.
గోన గన్నారెడ్డి… కాకతీయ చరిత్రలో తనదొక విశేష స్థానం… సైనిక వ్యూహ రచనల్లో రుద్రమదేవికి పెద్ద తోడ్పాటు… సైన్యాధ్యక్షుడు, బలమైన విధేయ సామంతుడు… తనదొక చరిత్ర, ఆ చరిత్రకు మనచుట్టూ ఎన్నో ఆనవాళ్లు… ఐతే ఆ ఆనవాళ్లను మనం పదిలం చేసుకుంటున్నామా..? భావి తరాలకు ఆ చరిత్రను చెప్పగలుగుతున్నామా..? చూపించగలగుతున్నామా..? విషయం ఏమిటంటే..?
చరిత్ర అంటే ఎప్పుడూ నాకు ఆసక్తికరమైన అంశమే… సమయం దొరికినప్పుడల్లా చారిత్రక నవలల్లో మునిగిపోవడం లేదా పురావస్తు ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలకు ప్రయాణించడం నా అలవాటు… పురాతన దేవాలయాలను సందర్శించినప్పుడు కూడా, నా దృష్టి వాటి ఆధ్యాత్మికత కంటే చారిత్రక, పురావస్తు విశిష్టతపైనే ఎక్కువగా ఉంటుంది…
Ads
జర్నలిజం అనేది చాలా ఒత్తిడితో కూడిన వృత్తి కావడంతో, ఇలాంటి అభిరుచులకు సమయం కేటాయించడం అంత సులభం కాదు. ఐనా అప్పుడప్పుడూ వీలు చేసుకుని ఎటైనా పర్యటిస్తున్నాను… నా శ్రీమతి మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్లలోని ఒక రెసిడెన్షియల్ కళాశాలలో ప్రిన్సిపాల్.., అందువల్ల నేను తరచుగా అక్కడికి వెళ్తుంటాను.
ఇటీవల, ఢిల్లీలో పనిచేసే నా కుమార్తె మాతో గడపడానికి జడ్చర్లకు వచ్చింది. ఆమెకు కూడా పుస్తక పఠనం, చారిత్రక ప్రదేశాల పట్ల ఎంతో ఆసక్తి. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాచీన చరిత్ర గురించి ఆరా తీస్తూ, సమీపంలో సందర్శించదగ్గ ప్రదేశం ఏదైనా ఉందా అని అడిగింది. నాకు గోన గన్నారెడ్డి గుర్తొచ్చాడు, ఖిలా ఘన్‌పూర్ గుర్తొచ్చింది…
ఎప్పుడూ అనుకునేవాణ్ని, ఆ ఖిలా చూడాలని… కుదరలేదు… అమ్మాయి అడగడంతో ఈసారి ఎలాగైనా వెళ్లి చూడాలని అనుకున్నాను… ఖిలా ఘన్‌పూర్… ఇది జడ్చర్లకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో, ప్రస్తుతం వనపర్తి జిల్లాలో ఉంది… నేను దాని చారిత్రక ప్రాధాన్యత గురించి చదివి ఉన్నాను… కాకతీయ సామ్రాజ్యంలో (క్రీ.శ. 1262 – 1296 మధ్య) అత్యంత ప్రభావవంతమైన సైన్యాధ్యక్షుడు తను, సామంతుడైన గోనా గన్నారెడ్డి పాలనలో ఉండేది ఇది…
2015లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘రుద్రమదేవి’ సినిమా చూసిన వారికి గోనా గన్నారెడ్డి పేరు సుపరిచితమే — (ఆడా ఉంటా, ఈడా ఉంటా)… ఆ పాత్రను అల్లు అర్జున్ పోషించాడు. తెలుగు సాహిత్యంపై అవగాహన ఉన్నవారికి ప్రముఖ నవలా రచయిత అడవి బాపిరాజు రాసిన ‘గోనా గన్నారెడ్డి’ నవల కూడా గుర్తుండే ఉంటుంది.

