Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అన్నీ నిజాలు చెప్పడం మొదలెడితే… ప్రతి క్షణం అమెరికా ఇరాన్ వార్ మరి..!!

March 25, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ……. ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి . ఆడవాళ్ళంటే అమ్మ , అక్కాచెల్లెళ్ళు కాదండోయ్ … భార్యలతో , ప్రేయసిలతో , గర్ల్ ఫ్రెండ్సుతో అన్న మాట . ఏదో తిరకాసు పెట్టి మాట తీసుకుంటారు . సంతోషి మాత వ్రతంలో ఉన్నాను ; ఓ నలభై రోజులు మందు కొట్టకూడదంటారు . నా మీద మీకు ప్రేమ ఉంటే ఓ ఆరు నెలలు సిగరెట్లు కాల్చకూడదంటారు . ఇలా ఏవేవో చేతిలో చెయ్యేయించుకుంటారు . ఇంక మగవారి తిప్పలు .

ఈ సినిమా అలాంటిదే . నిద్ర లేచిన దగ్గర నుండి చచ్చినా నిజం చెప్పని , అబధ్ధం ఆడకుండా ఉండలేని ఓ కుర్రాడు ఓ చక్కని చుక్క మాయలో పడిపోతాడు . నేను కావాలనుకుంటే ఓ నెల , మార్చి నెలంతా , అబధ్ధం ఆడకూడదు . అలా ఉంటే ఏప్రిల్ 1 న పెళ్లి చేసుకుంటానని ఓ అగ్రిమెంట్ చేయించుకుంటుంది .

Ads

ఈ కుర్రాడేమో ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా అలా మాటలాడి బతికేసే బేచ్ . ప్రేమ కోసం ఆ చక్కని చుక్క వలలో పడి నిజాలు చెప్పటం మొదలు పెడతాడు . ఇంకేముంది ! ఆ కాలనీలో అంతా ఇజ్రాయిల్ ఇరాన్ వారే . అందరూ గాయాలతో హాస్పిటల్లో జాయినయిపోతారు . చివరకు మన కుర్రాడు తన మిత్రుడికి శత్రువు అయిపోయి , అతని చేతిలో చావు తప్పించుకుని , తనను పెంచిన తల్లిని రక్షించేందుకు చేయని హత్యను మీద వేసుకుంటాడు .

పెంచిన తల్లి తానే హత్య చేసానని మన కుర్రాడిని రక్షిస్తుంది . నెల చివర్లో అబధ్ధమాడినా కుర్రాడి దీక్షకు అయిసయిపోయి ఆ ప్రేమికురాలు పెళ్ళికి అంగీకరించటంతో సినిమా ముగుస్తుంది . ఇది సినిమా కాబట్టి ఆ అమ్మాయి అగ్రిమెంటుని సడలించుకుని పెళ్లి చేసుకుంటుంది . నిజ ప్రపంచంలో కొందరు ఆడవాళ్ళు అంత దయార్ద్రులు కాదండోయ్ .

హరిశ్చంద్రుడే అబధ్ధమాడితే అనే నవల స్ఫూర్తితో వంశీ , కృష్ణ భగవాన్ , యల్ బి శ్రీరాంలు ఈ వినూత్న కధను నేసారు . నిస్సందేహంగా కొత్త రకం కధే . ఆ కధకు వంశీ మార్క్ టచ్ . కేవలం రెండు వారాల్లో రాజమండ్రి రైల్వే కాలనీలో మినిమం బడ్జెట్టుతో తీయబడిన సినిమా ఓ క్లాసిక్ కామెడీగా నిలిచిపోయింది .

సత్తె కాలంలోనే శుక్రుడు బలి చక్రవర్తికి బోధించాడు . వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ మాన విత్త భంగములందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు ఏం ఫరవాలేదు బొంకొచ్చు అని ప్రవచించాడు . భాగవతంలో చెప్పబడిన ఈ నీతి వాక్యాలే ఈ కలి కాలంలో ప్రామాణికం . ఈ పద్యం ప్రకారం అన్ని చోట్ల అందరితో అబధ్ధాలు ఆడవచ్చు . పాపం ఈ మినహాయింపు తెలియని ఈ కుర్రాడు దివాకరం నానా కష్టాలు పడి ప్రేమించిన పడతిని పెళ్లి చేసుకుంటాడు .

ఈ సినిమా గొప్ప ఏమిటంటే వంశీ అన్ని సినిమాల్లోలాగానే పాత్రల సృష్టి . హీరో అబధ్ధాలకోరు , ఈజీ గోయింగ్ & ఈజీ టేకింగ్ ఫెలో . ఈ రెండు లీడ్ రోల్సులో రాజేంద్రప్రసాద్ , శోభన గొప్పగా నటించారు . తర్వాత కాలంలో కమేడియన్ గా పాపులరయిన కృష్ణ భగవాన్ ఈ సినిమాలో విలనుగా , సీరియస్ పాత్రలో గుర్తుండిపోతాడు .

ఇతర పాత్రలు . మల్లికార్జున రావు , అతని ఇద్దరు భార్యలు , భాగ్యం (మా గుంటూరు జయలలిత) . బట్టల సత్యానికేమో భాగ్యం మీద మోజు , కన్ను . దాన్ని కేష్ చేసుకునే దివాకరం . చివరకు ఇద్దరు భార్యలు , భాగ్యం మల్లిఖార్జునరావుని ఉతుకుడు . భలే కేరెక్టర్లు .

చీటీ పాటల వయ్యారి వై విజయ . భర్త సాక్షి రంగారావు . భాగ్యం భర్త భీమరాజు . దివాకరం పెంపుడు తల్లిగా చాలా హుందా అయిన డాక్టరమ్మ పాత్రలో శుభ . రాళ్ళపల్లి , హీరోయిన్ తల్లిగా , కంచు వారి వారసురాలిగా జయవిజయ , ఆమె తమ్ముడుగా లిటిగేషన్ పాత్రలో మా గుంటూరు ప్రదీప్ శక్తి బ్రహ్మాండంగా నటించారు . లేడీస్ టైలర్ సినిమాలో విలన్ పాత్ర ధరించిన ప్రదీప్ శక్తి ఈ సినిమాలో లిటిగెంట్ సాఫ్ట్ పాత్రలో గొప్పగా నటించాడు .

ఇప్పటి తరం వాళ్ళకు వీడియోలను అద్దెకిచ్చే షాపులు తెలియదేమో . ఓ ముప్పై ఏళ్ళ కింద ఈ షాపులు వీర పాపులర్ . పైరసీ సినిమాలు , సింగిల్ ఎక్స్ , డబుల్ ఎక్స్ , త్రిపుల్ ఎక్స్ వీడియోలు , వాటిని చాటుగా వేసుకునే మగాళ్ళు , మగాళ్ళు బయటకు వెళ్ళాక ఇంకా రగస్యంగా చూసే కొంటె భార్యలు !!! ఇవన్నీ పెద్ద తిరణాల ఆరోజుల్లో . పోలీసుల రైడ్లు , వగైరా . మళ్ళా సినిమా లోకి వద్దాం .

ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఇళయరాజా సంగీతం , సిరివెన్నెల వెన్నెలకంటి పాటలు . మాటంటే మాటేనంట కంటపడ్డ నిజమల్లా చెపుతా పాట బాగుంటుంది . చెట్టు కింద ప్లీడర్ సినిమాలోని చల్తీ కా నామ్ గాడీ పాట ట్యూన్ , లిరిక్స్ గుర్తుకొస్తాయి . చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా చూస్తావా నా మైనా చేస్తానే ఏమయినా చాలా బాగుంటుంది .

ఒక్కటే ఆశా ఎందుకో శ్వాసా , ఒంపుల వైఖరి సొంపుల వాకిలి డ్యూయెట్లు రాజేంద్రప్రసాద్ , శోభనలపై బాగుంటాయి . నిజమంటే నిప్పే కదా మరో పాట . పాటల్ని బాలసుబ్రమణ్యం , చిత్ర , మనో పాడారు .

1991 ఫిబ్రవరిలో వచ్చిన ఈ సినిమా తమిళంలోకి సత్యవాన్ టైటిలుతో రీమేక్ అయింది . మురళి , గౌతమి నటించారు . కన్నడంలోకి మిస్టర్ హరిశ్చంద్ర అనే టైటిలుతో రీమేక్ అయింది . దర్శన్ , అనూ ప్రభాకర్ నటించారు . ఎన్నిసార్లయినా చూడబుధ్ధి వేసే ఈ సినిమా యూట్యూబులో ఉంది . It’s a hilarious , romantic , classic movie ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కమర్షియల్ యాడ్..! కానీ ఆమె అందమైన ఆ చిరునవ్వు గుర్తుచేస్తూ..!
  • చరిత్రాత్మక ఢిల్లీ జింఖానా క్లబ్‌ ఇక చరిత్ర పుటల్లోకి..?
  • పెళ్లితో కెరీర్ క్లోజ్ అనేది పాతమాట… దాన్ని బ్రేక్ చేసిన డిఫరెంట్ జంట…!
  • నాడు మంజులను రానివ్వలేదు… నేడు మంజుల బిడ్డ ఎంట్రీకి రెడీ…
  • System … సినిమా ముగిసినా… డైలాగులు వెంటాడుతూనే ఉంటయ్…
  • ఎప్‌స్టీన్ రహస్యాలకు ఈమే కీలకం… నాడియా మార్సింకో!
  • బావల్లేని మరదళ్లు… మరదళ్లు లేని బావలు… ఉత్తములు- గుణవంతులు…
  • నా వాచాలత్వం జీడి పప్పు… మీ వక్తృత్వం జిల్లేడు పప్పు…
  • IPL-2026 …. ప్లేఆఫ్‌లోకి రాజస్థాన్…! పంజాబ్ కల మళ్లీ భగ్నం..!
  • డ్రగ్స్ మత్తు దిగింది సరే… ఆ ‘థార్ పోరగాళ్ల’ డబ్బు బలుపు దిగేదెలా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions