Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీడియా బాసుల అహం దెబ్బ తింటే… జర్నలిస్టుల కొలువులు గల్లంతే…

March 4, 2026 by M S R

.

Bhavanarayana Thota…  యాజమానుల అహం దెబ్బతింటే.. ఉద్యోగులు బలి … 2002 జులైలో అనుకుంటా.. ముప్పవరపు వెంకయ్యనాయుడు బీజేపీ అధ్యక్షుడయ్యారు. ఆయన ఆ హోదాలో మొదటిసారిగా హైదరాబాద్ వచ్చినప్పుడు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి పార్టీ ఆఫీసు దాకా భారీ ర్యాలీ జరిగింది. ఆ తరువాత ఆయన పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఇదంతా కవర్ చేసి జెమినీ రిపోర్టర్ ఆ రిపోర్ట్ రాశారు.

చెన్నై ఆఫీసులో భారం తగ్గించటానికి ఒక్కోసారి కొన్ని వార్తలు హైదరాబాద్ లోనే ఎడిట్ చేసి పంపేవారు. సాధారణంగా ఆఖరి నిమిషంలో పంపాల్సిన వార్తలకే అలా జరుగుతుంది. కానీ ఆ రోజు మాత్రం సాయంత్రం లోపే పూర్తయినా, ఆ వార్త మాత్రం 8 గంటల వార్తలకు కొద్ది సేపు ముందు మాత్రమే చెన్నై చేరింది.

Ads

ఆ స్క్రిప్ట్ టీవీకి తగినట్టు లేదు. అందువల్ల దాని వీడియో ఎడిటింగ్ కూడా అలాగే జరిగింది. అంటే, యాంకర్ చదివిన స్క్రిప్ట్ లో ఊరేగింపు గురించి ఉంది. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన విషయం చెప్పి, ఆయన బైట్ వేశారు. దీంతో ఊరేగింపు విజువల్స్ లేవు. చాలా సీదాసాదాగా టెలికాస్ట్ చేయాల్సి వచ్చింది.
ఆ బులిటెన్ తరువాత మొత్తం విజువల్స్ తెప్పించుకొని 10 గంటల బులిటెన్ లో సమగ్రంగా, మొత్తం విజువల్స్ వాడుకుంటూ వార్త టెలికాస్ట్ చేశాం.

మరుసటి రోజు మధ్యాహ్నం ఒకటిన్నర టైమ్ లో సన్ టీవీ ఛైర్మన్ కళానిధి మారన్ మా ఎండీ (జెమిని, ఉదయ టీవీ బాధ్యతలు చూసే శరద్ కుమార్) కి ఫోన్ చేసి 2 గంటలకు తన ఛాంబర్ కి నన్ను పంపించమని చెప్పారట. “ఏంటి వెంకయ్య నాయుడి గారి న్యూస్ మనం వేయలేదా? కళానిధి కోపంగా ఉన్నారు. 2 గంటలకు వెళ్ళు కలువు” అని శరద్ గారు చెప్పారు. నాకు కొద్దిగా అర్థమైంది.

వెంకయ్యనాయుడి గారికి మారన్ కుటుంబంతో బాగానే పరిచేయముంది. అంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే జరిగింది. అందుకే వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన స్క్రిప్ట్, 10 గంటలకు తిరగరాసిన స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళా.

కళానిధి మారన్ చాలా కోపంగా ఉన్నారు. నేరుగా అడిగేశారు. “వెంకయ్యనాయుడి గారి వార్త మనం ఎందుకు సరిగా వేయలేకపోయాం? పగలు జరిగింది కదా, రాత్రి 8 గంటల బులిటెన్ లో కూడా చాలా తక్కువే వేశారంట. ఈరోజు ఆయన్ను లంచ్ కి పిలిచా. ఆయన, వాళ్ళ కూతురు వచ్చారు. నిన్న ప్రోగ్రామ్ ఎలా జరిగిందని మాట వరుసకు అడిగితే మీ చానల్ లో సరిగా వేయలేదు. ఈటీవీ బాగా కవర్ చేసింది అన్నారు. ఆ మాట నాకెంత ఎంత అవమానంగా ఉంటుంది?” అని కాస్త గట్టిగానే అన్నారు.

నేను వీలైనంత నెమ్మదిగా ఆయనకు అర్థమయ్యేట్టు చెప్పా. రిపోర్టర్ కొత్తవాడని, స్క్రిప్ట్ రాసే పద్ధతి తెలియకపోవటం వల్ల దానికి తగినట్టు ఎడిట్ చేయటంలో ర్యాలీ విజువల్స్ పడలేదని, ఆఖరి నిమిషంలో ఎడిటెడ్ వీడియో వచ్చిందని, 8 గంటలకు అది వాడినా, 10 బులిటెన్ లో సరి చేశానని వివరణ ఇచ్చా.
“ఓకే, ఆ రిపోర్టర్ ని తీసెయ్యండి” అన్నారు ఇక మాట్లాడేందుకేమీ లేదన్నట్టు.

“ ప్రింట్ నుంచి టీవీకి కొత్తగా వచ్చాడు” అంటూ నచ్చజెప్పాలని ట్రై చేసినా ఆయన వినిపించుకోకుండా మళ్ళీ అదే మాట రిపీట్ చేశారు. “ఈ క్షణమే తీసెయ్యండి” అని. కిందికి వచ్చి మా ఎండీ శరద్ గారికి విషయమంతా చెప్పా. ఆయన మళ్ళీ ఆఖరి ప్రయత్నంగా కళానిధికి చెప్పినా ఫలితం కనబడలేదు. హైదరాబాద్ కు హాట్ లైన్లో సమాచారం వెళ్ళింది. రిపోర్టర్ మీద వేటు పడింది.

అంతకుముందు ఒకసారి కూడా వెంకయ్యనాయుడి గారి ఫిర్యాదుకు నేను సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయం చుట్టూ పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్ళు జరుగుతున్న సమయమది. అప్పట్లో వెంకయ్యనాయుడి గారి బావమరిది భాస్కర నాయుడు ఆ ప్రాంతంలో అసైన్డ్ భూములు కొన్నారన్నది వార్త. అందులో ఎమ్మార్వో, సర్వేయర్ బైట్స్ కూడా ఉన్నాయి. అసైన్డ్ భూములు కొనటం, అమ్మటం చట్టవిరుద్ధమని, సర్వే నెంబర్లతో సహా వాళ్ళు చెప్పిన విషయాలు వార్తలో పొందుపరచాం.

అది టెలికాస్ట్ కాగానే మురసొలి మారన్ కు వెంకయ్యనాయుడి గారి నుంచి ఫిర్యాదు వెళ్ళింది. తన పేరు రాసి అవమానించారని. నిజానికి పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా మురసొలి మారన్ కూ , వెంకయ్య నాయుడుకూ మధ్య స్నేహం ఉండటం వల్ల ఆయన నేరుగా పెద్ద మారన్ కే కంప్లెయింట్ చేసేశారు. ఆయన అదే వేగంతో చానల్ వ్యవహారాలు చూసే పెద్ద కొడుకు కళానిధికి చెప్పారు. ఆయన నన్ను పిలిచి అడిగారు.

టెలికాస్ట్ చేసిన వార్త గురించి మొత్తం వివరంగా చెప్పా. “వెంకయ్య నాయుడి గారి పేరు వాడకుండా ఉండాల్సింది.” అన్నారు. “ఆయన పేరు లేకపోతే అ వార్తకు విలువేముంది?. అందుకే చెప్పాల్సి వచ్చింది” అన్నాను.

సానుకూలంగా తల పంకించి, “ఆయన నాన్నకు బాగా ఫ్రెండ్. ఆయన గురించి వార్త రాయాల్సి వస్తే కాస్త చూసుకోండి” అన్నారు సాలోచనగా. స్వయంగా వార్తలు రాయటం, హెడ్ లైన్స్ మార్చటం కూడా తెలిసిన కళానిధి ఆ వార్తను మాత్రం తప్పుపట్టలేదు. అందుకే ఏమీ అనలేకపోయారు.

***
ఇంకా అంతకు ముందు జరిగిన మరో సంఘటన కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సి వస్తోంది. 2000 సంవత్సరంలో అనుకుంటా ఎం. సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్) పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. అప్పటికే రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేసిన కృష్ణా జిల్లా నాయకుడు పాలడుగు వెంకటరావు ఆయనకు మంచి మిత్రుడు. ఎలాగూ తన ఫ్రెండ్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి మళ్ళీ కాస్త చురుగ్గా రాజకీయాల్లో ఉందామని పాలడుగు అనుకున్నారు.

అందుకే తన జిల్లాలో ఎమ్మెస్సార్ కు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు మంచి కవరేజ్ రావాలని హైదరాబాద్ నుంచే జర్నలిస్టులు వచ్చేలా ఏర్పాట్లు కూడా చేశారు. కానీ విజయవాడ రిపోర్టర్ ఉన్నాడు కదా అని హైదరాబాద్ జెమినీ నుంచి ఎవర్నీ పంపలేదు. వెంకట్రావు గారు మాత్రం అలా చాలదని జెమినీ డైరెక్టర్ కిరణ్ గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు.

