Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫోన్‌బుక్..! ప్రతి నంబరూ ఆత్మీయం కాదు, అవసరమైతే పలకరించదు..!!

February 26, 2026 by M S R

.

Raghu Mandaati …. మీ ఫోన్‌లో నంబర్లు ఎక్కువగా ఉండటం
అది నెట్‌వర్క్ కాదు.
అది కేవలం కాంటాక్టుల లిస్ట్ మాత్రమే.
నిజమైన నెట్‌వర్క్ అంటే
అవసరమైనప్పుడు స్పందించే మనసులు,
మీ విజయాన్ని చూసి హృదయపూర్వకంగా ఆనందించే మనుషులు,
మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకునే బంధాలు.

ఎందుకంటే నంబర్స్
స్క్రీన్‌పై కనిపిస్తాయి
సంబంధాలు మాత్రం జీవితంలో నిలుస్తాయి.
ఫోన్‌లో వెయ్యి కాంటాక్టులు ఉండొచ్చు.
వాటిలో చాలామంది పేర్ల ముందు “Sir”, “Madam”, “Director”, “CEO”, “Client”, “VIP” అని కూడా ఉండొచ్చు.
కానీ ఒక ప్రశ్న మనసును నిశ్శబ్దంగా అడగాలి.
ఈ నంబర్లలో ఎంతమంది మన కోసం నిజంగా నిలబడతారు?

Ads

ఫోన్‌లో సేవ్ చేసిన నంబర్‌ ఒక నెట్‌వర్క్ కాదు.
అది కేవలం డేటా. సిగ్నల్ ఉంటే కాల్ కలుస్తుంది. సిగ్నల్ లేకపోతే “నాట్ రీచెబుల్ ” అంటుంది.
కానీ సంబంధం అంటే సిగ్నల్ మీద ఆధారపడదు.
అది మనసు మీద ఆధారపడుతుంది.
నెట్‌వర్క్ అంటే పరిచయాల విస్తీర్ణం కాదు,
సంబంధాల లోతు.

చాలామందిని మనం కలుస్తాం ఈవెంట్స్‌లో, మీటింగ్స్‌లో, ప్రయాణాల్లో, ప్రాజెక్ట్‌లలో.
విజిట్ కార్డులు మార్చుకుంటాం. ఫోన్ నంబర్లు సేవ్ చేసుకుంటాం.
సోషల్ మీడియాలో ఫాలో అవుతాం.
మనకు అనిపిస్తుంది “నాకు మంచి నెట్‌వర్క్ ఉంది.” అని.
కానీ ఒక రోజు మనసు విరిగిపోయినప్పుడు,
ఒకానొక రాత్రి నిద్ర రాక ఒంటరిగా కూర్చున్నప్పుడు,
ఒక కష్ట సమయంలో ఎవరో ఒకరు నిశ్శబ్దంగా పక్కన కూర్చుని,
“నేను ఉన్నాను” అని చెప్పగలిగితే…
అదే నిజమైన నెట్‌వర్క్.

సంబంధం అంటే ఉపయోగం కోసం దగ్గరవ్వడం కాదు.
అది పరస్పర గౌరవం.
అది నమ్మకం.
అది బాధలో కూడా విడిచిపెట్టని ఆత్మీయత.
మన కాలంలో ఒక పెద్ద మాయ ఉంది.
విసిబిలిటీని వాల్యూ అనుకోవడం.
చాలామందితో ఫోటోలు ఉంటే,
చాలా ఫాలోవర్లు ఉంటే,
చాలా గ్రూపుల్లో ఉంటే
మనకు అనిపిస్తుంది మనం కనెక్ట్ అయిపోయామని.
కానీ కనెక్షన్ అంటే Wi-Fi కాదు.
అది హృదయాల మధ్య జరిగే ఒక మౌన ఒప్పందం.

ఎవరైనా మీకు కాల్ చేస్తే మీరు లిఫ్ట్ చేస్తారా?
మీరు కాల్ చేస్తే వాళ్లు స్పందిస్తారా?
మీతో ఎలాంటి లాభం లేదు మీరేమి ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా వారు మీతో ఉంటారా?
ఇవే నిజమైన ప్రశ్నలు.

లోతైన సంబంధాలు నిర్మించడం అంటే
సమయం ఇవ్వడం. వినడం. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం. సంతోషంలో పంచుకోవడం. బాధలో పట్టుకోవడం.
ఇది ఒక స్లో ప్రాసెస్, ఇది ఇన్‌స్టంట్ కాదు.
ఇది ఒక విత్తనం నాటినట్టు
మొదట మట్టి, తరువాత నీరు, తరువాత సహనం… అప్పుడే ఒక నీడిచ్చే చెట్టు లా మారుతుంది.
నంబర్లు స్క్రీన్‌లో మెరుస్తాయి.
సంబంధాలు జీవితంలో వెలుగుతాయి.

ఒకరోజు మన విజయాలన్నీ మాయమవుతాయి.
పదవులు మారిపోతాయి.
పరిస్థితులు మారిపోతాయి.
కానీ మన పక్కన నిలిచే మనుషులే
మన అసలైన సంపద.
కాబట్టి
నంబర్లు సేకరించకండి…
మనుషులను అర్థం చేసుకోండి.
కాంటాక్టులు పెంచకండి…
సంబంధాలు పెంచండి.
ఎందుకంటే చివరికి
ఫోన్ బ్యాటరీ ఖాళీ అవుతుంది.
సిగ్నల్ పోతుంది.
డేటా డిలీట్ అవుతుంది.
కానీ
నిజమైన బంధం ఒకసారి హృదయంలో నిలిచిపోయిందంటే
అది జీవితాంతం ఆల్వేస్ రీచెబుల్ గా ఉంటుంది.
అదే అసలైన నెట్‌వర్క్.

  • అదే మనిషిగా మనకు లభించే గొప్ప వరం.
    నా జీవిత ప్రయాణంలో నేను ఇది చాలా స్పష్టంగా నేర్చుకున్నాను.
    నేను ఎన్నో దేశాలు చూశాను…
    భూటాన్ పర్వతాల నిశ్శబ్దం నుండి కాంబోడియా దేవాలయాల నిత్యకాంతి వరకు,
    మలేషియా నగరాల వేగం నుండి కెన్యా మైదానాల విస్తీర్ణం వరకు,
    యుఏఈ ఆకాశహర్మ్యాల మెరుపు నుండి కిర్గిజిస్తాన్ పర్వత గాలుల స్వచ్ఛత వరకు
    ప్రపంచం నాకు చాలా పరిచయాలు ఇచ్చింది.
    కానీ నాతో నిజంగా నిలిచింది
    పరిచయాల సంఖ్య కాదు…
    మనసుల స్పర్శ.

సంబంధం అనేది భాషతో కాదు, భావంతో మొదలవుతుంది.
కెన్యాలో ఒక గ్రామంలో,
నా కెమెరా చూసి పిల్లలు నవ్వుతూ చుట్టూ చేరారు.
వాళ్లతో నాకు ఒక కామన్ లాంగ్వేజ్ లేదు.
కానీ ఆ నవ్వుల్లో ఒక అప్రయత్నమైన అనుబంధం ఉంది.
అది ఫోన్‌లో సేవ్ చేయలేని నెట్‌వర్క్.
కానీ హృదయంలో శాశ్వతంగా సేవ్ అయిపోయింది.

నిజానికి నా ప్రయాణాలు నాకు ఒక గొప్ప సత్యం నేర్పించాయి.
ప్రపంచం పెద్దది కాదు…
మనసులు దగ్గరైతే ప్రపంచం చిన్నదైపోతుంది.
ఇప్పుడు నేను నా ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ చూస్తే
అందులో చాలా పేర్లు ఉన్నాయి.
కానీ నా హృదయపు లిస్ట్ చాలా చిన్నది.
అందులో కొద్దిమంది మాత్రమే.
కానీ వాళ్లు
నన్ను అర్థం చేసుకునే వారు.
నా మౌనాన్ని కూడా వినగలిగే వారు.
నా విజయంలో హర్షించే వారు.
నా పరాజయంలో కూడా నన్ను వదలని వారు.

నెట్‌వర్క్ అనేది ఒక వ్యూహం కాదు.
అది ఒక సాధన.
ఒక ఆత్మీయ సాధన.
లోతైన సంబంధాలు నిర్మించాలంటే
మన అహాన్ని కొంచెం తగ్గించాలి.
ఎందుకంటే చివరికి
మన జీవితం ఒక ప్రాజెక్ట్ కాదు,
ఒక ప్రయాణం.
ఆ ప్రయాణంలో
మనతో పాటు నడిచే మనుషులే
మన అసలైన సంపద.
కాబట్టి నేను ఇప్పుడు నంబర్లు కాదు,
సంబంధాలు సేకరిస్తున్నాను.
కాంటాక్టులు కాదు,
ఆత్మీయత పెంచుకుంటున్నాను.

ఎందుకంటే నాకు తెలుసు
ఒక రోజు కెమెరా నిశ్శబ్దమవుతుంది.
ప్రయాణాలు ఆగిపోతాయి.
పేరు, ఖ్యాతి అన్నీ కాలంతో కలిసి కరిగిపోతాయి.
కానీ
మనసుకు హత్తుకున్న ఒక బంధం
అది మాత్రం కాలానికి అందని జ్ఞాపకంగా,
హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది.
అదే నా అనుభవం.
అదే నా నిజమైన నెట్‌వర్క్.

ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా నాతో టచ్ లో ఉంటున్న నా సన్నిహితులందరికి తెలుసు, నిజంగా పూర్తిగా తెలుసు, నేను ఎలా ఉంటాను, ఎలా ఏడుస్తాను, ఎలా బాధ పడతాను, ఎప్పుడు నవ్వుతాను, ఎంత వ్యంగంగా ఉంటాను, ఏం తింటాను, ఏం ఆలోచిస్తాను, నేను ఏం చేయగలను, నేనేమి చేయలేను, నా బలహీనతలు, నా రుగ్మతలు, నా అసహనాలు, అన్ని అన్ని తెలుసు…

నిజం చెప్పాలంటే వాళ్ళ దగ్గరే నేను నాలా ఉంటానేమో… వాళ్లకు మాత్రమే నేనేంటో నా నిజ స్వరూపం ఏంటో పూర్తిగా తెలుసు…
ఈ ప్రపంచం ముందు మనం ఒక పాత్ర పోషిస్తాం.
ఒక ప్రొఫెషనల్ ముఖం.
ఒక బలమైన మనిషి.
ఒక ఆలోచనాపరుడు.
ఒక సృజనశీలి.
ఒక నాయకుడు.
కానీ వాళ్ల ముందు
నేను ముసుగులు లేకుండా ఉంటాను.
అసహనంగా కూడా ఉంటాను.
చిన్న పిల్లాడిలా కూడా ఉంటాను.
కొన్నిసార్లు అర్థం లేని భయాలతో కూడిన మనిషిలా కూడా ఉంటాను.

వాళ్లకు మాత్రమే తెలుసు
నా నిజ స్వరూపం.
మనిషి జీవితంలో చాలా సంబంధాలు వస్తాయి.
కొన్ని అవసరంతో.
కొన్ని ప్రయోజనంతో.
కొన్ని పరిచయంతో.
కానీ చాలా అరుదుగా
కొన్ని సంబంధాలు మన ఆత్మను చూసి మనతో ఉంటాయి.
నేను అడిగినా, అడగకపోయినా…
నెలల కొద్దీ, ఏళ్ల కొద్దీ నా వైపు నుండి పలకరింపు లేకపోయినా…
నన్ను కంటికి రెప్పలా చూసుకునే ఆ మనసు వాళ్లకు ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే.

నేను కొన్నిసార్లు మౌనమవుతాను.
సందేశాలకు ఆలస్యం అవుతుంది.
కాల్స్ మిస్ అవుతాయి.
నా ప్రపంచంలోనే మునిగిపోతాను.
కానీ వాళ్లు మాత్రం
“ఇతను ఇలాగే ఉంటాడు” అని అర్థం చేసుకుంటారే తప్ప దూరం పెంచుకోరు, దూరం చేసుకోరు.
అది ప్రేమ కాదా?
అది బంధం కాదా?
అది నెట్‌వర్క్ కంటే గొప్పదికాదా?

సంబంధం అంటే ప్రతిరోజూ మాట్లాడటం కాదు.
ప్రతి గంటా మెసేజ్ చేయడం కాదు.
సంబంధం అంటే
కాలం గడిచినా,
మాటలు తగ్గినా,
మనసులు మాత్రం తగ్గిపోకపోవడం.
ఎప్పుడైనా ఒక రోజు,
ఒక చిన్న మెసేజ్ పంపితే
“ఎక్కడున్నావ్ ఎలా ఉన్నావ్?” అని అడిగితే
అక్కడి నుండి మొదలయ్యే సంభాషణలో
ఏ గ్యాప్ కనిపించకపోవడం.
అదే లోతు.

నా జీవితంలో కొంతమంది ఉన్నారు
వాళ్లకు నేను ఎన్ని విజయాలు సాధించానన్నది ముఖ్యం కాదు.
వాళ్లకు నేను ఎంత పేరు సంపాదించానన్నది ముఖ్యం కాదు.
వాళ్లకు ముఖ్యం
నేను బాగున్నానా లేదా అన్నది.
నేను అలసిపోయానా?
నేను నిశ్శబ్దంగా బాధపడుతున్నానా?
నా నవ్వు వెనక దాచిన దుఃఖం ఉందా?
అది వాళ్లు గుర్తిస్తారు.

నిజానికి…
మనల్ని పూర్తిగా తెలిసి కూడా మనతో ఉండే వాళ్లు ఉంటే
అది జీవితంలో అత్యంత గొప్ప వరం.
ఎందుకంటే చాలామంది మన బలాలను ప్రేమిస్తారు.
కొంతమంది మన విజయాలను ప్రేమిస్తారు.
కానీ చాలా కొద్దిమంది మాత్రమే
మన బలహీనతలను కూడా అంగీకరిస్తారు.
అదే అసలైన ఆత్మీయత.

నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను
నెట్‌వర్క్ అనేది పరిచయాల విస్తరణ కాదు.
అది ఆత్మీయత యొక్క స్థిరత్వం.
ఫోన్‌లో సేవ్ చేసిన నంబర్లు కాలంతో మారిపోతాయి.
కొన్ని డిలీట్ అవుతాయి.
కొన్ని ఉపయోగం లేక మసకబారిపోతాయి.
కానీ హృదయంలో సేవ్ చేసిన మనుషులు
వాళ్లు కాలానికి అందరు.

నేను ఎప్పుడో ఒకరోజు
అన్ని పాత్రల నుండి బయటకు వచ్చి
కేవలం ఒక మనిషిగా మిగిలిపోయినప్పుడు
నా పక్కన నిలబడే వాళ్లే
నా అసలైన సంపద.
వాళ్లే నా శ్వాసలో భాగం.
వాళ్లే నా కథలో నిశ్శబ్ద అక్షరాలు.
నిజంగా చెప్పాలంటే
నేను ఎలా ఉంటానో పూర్తిగా తెలిసి కూడా
నాతో ఉండటమే ఒక ప్రేమ.
ఆ ప్రేమను సంపాదించడం
జీవితంలో అత్యంత గొప్ప సాధన.
అదే నా నెట్‌వర్క్.
అదే నా జీవితం.
.
.
.
.
.
.
రఘు మందాటి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫోన్‌బుక్..! ప్రతి నంబరూ ఆత్మీయం కాదు, అవసరమైతే పలకరించదు..!!
  • పరకాల ప్రభాకర్… కేంద్ర ఆర్థికమంత్రి భర్తకు ఎక్కడో ఏదో దెబ్బ తిన్నది…
  • కేరళం..! ఎందుకు ఈ పేరు మార్పిడి..? ఈ పేరులో అర్థమేమిటి..?
  • రాయల్ టైగర్‌కు ఓ మాంసం ముక్క… ఆడిట్ వాడు పట్టేసుకున్నాడు…
  • పాటలు, డాన్సులు, యాక్షన్, స్టయిల్… ఫక్తు చిరంజీవి మార్క్ మూవీ…
  • తాజ్ హోటళ్ల నడుమ స్కై బ్రిడ్జ్… ఆసక్తి కలిగించే ఓ వార్త కథ..!!
  • గణపతి సైతం..! మావోయిస్ట్ పార్టీ చివరి వికెట్ కూడా త్వరలోనే..!!
  • ఆట వస్తువుల ఓ చిన్న వ్యాపారి… ట్రంపును నేల మీదకు దించాడు…
  • పురస్కారాల పందేరం వద్దు… అవార్డుల వైపు అందరి చూపు..!
  • విజయ్ దేవరకొండ అరటి బోదెలను అడ్డంగా నరకాల్సి ఉంటుంది..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions