.
శ్రీనివాసరావు మంచాల ….. 30 ఏళ్ల క్రితం… అప్పట్లో ఈనాడు మీదే రామోజీరావు ఫుల్ కాన్సంట్రేషన్… ప్రతి జిల్లా సర్క్యులేషన్, యాడ్స్ ప్రగతి మీద మూడు నెలలకోసారి స్వయంగా సమీక్ష జరిపేవాడు… ప్రతి ప్రింటింగ్ యూనిట్‌కు తనే వెళ్లేవాడు… సమీక్షకు ముందే జిల్లా రాజకీయ పరిస్థితుల మీద కూడా రిపోర్ట్ తీసుకునేవాడు… ప్రతి అక్షరమూ చదివేవాడు…
జిల్లా పేజీల్లో ఏమేం వార్తలు ఎలా వస్తున్నాయో కూడా సీరియస్ పరిశీలన ఉండేది తనది… ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే..? ఎస్, 30 ఏళ్ల క్రితం… బహుశా అది 1994… మామూలుగా స్టాఫ్ రిపోర్టర్లు, డెస్క్ సబ్‌ఎడిటర్లు, న్యూస్‌టుడే ఎండీ, యూనిట్ మేనేజర్లు మాత్రమే సమీక్ష సమావేశాల్లో ఉండేవాళ్లు… కానీ ఆరోజు ముఖ్య కంట్రిబ్యూటర్లను కూడా రమ్మన్నాడు…
Ads
అదుగో ఆ మీటింగుకు నేను కూడా వెళ్లాను, చేర్యాల కంట్రిబ్యూటర్‌గా… ఏవేవో అంశాల ప్రస్తావన వచ్చాక అప్పటి డెస్క్ ఇన్‌చార్జి రామస్వామి… డెస్కులో షఫీ, క్రాంతి, సోమిరెడ్డి… స్టాఫర్ అన్నమనేని శ్రీరాం… ఓ ప్రస్తావన వచ్చింది… 3 రోజుల్లో లక్షల మంది ఆదివాసీ, గిరిజన భక్తగణం భక్తితో దర్శించే సమ్మక్క- సారలమ్మ గద్దెల గురించి… ఎడ్లబళ్ల వరుసలు, తాత్కాలిక గుడారాల గురించి… గర్భగుడులు, విగ్రహాలు లేని విశిష్ట పూజల గురించి…
కాసేపు రామోజీరావు నిశ్శబ్దం… ఓ పనిచేద్దామా… అంత పెద్ద జాతర అంటున్నారు కదా, హెలికాప్టర్ పెట్టి ఫోటోలు తీయిద్దామా? ప్రపంచానికి ఆ జాతర స్పెషాలిటీని బలంగా ప్రదర్శిద్దాం అన్నాడు… ఆ మీటింగులో ఫుల్లు సైలెన్స్… జాతర ఫోటోల కోసం హెలికాప్టర్లు పెడదామా అన్న ఆ ప్రశ్న… రామోజీరావులోని నిజమైన జర్నలిస్టును మాకు చూపించింది… (అందుకే ఈనాడును ఈ స్థాయిలో నిలిపాడు తను)…

