Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ముఖపుస్తకం కాదు… ఇది అక్షరాలా బాపు మార్క్ పెళ్లిపుస్తకం…

April 13, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం ; ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం . తెలుగు లోగిళ్ళలో పెళ్ళంటే ముందు సీతారాముల కళ్యాణం చూదము రారండీ పాట . తర్వాత బంగారు బొమ్మ రావేమో పందిట్లొ పెళ్లి జరిగేనే పాట . ఈ సినిమా తర్వాత ఈ పాట కూడా మారుమోగుతూ ఉంది . అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన ఆరుద్ర గారికి , చక్కటి సంగీతాన్ని అందించిన కె వి మహదేవన్ గారికి , అత్యంత శ్రావ్యంగా పాడిన బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలకు ధన్యవాదాలు చెప్పాలి ఇంత మధురమైన పెళ్లి పాటను తెలుగు వారికి అందించినందుకు .

బాపు మార్క్ క్లాసిక్ ఈ పెళ్లిపుస్తకం సినిమా . బాపు , విశ్వనాథులు సాధారణ కధను కూడా కళాత్మకంగా , పది కాలాల పాటు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేలా జన రంజకంగా ఆవిష్కరిస్తారు . చాలా సాధారణ సందేశమే . భార్యాభర్తల మధ్య అనుమానాలు , కీచులాటలు , బిగుసుకుపోవటాలు , జారిపోవటాలు సర్వసాధారణమే . మనందరం వాటిని దాటిన వారమే . దాటుతున్నవారమే . ఈ పెళ్లి పుస్తకం సినిమాలో ఆ విన్యాసాలను ఎంత కళాత్మకంగా చూపారో !

Ads

మిస్సమ్మ సినిమాకు రివర్స్ . ఆ సినిమాలో భార్యాభర్తలు కాని వారు బతుకు తెరువు కోసం , మిస్సమ్మ బాకీ చెల్లింపు కొరకు భార్యాభర్తలుగా నటించారు . ఈ సినిమాలో అక్క కట్నం కొరకు , చెల్లెలు ఆపరేషన్ కొరకు భార్యాభర్తలు ఎవరికి వారు అబధ్ధం చెప్పి ఒకే కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంటారు . ఒక్క మిస్సమ్మేనా ! విరాటపర్వంలోని నర్తనశాల ఘట్టాన్ని కూడా జొప్పించారు . బాసు గారి బావమరిది భామ మీద కీచకుడి లాగా కన్నేస్తే కీచకుడి అక్క భీమావతారంలో వచ్చి బుధ్ధి చెప్పి పంపుతుంది .

బాపు బొమ్మ అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు . అలాంటి బాపు బొమ్మలాగా విశాలాక్షిగా తెరపై కనిపించే అవకాశం కలగటం దివ్యవాణి అదృష్టం . ఆమె కూడా అంతే గొప్పగా సద్వినియోగపరచుకుంది వచ్చిన అవకాశాన్ని . సినిమాలో కొంటె పెళ్ళాంగా నటించటం ఒక ఎత్తయితే క్లైమాక్సులో బరస్టయి భర్త ఒడిలోకి జారే సీన్లో అత్యద్భుతంగా నటించింది .

రాజేంద్రప్రసాద్ ఈ సినిమా టైంకు పండిపోయాడు . ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే అతనికి . అతని కీర్తి కిరీటంలో మరో కలికితురాయి . మరో ప్రధాన పాత్ర గుమ్మడిది . డబ్బొచ్చాక వెరైటీ ఐడియాలు వస్తాయి . కుటుంబానికి ఒక ఉద్యోగం మాత్రమే అనే సూత్రాన్ని డవలప్ చేసి సినిమాంతంలో పొరపాటు జరిగిందని తనకు తానే ఫైన్ వేసుకుంటాడు . గొప్ప మేనరిజాన్ని పెట్టారు ముళ్ళపూడి వెంకట రమణ . “నేను” అంటు పాజ్ ఇచ్చి మాట్లాడే మేనరిజం . గమ్మత్తుగా ఉంటుంది .

