక బాలుడు… వీరుడు… శూరుడు… హిందూ మహాసముద్రాన్ని తోక ముడిచేలా చేసి సాయంత్రం ఆరవుతుండగా నాలుగు గంటలపాటు ఏకధాటిగా ఈది ఒడ్డుకు చేరి పడిపోయాడు.
అంతటితో చాలదు. రిసార్ట్ చేరాలి. కాళ్లు కదలడం లేదు.
‘అమ్మ ఎలా ఉందో’…..
‘అమ్మా’….
శక్తినంతా కూడదీసుకుని లేచాడు. రెండు ఫర్లాంగుల దూరంలో ఉన్న రిసార్ట్ చేరి ఫోన్ అందుకుని మూడు సున్నాలు నొక్కి దిక్కులన్నీ పిక్కటిల్లేలా అరిచాడు.
‘హెలికాప్టర్ పంపండి… విమానం పంపండి… పడవలు పంపండి… మా అమ్మ… సముద్రంలో… మా చెల్లెలు… మా తమ్ముడు…’
రాత్రి 10 గంటలకు, ఒడ్డు నుంచి 14 కిలోమీటర్ల దూరంలో కొట్టుకొని పోయిన ఆస్టిన్ తల్లిని, తమ్ముడిని, చెల్లెలిని సహాయక బృందాలు రక్షించాయి. హెలికాప్టర్ గాలించి గుర్తిస్తే పడవ మీద తీసుకువచ్చారు.
అంత వరకూ ఆ తల్లికి ఒకటే భయం… ఆస్టిన్ ఒడ్డుకు చేరాడా లేదా… సహాయక బృందం వస్తుంటే ఆమె అరిచిన అరుపు ‘మావాడు చెప్తే వచ్చారా… మీకై మీరు వచ్చారా?
‘మీ వాడే’
అంత ఆందోళనలోనూ ఆమె నవ్వింది. ప్రకృతి శక్తులు ఆమె తలను నిమిరాయి.
‘పిచ్చిదానా… నీ కొడుకును ఓడించడం మా వశమా?’
ఆస్టిన్ ఆ రోజు నుంచి నేటి వరకూ ఆస్ట్రేలియాలో హీరో అయ్యాడు. ప్రపంచం మొత్తం వాడి సాహసం విని, వాడి కోసం 3 లక్షల డాలర్లు సేకరించి క్షణాల మీద ఇచ్చింది. పెద్ద పెద్ద వాళ్లు వాణ్ణి కలిసి షేక్‌హ్యాండ్ ఇచ్చి వెళుతున్నారు.
350 మీటర్లు ఈదలేని వాడు నాలుగు కిలోమీటర్ల సముద్రాన్ని ఈదాడు.
ప్రేమను ప్రదర్శిస్తే ప్రతి మనిషిలోన ఇంత ప్రచండశక్తి వెలికి వస్తుంది.
ద్వేషం కలిగి ఉంటే ఇదే ప్రచండశక్తి లోపలి అవయవాల మీదకు మళ్లుతుంది.
నిరాశ, నిస్పృహ, హానిగుణం, చెడు తలంపు, మరణవాంఛ… ఇవి తలెత్తినప్పుడు ఒక్కటే మాట ‘నాట్ టుడే… నాట్ టుడే… నాట్ టుడే’…
ఇక చూడండి…. ప్రకృతి శక్తులు మీ తలను ఎలా నిమిరి లాలిస్తాయో…..
Share this Article