ఈనాడుకు సంబంధించి తను అంతే… దేనికైనా రెడీ అనేవాడు… ఖర్చు కాదు, ఈనాడు మార్క్ ముద్ర ఉండాల్సిందే… గ్రేట్ పర్సనాలిటీ..! డెస్క్ ఇన్‌ఛార్జి చెప్పాడు… ‘‘మ్యాగ్జిమం కవరేజీ ఇస్తాం, ఫోటోలూ అంతే…‘‘ తరువాత ఓ టీమ్ ఫామ్ చేశారు, సహజంగానే నేను… ప్రస్తుతం ఏబీఎన్ డిబేటర్ వెంకటకృష్ణ (అప్పట్లో గోవిందరావుపేట కంట్రిబ్యూటర్), ఫోటోగ్రాఫర్ బషీర్… టీమ్‌లో పరకాల రాజేశ్వర్, ములుగు కోటేశ్వరరావు, చెన్నారావుపేట మల్లేశం గుర్తున్నారు…
రేపు జాతర స్టార్ట్ అనగా… డెస్క్ ఇన్‌చార్జి రామస్వామి మేడారం దాకా వచ్చి, ఆ దుమ్ము, ఆ జనం, ఆ సందోహం చూసి… వెంటనే వాపస్ వెళ్లిపోయాడు… అప్పట్లో గద్దెలు, ఓ పక్కన నాలుగు ఎండోమెంట్స్ వాళ్ల రూమ్స్… చుట్టుపక్కల చూడటానికి ఎత్తుగా ఓ పోలీస్ ఔట్ పోస్ట్… అంతే, ఇంకేమీ ఉండేవి కావు… ఎత్తయిన చెట్లు, కాస్త దూరంలో కొండరెడ్ల చిన్న చిన్న ఊళ్లు…
జాతర సమయానికి వందల దుకాణాలు… కోళ్లు, మేకలు, పందులు, బంగారం (బెల్లం), చిన్నాచితకా తినుబండారాలు… జాతర అంటే అంతే కదా… ఆర్టీసీ ప్రత్యేక బస్సులు… అప్పటికి జంపన్నవాగుపై వంతెన కూడా లేదు… (తరువాత ప్రభాకర్‌రెడ్డి కలెక్టర్‌గా వచ్చాక కొన్ని రోజుల్లోనే బ్రిడ్జి కట్టించి రికార్డు క్రియేట్ చేశాడు…)
తెలిసిన ఎండోమెంట్ ఏసీ అప్పట్లో మేడారం ఇన్‌చార్జి… (పేరు గుర్తులేదు, నాకే పరిచయం, కొమురవెల్లి ఈవోగా చేశాడు కాబట్టి)… ఓ రూమ్‌లో బ్యాగులు వేసేశాం… (అప్పట్లో ఈనాడుకు ఎండోమెంట్స్ దాసోహం అని ఎవరో వేరే పత్రికలో వార్త కూడా రాసినట్టు గుర్తు…) మరోవైపు దేవరుప్పుల శర్మ ఎండోమెంట్స్ శాఖ తరఫున వచ్చాడు…

వాళ్లకు అప్పట్లో ఓ ప్రత్యేక టెంట్… అక్కడే భోజనం… నిర్బంధంగా మేమూ అక్కడికే వెళ్లి తినేవాళ్లం… లేకపోతే వేరే మన కడుపులు జీర్ణం చేసుకునే తిండి దొరకదు… రామోజీరావు హెలికాప్టర్ పెడతాను ఫోటోల కోసం అన్నాడు… మరి ఈ ఇంపాక్ట్‌ఫుల్ ఫోటోలు కావాలి ఎలా..?
ఓ ఐడియా స్ట్రయికైంది… రంగులరాట్నం… అది ఎక్కి, తను ఎక్కిన బాక్స్ పైకి వెళ్లాక ఆపాలని కోరాం… అక్కడి నుంచి నలువైపులా ఫోటోలు… ఇంకేం..? చుట్టూ వందలు, వేల ఎడ్ల బళ్లు, అవే గుడారాలు… కానీ ఫోటోలు, వార్తలు పంపాలంటే ఎలా..? అప్పటికి మేడారానికి ఫోన్ లైన్లే లేవు… కంప్యూటర్లు పెట్టి కంపోజింగ్ చేసే సీన్ లేదు… అందుకని వార్తలు రాసిన చేతిప్రతులు, అప్పటికప్పుడు కట్ చేసి బ్లాక్ పేపర్‌లో చుట్టిన ఫోటో రీల్స్…
అవి ఓ రిపోర్టర్ పట్టుకుని, ఆ జనంలో పడి అయిదారు కిలోమీటర్ల దూరం పరుగు తీసి, ఓ మోటార్ సైకిల్‌కు ఇస్తే, అక్కడి నుంచి తాడ్వాయిలో ఆగిన ఈనాడు వెహికిల్‌కు అందిస్తే… అక్కడి నుంచి కరీంనగర్‌కు వెహికిల్ స్పీడుగా… అదొక పెద్ద ప్రయాస… ఇప్పటికీ నాటి కవరేజ్ తీరు తలుచుకుంటే ఈరోజుకూ ఓ విభ్రమ… ఓ మెమరీ… ఓ నాస్తాల్జియా…

తెల్లవారి ఈనాడులో ‘మేడారం- గిరిజన భక్త గుడారం’ హెడింగుతో ఫుల్ లెంత్ బ్యానర్… వేరే పత్రికలు దరిదాపుల్లో లేవు… పొద్దున్నే ఈనాడు కాపీలను జాతర దాకా పంపిచేవాళ్లు… ఎదురు‘కోళ్లు’, పురిట్లోనే పుట్టువెంట్రుకలు వంటి వార్తలు, శర్మ హెడ్డింగులు… బలులు, మద్య నిషేధంపై కలెక్టర్ ఆంక్షల్ని ఖాతరు చేసేదెవరు..? ‘కలెక్టర్ ముందే కసకసా’ అని ఓ వార్త…
మందు సీసాలు ఇస్తే తప్ప కుదరదని పూజార్లు… పోలీసుల స్వాగత కాల్పులు, వందలు, వేల మంది పడుకుంటే వాళ్ల మీద నడుస్తూ దేవతల్ని తీసుకొచ్చే పూజార్ల సందోహం… పూనకాలు (శిగాలు)… పాఠక ప్రపంచానికి జాతరను అక్షర సాక్షాత్కరం చేశాం… తరువాత మేడారం గిరిజన కుంభమేళాగా మారింది…
ఎప్పుడో అర్ధరాత్రి దేవతలు వస్తారు గద్దెల మీదకు, కానీ తెల్లవారే పత్రికలో కవర్ కావాలి, మరెలా..? ఆల్రెడీ ఓ వార్త రాసి పెట్టడం… దేవతలు గద్దెల మీదకు వచ్చాక, పోలీస్ వైర్‌లెస్ సెట్లలో వరంగల్ కంట్రోల్‌రూమ్‌కి చెప్పించి, అది విని, కరీంనగర్ డెస్క్‌కు ఫోన్ చేసి, కన్‌ఫరమ్ చేస్తే, అప్పటికప్పుడు ఆ వార్త కవర్ చేసేవాళ్లు… పర్‌ఫెక్ట్ ప్లానింగు… (మిగతా పత్రికల ప్రతినిధుల్ని డీపీఆర్వో సమ్మక్క వచ్చిన రోజున మేడారానికి తీసుకెళ్తే, ఆ మరుసటిరోజు ఆ వార్త కవరయ్యేది)…

గిరిజనేతరులు కూడా దర్శించుకోవడం, జాతర రోజుల్లోనే కాదు, మామూలు రోజుల్లో కూడా రెగ్యులర్ దర్శనాలు… కథ మారిపోయింది… ఈరోజు 3 కోట్ల దర్శనాలు…
ఈ జాతర వైభవానికి ఈరోజున రామోజీరావు సంకల్పించిన ‘బహుళ ప్రచారం’ కూడా ఓ ప్రధాన కారణం... సమ్మక్క- సారలమ్మల జాతర ముగిసింది కదా... ఓసారి పాత జ్ఞాపకాల నెమరివేత ఇది..!! ఆనాటి ఆ ప్రచార బృందంలో నేనూ ఉన్నాననే ఓ తలపొగరుతో..!!
Share this Article