మరో ప్రధాన పాత్ర గలగలా సందడి చేసే బాసు కుట్టి పాత్ర . సిందుజ బాగా నటించింది . బాసు గారి భార్యగా ఝాన్సీ , కీచక బామ్మరిదిగా శుభలేఖ సుధాకర్ నటించారు . మరో గుర్తుండిపోయే పాత్ర రావి కొండలరావుది . బాసు డైలాగులకు టివిలో వచ్చే బధిర వార్తల్లాగా అభినయిస్తూ ఉంటుంది ఆ పాత్ర . ఈ సినిమా మూల కధ ఆయన వ్రాసిందే . నంది అవార్డు కూడా వచ్చింది . ఇంకా అశోక్ కుమార్ , నా ప్రియమిత్రులు ధర్మవరపు సుబ్రమణ్యం , అనంత్  ప్రభృతులు నటించారు .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యమే . బాపు అనగానే తోట పాటలు ఉండాల్సిందే కదా ! ఉన్నాయి . వన భోజనం పాట ప ప ప పప్పు దప్పళం పాట అలాంటిదే .‌ త్యాగరాజ స్వామి జగదానంద కారకా జయ జానకీ ప్రాణనాయకా పాట . బాపు సినిమాలో రాముడి పాట లేకుండా ఉంటుందా !

నారాయణ తీర్ధుల వారి కృష్ణ లీలా తరంగిణి నుండి కృష్ణం కలయ సఖీ సుందరం నృత్యం దివ్యవాణి , సింధుజల మీద చాలా బాగుంటుంది . నారాయణ తీర్ధుల (1650-1745) వారిది మా గుంటూరు జిల్లా , నాగార్జున యూనివర్శిటీ వద్ద కల కాజ . చాలామందికి తెలిసే ఉండవచ్చు .

ఈ సినిమాలో బాపు మార్క్ పాట అమ్మ కుట్టి అమ్మ కుట్టి మనసిలాయే కూడా ప్రకృతి నేపధ్యంలో తీయబడింది . రాజేంద్రప్రసాద్ , దివ్యవాణి మీద సరికొత్త చీరె ఊహించినాను సరదాల సరిగంచు నేయించినాను చాలా అందంగా ఉంటుంది . మరో శ్రావ్యమైన పాట హాయి హాయి శ్రీరంగ సాయి మా పెద్ద పాపాయి ఆపదల కాయి . మన చిన్నప్పటి జోల పాటకు కొనసాగింపు . ఈతరం అమ్మలు ఇంకా పాడుతున్నారా !!

కధను రావి కొండలరావు నేస్తే , స్క్రీన్ ప్లేని మాటల్ని నిర్మాత ముళ్ళపూడి వెంకట రమణ సమకూర్చారు . సంతోషం ఏమిటంటే ముళ్ళపూడి వారికి లాభాలు వచ్చాయి . ఆరుద్ర వ్రాసిన పాటలకు బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , వాణీ జయరాం , శైలజ , పూర్ణచందర్ గాత్రాన్ని ఇచ్చారు . నృత్యాలను శీను కంపోజ్ చేసారు . సినిమా యూట్యూబులో ఉంది . పాటల్ని ఆస్వాదించండి …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ముఖపుస్తకం కాదు… ఇది అక్షరాలా బాపు మార్క్ పెళ్లిపుస్తకం…
  • గుడి సంప్రదాయమే ‘సుప్రీం’… పాటించాల్సిందే… ధర్మో రక్షతి రక్షితః
  • మీ దుంపతెగ… 90 ఏళ్లు… స్టిల్ హెల్తీ… మీరే చంపేశారేమిట్రా…
  • ఇండియన్ సినిమాపాట @ ఆశా భోస్లే..! వైవిధ్యానికి ఐకన్ ఆమె..!!
  • విష్ణుప్రియ డబ్బు కక్కుర్తి… కానీ అది నేరమా..? అంత ఘోరమా..?
  • ఓహ్… నటుడు ప్రకాష్‌రాజ్‌లో ఈ కోణం కూడా ఉందా..? ఆశ్చర్యమే…!
  • పింక్ అక్రమార్కుల పాపాల పుట్టలు పగిలిపోయాయ్… జయహో హైడ్రా…
  • అక్కినేని- అమల ప్రేమ- పెళ్లి ‘నిర్ణయం’ అప్పుడే జరిగిపోయింది..!
  • AI అంటే Anti Indian కాదు… ఇండియా స్టాండ్ అర్థం చేసుకుంది…
  • ఎహె పో… నేను అసలే ఆడను… అదసలు బౌలింగే కాదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions