.
బెడ్ మీద 5 అడుగుల కుబుసం.. ‘రీనా’ నాగిని స్కెచ్ రివర్స్…! నేటి కాలంలో ప్రేమ కోసం ప్రేమికులు ఏం చేస్తున్నారు..? పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని తెలిస్తే, ఏదో ఓ సమయం చూసి, లగేజీ సర్దుకుని, ఇంటి నుంచి జంప్… లోకల్ ట్రైన్ నుంచి విమానం వరకు ఎక్కేస్తున్నారు, లేచిపోతున్నారు…
కానీ.. ఈ యూపీ పాప మాత్రం ఏకంగా క్రియేటివిటీతో ‘ఇచ్ఛాధారి నాగిని’ అవతారం ఎత్తేసింది… అనగా ఎత్తు వేసింది అని… ఉత్తరప్రదేశ్‌లోని ఔరయా జిల్లా, సింగనాపూర్ గ్రామంలో రీనా (24) అనే యువతి వేసిన స్కెచ్ చూస్తే పోలీసులే “వామ్మో.. ఈవిడ గ్రేట్ సామీ” అంటున్నారు…
Ads
ఉదయాన్నే రూమ్‌లో నాగిని సీన్! ఫిబ్రవరి 10, 2026, మంగళవారం, ఉదయం.. ఇంట్లో వాళ్ళు రీనా తలుపు కొట్టారు… ఎంతకీ తీయకపోవడంతో లోపలికి వెళ్లి చూస్తే… గుండె ఆగినంత పనైంది! అక్కడ బెడ్ మీద రీనా లేదు… కానీ దుస్తుల మధ్య 5 అడుగుల పొడవైన పాము కుబుసం (Snake Skin) చుట్టేసి ఉంది… పక్కనే కొన్ని గాజులు, సింధూరం చిమ్మేసి ఉన్నాయి…
అంతే… “రీనా నాగినిగా మారిపోయి ఎటో వెళ్ళిపోయింది” అని ఊరంతా దండోరా… ప్రచారం… జనం కూడా ఔరా అనుకున్నారు… కానీ కథ అక్కడితే ఆగిపోతే వార్త ఏముంటుంది..? పోలీసులు లైట్ తీసుకోరు కదా…
అమ్మాయి పక్కా ప్లాన్.. ఇవే సాక్ష్యాలు! తల్లిదండ్రులకు అనుమానమొచ్చింది… పోలీసుల్ని పిలిచారు… పోలీసులు రంగంలోకి దిగి ఆరా తీస్తే రీనా గారి ‘సినిమా మెదడు’ బయటపడింది… అసలేం జరిగిందంటే…
-
గుడి నుంచి విగ్రహం..: రీనా గత 3 నెలల నుంచే ఈ ప్లాన్ వేస్తోంది… మైన్‌పురి జిల్లాలోని శేషనాగ్ గుడి నుంచి ఒక నాగదేవత విగ్రహాన్ని తెచ్చి, రోజూ తన కలలో పాములు వస్తున్నాయని బిల్డప్ ఇచ్చింది… ఆ విగ్రహం తన కథకు కనెక్టింగ్ లింక్ అన్నమాట… (జీటీవీ సీరియళ్లు బాగా చూసేదేమో పిల్ల…)
-
తల్లి ఫోన్ వినియోగం…: తన ఫోన్ వాడితే పోలీసులు పట్టుకుంటారని, రీనా తన తల్లి ఫోన్ నుంచే ప్రియుడితో మంతనాలు సాగించేది…
-
అరెంజ్డ్ మ్యారేజ్ కష్టాలు…: ఇంట్లో వాళ్ళు రీనాకు వేరే సంబంధం చూశారు… ఆ పెళ్లి ఇష్టం లేక, తన పాత ప్రియుడితో కలిసి ఈ ‘నాగిని డ్రామా’ ఆడి చెక్కేసింది…
పోలీస్ పంచ్: “మేము వెతుకుతోంది మనిషిని, నాగినిని కాదు!” పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అజయ్ కుమార్ బృందం ఈ కుబుసాన్ని చూడగానే అది ఎవరో తెచ్చి పెట్టిందని పసిగట్టాడు… “రీనా బానే ఉంది.. ఆమె ఎక్కడికీ పామై వెళ్ళలేదు, ప్రియుడితో కలిసి జంప్ అయింది” అని తేల్చేశాడు… మూఢనమ్మకాలను వాడుకుని ఊరిని నమ్మించాలనుకున్న రీనా ప్లాన్‌ని పోలీసులు అలా చిత్తు చేశారు…
ముచ్చటగా ఒక మాట…: ప్రేమించాలి… దాన్ని గెలిపించుకోవాలి… అంతే కానీ, ఇలా పాములని, కుబుసాలని నమ్ముకుని జనాల్ని పిచ్చోళ్లను చేయాలనుకుంటే చివరికి ఆ ప్రేమకథలు ఇలాగే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది… దొరికిపోతే ఉస్స్ ఉస్స్ అంటూ ఉత్తుత్తి బుసలే మిగులుతాయి…
Share this Article