.
సీనియర్ జర్నలిస్ట్ జకీర్ ఒకనాటి క్రాంతి పత్రిక క్లిప్పింగ్ పెట్టి మరీ రాసిన ఓ వార్త ఇంట్రస్టింగ్… ఓ పాత సందర్భాన్ని గుర్తుచేశాడు ప్రస్తుత సందర్భానుసారం… జగిత్యాలలో ఒకప్పుడు… అంటే, 48 సంవత్సరాల క్రితం సెప్టెంబరు 9న రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో లక్షలాది మంది కదం తొక్కారు… భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం… జగిత్యాల జైత్రయాత్రగా విప్లవోద్యమంలో ప్రసిద్ధి అది… దాదాపు మూడు లక్షల మంది పేదజనం దున్నేవాడిదే భూమి కావాలంటూ, బానిస బతుకులు- వెట్టిచాకిరీకి నిరసనగా ఆ సభ జరిగింది…
అది గడీల మీద తిరుగుబాటు… ఆ జగిత్యాల తరువాత కాలంలో పీపుల్స్‌వార్ ఉద్యమానికి ఆయువుపట్టుగా మారింది… అనేక అగ్రనేతలు ఆ ఏరియా నుంచే వచ్చారు… పీపుల్స్‌వార్ మావోయిస్టు పార్టీగా మారాక కూడా జగిత్యాల ప్రాంతం విప్లవపోరాటాలకు కేంద్రంగానే ఉంది… ఇదే జీవన్‌రెడ్డి మొదట్లో న్యాయవాదిగా ఆ పోరాటాల పట్ల సానుకూలతనే కనబరిచాడు…
Ads

సీన్ కట్ చేస్తే… అదే జీవన్‌రెడ్డి అదే గడీల రాజ్యంలోకి వెళ్తున్నాడు ఈ లేటు వయస్సులో… ఎంత కంట్రాస్టు..?! అక్కడే కేసీయార్ ఈనెల 26న లక్ష మందితో మీటింగు పెడతాడని వార్తలు వస్తున్నాయి… జీవన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడానికి ఉద్దేశించిన సభ… సరే, జనం మీద అలిగి, జనానికి దూరంగా, జనం సమస్యలేమీ పట్టకుండా ఫామ్ హౌజు వదలని కేసీయార్ ఆ సభకు వస్తాడా లేదానేది సందేహమే… వస్తే, జీవన్‌రెడ్డి చేరిక తాలూకు విశ్లేషణల్ని కాసేపు వదిలేసి, ఆయన జనంలోకి వస్తున్నందుకు ఆహ్వానిద్దాం… ప్రతిపక్ష నేత పాత్రను పోషించాలనే ఆశిద్దాం… కానీ అలా చేస్తే తను కేసీయార్ ఎందుకవుతాడు..?
అవునూ, జీవన్‌రెడ్డికి ఎందుకంత ఎనలేని ప్రయారిటీ ఇస్తున్నది బీఆర్ఎస్..? పెద్ద క్వశ్చన్ మార్క్… తను కేవలం జగిత్యాల ప్రాంత నేత… పలుసార్లు ఓడిపోయాడు, చాన్నాళ్లుగా జనం తనను ఆదరించడం లేదు… తనేమీ రాష్ట్ర స్థాయి నేత కాదు… పైగా కేసీయార్ స్వయంగా నంబర్ టూ ప్లేసులోని చాలామంది నాయకులను పార్టీ నుంచి తరిమేశాడు, తెలంగాణ ద్రోహులను కూడా అలుముకుని, అందలాలు ఇచ్చాడు…
అవన్నీ తెలిసి, ఏళ్లుగా చూస్తూ కూడా… దేవుడే నన్ను నీ దగ్గరకు పంపాడన్నా అంటున్నాడు జీవన్‌రెడ్డి కేసీయార్ దగ్గరకు… అవునా..? కానీ ఎందుకు..? కేసీయార్ పదేళ్ల పాలన వైఫల్యాలను, తప్పులను మోయడానికా..?
పింక్ క్యాంపు రాతలు కొన్ని నిన్న ఆశ్చర్యం కలిగించాయి… బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ జీవన్‌రెడ్డిని బీజేపీలోకి తీసుకురావడానికి బాగా ప్రయత్నించాడట… జీవన్‌రెడ్డికి రాజ్యసభ, ఆయన కోడలికి జగిత్యాల టికెట్ ఆఫర్ ఇచ్చాడట…
ఐనాసరే, నేను బీజేపీ భావజాలంలో ఇమడలేను, బీజేపీలో చేరిన ఈటల స్థితిని చూస్తున్నాం కదా, సో, బీఆర్ఎస్- కేసీయార్ నాయకత్వమే ఇష్టపడతాను అని బీఆర్ఎస్లో చేరడానికే మొగ్గు చూపాడట… నిజంగా బీజేపీ ఎవరికైనా ముందుస్తుగా రాజ్యసభ, అసెంబ్లీ టికెట్లు హామీ ఇస్తుందా..? పోనీ, ఇవ్వడానికి అరవింద్ ఎవరు..? తన చేతుల్లో ఏముంటుంది..?
అవునూ… ప్రస్తుతం రహస్య స్నేహితులుగా మాత్రమే ఉన్న బీజేపీ- బీఆర్ఎస్ రేప్పొద్దున పొత్తుకో, అవగాహనకో, విలీనానికో సిద్ధమైతే అప్పుడు జీవన్‌రెడ్డి ఏం చేయాలి మరి..?! పింక్ క్యాంప్ ప్రచారం ఎలా ఉంటుందంటే..? జీవన్ రెడ్డి వంటి నేత పార్టీని వీడితే ఇక కాంగ్రెస్ గతి ఏమిటి అని ఖర్గే పార్టీ రాష్ట్ర ముఖ్యులకు క్లాస్ పీకాడని వార్తలు రాయిస్తున్నారు… ఖర్గే అసలు జీవన్‌రెడ్డి పేరు విని ఉంటాడా..?

Share this Article