Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పట్లో రిజెక్టయ్యాడు గానీ… వర్తమాన చానెళ్లలో చెలామణీ అయ్యేవాడేమో…

February 26, 2026 by M S R

.

Bhavanarayana Thota …. అనగనగా ఒక న్యూస్ రీడర్… అప్పటికి జెమినీ టీవీలో వార్తలు మొదలై దాదాపు ఏడాది గడిచింది. ఒకరోజు ఒక ఉంగరాల జుట్టుతో ఉన్న 30 ఏళ్ల యువకుడు మద్రాసులో జెమినీ ఆఫీసుకు వచ్చాడు. న్యూస్ రీడర్ గా చేరాలనుకుంటున్నట్టు చెప్పాడు.

అప్పట్లో జెమినీ టీవీలో అరగంట బులిటెన్స్ కొన్ని మాత్రమే ఉండేవి. వాటికి సరిపడా యాంకర్స్ ఉన్నారు. అందువలన ఖాళీలేమీ లేవని చెప్పాను. బాగా నిరాశ పడినట్టు కనిపించాడు. “మీ దగ్గర పనిచేస్తున్నవాళ్ళు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే కదా, వాళ్ళు సెలవు పెట్టినప్పుడైనా నేను పనిచేయవచ్చు కదా?” అని అడిగాడు. దానికీ ఇప్పటికే ఏర్పాట్లు జరిగిపోయిన సంగతి చెప్పా.

Ads

రకరకాలుగా నన్ను ఒప్పించటానికి ప్రయత్నించాడు గాని కుదరలేదు. మొత్తానికి చాలా అసంతృప్తితో ఉన్నాడు. చాలా దూరం నుంచి ఎంతో నమ్మకంగా వచ్చాడు కాబట్టి కనీసం స్క్రీన్ టెస్ట్ చేయించాలనిపించింది. స్టూడియోకి పంపించా. అక్కడ టెలిప్రాంప్టర్ లో చదవటం కాసేపు ప్రాక్టీస్ చేయించి, అతనికి నమ్మకం కలిగాక టెస్ట్ కట్ రికార్డ్ చేయమని చెప్పా. అది అయిపోయాక నన్ను చూడమని బలవంతం చేశాడు. నేనొక్కడినే కాదు, స్టాఫ్ మొత్తం చూశాక ఏదైనా అవకాశం ఉంటే చెబుతానని నమ్మకంగా చెప్పి పంపించా.

రెండు మూడు రోజుల్లో మళ్ళీ వచ్చే ప్రమాదముందని పసిగట్టటం వలన అప్పటికప్పుడే ఆ టేప్ తెప్పించి ప్లే చేసి చూశా. కాస్త నలుపు కదండీ అని మా స్టాఫ్ కామెంట్. “పరవాలేదులే మేకప్ తో కవర్ అవుతుంది” అన్నాను. “చదవటం కూడా ఏమంత బాగాలేదు. ఏ మాత్రం పనికి రాడ”ని అంతా తేల్చేశారు. చివరి ఆశ కూడా పోయిందని నాకూ కాస్త బాధగానే ఉంది.

సరిగ్గా మరుసటి రోజే ఆఫీస్ కి వచ్చాడు, తెలుసుకొని వెళదామని. ఊరికి వెళ్ళకుండా తెలిసినవాళ్ళింట్లో ఉన్నానని చెప్పాడు. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నేరుగా చెబితే బాధపడతాడు. కాస్త పరవాలేదని, ఖాళీ వస్తే చెబుతానని చెప్పి పంపించా. ఆ విధంగా అప్పటికప్పుడు ఇబ్బంది నుంచి గట్టెక్కా.

కానీ ఆ ఊరట కొద్దిరోజులే. రెండు మూడు రోజులు గడిచాయో లేదో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నుంచి ఫోన్. “మన జిల్లావాడే, కాస్త చూడండి” అని రికమండేషన్. ఆయనకు పరిస్థితి వివరంగా చెప్పా. ఏ మాత్రం వీలున్నా సాయం చెయ్యండి” అని మాత్రమే అన్నారు.

ఇంకో రెండు రోజులకు ఎర్రన్నాయుడు గారి నుంచి ఫోన్. నా నుంచి అదే సమాధానం. ఆ తరువాత వెంకయ్య నాయుడు గారు కూడా అదే వరస. ఇతగాడెవడో మామూలు వాడు కాదనిపించింది. ఉద్యోగాల కోసం అలా మొహమాట పెట్టించేవాళ్ళని చూశాను గాని తెరమీద కనబడటానికి కూడా రాజకీయ నాయకులతో ఫోన్ చేయిస్తారని అనుకోలేదు.

నాలుగైదు రోజులు గడిచాయో లేదో మా ఎండీ శరద్ కుమార్ నన్ను పిలిచి, “ఎవరా శ్రీరాజ్? కళానిధి మారన్ (ఛైర్మన్)కి వెంకయ్య నాయుడుతో ఫోన్ చేయించాడట. వీలుంటే చూడమంటున్నారు” అన్నారు. స్క్రీన్ టెస్ట్ కూడా చేశానని చెప్పి ఆ కాసెట్ ప్లే చేసి చూపించా. ఆయన కూడా పెదవి విరిచారు. కానీ కళానిధి చెప్పారు కాబట్టి ఏదోలా తెరమీద చూపిద్దాం అన్నారు.

బులిటెన్ లో అప్పటికే వాతావరణ సమాచారం చెప్పటానికి ఒకరికి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. (విదేశీ చానల్స్ లో వాళ్ళని వెదర్ గాళ్స్ అంటారు). ఇప్పుడు ఇతగాడికి బిజినెస్ వార్తలు రెండు మూడు రోజులు ఇచ్చి చూద్దామన్నారు. సరేనని చెప్పి కబురు చేసిందే ఆలస్యం. వచ్చేశాడు.

సన్ గ్రూప్ లో మేకప్ మన్ ఉండరు. ఎవరి మేకప్ వాళ్ళే వేసుకోవాలి. ఆ విషయం శ్రీరాజ్ కి ముందే చెప్పా. అదేం పెద్ద విషయం కాదన్నట్టు ఎవరో సినిమా వాళ్ళను పట్టుకొని మేకప్ కి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా కాస్త మెరుగ్గా కనబడే ప్రయత్నం చేశాడు. కానీ మా స్టాఫ్ చాలా గుర్రుగా ఉన్నారు. అందరూ నా మీద కోపంగా ఉన్నారు. ఆ కోపంతో అతణ్ణి ఎక్కడ ఇబ్బంది పెడతారోనని నేనే దగ్గరుండి అతని చేత ఆ మూడు నిమిషాల బిజినెస్ వార్తలు చదివించా.

కానీ మా ఎండీ అతణ్ణి తెరమీద చూడగానే తేల్చేశారు. వద్దన్న సంగతి వీలైనంత సున్నితంగా చెప్పి పంపించమన్నారు. అతనికి హామీ ఇచ్చిన ప్రకారం మూడు రోజులు చదివించాక చెప్పా. ఆడియెన్స్ నుంచి వచ్చే ఫీడ్ బాక్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని, ఇంకో పది రోజులు పట్టవచ్చునని నచ్చజెప్పి పంపించా. పది రోజుల తరువాత ఫోన్ చెయ్యమన్నా. ఎదురుగా చెప్పటం కంటే ఫోన్ లో అయితే కాస్త నిర్మొహమాటంగా చెప్పొచ్చని నా ఆలోచన.

కానీ నా ఆలోచన తప్పని రుజువు చేస్తూ వారం రోజులకే ప్రత్యక్షమయ్యాడు. ఏమైనా ఫీడ్ బాక్ వచ్చిందా అని. ఇంకా రాలేదని చెప్పా. అవున్లెండి, లెటర్స్ దూరం నుంచి రావాలి కదా అంటూ తనకు తానే సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అతని పిచ్చి గాని ఎవరూ పనిగట్టుకొని ఆ మూడు నిమిషాల్లో అతగాడు కనిపించిన 40- 50 సెకెన్ల గురించి (మిగతా భాగం విజువల్స్ ఆక్రమిస్తాయి) లెటర్లు రాయరు కదా.

సెల్ ఫోన్లు అప్పుడే వచ్చాయి గాని నిమిషానికి పది రూపాయల దాకా బిల్ పడేది. అందువల్ల ఫోన్ చేసే అవకాశం లేదు. జెమినీ టీవీ అప్పట్లో ‘పోస్ట్ బాక్స్ 1562’ పేరుతో ఫీడ్ బాక్ మీద కార్యక్రమం నడిపేది గాని ఆ లెటర్లు రాసేవాళ్ళెవరూ వార్తలు చూసే రకం కాదు.

చాలా ఆశ్చర్యం! మరుసటి రోజే ఆరు ఉత్తరాలొచ్చాయి. రెండు పోస్ట్ కార్డులు, రెండు ఎన్వలప్స్, రెండు ఇన్లాండ్ లెటర్స్. అన్నింటిలోనూ సారాంశం ఒక్కటే. “ఈ మధ్య మూడు రోజుల పాటు మీ వార్తల్లో ఒక యువకుణ్ణి మెరుపులా మెరిపించారు. మళ్ళీ అతణ్ణి చూపటం లేదు. వీలైతే పూర్తి బులిటెన్ లో అతడు కనబడాలని కోరుకుంటున్నాం”. కచ్చితంగా ఈ మాటలే కాకపోయినా, దాదాపుగా అన్నింటి సారాంశం ఇదే. చాలా ఆశ్చర్యమనిపించింది. ఇంతగా గుర్తుపెట్టుకొని లెటర్స్ రాసి మరీ చెబుతున్నారా? వార్తలకి ఇంత ఫాలోయింగ్ ఉంటుందా?

