Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పోటాపోటీగా తాయిలాలు… రాజకీయాల్లో మాత్రం వెకిలి కూతలు…

March 27, 2026 by M S R

·

( తోట భావనారాయణ ) …. తమిళనాడులో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ విమర్శలకు మహిళలే టార్గెట్ అవుతున్నారు. కొత్తగా పార్టీ పెట్టిన నటుడు విజయ్ ను అవమానించే క్రమంలో నటి త్రిష గురించి బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపాయి. ఆ తరువాత నామమాత్రంగా విచారం వ్యక్తం సరి పెట్టారు.

అది జరిగిన కొద్ది రోజులకే అన్నా డీఎంకే నాయకుడొకరు స్టాలిన్ వాగ్దానానికి వక్ర భాష్యం చెబుతూ మరో నయనతార పేరు ప్రస్తావించారు. ఇలా మహిళల్ని అవమానించటం తమిళనాట కొత్తేమీ కాదు. నాయకుల బాహుభార్యత్వం మొదలు వివాహేతర సంబంధాల దాకా ఆరోపణలకు ముడి సరకు కావటం అక్కడ ప్రత్యేకత.

Ads

కరుణానిధి బ్రతికి ఉన్నంత కాలం ఆయన భార్యల మీద అన్నా డీఎంకే కామెంట్స్ చేస్తూనే ఉండేది. ముగ్గురు భార్యలంటూ తరచూ ప్రస్తావించేది. . మొదటి భార్య పద్మావతి చనిపోయాక ఆయన దయాళు అమ్మాళ్ ను చేసుకున్నారు. ఆమెకు అళగిరి (గతంలో కేంద్ర మంత్రి), స్టాలిన్ ( ఇప్పటి ముఖ్యమంత్రి), తమిళరసు అనే ఇంకో కొడుకు, సెల్వి అనే కూతురు ఉన్నారు.

హిందీ వ్యతిరేకోద్యమంలో పరిచయమైన రాజాత్తి అమ్మాళ్ ఇంకో భార్య. ఈమె కూతురే కనిమొళి. ( ఒకప్పుడు ది హిందూలో సబ్ ఎడిటర్, ఆ తరువాత ఎంపీ. 2 జి స్కామ్ లో ఏడాదిపాటు జైల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఎంపీ).

కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉండగా పార్టీ కార్యకర్తలు తమ పనులు కావటం లేదంటూ ఫిర్యాదు చేశారు. “నా ఇంటికో కార్డు ముక్క రాయండి చాలు, నే చూసుకుంటా” అని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. వెంటనే జయలలిత “ ఏ ఇంటికి?” అని ప్రశ్నించారు. నిజానికి ఇద్దరు భార్యల ఇళ్ళ దగ్గరా పోలీస్ సెక్యూరిటీ ఉండటం రహస్యమేమీ కాదు.

అయితే, జయలలిత ప్రశ్నతో ఇరుకునపడ్డ కరుణానిధి “నా సంగతి సరే, ఇంతకీ నిన్ను కుమారి అని సంబోధించాలా? శ్రీమతి అని సంబోధించాలా?” అంటూ ఎదురు ప్రశ్న వేశారు. కరుణానిధి లాంటి పెద్దమనిషి అలా మాట్లాడటం మీద అప్పట్లో చాలా విమర్శలొచ్చాయి.

ఎంజీ రామచంద్రన్ కూడా ఇద్దరు భార్యలు చనిపోయాక హీరోయిన్ జానకితో ప్రేమలో పడ్డారు. రెండో భార్య చనిపోకముందే ప్రేమించుకున్నారని చెప్పుకుంటారు. అప్పటికే పెళ్ళయిన జానకి తన భర్తకు విడాకులిచ్చాక ఎమ్జీఆర్ ను పెళ్లి చేసుకున్నారు. ఎమ్జీఆర్ చనిపోయాక 24 రోజుల పాటు ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఎమ్జీఆర్ సరసన నటించిన మరో హీరోయిన్ జయలలిత ఆయనకు రాజకీయ శిష్యురాలయ్యారు. పార్టీ ప్రచారకార్యదర్శిగా దూసుకుపోతున్న సమయంలో ఉన్నట్టుండి పక్కనబెట్టటం, ఇంటికే పరిమితం కావాల్సి రావటం జయలలితను బాధించింది. ఎమ్జీఆర్ సన్నిహితులందరూ అప్పటిదాకా పొగిడినా, వెంటనే ప్లేట్ ఫిరాయించి జయలలిత మీద దుమ్మెత్తి పోశారు.

అప్పట్లో చంద్రలేఖ అనే ఐఎఎస్ అధికారిణి మదురై కలెక్టర్ అయ్యారు. తమిళనాడుకు రెండో మహిళా కలెక్టర్ గా ఆమె గురించి చెప్పుకునేవారు. ఎమ్జీఆర్ ప్రత్యేకంగా ఆమెకు ఆ పోస్ట్ ఇచ్చారనే ప్రచారం జరిగింది. ఆమె సూచన మేరకే తనను పక్కనబెట్టారని జయలలిత కూడా నమ్మారని కూడా చెప్పుకునేవారు. జయలలిత అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి సంస్థ సీఎండీగా ఉన్న చంద్రలేఖ మీద యాసిడ్ దాడి జరిగింది. అందమైన చంద్రలేఖను అందవిహీనంగా మార్చిన యాసిడ్ దాడి వెనుక సీఎం జయలలిత ఉన్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

చంద్రలేఖ తన ఉద్యోగానికి రాజీనామా చేసి సుబ్రహ్మణ్యస్వామి పిలుపు మేరకు జనతా పార్టీలో చేరి తమిళనాడు శాఖకు అధ్యక్షులయ్యారు. జయలలిత జైలుకెళ్ళటానికి కారణం.. తమిళనాడు ప్రభుత్వం కాదు.. స్వామి, చంద్రలేఖ పెట్టిన అవినీతి కేసులే. అయితే, సుబ్రమణ్య స్వామి గాని చంద్రలేఖ గాని జయలలితమీద వ్యక్తిగత విమర్శలు చేయలేదు.

ఒకసారి రిపోర్టర్లు ఆమె వివాహితేనా అని అడిగితే. నేనలాంటి విషయాలు మాట్లాడను. మాట్లాడితే I may win the battle but lose the war అన్నారాయన. ఆమె అవినీతి మీద పోరాడతానే తప్ప వ్యక్తిగత దాడితో తాత్కాలికంగా పైచేయి సాధించటం తన లక్ష్యం కాదని స్పష్టంగా చెప్పారు. ఆ విధంగా సుబ్రమణ్య స్వామి, చంద్రలేఖ చాలా balanced గా ఉన్నట్టు లెక్క.

జయలలిత బ్రతికి ఉన్నంత కాలం ఆమె మీద అభాండాలు మోపుతూ మాట్లాడించటం డీఎంకే కి అలవాటై పోయింది. పార్టీ సభల్లో మాట్లాడటానికి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి వక్తలను సిద్ధం చేయటం పార్టీకి అలవాటు. వాళ్ళకు ట్రెయినింగ్ ఇచ్చి, ఎవరు ఏయే అంశాలు మాట్లాడాలో కూడా చెప్పేవాళ్ళు. గ్రామస్థాయి నాయకులైతే బాగా దిగజారి మాట్లాడవచ్చని అర్థం.

“ఒక తెలుగు తల్లికి, కన్నడ తండ్రికి పుట్టి ఇంకో తెలుగు నటుడితో సహజీవనం చేసిన ఆవిడా మనల్ని పాలించేది?” అంటూ వాళ్ళ ప్రసంగాలు సాగేవి. ఇలాంటి దారుణమైన మాటల్ని సైతం పట్టించుకోకుండా జయలలిత ఎంత మొండిగా ముందుకు సాగారో అర్థం చేసుకోవాలి. అసెంబ్లీలోనే సాగిన దుశ్శాసన పర్వం కూడా డీఎంకే తీరుకు అద్దం పట్టింది.

ఎమ్జీఆర్ ఒకప్పుడు భాగ్యరాజ్ ను తన నటనావారసుడు అని చెప్పినందుకు ఆయన చనిపోయిన కొద్ది నెలలకే భాగ్యరాజ్ ఆయన పేరు మీద పార్టీ పెట్టాడు. అయితే, భాగ్యరాజ్ తన భార్య (నటి) కి విడాకులిచ్చి ఇంకో నటి పూర్ణిమను పెళ్ళి చేసుకోవటాన్ని ప్రస్తావిస్తూ, పెళ్ళిళ్ళలోనూ నువ్వు వారసుడివే అని వెటకారం చేశారు.

ఆ తరువాత కాలంలో శరత్ కుమార్ విషయం కూడా వార్తల్లోకెక్కింది. అప్పటికే కొన్నాళ్ళు నగ్మాతో ప్రేమవ్యవహారం నడపటం గురించి పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వార్తలొచ్చాయి. ఆ తరువాత రాధిక దగ్గరవుతున్న క్రమంలో ఆయన తన భార్యకు విడాకు లిచ్చారు. అప్పటికే రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న రాధిక వల్ల తమ కుటుంబంలో వచ్చిన మనస్పర్థలే విడాకులకు దారితీశాయని అప్పట్లో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా ఆరోపించారు.

శరత్ కుమార్ డీఎంకేలో చేరటాన్ని రాధిక ప్రోత్సహించినప్పుడు అన్నాడీఎంకే వాళ్ళు రాధిక పెళ్ళిళ్ళ మీద దారుణమైన ఆరోపణలు చేశారు. డీఎంకే ఆయనను రాజ్యసభకు పంపినా 2006లో రాజీనామా చేసి మళ్ళీ వీళ్ళిద్దరూ జయలలిత పంచన చేరినప్పుడు డీఎంకే కూడా వీళ్ళ మీద అలాంటి చౌకబారు విమర్శలే చేసింది.

కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు కూడా ఆయన పెళ్ళిళ్ళ మీద విమర్శలు వచ్చాయి. మొదట వాణీ గణపతిని, ఆ తరువాత సారికను పెళ్ళి చేసుకున్న కమల్ హాసన్ ఆ బంధాలు తెగతెంపులు చేసుకొని కొంత కాలం మరోనటి గౌతమితో సహజీవనం నెరపటం రహస్యమేమీ కాదు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనా, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ ప్రస్తావన తెరమీదికి తెచ్చినవాళ్ళున్నారు.

ఇప్పుడు తాజాగా త్రిష మీద దాడి మొదలైంది. ఆమె తనను తాను జయలలితతో పోల్చుకోవటం, సీఎం కావటం తన లక్ష్యమని చెప్పటం ఆమె మీద వ్యాఖ్యలకు కారణం. ఇంకోవైపు విజయ్ భార్య కోర్టుకెక్కి, పేరు చెప్పకుండానే త్రిష గురించి ప్రస్తావించటం, వ్యక్తిగత దాడికి దిగటం చూస్తున్నాం.

ముందుగా విజయ్.. త్రిషను వదిలిపెట్టాలంటూ బీజేపీ నాయకుడు నాయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎమ్జీఆర్ తరహాలో విజయ్ ముఖ్యమంత్రి కాకముందే ఈమె జయలలితతో పోల్చుకోవటమేంటని చెవులు కోరుక్కుంటున్నవాళ్ళ సంఖ్య కూడా తక్కువేమీ లేదక్కడ.

ఇంకోవైపు అందరి కోర్కెలూ తీరుస్తానన్న స్టాలిన్ హామీకి పెడర్థాలు తీస్తూ, “ నేను నయనతారను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నా కోర్కె తీరుస్తావా?” అంటూ అన్నా డీఎంకే ఎంపీ షణ్ముగం చేసిన వెకిలి వ్యాఖ్య కూడా ఎన్నికల వేళ దుమారం రేపింది. ఈ రెండు విషయాల్లోనూ ఎన్డీయే కూటమి ఇరకాటంలో పడినా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై మాత్రం ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలను ఆపలేని డీఎంకే పాలన గురించి మాట్లాడాలి గాని ఈ వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యమివ్వటమేంటని ప్రశ్నిస్తున్నారు.

అత్యాచారానికి గురైన ఒక యువతి 16 కిలోమీటర్లు నడిచి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంచలన ఘటనను ఆమె ప్రస్తావించారు. ఒరు వార్తైక్కు కండనమ్ తెరివిత్తవరగళెల్లామ్ ఒరు వాళ్కైక్కు కండనం తెరివిక్కవిల్లయే (ఒక వ్యాఖ్యను ఖండించిన వాళ్ళు ఒక జీవితం పోయినప్పుడు ఖండించలేదే) అంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు.

ఈసారి రాజకీయ నాయకుల వ్యాఖ్యల్లో మహిళల ప్రస్తావన బాగా పెరగటం మీద తమిళనాడులో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఒకవైపు ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తూనే పోటాపోటీగా మహిళలకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. మహిళలకు ఇప్పుడు నెలకు వెయ్యి ఇస్తుండగా దాన్ని 2 వేలు చేస్తానని, కుటుంబానికి 5 వేలు ఏకమొత్తంగా నగదు బదలీ చేస్తామని డీఎంకే చెబుతోంది, తాము కూడా మహిళలకు నెలనెలా రెండు వేల చొప్పున, కుటుంబానికి ఏకమొత్తంగా 2 వేలు ఇస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది.

విజయ్ ఇంకో అడుగు ముందుకేసి మహిళలకు నెలకు 2,500 చొప్పున ఇవ్వటంతోబాటు పెళ్ళికూతురికి 8 గ్రాముల బంగారం ఇస్తానంటున్నాడు. ఇంకో నాలుగు వారాల్లో జరిగే ఎన్నికల ఫలితాల మీద ఈ తాయిలాల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. – తోట భావనారాయణ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెద్ద నెట్‌వర్క్..! భీతిగొలిపే మల్టీ లేయర్ కార్పొరేట్ టెర్రర్ మోడల్..!!
  • IPL 2026…! ఈ సీజన్‌లో ఎందుకు అంబానీ టీమ్ ఫ్లాప్ గేమ్..?
  • ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ… తమిళులకు కన్నడ ఫ్యాన్స్ వెక్కిరింపులు…
  • ఈ జడ్జి వద్దన్నాడు కదా కేజ్రీవాల్‌..! తరువాత ఏమైందంటే..?
  • … మూలిగే తెలంగాణ బీజేపీపై కన్నడ తేజస్వి సూర్య పోటు…
  • ఎవరి కోసం ఈ సీట్ల పెంపు..? ప్రజలకు ఏం ప్రయోజనం..?
  • నాటి పారుపల్లి రామకృష్ణయ్యే శంకరాభరణం శంకరశాస్త్రి…
  • దొంగ మొగుడిలాగే రౌడీ అల్లుడు… పక్కా చిరంజీవి మార్క్…
  • అవునూ… హఠాత్తుగా ఈ కులగణన తెరపైకి తెచ్చారెందుకు భయ్యా..?!
  • చైనాలో ఏం జరుగుతోంది..? వంద మంది సైనిక జనరల్స్ గల్లంతు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions