.
నో, నో… తళాతళా ధవళ వర్ణపు చొక్కా… జేబులో పెన్ను… బెల్టు, టిక్కుటాకు టక్కు… బూట్లు… చేతిలో ఏం పుస్తకమో మరి… లొంగిపోయిన ఓ మావోయిస్టు అగ్రనేత సచివాలయానికి సీఎంను కలవడానికి వస్తున్న తీరు చూసి కాదు… నవ్వొచ్చింది తన మాటలు విని, చదివి…
- ‘‘కేంద్రం సహకరిస్తే రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తాం… పీఎల్జీఏ రద్దు చేస్తాం, సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తాం, జైళ్లలోని మాజీ సహచరులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం, జనానికి బహిరంగ లేఖ రాస్తాం.. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి… మొత్తం కేసులన్నీ ఎత్తివేయాలి… కోటి రూపాయల రివార్డు ఇవ్వాలి… లొంగిపోయిన వారందరికీ అయిదెకరాల భూమి ఇవ్వాలి…’’
ఓ రాజకీయ పార్టీ ఏర్పాటుకు కేంద్రం ఎందుకు సహకరించాలి..? ఎలా సహకరించాలి..? రాజ్యంపై తిరగబడి, వేల మంది ప్రాణాలు పోవడానికి కారకులైనందుకు కృతజ్ఞతగానా..? ఐనా మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో వచ్చే సంకల్పం ఉంటే, పార్టీ ఏర్పాటు, రిజిస్ట్రేషన్ మీ పని… దాని పని అమిత్ షా ఎందుకు చూస్తాడు..? ఎందుకు చూడాలి..?
Ads
పీఎల్జీఏ నువ్వు రద్దు చేసేదేముంది..? ఇప్పుడది నీ పరిధిలో లేదు, నువ్వు లొంగిపోయావు, నీకూ పార్టీకి సంబంధం లేదు… పీఎల్జీఏ రద్దు చేయాలనే ఆలోచన ఉన్నవాడు ఆయుధాలు పార్టీకి అప్పగించి రాడు… సాయుధ పోరాట విరమణ ప్రకటన కూడా నువ్వు చేయాల్సింది కాదు, నువ్వింకా పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి అనుకుంటే ఎలా..? నువ్వు సాయుధ పోరాటం విరమించావు, అంతే…
జైళ్లలోని మాజీ సహచరులతో కలిసి కార్యాచరణ రూపొందించుకొండి సరే, కానీ ముందుగా వాళ్లు బయటికి రావాలి కదా… పోనీ, మళ్లీ అడవుల్లోకి వెళ్లి, అక్కడ ఇంకా మిగిలిన మాజీ సహచరులను ఒప్పిస్తారా..? ఓసారి అడవిలోకి మళ్లీ వెళ్లి చూడండి, సిట్యుయేషన్, సీన్ ఎంత రివర్స్ ఉంటుందో…
జనానికి బహిరంగ లేఖ రాస్తావు సరే, ఏమనీ..? ఇన్నేళ్ల నిష్ప్రయోజనకర హింస, హత్యాకాండకు క్షమాపణ కూడా ఉంటుందా లేఖలో… లేక అవే పడికట్టు పదాలతో లొంగుబాటు కారణాలుంటాయా..? అవి సమాజానికి అవసరమా..?
ఆపరేషన్ కగార్ ఎందుకు నిలిపివేయాలి..? అది కొనసాగుతున్నందువల్లే కదా… ప్రాణభయంతో… హఠాత్తుగా సాయుధపోరాటంతో సాధించేది ఏమీ లేదనే జ్ఞానబోధ కలిగింది… మరెందుకు కేంద్రం దాన్ని నిలిపివేస్తుంది… ‘‘రాజ్యంపై తిరుగుబాటు- రాజ్యం అణిచివేత’’ ఈ పరిధి దాటి ఎక్కడైనా సరే ఏ రాజ్యం వ్యవహరించదు…
మొత్తం కేసులన్నీ ఎత్తివేయాలనే కోరిక మాత్రం ఒక కోణంలో సబబే… ఇంకా ఆ కేసులు, విచారణ… కోర్టులు, పోలీసుల సమయాన్ని వృథా చేయడమే… అవి నిలిచేవి కావు, శిక్షించేవి కావు…
ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టే లొంగుబాటు స్కీమ్స్ అమలు చేయాలి, కోటి రూపాయలు ఇవ్వాలట… ప్రాణానికి భరోసా ఇచ్చి, లొంగుబాటుకు అవకాశమే పెద్ద రివార్డు మాజీ కామ్రేడ్… మీరు డిమాండ్ చేసే స్థితిలో లేరు… నో యువర్ ప్రజెంట్ స్టేటస్…
లొంగిపోయిన వారందరికీ అయిదెకరాల భూమి ఎందుకు ఇవ్వాలి..? ప్రతి పేద కుటుంబానికీ ఇవ్వాలని అడిగితే అదొక రేంజ్ డిమాండ్ అయి ఉండేది… రాజ్యం- ప్రభుత్వాల దృష్టిలో ఆయుధం వదిలేసి, సరెండరైన తిరుగుబాటుదారులు, ఇన్నాళ్లూ తప్పుదారిలో నడుస్తూ సమాజానికి హానికారకులు… మరెందుకు ఉద్యోగాలు, పెన్షన్లు, భూములు..?
కోవర్టులు, ఇన్‌ఫార్మర్ల పేరిట సాగిన విచక్షణరహిత, అకారణ, ఆధారరహిత హత్యాకాండ, పల్లెల్లో కల్లోలకాండ బాధిత కుటుంబాలకు కదా ఈ భూములో, ఈ సానుభూతో, ఈ ప్రభుత్వ సాయమో దక్కాల్సింది… ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, బలగాల కుటుంబాలకు కదా… నిజానికి ఇందుకు కూడా కాదు కాస్త నవ్వొచ్చింది…
తుపాకీ నీడలో సిద్ధాంతాలు బోధించడం వేరు… మెయిన్ స్ట్రీమ్‌లో ప్రజల్ని ఒప్పించే, మెప్పించే రాజకీయాలు వేరు… నేపాల్‌లో చండప్రచండంగా ఉరిమిన నక్సలైట్లు చివరకు ఏమయ్యారు..? అధికారంలోకి వచ్చీ జనాన్ని మెప్పించలేక కనుమరుగయ్యారు… అసలు దేశంలో వామపక్ష రాజకీయాలే కొడిగట్టిపోతున్న దుర్దినాలు…
ఇంకా ఇంకా దేవ్‌జీ, తన లొంగుబాట సహచరులు బయటి ప్రపంచంలోకి, క్షేత్ర వాస్తవాల్లోకి రాలేకపోతున్న తీరు చూసి నవ్వొచ్చింది..!! కటువుగా ఉన్నా, కఠినంగా వినిపించినా ఇది రియాలిటీ… నాలుగు రోజులు పోతే మీరు వార్తల్లో కనిపిస్తే అప్పుడు చెప్పుకుందాం..!!
కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఈ మాజీ అగ్ర మావోయిస్టులు ఆసక్తి చూపిస్తున్నారనీ, ఎలాగూ రాబోయే ఎన్నికలనాటికి తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి కాబట్టి వీళ్లలో ముగ్గురికో నలుగురికో టికెట్లు ఇచ్చే చాన్సుందనీ, వీళ్ల రాజకీయ పార్టీ బీఆర్ఎస్‌కు శరాఘాతమనీ… రకరకాల అంచనాలు, విశ్లేషణలు కూడా ఒకింత నవ్వు పుట్టిస్తున్నాయి… నిఝంగా నిఝం..!!
Share this Article