.
Subramanyam Dogiparthi …. చిరంజీవి నటించిన ఏకైక కౌబాయ్ మూవీ 1990 లో వచ్చిన ఈ కొదమ సింహం . కైకాల సత్యనారాయణ , ఆయన తమ్ముళ్ళు రమా ఫిలింస్ బేనర్లో నిర్మించిన హిట్ మూవీ . ఇరవై సెంటర్లలో వంద రోజులు ఆడింది . హిందీలోకి మై హూ కిలాడియోంకా కిలాడీ అనే టైటిలుతో , ఇంగ్లీషు లోకి Hunters of Indian Treasure అనే టైటిలుతో డబ్ చేయబడింది .
కౌబాయ్ సినిమాలకు మన తెలుగులో కృష్ణ , విజయనిర్మల , విజయలలిత , జ్యోతిలక్ష్మి పెట్టింది పేరు . శోభన్ బాబు కూడా దెబ్బకు ఠా దొంగల ముఠా అనే ఒక కౌబాయ్ సినిమాలో నటించారు . యన్టీఆర్ , ఏయన్నార్ నటించలేదు .
Ads
కైకాల సత్యనారాయణ తమ్ముడు నాగేశ్వరరావు చిరంజీవితో భారీ స్థాయిలో ఈ కౌబాయ్ సినిమా తీయాలని ఫిక్సయి పోయి పరుచూరి బ్రదర్స్ , విజయేంద్రప్రసాద్ , సత్యానంద్ లతో ఈ సినిమా కధను తయారు చేసుకున్నారు . మెకన్నాస్ గోల్డ్ , మోసగాళ్ళకు మోసగాడు వంటి అన్ని treasure hunt సినిమాల్లాగే ఈ సినిమా కూడా నెమలి సింహాసనం , కోహినూర్ వజ్రంల కొరకు వేట .
బ్రిటిష్ కాలంలో సినిమా . అరాచకం , లూటీలు , మానభంగాలు , వ్యభిచారం వగైరా వ్యాధులతో బాధపడుతున్న ఓ ప్రాంతంలో శిష్టరక్షకుడి అవతారంలో అమాయక జనాన్ని రక్షిస్తూ ఉంటాడు హీరో చిరంజీవి భరత్ అనే పాత్రలో . ఆయన తల్లిని బంధించిన రాజుతో తన తండ్రి నిర్దోషి అని రుజువు చేసి , అదృశ్యమైన నెమలి సింహాసనాన్ని , కోహినూర్ వజ్రాన్ని తెస్తానని బయలుదేరుతాడు .
ఆ క్రమంలో ఆటవికుల పెద్ద దిక్కుగా ఉన్న తండ్రిని కలుసుకుని అసలు నిజాలను తెలుసుకుంటాడు . ఆ సింహాసనం , వజ్రం కోసం ప్రయత్నం చేస్తున్న మేయర్ , ఇతర విలన్లను గెలిచి వాటిని రాజుకి అప్పచెప్పి తల్లిదండ్రులను కాపాడుకోవటంతో సినిమా శుభాంతం అవుతుంది .
చిరంజీవికి ఈ సినిమాలోని దుష్టశిక్షణ పాత్ర కొట్టిన పిండే . తేడా అంతా కౌబాయ్ రోల్ . ఏక్షన్ , ఫైటింగ్ , డాన్సులు వంటి సీన్లలో యధావిధిగా అదరగొట్టేసారు . ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పాత్ర సుడిగాలి పాత్ర . ఈ పాత్రలో మోహన్ బాబు ప్రేక్షకులు మరచిపోలేని నటనను ప్రదర్శించాడు . మోసగాళ్ళకు మోసగాడు సినిమాలో నాగభూషణం గుర్తుకొస్తాడు.
ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ హిందీ నటుడు ప్రాణ్ నటించటం . మేయర్ పాత్రలో , హీరోయిన్ సోనం తండ్రిగా మెరిసిపోయారు . సినిమాకు మరో అత్యంత ప్రధాన పాత్ర సత్యనారాయణది . అద్భుతమైన మేకప్ . ఆయన నటన గురించి చెప్పేదేముంది !
