Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సాయం కోరుతూ కన్నీళ్లు, విన్నపాలు… ఇదోరకం మోసం, జాగ్రత్త…

March 17, 2026 by M S R

.

Director Devi Prasad.C…. ఫిబ్రవరిలో ఓరోజు ఉదయం 6281053292 నంబర్ నుండి ఓ ఫోన్‌కాల్ వొచ్చింది. చాలా దీనంగా వున్న ఓ గొంతుతో “నమస్తే సర్. నేను లింగా… గుర్తున్నానా సర్” అన్నాడో వ్యక్తి.
ఎవరు? అన్నాను.
“మీరు శ్రీరంగనీతులు సినిమాలో యాక్ట్ చేశారు కద సర్. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానా సినిమాకి. చాలా రోజులయ్యింది కనుక మీకు గుర్తుండకపోవచ్చు”అన్నాడు.
“సరే… చెప్పండి”

“ఎలా చెప్పాలో అర్ధం కావటం లేదు సర్. కొన్నిరోజులుగా మలక్‌పేట యశోదా హాస్పిటల్ లో మా అమ్మగారు సీరియస్‌గా ఉన్నారు. మా దగ్గర డబ్బులు అయిపోయాయి. ఆరోగ్యశ్రీలాంటి కార్డులేవీ లేవు. తెలిసినవాళ్ళు బెంగుళూరు షిఫ్ట్ చేస్తే ఫ్రీగా ట్రీట్‌మెంట్ చేయిస్తామన్నారు. అంబులెన్స్ కి 16 వేలు అడిగారు. పదివేలు దొరికాయి. 6 వేలు తక్కువయ్యింది. టైమ్ లేదు సర్. ఏంచేయాలో అర్ధంకాక మీకు కాల్ చేశాను.” అన్నాడు దీనంగా.

Ads

వాట్సప్ లో మొహానికి ఆక్సిజన్ మాస్క్‌ వున్న పెద్దావిడ ఫోటో, హాస్పిటల్‌లో ఓ ప్రదేశం ఫోటోలు పెట్టాడు.
మనసు కలుక్కుమన్నది.
ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అతను చెప్పిన “పచరపల్లి లింగారెడ్డి” అనే పేరున్న ఎక్కౌంట్‌కి 6 వేలు గూగుల్‌పే చేశాను.
అతను థ్యాంక్స్‌లతో దండాలు మెసేజ్ చేశాడు.

ఓ ముసలమ్మ అంబులెన్స్ లో ఉన్నట్టు ఒక్క సెకెన్ మాత్రమే ఉన్న ఓ వీడియో పంపాడు.
మరుసటిరోజు ఉదయం బెంగుళూరు రీచ్ అయ్యి హాస్పిటలో జాయిన్ చేసినట్టు, ఆపరేషన్‌కి డాక్టర్స్ ప్రిపేరవుతున్నట్టు మెసేజ్‌లు పెట్టాడు.
ఓ గంట తరువాత మళ్ళీ మళ్ళీ డబ్బులడగటం మొదలుపెట్టాడు.

తరువాతరోజు అతను చెప్పిన శ్రీరంగనీతులు సినిమాకి పనిచేసినవాళ్ళకు కాల్ చేసి అడిగితే అసలు లింగారెడ్డి అనే ఏ వ్యక్తీ ఆ సినిమాకి పనిచేయలేదనీ, ఆ సినిమా పేరుచెప్పి రెండునెలల క్రితం సేమ్ లూప్ వేసి ఆ సినిమా హీరోలనీ డబ్బులడిగాడనీ చెప్పారు.

మూడు రోజుల తరువాత ఆత్రేయపురంలో షూటింగ్ లో నాపక్కనే ఉన్న “భాషా” అనే నటునికి అదే వ్యక్తి కాల్ చేసి, మూడేళ్ళ ముందెప్పుడో ఆయన నటించిన సినిమాకి తాను A.D గా పనిచేశానని అవే డైలాగులు చెప్పి అవే ఫోటోలు పంపాడు.
బాషా గారికి విషయం ముందే తెలుసు కనుక “నువ్వు గుర్తురావటం లేదు నీ ఫోటో పెట్టు” అంటే హీరో అడివిశేష్ తో ఉన్న ఫోటో పెట్టాడు.

ఇప్పుడు మీ మదర్ ఎక్కడున్నారు అని అడిగితే మలక్‌పేట యశోదాలో అన్నాడు.
నేను ఫ్రెండ్ తో డబ్బులు పంపుతాను లొకేషన్ షేర్ చెయ్ అంటే యశోదా హాస్పిటల్‌కి మూడు వీధుల అవతలున్న ఓ లొకేషన్ పెట్టాడు.
నేను మళ్ళీ ఆ లింగారెడ్డి కి కాల్ చేసి ఇప్పుడెక్కడున్నారు అని అడిగితే బెంగుళూరులో జయదేవ్ హాస్పిటల్‌లో ఉన్నాము ట్రీట్‌మెంట్ జరుగుతుంది అన్నాడు.

ఫ్రాడ్‌ వెధవ అని నేను తిడుతున్నా అతను మాత్రం చాలా కూల్‌గా సమాధానాలు చెప్పాడు.
లొకేషన్‌లో ఉన్న నటులు ఒకప్పుడు వాడు జబర్దస్త్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడనీ, కొన్నేళ్ళ నుండి వాడిలాగే చేస్తున్నాడని వాడి పాత మిత్రులద్వారా తెలిసిందని చెప్పారు.
మరో నటీమణి గారిని ఎవడో కో ఆర్డినేటర్ పేరుతో అతని కొడుకుకి యాక్సిడెంట్ అయ్యిందని టెన్షన్ పెట్టి వేలకివేలు కొట్టేశాడట. అదీ ఫ్రాడే.

కుమార్ అనే పేరుతో కో ఆర్డినేటర్‌నని చెప్పి నాకు వచ్చిన సేమ్ ఫోటోలనే పంపి 5 వేలు కొట్టేశారని నా సహనటీమణి ఒకరు చెప్పారు.
నాయక్ అనే పేరు చెప్పి డబ్బింగ్ ఇన్‌చార్జ్ పేరుతో భార్యకి సీరియస్ గా ఉందని చెప్పి, ఓ టీవీ చానెల్ లో పనిచేసే మా చెల్లెలికే 6 వేలు టోకరా వేశాడొకడు.
అన్నీ ఫేకే.

ఫేక్

గతంలోనూ కొందరు (తెలిసినవాళ్ళే) పిల్లలకి బాగోలేదనీ, ఫీజులు కట్టాలనీ నా దగ్గర డబ్బులు తీసుకుని ఫుల్‌బాటిల్స్ మందుకొట్టి ఎన్‌జాయ్ చేసినవాళ్ళ గురించి నాకు తెలిసినా ఇక్కడ అమ్మ సెంటిమెంట్‌తో కొట్టాడు వీడు.
పోయిన డబ్బు ఎంతనికాదు మరెంతోమంది మోసపోకూడదనే ఈ పోస్ట్ పెడుతున్నా.

మనుషుల్లో సహజంగా ఉండే జాలి, కరుణ, దయలే ఆ మోసగాళ్ళ బలం.
రెండో విషయం: ఆత్రేయపురంలో షూటింగ్‌లో నేను క్యారెవాన్ దిగి షాట్ కి వెళ్ళొచ్చేసరికి నా బ్యాగ్‌లోని పర్స్ తీసి మరీ పదకొండున్నరవేలు క్యాష్ కొట్టేశారు.
సహజంగా కాపలా కాసే కుర్రాడు ఉంటాడు.

ఆ క్యారెవాన్ బాధ్యత తీసుకొనే వ్యక్తిని “మేము షాట్‌కి వెళ్ళాక క్యారెవాన్ లోపలికి ఎవరెవరు వెళ్ళారు” అని అడిగితే సదరు వ్యక్తి సరైన సమాధానం చెప్పకపోగా ఆగ్రహంతో ఊగిపోతూ మాకేం బాధ్యత లేదంటూ రివర్స్ లో నా అసిస్టెంట్ మీద గొడవకు దిగాడు.
పదిహేడున్నర వేలు తీసుకుని ఫిబ్రవరి నెల నాకు నేర్పిన పాఠాలేమంటే ……
అడుగడుగుకో దొంగ అరగజానికో మోసగాడు తిరుగాడుతున్న ఈ సమాజంలో…..
తనకుమాలిన ధర్మం పనికిరాదు.

నాగయ్య

ప్రతిక్షణం నీకు నువ్వే అప్రమత్తంగా ఉండటం అవసరం.
సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి చివరిదశలో ఆర్ధిక కష్టాలు అనుభవించిన చిత్తూరు వి.నాగయ్య గారు తన స్వీయచరిత్రలో ఇచ్చిన సందేశం నేను పెట్టిన ఫోటోలో వుంది. అందరూ తప్పక చదవాలి. ముఖ్యంగా సినిమావాళ్ళు. ____ దేవీప్రసాద్.



  • ఇదెందుకు పబ్లిష్ చేస్తున్నానంటే… ఇలాంటి ఫేక్, ఫ్రాడ్ ల వల్ల నిజంగా అవసరాలున్నవాళ్లను కూడా ఎవరూ నమ్మలేని పరిస్థితి ఏర్పడుతోంది… మరొకటి, సర్, క్యాష్ ఇస్తాను, మీ ఫోన్ నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయండి అనడిగే వాళ్లు కూడా ఎక్కువయ్యారు… జాగ్రత్త… అది వేరే దందా… …. ముచ్చట


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యోగీ, హిమంత ‘బుల్‌డోజర్’ బాటలో… బెంగాలీ సువేందు అధికారి…
  • రాజకీయ విమర్శల్లో ఘాటు వోకే… కానీ జాతుల్ని కించపరచడం దేనికి..?
  • ప్రళయ్..! ఇక ప్రేక్షకులందరి చూపూ ఈ కొత్త సినిమాపైనే..!
  • ఇరాన్‌లో చిక్కుకున్న అమెరికన్ పైలట్‌ను కాపాడింది ఇదేనా..?!
  • ఏడేళ్ల ‘బాలీవుడ్ బాద్‌షా’ పీఠానికి ఎసరు..! తొలిసారి రణబీర్‌కు కిరీటం..!
  • కొబ్బరి బొండాం..! అప్పట్లో కామెడీ హీరో అంటే ఓన్లీ రాజేంద్ర ప్రసాద్..!
  • అర్చకుల విదేశీ ప్రయాణాలు నిషిద్ధమా..? శృంగేరీ చెప్పిందే ఆగమమా..?!
  • అసెంబ్లీ నక్సలైట్..! ముందస్తు జాగ్రత్తగా ఉపా కేసు వర్తిస్తుందా యువరానర్..!!
  • అన్నదాత చెమట చుక్కకు తెలుసు మెతుకు విలువ… అవమానించకండి…
  • గాలికదుపు లేదు- కడలికంతు లేదు… ప్రతి పదంలోనూ మార్మిక భావన…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions