Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పరకాల ప్రభాకర్… కేంద్ర ఆర్థికమంత్రి భర్తకు ఎక్కడో ఏదో దెబ్బ తిన్నది…

February 25, 2026 by M S R

.

Narasimha Rao …. ఈరోజు దిశ దినపత్రికలో పరకాల ప్రభాకర్ వైర్‌లో రాసిన వ్యాసంపై నా విశ్లేషణ… ఈ వ్యాసానికి మూలాధారమైన నా అసలు వ్యాసాన్ని ఇక్కడ ఇస్తున్నా… ప్రజాతీర్పును అవమానిస్తున్న పరకాల కాకి లెక్కలు! – నెల్లూరు నరసింహారావు

‘‘2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల “అద్భుతం” వెనుక ఏదైనా “దుశ్చర్య” ఉందా?’’ అనే పేరుతో పరకాల ప్రభాకర్ www.thewire.in లో రాసిన వ్యాసంలోని సారంకంటే ఆ వ్యాసం ప్రచురింపబడిన సమయం, సందర్భం చాలా ఆసక్తిదాయకంగా ఉన్నాయి.

Ads

బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ పాల్ పియర్సన్, తన సంచలనాత్మక గ్రంథం, Politics in Time: History, Institutions, and Social Analysis(Princeton University Press 2004) లో చారిత్రక దృక్పథం ప్రాధాన్యతను వివరించటమే కాకుండా రాజకీయాలను కాలంలోకి తిరిగి తీసుకు రావడం ద్వారా సమాజశాస్త్ర విశ్లేషణలను సుసంపన్నం చేయవచ్చని చెప్పాడు. సరిగ్గా ఈ సూచననే పరకాల ప్రభాకర్ విస్మరించాడు. ఇదెలానో తరువాత చెబుతాను. ముందుగా ఆయన ఏమంటున్నాడో చూద్దాము…




  • ఆయన తన వ్యాసాన్ని ఇలా ప్రారంభించాడు…: ‘‘2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ న్నికల పోలింగ్ డేటాను నిశితంగా పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమి 175 అసెంబ్లీ స్థానాలకుగాను 164 గెలుచుకోవడానికి దారితీసిన ‘‘అద్భుతం” వెనుక ఉన్న ‘‘దుశ్చర్య” ఏమిటో వెల్లడవుతుంది. ఇక్కడ ఇచ్చిన అంకెలన్నింటిని భారత ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి విడుదల చేసిన డేటా నుంచి- వారి అధికారిక నోటిఫికేషన్లు, పత్రికా ప్రకటనల నుంచి తీసుకోవడం జరిగింది’’.

 

  • సాయంత్రం 5 గంటల సమయానికి 68.04% ఓట్లు పోలైనట్లు 2024 మే 13న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ సీఈఓ మీడియాకు వెల్లడించారు… ఆ తరువాత ఈసీఐ 2024 మే 13న విడుదల చేసిన పత్రికా ప్రకటన నెం. ECI/PN/84/2024 ప్రకారం, అదే రోజు రాత్రి 11.45 గంటలకు ఓటింగ్ శాతం 76.50% ఉంది. భారత ఎన్నికల సంఘం 2024 మే 17వ తేదీ విడుదల చేసిన పత్రికా ప్రకటన నెం. ECI/PN/89/2024 ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలింగ్ శాతాన్ని 80.66%కు సవరించారు. ఆంధ్రప్రదేశ్ సీఈఓ ఈ సంఖ్యను 81.86%గా పేర్కొనగా, ఈసీఐ గణాంకాల నివేదిక ఈ సంఖ్యను 81.79%గా పేర్కొంది’’.

 

  • ‘‘ఈ సంఖ్యలను నిశితంగా పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ అద్భుతం వెనుక ఉన్న దుర్మార్గం స్పష్టంగా వెల్లడవుతుంది. సీఈఓ ప్రకారం పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల వరకు జరిగిన 68.04% పోలింగ్‌ను పరిశీలిస్తే గంటకు సగటున 6.8% ఓటింగ్ జరిగినట్టు తెలియజేస్తుంది. ఆ తరువాత 10 గంటల పాటు ఓటింగ్ జరిగింది. పోలింగ్ రాత్రి 8 గంటల సమయానికి 68.12% పెరిగింది. రాత్రి 8 గంటల వరకు, అంటే మూడు గంటలలో 0.08% పెరిగింది.

 

  • అయితే, పోలింగ్ రోజైన అదే రోజు రాత్రి 11.45 గంటలకు పోలింగ్ శాతం 76.50%కు ఎగబాకింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.45 గంటల మధ్య పెరుగుదల 8.38% ఉంది. అంతేకాకుండా 3,500 బూతులలో పోలింగ్ ఇంకా జరుగుతోందని సీఈఓ ప్రకటించింది. అర్థరాత్రి తరువాత ఈ 3,500 బూతులలో పోలైన ఓట్లు భారత ఎన్నికల సంఘం పత్రికా ప్రకటన నెం. ECI/PN/89/2024  ప్రకారం, పోలైన ఓట్లను (Voter Turnout (VTR))ను 4.16% మేర పెంచి, పోలింగ్ శాతాన్ని 80.66%కు తెచ్చింది … ఈ శాతాన్ని వాస్తవ సంఖ్యలలోకి మారిస్తే- 3,500 బూతులలో అర్థరాత్రి తరువాత జరిగిన పోలింగ్‌లో ఆశ్చర్యకరంగా 17,19,482 ఓట్లు పోలయ్యాయి”…


ఇలా సాగుతుంది పరకాల ప్రభాకర్ కుట్ర సిద్దాంతం… అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)తో సహా అనేక మంది పిటిషనర్లు, 2024 సార్వత్రిక ఎన్నికలలో మొదటి రెండు దశలలో తుది ఓటర్ల ఓటింగ్ డేటాను ప్రచురించడంలో గణనీయమైన జాప్యం, ప్రారంభ అంచనాలతో పోలిస్తే శాతాల పెరుగుదల (5-6%) గురించి ఆందోళన వ్యక్తం చేసినప్పుడు పోలింగ్ రోజులలో విడుదల చేసిన ప్రారంభ ఓటర్ల ఓటింగ్ శాతాలు తాత్కాలికమైనవని, సవరణకు లోబడి ఉంటాయని ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకు తెలిపింది….

అంతేకాకుండా ఫాం 17 C (పోల్ చేయబడిన ఓట్ల శాతా) ల పూర్తి పరిశీలన తర్వాతే తుది, నవీకరించబడిన గణాంకాలు విడుదల చేయబడతాయని కూడా ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకు తెలిపిన విషయాన్ని పరకాల పరిగణనలోకి తీసుకుని ఉండివుంటే ఆయనకు ఈ వ్యాసం రాయవలసిన శ్రమ తప్పేదే. అయినా రాజకీయాలలో ఏదీ అమాయకంగా జరగదు కదా…

అయినప్పటికీ పరకాల లేవనెత్తిన విషయాలను ఒకసారి పరిశీలిద్దాము. ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాలకు కలిపి 46,389 పోలింగ్ బూతులు ఉన్నాయి. అంటే సగటున ఒక్కో నియోజకవర్గానికి 265 పోలింగ్ బూతులు ఉంటాయి. ఒక నియోజకవర్గ పోలింగ్ ను పర్యవేక్షించే రిటర్నింగ్ ఆఫీసర్ 267 బూతుల నుంచి సమాచారాన్ని తెప్పించటానికి, అలా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి పర్సంటేజ్ తియ్యటానికి గంటకు మించి పడుతుంది.

ఇలా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల డేటాను సమీకరించి, క్రోడీకరించటానికి ఆయా జిల్లాల కలెక్టర్లకు మరో గంట పడుతుంది. అలా అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి రాష్ట్ర స్థాయి పర్సేంటేజీని ప్రకటించటానికి కనీసం మరో 2 గంటలు పడుతుంది.

అంటే పరకాల ప్రభాకర్ రాసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన 68.04% మద్యాహ్నం 2-3 గంటల మధ్యకాలంలో జరిగిన పోలింగ్ కు సంబంధించినదై ఉంటుంది. లేకపోతే సాయంత్రం 5 గంటలకు 46,389 పోలింగ్ బూతులకు చెందిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేవలం నిముషాల వ్యవధిలో ఎలా ప్రకటించగలడు?

పరకాల ప్రభాకర్ కు క్షేత్ర స్థాయి ఎన్నికల ప్రక్రియ గురించి ఏమాత్రం అవగాహన లేదని దీనిని బట్టి అర్థమౌతోంది. 2014-19 మధ్యకాలంలో ఏమి జరిగిందో ఆయనకు చెప్పవలసిన అవసరం లేకున్నా ప్రజలకు మరోసారి గుర్తు చేస్తే లాభసాటిగా ఉంటుంది. విభజిత ఆంధ్రప్రదేశ్ కు కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం ఇవ్వవలసిన రాయితీలు ఇవ్వకపోవటంతో విబేధించిన చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వున్న ఆర్ పి సిసోడియాను తొలగించి గోపాలకృష్ణ ద్వివేదీని 2019 జనవరి 16వ తేదీనాడు నియమించింది.

ఆ తరువాత ఎన్నికల తేదీ (11 ఏప్రిల్)కి కొన్ని రోజుల ముందు ప్రధాన కార్యదర్శిగావున్న అనిల్ చంద్ర పునేతాను తొలగించి ఎల్ వి సుబ్రమణ్యంను నియమించింది. అలాగే మార్చి- ఏప్రిల్ లో డిజిపి ఇంటెలిజెన్స్ ఏబి వెంకటేశ్వరరావును బదిలీ చేసింది. ఇటువంటి అప్రజాస్వామిక చర్యల మధ్య జరిగిన 2019 ఎన్నికల గురించి అప్పటి దాకా చంద్రబాబు ప్రభుత్వంలో సమాచార, కమ్యూనికేషన్ సలహాదారుగా క్యాబినెట్ మంత్రి హోదాను అనుభవించిన పరకాల ప్రభాకర్ కు ఏమాత్రం పట్టలేదు. అందుకే ప్రొఫెసర్ పాల్ పియర్సన్ రాజకీయ విశ్లేషణలలో చారిత్రక దృక్పథంతో పాటు కాలాన్ని తిరిగి తీసుకురావాలన్నాడు.

ఆంధ్రప్రదేశ్ లో 2019 అసెంబ్లీ ఎన్నికలను పరకాల ప్రభాకర్ 2024 ఎన్నికలను విశ్లేషించినట్టుగా విశ్లేషిస్తే ఏమౌతుందో చూద్దాము. సాయంత్రం 6 గంటల వరకు 74 శాతం పోలింగ్ నమోదైందని 2019లో ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన గోపాల్ కృష్ణ ద్వివేది తెలిపారు. మొత్తం శాతం 80 వరకు పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు…

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని బూత్‌లలో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగిందని ఆయన అన్నాడు…  (https://www.ndtv.com/…/lok-sabha-elections-2019-polling… ఈ వ్యాసం తేదీ ఏప్రిల్ 11, 2019). 2019 ఎన్నికల్లో అంతిమంగా పోలైన ఓట్లు 31,680,063 (80.39%). ఈ లెక్క చాలా చోట్ల ఇప్పటికీ 31,333,631 (79.88%) గానే ఉంది. 2014లో కంటే 2019లో దాదాపు 2% అధికంగా ఓట్లు పోలయ్యాయి.

అధికారులను అప్రజాస్వామికంగా తొలగించి ఎన్నికల ప్రక్రియను మొత్తంగా ఎన్నికల కమిషన్ ఎవరి మేలు కొరకు తన చేతుల్లోకి తీసుకుందన్న విషయం ప్రభాకర్ కు పట్టలేదు. 2019లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వివేదీ ప్రకటించినట్టుగానే 2024లో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా ఇలా ప్రకటించాడు…

  • ‘‘సోమవారం జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సాయంత్రం 6 గంటల నాటికి ఏపీలో సగటున 75 శాతం పోలింగ్ నమోదైంది. పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలలో నిలబడ్డారు. ఈసీ తుది గణాంకాలను సంకలనం చేసే సమయానికి ఈ పోలింగ్ శాతం 2019 ఎన్నికల్లో నమోదైన 80 శాతం రికార్డును తాకే అవకాశం ఉంది’’

(https://timesofindia.indiatimes.com/…/art…/110098187.cms Dated: May 14, 2024). 2019లో, 2024లో సాయంత్రం 6 గంటలకు ఒకే పోలింగ్ నమోదైంది. కానీ 2024 ఎన్నికలలో జరిగిన “అద్భుతం” వెనుక మాత్రమే ప్రభాకర్ కు “దుశ్చర్య” కనపడింది!

అసలు 2019లో, 2024లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాం. 2019లో ఓటు హక్కు వినియోగించుకున్నవాళ్ళ సంఖ్య 3,16,80063 (80.39%). ఈ ఓట్లలో వైఎస్ఆర్సీపికి వచ్చిన ఓట్లు 1, 56, 88,569 (49.95%). ఈ ఓట్లతో గెలిచిన సీట్లు 151. అలాగే టిడిపికి వచ్చిన ఓట్లు 1, 23, 04668 (39.17%). గెలిచిన సీట్లు 23. జనసేనకు 17, 36,811 (5.53%) ఓట్లు వచ్చాయి. ఒకే ఒక సీటు గెలిచింది. బిజెపీకి 2,63,849 (0.84%) ఓట్లు వచ్చినా ఒక్క సీటు కూడా గెలవలేదు.

  • 2024 ఎన్నికలకు వచ్చేసరికి 3,38,38 349 (81.86%) ఓట్లు పోలయ్యాయి. ఈ సంఖ్య 2019తో పోల్చినప్పుడు కేవలం 1.47% మాత్రమే ఎక్కువ. టిడిపి, జనసేన, బీజేపి కూటమిగా ఏర్పడటంవల్ల ఓట్లు, సీట్లు ఇలా వచ్చాయి.

టిడిపి 1, 53, 84,576 (45.60%) ఓట్లతో 135 సీట్లు గెలుచుకుంది. జనసేన 23, 17, 747 (6.87%) ఓట్లతో 21 సీట్లను, బీజేపి 9, 53,977 (2.83%) ఓట్లతో 8 సీట్లను గెలుచుకున్నాయి. ఈ మూడు పార్టీల కూటమికి సమిష్టిగా వచ్చిన ఓట్లు: 1, 86, 56 300 (55.30%). అలాగే వైఎస్ఆర్సిపి 1, 32, 84 134 (39.37%) ఓట్లతో 11 సీట్లను గెలుచుకుంది. అంటే టిడిపి కూటమికి, వైఎస్ఆర్సిపికి మధ్య తేడా 53, 7 2,1 6 6 ఓట్లు…

2019లో విడివిడిగా పోటీచేసిన కూటమి పార్టీల ఓట్లు కలిపితే 1, 43, 06128 అవుతాయి. వైఎస్ఆర్సిపికి వచ్చిన 1, 56, 885691 ఓట్లతో పోల్చినప్పుడు తేడా 13,82, 4 41 ఓట్లు. రాజకీయాలలో 1+1+1 = 3 అవ్వవని జగన్ రెడ్డికి తెలియదు. ‘‘సింహం సింగిల్ గా వస్తుంది’’ అని గొప్పలు చెబుతుంటాడు. కానీ వాస్తవంలో సింహాలు సింగిల్ గా రావు. పొరపాటున వస్తే సాధు జంతువులు కూడా కుమ్ముతాయి.

అందుకే సింహాలు మందగా వచ్చి మాత్రమే వేటాడుతాయి. ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా ఇదే జరిగింది. సీన్ రివర్స్ అయింది అంతే. కాబట్టి పరకాల ప్రభాకర్ కు 2024లో అద్భుతంగా మిరుమిట్లుగొలుపుతూ కనపడిన అరుంధతీ నక్షత్రం 2019లో ఏదో పొగమంచు ఆవహించి కనపడలేదనుకుంటా!

పరకాల ప్రభాకర్ రాసింది చూశాక ఆయనకు ఈ దేశంలో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయనే విషయంపైన అసలు అవగాహనే లేదనిపిస్తుంది. ఎన్నిక అనగానే ఓటర్ల లిస్టుల కాపీలను సిద్దం చేసుకోవటం, పోలింగ్ ఏజంట్లుగా ఏఏ బూతుల్లో ఎవరెవరు ఉండాలో రాజకీయ పార్టీలు నిర్ణయిస్తాయి. ఓటర్లను గుర్తిస్తూ పోలింగ్ అయ్యేదాకా వుండి ఫామ్ 17సి కాపీని తీసుకోవటం ఏ పోలింగ్ ఏజంటూ మరువడు.

  • ఫాం 17సి లో 7 విషయాలు ఉంటాయి. ముఖ్యంగా సదరు పోలింగ్ బూత్ లో మొత్తం ఓటర్లు ఎందరు? ఏ ఏ గంటల్లో ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు, సదరు బూత్ లో వినియోగించిన ఇవిఎమ్ కు, వివిపాట్ లకు సంబంధించిన వివరాలు ఉంటాయి . ఎందరు వినియోగించుకోలేదనే విషయాలు కూడా ఉంటాయి.

కౌంటింగ్ కి వెళ్లే ఏజెంట్లు ఫాం 17 సి లోని సమాచారం ఇవిఎమ్ లలోని ఓట్లతో సింక్ అవుతుందో, లేదో చూస్తారు. 2024 ఎన్నికల్లో అటువంటి తేడాలు ఉన్నట్టు ఎక్కడా రిపోర్ట్ కాలేదు. అందుకే ఓట్ల లెక్కింపుకు ముందు గానీ, ఆ తరువాత గానీ పోలైన ఓట్ల గురించి ఎవ్వరూ సందేహాన్ని వ్యక్తపరచలేదు.

నిజం చెప్పాలంటే నియోజకవర్గంలోని 260 బూతుల్లో ఏమి జరుగుతుందో ఎన్నికల కమిషన్ కంటే ముందుగానే రాజకీయ పార్టీల అభ్యర్థులకు తమ పోలింగ్ ఏజంట్ల ద్వారా తెలుస్తుంది. కాబట్టి పరకాల ప్రభాకర్ చెబుతున్న కాకిలెక్కలకు ఏమాత్రం విలువ లేదు.

పాల్ పియర్సన్ సూచించినట్లుగా రాజకీయాలను కాలంలోకి తిరిగి తీసుకొద్దాము. పరకాల ప్రభాకర్ చెబుతున్నట్టు లక్షలాది ఓట్లను ఇవిఎమ్ లలోకి తేగల సత్తా ఎవరికైనా ఉంటేగింటే అది బీజేపీకే ఉంటుంది. ఆంధ్రపదేశ్ లో బీజేపీ తన శక్తియుక్తులను జగన్ రెడ్డికి అనుకూలంగా (2019లో వివిధ రూపాల్లో చేసినట్టు) ఉపయోగిస్తుంది తప్ప చంద్రబాబుకు అనుకూలంగా వినియోగించదనేది జగద్వితం.

అంతేకాదు, పాత సిబిఐ కేసులు, వివేకా హత్య, లిక్కర్ స్కాం, తాజాగా నెయ్యేలేని రసాయన కాక్టెయిల్ స్కాం ల నుంచి జగన్ రెడ్డిని కాపాడుతున్నది ఎవరో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు తెలుసు. ఏమైనప్పటికీ ఒక బెటాలియన్ తెలుగు మేధావులను గంగిరెద్దులుగా మార్చిన జగన్ రెడ్డి ‘మంత్రదండానికి’ నా హ్యాట్స్ ఆఫ్!…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పరకాల ప్రభాకర్… కేంద్ర ఆర్థికమంత్రి భర్తకు ఎక్కడో ఏదో దెబ్బ తిన్నది…
  • కేరళం..! ఎందుకు ఈ పేరు మార్పిడి..? ఈ పేరులో అర్థమేమిటి..?
  • రాయల్ టైగర్‌కు ఓ మాంసం ముక్క… ఆడిట్ వాడు పట్టేసుకున్నాడు…
  • పాటలు, డాన్సులు, యాక్షన్, స్టయిల్… ఫక్తు చిరంజీవి మార్క్ మూవీ…
  • తాజ్ హోటళ్ల నడుమ స్కై బ్రిడ్జ్… ఆసక్తి కలిగించే ఓ వార్త కథ..!!
  • గణపతి సైతం..! మావోయిస్ట్ పార్టీ చివరి వికెట్ కూడా త్వరలోనే..!!
  • ఆట వస్తువుల ఓ చిన్న వ్యాపారి… ట్రంపును నేల మీదకు దించాడు…
  • పురస్కారాల పందేరం వద్దు… అవార్డుల వైపు అందరి చూపు..!
  • విజయ్ దేవరకొండ అరటి బోదెలను అడ్డంగా నరకాల్సి ఉంటుంది..!!
  • ముందే చెబుతున్నా… మొత్తం చదివాక అస్సలు నవ్వొద్దు సుమీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions