.
కులం గిలం జాన్తా నై! …. కాలం మారింది… కాలంతో పాటు మన ఆలోచనలు కూడా వేగంగా మారుతున్నాయి. “ఫలానా అర్హతలున్న వధువుకు/ వరుడికి ఫలానా అర్హతలున్న వరుడు/ వధువు కావలెను” అన్న ప్రకటనల నుండి “మనసు కలిసిన తోడు కావలెను” అనే స్థాయికి వచ్చాయి పెళ్ళి ప్రకటనలు.
తాజాగా జీవన్ సాథీ మ్యాట్రిమోనీ విడుదల చేసిన నివేదిక చూస్తుంటే భారతీయుల వివాహ వ్యవస్థలో ఒక నిశ్శబ్ద విప్లవం కనిపిస్తోంది. కులం గోడలు బద్దలవుతున్నాయి.. వయసు నిబంధనలు చెరిగిపోతున్నాయి.
Ads
కులం వెనక్కి.. గుణం ముందుకు! ఒక దశాబ్దం క్రితం వరకు పెళ్లి సంబంధం కుదరాలంటే ‘కులం’ ఒక్కటే ప్రధానమైన అర్హత. 2016 నాటి గణాంకాలను పరిశీలిస్తే 91 శాతం మంది కులం చూసే పెళ్లి చేసుకుంటామని భీష్మించుకు కూర్చున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.
2025 నాటికి ఆ సంఖ్య 54 శాతానికి పడిపోయింది. అంటే కులం గిలం జాన్తా నై.. మాకు మనసు కలిస్తే చాలు అని సగానికి పైగా యువత తెగేసి చెబుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. కులాల కుంపట్ల కంటే కలకాలం కలిసి ఉండే గుణమే ముఖ్యమని నేటి తరం డిక్లేర్ చేస్తోంది.
25 ఏళ్లకే పెళ్ళా? నో వే! “పాతికేళ్లు వచ్చాయి.. ఇక పెళ్లి చేసేయాలి” అనే పాతకాలపు పద్ధతులకు యువత స్వస్తి పలుకుతోంది. కెరీర్‌లో స్థిరపడాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, జీవితంపై ఒక క్లారిటీ రావాలి.. అప్పుడే వివాహం అంటున్నారు. అందుకే గతంలో 27 ఏళ్లుగా ఉన్న సగటు పెళ్లి వయసు ఇప్పుడు 29 ఏళ్లకు చేరింది. వయసు మించిపోతుందనే భయం కంటే, తప్పుడు వ్యక్తిని ఎంచుకోకూడదనే స్పష్టత యువతలో పెరిగింది. పరిపక్వత వచ్చాకే పీటలు ఎక్కుతామని వారు చెబుతున్న తీరు ఆలోచించదగ్గది.
ఆదాయం విషయంలో అహంకారం లేదు ఆర్థిక విషయాల్లో కూడా నేటి యువత చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తోంది. ఇద్దరూ సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుందని 92 శాతం మంది నమ్ముతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన మార్పు ఏంటంటే.. 87 శాతం మంది పురుషులు తమ కంటే ఎక్కువ సంపాదిస్తున్న మహిళను భార్యగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.
పురుషాధిక్యత లేదా ఈగో కంటే ఆర్థిక భద్రతకే వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. అటు మహిళలు కూడా తమ కంటే తక్కువ ఆదాయం ఉన్న పురుషులతో జీవితాన్ని పంచుకోవడానికి వెనకాడటం లేదు.
వివక్ష నీడ నుంచి పునర్వివాహ వెలుగులోకి… విడాకులు అంటే ఒకప్పుడు సామాజిక కళంకం. కానీ ఇప్పుడు ఆ దృక్పథం మారుతోంది. గత దశాబ్దంలో పునర్వివాహాల సంఖ్య ఏకంగా 43 శాతం పెరిగింది. గత చరిత్ర కంటే మనిషి వ్యక్తిత్వానికే విలువ ఇస్తున్నారు. విడాకులు తీసుకున్న వారికి వస్తున్న సంబంధాలలో 15 శాతం మంది అవివాహితులు ఉండటం విశేషం. అంటే గతాన్ని తవ్వి చూడకుండా, వర్తమానంలో తోడుగా నిలిచే మనిషిని గౌరవించే సంస్కృతి పెరుగుతోంది.
నా పెళ్లి.. నా నిర్ణయం! పెళ్లి సంబంధం అంటే ఒకప్పుడు పెద్దలే అంతా చూసేవారు. కానీ ఇప్పుడు 77 శాతం మంది యువత తమ ప్రొఫైల్స్‌ని తామే మేనేజ్ చేసుకుంటున్నారు. తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే బాధ్యతను తమ చేతుల్లోనే ఉంచుకుంటున్నారు. అలాగని తల్లిదండ్రులను పక్కన పెట్టడం లేదు..
69 శాతం మంది పెద్దల ఆమోదానికి విలువ ఇస్తున్నారు. అయితే మ్యాచ్ మేకింగ్‌లో ఇప్పుడు తల్లిదండ్రుల కంటే తోబుట్టువుల (అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల) సలహాలకే యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.
మొత్తానికి భారతీయ వివాహ వ్యవస్థలో ‘మనసే మంత్రం’ అన్న కొత్త సూత్రం అమలవుతోంది. సంప్రదాయాలను గౌరవిస్తూనే, వ్యక్తిగత స్వేచ్ఛకు, మానసిక సాన్నిహిత్యానికి పెద్దపీట వేస్తున్న నేటి తరం ఆలోచనలు నిజంగానే ఆహ్వానించదగ్గవి. పెళ్లి రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు.. రెండు స్వతంత్ర మనసుల అందమైన ప్రయాణం.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article