రాణి రుద్రమదేవికి అత్యంత నమ్మకమైన సేనాని గోనా గన్నారెడ్డి. ఆయన తండ్రి గోనా బుద్ధారెడ్డి స్వయంగా గొప్ప కవి. ఆయన ద్విపద కావ్యం రూపంలో రచించిన ‘రంగనాథ రామాయణం’ తెలుగు సాహిత్యంలో తొలి రామాయణ గ్రంథాలలో ఒకటిగా నిలిచిపోయింది. గోనా వంశస్థులు వర్ధమానపురం (నేటి నాగర్‌కర్నూల్ జిల్లాలోని నంది వడ్డేమాన్) రాజధానిగా ఈ ప్రాంతాన్ని పాలించారు.
కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి పేరు మీద గన్నారెడ్డి ఈ ‘ఘన్‌పూర్’ కోటను నిర్మించాడు… దుర్భేద్యమైన కొండల శ్రేణిపై నిర్మించిన ఈ కోట, శత్రువుల నుండి రక్షణ పొందేలా వ్యూహాత్మకంగా రూపొందించబడింది. కోట పక్కనే ఆయన ‘గణపసముద్రం’ అనే భారీ చెరువును కూడా నిర్మించారు. కాకతీయులు తమ సామ్రాజ్యం అంతటా ఇలాంటి వందలాది గొలుసుకట్టు చెరువులను నిర్మించి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు.
కోటకు ప్రధానంగా ఐదు ప్రవేశ ద్వారాలు… వీటిని దాటుకుని లోపలికి వెళ్లడం శత్రువులకు దాదాపు అసాధ్యం… కోట గోడల వెంట సుమారు 60 కి పైగా బురుజులుండేవట… వీటి నుండి శత్రువుల కదలికలను కిలోమీటర్ల దూరం నుంచే గమనించవచ్చు…
కొండపై నీటి ఎద్దడి తలెత్తకుండా… పైనే రామ గుండం, లక్ష్మణ గుండం అనే రెండు సహజ నీటి కుంటలు ఉన్నాయి… ఇవి ఎప్పుడూ ఎండిపోవంటారు… కొండ కింద ఉన్న గణపసముద్రం భారీ చెరువు నుంచి నీటిని పైకి పంపింగ్ చేసే ఏర్పాట్లు ఉండేవని కొందరు చరిత్రకారుల అభిప్రాయం…
కోట శిఖరాగ్రాన ఇప్పటికీ రెండు భారీ లోహపు ఫిరంగులు ఉన్నాయి… వీటిని ప్రత్యేకమైన లోహ మిశ్రమంతో తయారు చేశారు, అందుకే ఇన్ని వందల ఏళ్లయినా తుప్పు పట్టకుండా మెరుస్తూనే ఉంటాయి… ఇదంతా నేను చదివిన కోట విశేషాలు…
చారిత్రక ఆధారాల ప్రకారం, బుద్ధాపురం (నేటి భూత్పూర్) వద్ద ఢిల్లీ సుల్తానులతో జరిగిన యుద్ధం తర్వాత, కాకతీయ రాజు రెండో ప్రతాపరుద్రుడు గోనా గన్నారెడ్డి కుమార్తెను ఇదే ఖిలా ఘన్‌పూర్ కోటలో వివాహం చేసుకున్నాడు…

ఒక చలికాలపు ఎండ వేళ, నేను నా కుమార్తెతో కలిసి ఈ 13వ శతాబ్దపు కోటను సందర్శించాలని బయల్దేరాను… జడ్చర్ల నుండి జాతీయ రహదారిపై భూత్పూర్ కేవలం 5 కిలోమీటర్ల దూరం… అక్కడ నుండి ఎడమ వైపు తిరిగితే సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఖిల్లా ఘన్‌పూర్ వస్తుంది… ఐనా గూగుల్ మ్యాప్స్ ఉందిగా, సులభంగానే చేరుకున్నాం…
రోడ్డు బాగుంది, మండల కేంద్రం కావడంతో పట్టణం కూడా చూడముచ్చటగా, పక్కన పచ్చని పొలాలతో కళకళలాడుతోంది. పట్టణం ప్రవేశంలోనే ఉన్న మండల కార్యాలయం వద్ద ఆగి కోట గురించి విచారించాం…
“లేదు, మీరు కోటపైకి వెళ్లలేరు. అది పూర్తిగా అడవి ప్రాంతం, వెళ్లడానికి సరైన మార్గం లేదు. కొండ మీదకు దారి కూడా సరిగ్గా ఉండదు. పైగా అక్కడ పాములు, అడవి జంతువులు ఉండే అవకాశం ఉంది, అది ప్రమాదకరం” అని అక్కడి అధికారి ఒకరు మమ్మల్ని హెచ్చరించాడు…
మాలో ఒక్కసారిగా నిరాశ… అయితే, ఉత్సాహవంతులైన యువకులు, చరిత్ర ప్రేమికులు ఈ కోటను ట్రెక్కింగ్ ద్వారా సందర్శిస్తున్నారని నేను ఎక్కడో చదివినట్టు గుర్తు… అందుకని ఆశ వదులుకోలేదు. పట్టణంలో ముందుకు వెళ్తుండగా ప్రెస్ క్లబ్ కనిపించింది. అక్కడ విజయ్ అనే స్థానిక జర్నలిస్ట్… నేను ఫలానా అని పరిచయం చేసుకున్నాను, సంతోషంగా, సాదరంగా మాటలు కలిపాడు…
“అవును సార్, ఇది పూర్తిగా సందర్శించడం అంత సులభం కాదు, జనం వెళ్లక చాలా కాలమైంది, స్థానికులకు కూడా దీని గొప్పతనం గురించి అంతగా తెలియదు. అప్పుడప్పుడు ట్రెక్కింగ్ బృందాలు వెళ్తుంటాయి, కానీ ఒంటరిగా వెళ్లడంకంటే గుంపులుగా వెళ్లడమే క్షేమం…”
కొండపైకి వెళ్లేందుకు మెట్లు ఉన్నాయి, కానీ చాలావరకూ శిథిలమయ్యాయి, అజాగ్రత్తగా ఉంటే లోయల్లో పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు మమ్మల్ని… అయినా సరే వెళ్లాలనే మా పట్టుదల చూసి, విజయ్ స్వయంగా మమ్మల్ని కోట ముఖద్వారం వరకు తీసుకెళ్లి దారి చూపిస్తానన్నాడు. ఆయన తన బైక్‌పై ముందు వెళ్తుంటే, మేము కారులో సందులు గొందుల గుండా ప్రయాణించి కోట ప్రవేశ మార్గానికి చేరుకున్నాం…

అక్కడ అటవీ శాఖ బోర్డు “అటవీ ప్రాంతం.. అడవి జంతువుల పట్ల జాగ్రత్త” అని హెచ్చరిస్తోంది… గేటు తెరిచి ఉంది… మొదట గేటు వరకే వస్తానన్న విజయ్, మా ఉత్సాహాన్ని చూసి మాతో పాటు కొండ ఎక్కడానికి సిద్ధమయ్యాడు. “నేను కూడా దాదాపు ఆరేడేళ్ల తర్వాత ఇక్కడికి వస్తున్నాను” అన్నాడాయన…
కొండ ఎక్కడం చాలా కష్టంగా ఉంది. ఒక సన్నని దారి ఉన్నప్పటికీ, చుట్టూ దట్టమైన పొదలు, రాళ్లతో నిండి ఉంది. పాత మెట్లు ఉన్న దారిలోనే మేము ముందుకు సాగాం. చలికాలమే అయినా ఎండ తీవ్రత వల్ల మేం త్వరగానే అలసిపోయాం. మధ్యమధ్యలో ఆగుతూ ఊపిరి పీల్చుకుంటూ ఎక్కడం కొనసాగించాం. ట్రెక్కింగ్ గ్రూపులే తప్ప సాధారణ పర్యాటకలకు కష్టమే అని అర్థమైంది…
కోట పైభాగానికి చేరుకుని, మొత్తం చూడాలంటే కనీసం 3 కిలోమీటర్ల మేర నడవాలని విజయ్ చెప్పాడు. సగం దూరం వెళ్ళాక ఒక విశ్రాంతి స్థలం వద్ద ఆగి చూస్తే, పైనే కోట శిథిలాలు కనిపించాయి. “మధ్యలో హనుమంతుడి ఆలయం ఉంది. ఏటా జాతర సమయంలో మాత్రమే ప్రజలు ఇక్కడికి వస్తారు. మిగతా సమయాల్లో ఇది నిర్మానుష్యంగానే ఉంటుంది” అని విజయ్ వివరించాడు.
ఆ కొండల అమరిక సహజ సిద్ధమైన రక్షణ కవచంలాగే కాకుండా, చూడటానికి ఎంతో అందంగా ఉంది. కోట గోడలు, దారులు శిథిలమైనా, అక్కడి నుండి కనిపించే దృశ్యం అద్భుతంగా ఉంది. కింద నీటితో నిండి ఉన్న ‘గణపసముద్రం’ చెరువు స్పష్టంగా కనిపిస్తోంది.
మేం ఇంకా పైకి వెళ్లడానికి ప్రయత్నించాం కానీ, అలసట వల్ల విరమించుకోవాల్సి వచ్చింది. “మీరు మంచి నీళ్ల బాటిల్ తెచ్చుకోవడం మంచిదైంది, కానీ ఒకటి సరిపోదు. పైకి వెళ్లాలంటే కనీసం మూడు నాలుగు బాటిళ్లు ఉండాలి” అన్నాడు విజయ్ నవ్వుతూ…
కోటలో రెండు సొరంగాలు ఉన్నాయని, ఒకటి గ్రామంలోకి, మరొకటి పానగల్ కోటకు దారి తీస్తాయని చెప్పాడు. శత్రువుల దాడి జరిగినప్పుడు రాజకుటుంబం తప్పించుకోవడానికి …
“ఇది రక్షిత కట్టడాల జాబితాలో లేకపోవడంతో క్రమంగా శిథిలమైపోతోంది. గతంలో కొందరు జిల్లా కలెక్టర్లు దీనిని పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రయత్నించారు కానీ, నిధుల కొరత వల్ల అది సాధ్యపడలేదు” అని విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు…
దిగడం కూడా ఎక్కడమంత కష్టంగానే అనిపించింది. తిరిగి గేటు వద్దకు చేరుకున్నాక, కోట పైభాగంలో ఉండే ఫిరంగులను, యుద్ధ సామగ్రిని చూడలేకపోయినందుకు మా ముఖాల్లోని నిరాశను విజయ్ గమనించాడు. “పైన చిన్న చిన్న నీటి కుంటలు కూడా ఉన్నాయి, బహుశా రాజవంశీయుల తాగునీటి అవసరాల కోసం వాటిని వాడేవారేమో” అని ఆయన అదనపు సమాచారం చెప్పాడు…
“డోన్ట్ వర్రీ సార్. వచ్చేసారి మీరు మీ జర్నలిస్ట్ మిత్రులతో కలిసి రండి. అప్పుడు మిమ్మల్ని కచ్చితంగా కొండ పైవరకూ తీసుకెళ్తాను” అని విజయ్ భరోసా ఇచ్చాడు… ఇక్కడ పదే పదే నన్ను పీడించిన ప్రశ్న... ప్రభుత్వం ఇలాంటి హిస్టారిక్ ప్రదేశాల్ని ఎందుకు టూరిస్ట్ సైట్స్‌లాగా డెవలప్ చేయకూడదు..? .... — అప్పరసు శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు
Share this Article