ఏదో అనుమానంగా ఉన్నా, అనుమానించటానికి ఏమీ కనబడ్డం లేదు. రెండు రాయల సీమ ఊళ్ళ నుంచి, రెండు తెలంగాణ ప్రాంతం నుంచి, ఇంకో రెండు కోస్తా ఆంధ్ర ప్రాంతం నుంచి. బాగా బాలెన్స్ అయ్యాయి. బాల్ పెన్ తో, ఫౌంటెన్ పెన్ తో, బ్లూ, బ్లాక్ కలర్స్ తో ఎక్కడా అనుమానం రాకుండా సహజసిద్ధంగా ఉన్నాయి.

చేతి రాత కూడా దేనికదే భిన్నంగా ఉంది. సరిగ్గా అప్పుడే ఆ ఫీడ్ బాక్ కోసం ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠతో ఎదురుచుస్తున్న ఆ ’మెరుపులాంటి యువకుడు’ గుర్తొచ్చాడు. అతని హస్తముందా అనే ఊహ రాగానే మరింత నిశితంగా పరిశీలించటం మొదలుపెట్టా.

అన్నిటినీ వరుసగా పేర్చి చూస్తుంటే నా కళ్ళు ఒక్కసారిగా ఆ లెటర్ల మీద పడ్డ స్టాంపుల దగ్గర ఆగిపోయాయి. నా అనుమానం బలపడింది. కచ్చితంగా ఆ మెరుపులాంటి యువకుడి పనేనని అర్థమైపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, దొరికిపోయాడు. జాలి పడటం తప్ప చేయగలిగిందేమీ లేదు.

ఆ తరువాత కాసేపటికే శ్రీ రాజ్ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ‘ఈ పాటికి ఫీడ్ బాక్ అందే ఉండాలే’ అన్న ధీమా అతని ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. “ఇక తప్పించుకోవటానికి వీల్లేదు, నాకు దొరికిపోయావ్, నాకు అవకాశం ఇచ్చి తీరాల్సిందే” అన్నట్టుగా నావైపు చూస్తున్నట్టనిపించింది. రాగానే కూర్చోబెట్టి టీ తెప్పించి కబుర్లలో దించా.

ఎలా చెప్పాలో అర్థం గాక నేను సతమతమవుతున్నా. అతగాడేమో ఇంకా చెప్పడేంటా అని చూస్తున్నాడు. ఏమైతేనేం, అనేశా “శ్రీరాజ్ గారూ, అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు గాని లెటర్స్ అన్నీ తేనాంపేట పోస్టాఫీసులోనే పోస్ట్ చేశారు” అని. (అది మా జెమినీ టీవీ ఉన్న డిఎంకె ఆఫీసు భవనానికి పక్కనే ఉంటుంది.) కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు ముఖంలో. “సారీ సార్, వస్తాను” అంటూ లేచి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

( ఈ మధ్య చానల్స్ మారుస్తూ ఉంటే ఒక క్రైస్తవ మత ప్రచార చానల్ లో కనిపించాడు శ్రీరాజ్ (ఇది అతని అసలు పేరు కాదు). అతణ్ణి చూడగానే అప్పటి సంగతి గుర్తొచ్చింది. మొత్తానికి టీవీలో కనబడాలన్న అతని పట్టుదలను మాత్రం మెచ్చుకోవాల్సిందే) – తోట భావనారాయణ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ కీలక లొంగుబాట్ల వేదికపై ఎవరామె..? ఓసారి చెప్పుకోవాలి..!!
  • అప్పట్లో రిజెక్టయ్యాడు గానీ… వర్తమాన చానెళ్లలో చెలామణీ అయ్యేవాడేమో…
  • సాయి పల్లవి…! వాట్ ఏ కెరీర్… 15 సినిమాలు- ఏడు ఫిలిమ్ ఫేర్లు…!!
  • ఫోన్‌బుక్..! ప్రతి నంబరూ ఆత్మీయం కాదు, అవసరమైతే పలకరించదు..!!
  • పరకాల ప్రభాకర్… కేంద్ర ఆర్థికమంత్రి భర్తకు ఎక్కడో ఏదో దెబ్బ తిన్నది…
  • కేరళం..! ఎందుకు ఈ పేరు మార్పిడి..? ఈ పేరులో అర్థమేమిటి..?
  • రాయల్ టైగర్‌కు ఓ మాంసం ముక్క… ఆడిట్ వాడు పట్టేసుకున్నాడు…
  • పాటలు, డాన్సులు, యాక్షన్, స్టయిల్… ఫక్తు చిరంజీవి మార్క్ మూవీ…
  • తాజ్ హోటళ్ల నడుమ స్కై బ్రిడ్జ్… ఆసక్తి కలిగించే ఓ వార్త కథ..!!
  • గణపతి సైతం..! మావోయిస్ట్ పార్టీ చివరి వికెట్ కూడా త్వరలోనే..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions