.
Subramanyam Dogiparthi …. Beauty of democracy ఏంటంటే… డ్రైవర్లు మంత్రులు అయ్యారు , ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రులు , చాయ్ అమ్ముకున్నవారు ప్రధాన మంత్రులు అయ్యారు . సామూహిక రేపులు , కబ్జాలు , మర్డర్లు , వగైరా చేసినోళ్ళు MLA , MLC , పార్లమెంట్ సభ్యులు అయ్యారు , అవుతున్నారు .
1991 లో ఒక ఊపు ఊపిన ఈ భారత్ బంద్ సినిమాలో కిళ్ళీలు కట్టే కొండయ్య తలకాయలు తీసేయటంతో తన ప్రస్థానం ప్రారంభించి, చేయని అఘాయిత్యం లేకుండా ముఖ్యమంత్రి అయిపోతాడు .చివరకు ప్రధానమంత్రి కూడా అవుదామనుకుంటాడు .
Ads
అర్హత లేనివాళ్ళు అందలం ఎక్కితే ఎలా ఉంటుందో చూపటమే ఈ సినిమా లక్ష్యం అని ప్రారంభంలోనే వాయిస్ ఓవర్ వస్తుంది . అలాగే సాగుతుంది సినిమా . తలకాయలు తీసేవాడు ముఖ్యమంత్రి అయితే మంత్రులు , సలహాదారులు ఎవరవుతారో ఊహించవచ్చు .
అలాంటి అరాచక ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడే ప్రజాస్వామ్య రక్షకులుగా కొందరు యువ అతివాదులు , చట్టం ముందు ముఖ్యమంత్రి అయినా అతని బావమరిది అయినా ఒకటే అనే చిరు పోలీస్ ఇనస్పెక్టర్ , ఓ లెక్చరర్ ఝాన్సీ సమిష్టి ఉద్యమమే ఈ భారత్ బంద్ సినిమా . బహుశా ఈ సినిమా చూడనివారు ఉండరేమో !
ఈ సినిమా కాస్ట్యూమ్స్ కృష్ణది . సాదాసీదా కాస్ట్యూమ్స్ డిజైనర్ కృష్ణ నటుడిగా ఓ వినూత్న పంధాలో నటించారు . అతని డైలాగ్ డెలివరీ , చేతులు పైకెత్తే మేనరిజం , ప్రతీ కదలిక అద్భుతం . అతని తర్వాత చెప్పుకోవలసింది అశోక్ కుమార్ ముఖ్యమంత్రి బావమరిదిగా బ్రహ్మాండంగా నటించారు . ఇద్దరూ తమ నట విరాట రూపాన్ని చూపారు . ఇద్దరికీ మొదటి సినిమాయే ఇది .
ఇనస్పెక్టరుగా వినోద్ కుమార్ , అతని భార్యగా లెక్చరర్ ఝాన్సీగా ఊర్వశి అర్చన , అతివాదిగా రెహమాన్ చాలా గొప్పగా నటించారు . రచయిత జొన్నవిత్తుల ఈ సినిమాలో నిరుద్యోగ యువకుడిగా తళుక్కుమంటారు . ఇతర ప్రధాన పాత్రల్లో చలసాని కృష్ణారావు , బాబూమోహన్ , కోకా రాఘవరపు , సుధారాణి తదితరులు నటించారు
సినిమా అంతా హైదరాబాదులోనే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు . చాలామంది చిన్న చిన్న నటులే . చాలా బిర్రయిన స్క్రీన్ ప్లేతో నడిపించిన ఈ సినిమా సుమారు పది కేంద్రాలలో వంద రోజులు ఆడింది . వంద రోజుల ఫంక్షనుకి యన్టీఆర్ , చిరంజీవి ముఖ్య అతిధులుగా విచ్చేశారు .

సినిమాలో చాలా ధైర్యంగా సారాయి అమ్మకాలు , సారాయి కొంటేనే రేషన్ , వ్యభిచారానికి చట్టబధ్ధత వంటి సంస్కరణలను ప్రభుత్వం తెచ్చినట్లు చూపారు . మన అదృష్టం ఏమిటంటే ఇంకా వ్యభిచారాన్ని చట్టబధ్ధం చేసే ప్రభుత్వం ఏమీ రాలేదు దేశంలో . పర్యాటక రంగ అభివృద్ధికి లాస్ వెగాస్ లోలాగా ఆటలు , అమ్యూజ్మెంటులు ఆదానీ , అంబానీ , విజయ్ మాల్యా వంటి ప్రగతిశీల పారిశ్రామికవేత్తలు ప్రతిపాదిస్తే వచ్చినా రావచ్చు .
ఆరోజుల్లో ఊరకూరకే హైదరాబాద్ నగరంలో మత కల్లోలాలు వస్తుండేవి . వాటిని , ఆ మత కల్లోలాలని హిందూ ముస్లింల మధ్య ఎలా రాజేస్తారో కూడా ధైర్యంగా చూపారు . ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏమిటంటే డ్యూయెట్లు లేవు , ఫిమేల్ సింగర్స్ కూడా లేరు . మాటల్ని పాటల్ని జొన్నవిత్తుల వారే వ్రాసారు . అన్నింటినీ బాలసుబ్రమణ్యమే పాడారు . ప్రతీ పాట ఎర్రముత్యమే . అరెరెరెరె దేశమిట్టా తగలడిపోతుంది ఏ వంగపండో , జాలాదో వ్రాసారనుకుంటారు . జొన్నవిత్తుల ఇంత ఎర్రగా వ్రాయటం ఆశ్చర్యమే .
మత సామరస్యాన్ని ఆవిష్కరించే కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా దేశమాత బిడ్డలం పాట చాలా బాగా ఉంటుంది . స్వతంత్ర భారతాన మరో జులియన్ వాలా బాగ్ అంటూ సాగే విషాద పాట , తప్పు లేదు ఒప్పు లేదు అంటూ సాగే పాట చాలా బాగుంటాయి . బహుశా ఫిమేల్ సింగర్ లేకుండా తీయబడిన సినిమా ఇదేనేమో !
ఎన్ని సినిమాలు వచ్చినా , మరెన్నో ప్రవచనాలు చెప్పినా నానాటికి తీసికట్టు నాగంభొట్లు సామెతే అయిపోయింది సమాజం . సామాజిక , రాజకీయ విమర్శనాత్మక సినిమాలు కూడా ఇప్పుడు కరువైపోయాయి . ఇంతకముందు చూసి ఉన్నా మరలా చూడతగ్గ సినిమాయే . కాస్ట్యూమ్స్ కృష్ణ నటన కోసమయినా మరోసారి చూడవచ్చు …
Share this Article