ముగ్గురు ముద్దుగుమ్మలు . హిందీ నటి సోనం , రాధ , వాణీ విశ్వనాధ్ . సోనం పాత్ర గ్లామర్ పాత్రే . రాధదే చాలా ముఖ్యమైన పాత్ర . బాగా నటించింది . వాణీ విశ్వనాధ్ కాసేపే కనిపిస్తుంది . ఆ కాసేపులోనే చిరంజీవితో మంచి డాన్స్ , హిట్ పాట ఉన్నాయి ఆమెకు .
చిరంజీవి కన్నతల్లిగా జయంతి , పెంచిన తల్లిగా అన్నపూర్ణ ; ఇతర పాత్రల్లో సుధాకర్ , గొల్లపూడి మారుతీరావు , చలపతిరావు , కన్నడ ప్రభాకర్ , రంగనాధ్ , అల్లు రామలింగయ్య , వయ్యారాల వై విజయ , బ్రహ్మానందం తదితరులు నటించారు .
చిరంజీవి అనగానే పాటలు , స్టెప్పులు , ఫైట్లు ఆశిస్తారు ప్రేక్షకులు . అన్నీ దండిగానే ఉన్నాయి . రాజ్-కోటి సంగీత దర్శకత్వంలో పాటలనన్నీ వేటూరి వారే వ్రాసారు . బాలసుబ్రమణ్యం , మనో , చిత్ర పాడారు . వాణీ విశ్వనాధ్ , చిరంజీవిల మీద బ్రేక్ డాన్స్ పాట స్టార్ స్టార్ మెగాస్టార్ జపం జపం కొంగ జపం సూపర్ పాపులర్ సాంగ్ .
మిగిలిన నాలుగూ చిరంజీవి , సోనం , రాధల డ్యూయెట్లు . చాలా అట్టహాసంగా , భారీ ఖర్చుతో చిత్రీకరించారు . చక్కిలిగింతల రాగం , పిల్లో జాబిల్లో , అల్లాటప్పా గోంగూరమ్మ , గుం గుమాయించు కొంచెం లవ్ లగాయించు అంటూ సాగుతాయి ఈ నాలుగు డ్యూయెట్లు . చిరంజీవి అభిమానులను సీట్లలో కూర్చోనీయవు . తార , శివ సుబ్రమణ్యం డాన్సులను బ్రహ్మాండంగా కంపోజ్ చేసారు .
రాజస్థాన్ రాష్ట్రంతో సహా అయిదు రాష్ట్రాలలో షూటింగ్ జరుపుకున్న భారీ బడ్జెట్ సినిమా . ఎడారి ఇసుకలో చిరంజీవిని అతని గుర్రం కాపాడే సీన్ ప్రేక్షకులకు ఎలా బాగా నచ్చేసిందో, తర్వాత రోజుల్లో మగధీర సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాన్ని పెట్టారు రాజమౌళి .
చిరంజీవి కుమారుడు రాంచరణ్ నటించటం విశేషం . కేసినోలో ప్లేయింగ్ కార్డుల షఫిలింగ్ బాగుంటుంది . పేకాట బాగా ఆడే వాళ్ళకు తెలుసు . ముక్కలు కలపటంలోనే జిమ్మిక్కులు చేస్తారు వెటరన్ ఆటగాళ్లు . Enjoyable .
సినిమా యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే వాచ్ లిస్టులో వేసేసుకోండి . Undoubtedly an enjoyable action movie with melodious songs . కె మురళీమోహన్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను చిరంజీవి , రాధల అభిమానులు ఎన్ని సార్లయినా చూస్తారు . ఈమధ్యే 4కే, 5:1 ఆడియోతో రీరిలీజ్ చేసినట్టున్నారు.
నేను పరిచయం చేస్తున్న 1247 వ సినిమా. #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article