.
తెలంగాణ ఆర్థిక దూకుడు… జీఎస్‌డీపీ నుంచి జీఎస్టీ వరకు… అనేక సూచికల్లో ఏపీపై స్పష్టమైన ఆధిక్యం… సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించే, ఆశించే, ఆకాంక్షించే మూడు ట్రిలియన్ల ఎకానమీని 2047కల్లా తెలంగాణ ఖచ్చితంగా సాధించగలదు అని చెప్పేందుకు వర్తమాన వృద్ధి గణాంకాలే నిదర్శనం… (2034-35 కల్లా వన్ ట్రిలియన్ ఎకానమీ)…
ఈ హెడింగ్, ఈ ప్రస్తావనలు ఎందుకంటే…? నిన్నటి గవర్నర్ అసెంబ్లీ ప్రసంగంలోని కొన్ని గణాంకాలు, అంశాలు… అవేమిటో వివరంగానే చెప్పుకుందాం… సమైక్యవాదం వినిపిస్తూ, తెలంగాణ ఏర్పాటుకు అప్పట్లో అడ్డుపడిన శక్తులు పదే పదే చెప్పింది ఏమిటి..?
Ads
‘తెలంగాణ వాళ్లకు పరిపాలన తెలియదు, అంధకారంలోకి వెళ్తుంది తెలంగాణ, ఆర్థికంగా దెబ్బతింటారు’ ఇలా… దాదాపు శాపనార్థాలు పెడుతున్నట్టుగా బోలెడు తప్పుడు అంచనాలు, భయాందోళనల్ని రేకెత్తించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డాయి ఆ శక్తులు…
కానీ ఒక్కసారి స్థూలంగా ఆర్థికాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కీలక గణాంకాల్ని పరిశీలిస్తే… ‘బాగా పాలించడం తెలిసిన తెలివైన’ ఏపీ ఎక్కడో వెనకబడిపోయి, తెలంగాణ మాత్రం దూకుడుగా ముందుకు పోతోందని అర్థమవుతుంది… ఇన్నాళ్లు ఎవరు పాలించారు, ఇప్పుడు ఎవరు పాలిస్తున్నారనేది కాదు, ఆంధ్రా నేతల దిష్టి వ్యాఖ్యలను, వెక్కిరింపులను, నెగెటివ్ తలంపులను దాటేసి, ఛేదించి… నేడు తెలంగాణ బలంగా నిలబడిందని చెప్పడమే ఈ కథన ఉద్దేశం…
దేశం కంటే వేగంగా తెలంగాణ వృద్ధి … దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 8% వృద్ధి రేటుతో ముందుకు సాగుతోంది. అయితే తెలంగాణ వృద్ధి రేటు దాన్ని మించి ఉంది.
-
తెలంగాణ జీఎస్డీపీ (GSDP) – ₹17.82 లక్షల కోట్లు (2025–26)
-
వృద్ధి రేటు – 10.7%
-
దేశ జీడీపీలో తెలంగాణ వాటా – 4.99%
అంటే దేశ సగటు వృద్ధి కంటే తెలంగాణ వృద్ధి వేగం ఎక్కువ…
తలసరి ఆదాయంలో తెలంగాణ ముందంజ … ఆర్థికాభివృద్ధిని అంచనా వేసే ముఖ్యమైన సూచిక తలసరి ఆదాయం.
-
తెలంగాణ తలసరి ఆదాయం – ₹4,18,931
-
దేశ సగటు తలసరి ఆదాయం – దాదాపు ₹2 లక్షల పరిధి
అంటే తెలంగాణ వ్యక్తి ఆదాయం దేశ సగటుతో పోలిస్తే దాదాపు రెండింతలు.
ఇది రాష్ట్ర ఆర్థిక నిర్మాణం బలంగా ఉందని సూచిస్తుంది.
జీఎస్టీ వసూళ్లలో టాప్ రాష్ట్రాల్లో తెలంగాణ …. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యాపారం, వినియోగం ఎంత ఉందో చెప్పే సూచిక GST వసూళ్లు. 2024–25 గణాంకాల ప్రకారం:
-
తెలంగాణ మొత్తం GST వసూళ్లు – ₹65,432 కోట్లు
-
దేశంలో స్థానం – టాప్ 10 రాష్ట్రాల్లో ఒకటి
-
అదే సమయంలో
-
ఆంధ్రప్రదేశ్ – ₹54,321 కోట్లు
-
అంటే ఏపీకన్నా విస్తీర్ణం, పాపులేషన్ తక్కువ ఉన్నప్పటికీ, జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ఏపీ కంటే ముందుంది.
విద్యుత్ వినియోగం కూడా అభివృద్ధికి సూచిక … ఒక రాష్ట్రంలో పరిశ్రమలు, సేవల రంగం ఎంత వేగంగా పెరుగుతున్నాయో చెప్పే మరో సూచిక తలసరి విద్యుత్ వినియోగం. తాజా అంచనాల ప్రకారం తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం ఏటా 2400 యూనిట్లు… అదే ఏపీలో 1700 – 1800 యూనిట్లు మాత్రమే… అంటే తెలంగాణలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండటం పరిశ్రమల విస్తరణ, పట్టణీకరణ, సేవల రంగం పెరుగుదలను సూచిస్తుంది…
ద్రవ్యోల్బణ నియంత్రణలో కూడా తెలంగాణ …. గవర్నర్ ప్రసంగం ప్రకారం తెలంగాణలో ద్రవ్యోల్బణం – 0.2% … అంటే ధరల స్థిరత్వం కొనసాగుతోంది… అంటే ప్రజల కొనుగోలు శక్తి ఎక్కువగా ప్రభావితం కాకుండా ఆర్థిక వ్యవస్థ కొనసాగుతోంది…
జీడీపీలో తెలంగాణ స్థానం… దేశ జీడీపీలో తెలంగాణ వాటా *సుమారు 5 శాతానికి చేరింది. రాష్ట్ర జీఎస్‌డీపీ పరంగా తెలంగాణ దేశంలో టాప్ 10 రాష్ట్రాల్లో ఒకటి…
ఏపీతో పోలిస్తే తెలంగాణ బలాలు … ఆర్థిక సూచికల్లో చూస్తే కొన్ని రంగాల్లో తెలంగాణ స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. తెలంగాణ జీఎస్డీపీ 17.8 లక్షల కోట్లు, కానీ ఏపీ 15.8 లక్షల కోట్లు మాత్రమే… తలసరి ఆదాయం తెలంగాణలో 4.18 లక్షలు కాగా ఏపీలో 2.7 లక్షలు మాత్రమే… జీఎస్టీ వసూళ్లు తెలంగాణలో 65 వేల కోట్ల పైచిలుకు… కాగా ఏపీలో అది 54 వేల కోట్లు మాత్రమే…
హైదరాబాద్ కేంద్రంగా సేవల రంగం బలంగా ఉండటం, ఐటీతోపాటు ఫార్మాలో ముందంజ, వ్యవసాయ రంగంలో విశేష ప్రగతి, పట్టణీకరణ కూడా పెరగడం వంటి అనేక అంశాలు తెలంగాణ దేశ సగటుతో పోలిస్తే చాలా దూకుడుగా ముందుకు తీసుకుపోతున్నాయి… శుభం…
- అవునూ… గవర్నర్ ప్రసంగం ఓ డొల్ల అని బీఆర్ఎస్ విమర్శ… రొటీన్ ఫార్మాట్ విమర్శ… ఐతే తెలంగాణ ప్రగతి గణాంకాలు కూడా అబద్దాలే అని బీఆర్ఎస్ చెబుతోందా…? ఐతే తొమ్మిదిన్నరేళ్ల తొలి పాలనలో ఏమీ ఉద్దరించలేదని మీరు చెప్పుకుంటున్నట్టా..?
Share this Article