వాళ్ళిద్దరిదీ ఒకే జిల్లా కావటమే కాదు.. బంధుత్వం కూడా ఉండి ఉండవచ్చు. అందువల్ల అప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి ఒక రిపోర్టర్ ను వెళ్ళమని కిరణ్ గారు చెప్పారు. ఆ రిపోర్టర్ గాంధీ భవన్ కు వెళ్ళి కనుక్కుంటే అప్పటికే అందరికీ ట్రెయిన్ టికెట్స్ బుక్ అయ్యాయని, ఇప్పుడు చేయగలిగేదేమీ లేదని సమాధానం. గాంధీభవన్ నుంచే ఆ రిపోర్టర్ పాలడుగు వెంకట్రావు గారికి ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు.

కెమెరా క్రూతో కలసి రావాల్సి ఉంటుందని చెప్పగానే ఒక అద్దె కారు తీసుకొని వస్తే ఆ అద్దె ఇస్తానని ఆయన చెప్పారు. అలా ఆ రిపోర్టర్ అప్పటికప్పుడు బయల్దేరి వెళ్ళాడు. ప్రోగ్రామ్ కవర్ చేశాడు.

కానీ, వీడియోలతోబాటు వార్త పంపుతూ స్క్రిప్ట్ లో పాలడుగు వెంకట్రావు గారి పేరు ఎక్కడో చివర్లో .. ‘కూడా పాల్గొన్నారు’ వరుసలో కలిపేశాడు. ఆ రోజు కూడా ఆఖరి నిమిషంలో వార్త రావటంతో 8 గంటల వార్తల్లో అలాగే వెళ్ళింది. మళ్ళీ 10 గంటల బులిటెన్ కి మాత్రం ఆయన ఆధ్వర్యంలో జరిగిన విషయం ప్రముఖంగా ప్రస్తావిస్తూ తిరగరాసి ప్రసారం చేశాం.

కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 8 గంటల బులిటెన్ చూసి పాలడుగు బాగా ఫీలయ్యారు. “మీవాడికి డబ్బులిచ్చినా, నా పేరు ఎక్కడో చివర్లో రాశాడు” అంటూ మా డైరెక్టర్ కిరణ్ గారికి కంప్లెయింట్ చేశారు. ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వార్త సరిగా రాయనందుకు, డబ్బులు తీసుకున్నట్టు ఆయన చెప్పినందుకు.

సహజంగానే కిరణ్ గారికి తలకొట్టేసినట్టయింది. పాలడుగు గారు డబ్బిచ్చింది కారుకే తప్ప రిపోర్టర్ కి కాదు. రిపోర్టర్ చెప్పినా, ఇదంతా వినిపించుకునే పరిస్థితిలో కిరణ్ గారు లేరు. రిపోర్టర్ ని తీసేయాల్సిందేనని పట్టుబట్టారు. మరునాడు ఉదయమే చెన్నైలో మా శరద్ గారి దగ్గర పంచాయితీ. నేను జరిగిందంతా చెప్పా. అయినా సరే, కిరణ్ గారు మరీ మరీ చెబుతున్నారు కాబట్టి రిపోర్టర్ ను తీసేయాల్సిందే అన్నారాయన. ఆ విధంగా ఆ రిపోర్టర్ అదే రోజు తప్పుకోక తప్పలేదు.

ఈ రెండు సందర్భాల్లోనూ యాజమానుల అహం దెబ్బతిన్నది. ఇద్దరి ఉద్యోగాలూ పోయినప్పుడు నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఉద్యోగాలు పోగొట్టుకున్న ఇద్దరు రిపోర్టర్ల పేర్లూ ఒకటే కావటం యాదృచ్ఛికం. – తోట భావనారాయణ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీడియా బాసుల అహం దెబ్బ తింటే… జర్నలిస్టుల కొలువులు గల్లంతే…
  • ఇరాన్ ప్రాసెస్ డ్రైవెన్ స్ట్రాటజీ … నాయకత్వాన్ని కోల్పోయినా ఆగని యుద్ధం…
  • అమెరికా చమురు దాహం – రక్త పిపాస ఉగ్రవాదం! పశ్చిమాసియా ప్రకంపనలు
  • చంద్రబాబును భయపెట్టిన ఇజ్రాయిల్… ఓ జర్నలిస్ట్ జ్ఞాపకాలు …
  • అమెరికాను నమ్మి… చివరకు ఎడ్డిమొహం వేసేది మళ్లీ పాకిస్థానే…
  • సొంత కోతలు, తిక్క కూతలు… పాకిస్థాన్ ప్లేయర్లు ఇక అస్సలు మారరు…
  • సొంతూళ్లో… సొంతింట్లో… వ్రతం, విందు… భేష్ విజయ్ దేవరకొండా…
  • చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌‌ను నమ్మి… ఇరాన్ నిండా మునిగిందా..?!
  • 70 ఏళ్ల మాస్ ముసలమ్మ..! ఈ వయస్సులోనూ రాధిక అదరగొట్టేసింది..!!
  • తమ్మినేనికి అభిశంసన..! సీపీఎం కేంద్ర కమిటీ మండిపాటు..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions