Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొబ్బరి బొండాం..! అప్పట్లో కామెడీ హీరో అంటే ఓన్లీ రాజేంద్ర ప్రసాద్..!

April 6, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. ప్రముఖ దర్శకుడు యస్ వి కృష్ణారెడ్డి ఈ కొబ్బరి బొండాం సినిమా ద్వారానే సినీ రంగ ప్రవేశం చేసారు . అయితే దర్శకునిగా కాదు . నిర్మాత అచ్చిరెడ్డితో కలిసి సహ నిర్మాతగా . విశేషం ఏమిటంటే ఈ సినిమాకు కధ , స్క్రీన్ ప్లే , సంగీతం మూడింటినీ అందించారు . సంగీత దర్శకత్వం కూడా వహించిన నిర్మాత , దర్శకుడు బహుశా చిత్తూరు వి నాగయ్య తర్వాత ఈయనే ఏమో !

గొప్ప సందేశాత్మక కధ కూడా . రేలంగి జేబులో బొమ్మ జేజేల బొమ్మలాగా తన ప్రొఫెసర్ ఇచ్చిన కాయిన్లో మహత్తు ఉందనే విశ్వాసంతో ఎలాంటి అసాధ్యాలను అయినా సుసాధ్యం చేసే కొబ్బరి బొండాం పాత్రను నేసారు . మనలో చాలామందికి ఉంటుంది ఈ diffidence . అందువలనే బాబాలు , స్వామీజీల వద్దకు తాయెత్తుల కోసం , విభూతి కోసం , పాద దూళి కోసం , పాదాలను కడిగిన తీర్ధం కోసం పరుగెత్తుతూ ఉంటాం , ప్రాణాలనూ పోగొట్టుకుంటూ ఉంటాం . ఇదే ఈ సినిమా కధాంశం టూకీగా .

Ads

ఈ సినిమాలో రెండు మహిళా పాత్రలు . Unforgettable and unmissable . ఒకటి శ్రీలక్ష్మిది . టివిలో వచ్చే ప్రకటనలను భర్త మీద ప్రయోగాలు చేసే సాధ్వీమణి పాత్ర . జనం నవ్వలేక చావాల్సిందే . స్వర్ణ కమలంలో హారతి , ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ సినిమాలో పళ్ళెం , చెంబు లాగా ఈ సినిమాలో భర్త బట్టల సత్యం మీద టూత్ పేస్టులు , వాషింగ్ పౌడర్లు , షాంపూలు , వగైరా ప్రయోగాలు చేయటం . ఇలాంటి పాత్రలకు బ్రాండ్ అయిపోయింది శ్రీలక్ష్మి .

మరో పాత్ర మా గుంటూరు జయలలితది . జానాబెత్తెల జానమ్మ . కృష్ణారెడ్డి గారికి ఈ పాత్ర ఐడియా ఎక్కడ నుండి వచ్చిందో ! కాస్త సింగిల్ ఎక్స్ లాగా అనిపించినా సినిమాలోకి బాగా ఫిట్ చేసారు . ఆమె కూడా గొప్పగా , హాటుగా నటించింది .‌ ఈ ఇద్దరు నటీమణులను ప్రత్యేకంగా చెప్పుకోవలసిందే .

ఇంక హీరో రాజేంద్రప్రసాద్ . ఆయన హాస్య నట యాత్రలో మరో మైలురాయి 1991 లో వచ్చిన ఈ కొబ్బరి బొండాం సినిమా . పాతాళభైరవి సినిమాలో తోటరాముడిలాగా ప్రేమ కోసమై కష్టాల పాలవుతాడు . ప్రేమించిన పడతి పెట్టిన రెండు షరతుల కోసం ఉద్యోగంలో చేరి అయిదు లక్షలు పోగొట్టుకోవటం . పడతి కోసం ఆమె అన్నకు అయిదు లక్షలు ఇవ్వడం కోసం కష్టాలు .

ఈజీ మనీ లంకె బిందెల కోసం వెతుకులాటలో ఏదో ఒక నాణెం దొరికితే దానికి మగధ సామ్రాజ్యం , శివాజీ మరాఠా రాజ్యం కధలను అల్లి శిష్యుడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి అజేయుడిని , విజేతను చేస్తాడు హిస్టరీ ప్రొఫెసర్ గారు . సినిమాంతంలో కిల్లర్ రెజలర్ని కూడా మట్టి కరిపించాక తెలుస్తుంది అదంతా తన స్వంత బలమే అని . చాలా విలువైన సందేశం అందరికీ .

రాజేంద్రప్రసాద్ బాగా నటించాడు . హీరోయిన్ గా నిరోషా , హీరో గారి ప్రొఫెసరుగా రమణమూర్తి , తల్లిగా దేవదాస్ కనకాల భార్య లక్ష్మి నటించారు . హాస్య జంటగా మల్లికార్జున రావు , శ్రీలక్ష్మి అదరగొట్టేసారు . ఇంక మా గుంటూరు జయలలిత వయ్యారాల వై విజయతో పోటీ పడింది .

విలనుగా కోట శ్రీనివాసరావుకు ప్రత్యేక మేనరిజాన్ని పెట్టారు కృష్ణారెడ్డి . ఒక్కో సినిమాలో ఒక్కో మేనరిజం . దటీజ్ కోట . ఇతర పాత్రల్లో సుధాకర్ , హనుమంతరావు , కళ్ళు చిదంబరం  తదితరులు నటించారు .
అరంగేట్రంలోనే శ్రావ్యమైన , శబ్ద కాలుష్య రహిత సంగీతాన్ని అందించారు కృష్ణారెడ్డి . సినిమాలో ఒక చోట సామజ వర గమనాని బేక్ గ్రౌండ్ మ్యూజిక్కుగా పెడతారు . ఇప్పుడు వస్తున్న కుర్ర సంగీత దర్శకులు తప్పక చూడాలి .

భువనచంద్ర , జొన్నవిత్తుల వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , చిత్ర బాగా పాడారు . ముఖ్యంగా చల్లాచల్లని గాలుల్లో సాయం సమయంలో వాన పాట . నిరోషా , రాజేంద్రప్రసాదు మీద బాగా చిత్రీకరించారు దర్శకుడు కాట్రగడ్డ రవితేజ . జానాబెత్తెల జానమ్మ అంటూ సాగే జయలలిత , బట్టల సత్యం మీద బాగుంటుంది .

అలాగే అందాల మేఘమాల పాట నిరోషా మీద , గంగిగోవు లాంటి వాడిని , కొక్కో కొబ్బరి బొండాం అంటూ సాగే రెండు టీజింగ్ పాటలూ హుషారుగా ఉంటాయి . సుచిత్ర డాన్సుల్ని బాగా కంపోజ్ చేసింది .

ఈ సినిమా విజయానికి మరో కారణం డైలాగులు . మా గుంటూరు వారయిన Divakara Babu Madabhushi గారే వ్రాసారు . ముఖ్యంగా కోట , బట్టల సత్యం , శ్రీలక్ష్మి , జయలలిత డైలాగులను బ్రహ్మాండంగా వ్రాసారు . ఈ హాస్య రస , సందేశాత్మక సినిమా యూట్యూబులో ఉంది . చూసి ఉన్నా మరలా చూడతగ్గ సినిమా .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రకాష్ ఆంటోనీ రాజ్ మళ్లీ కూశాడు… ఈసారి రాముడిపై మరింత వెటకారంగా…
  • నో బొట్టు, నో మణికట్టు పట్టీలు, నో సిందూరం… లెన్స్‌కార్ట్ వివాదం ఏమిటంటే..?
  • పెద్ద నెట్‌వర్క్..! భీతిగొలిపే మల్టీ లేయర్ కార్పొరేట్ టెర్రర్ మోడల్..!!
  • IPL 2026…! ఈ సీజన్‌లో ఎందుకు అంబానీ టీమ్ ఫ్లాప్ గేమ్..?
  • ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ… తమిళులకు కన్నడ ఫ్యాన్స్ వెక్కిరింపులు…
  • ఈ జడ్జి వద్దన్నాడు కదా కేజ్రీవాల్‌..! తరువాత ఏమైందంటే..?
  • … మూలిగే తెలంగాణ బీజేపీపై కన్నడ తేజస్వి సూర్య పోటు…
  • ఎవరి కోసం ఈ సీట్ల పెంపు..? ప్రజలకు ఏం ప్రయోజనం..?
  • నాటి పారుపల్లి రామకృష్ణయ్యే శంకరాభరణం శంకరశాస్త్రి…
  • దొంగ మొగుడిలాగే రౌడీ అల్లుడు… పక్కా చిరంజీవి మార్క్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions