.
Mani Bhushan …. బసంతి – ధన్నో – ఫ్రాంకీ …. ఈ మూడు పేర్లు ఇండియాతో లింక్ అయినవి. రెండు పేర్లు ‘షోలే’ సినిమాలో ఉంటాయి. ‘బసంతి’ హేమమాలిని పేరు, ‘ధన్నో’ అనేది బసంతి నడిపే టాంగా గుర్రం పేరు. మూడోదయిన ‘ఫ్రాంకీ’ ముంబైలో స్ట్రీట్ ఫుడ్. వెస్టిండీస్ మొదటి నల్లజాతి కెప్టెన్ ఫ్రాంక్ వోరెల్ (Frank Worrell) గౌరవార్థం 60వ దశకంలో ఒక పంజాబీ వండిన వంటకం పేరు ఫ్రాంకీ.
ఇక్కడి ఫొటోలోని నొరాలి షూమేకర్ (Noraly Schoenmaker) నెదర్లాండ్స్ యువతి. రోడ్ ట్రావెలర్. భలే ధైర్యవంతురాలు. ఎప్పుడూ నవ్వుతూ విసుగు చిరాకు లేకుండా బైక్ డ్రైవ్ చేస్తుంది.
జియోకెమిస్ట్రీలో పిజి చేశాక, పిహెచ్ డికోసం ఆస్ట్రేలియా వచ్చింది. అక్కడి నుంచి న్యూజీలాండ్, ఇండియాల్లో తిరగడంతో… ఈ భూమి మీద అన్వేషించాల్సిన నేల చాలా ఉందని తెలుసుకుంది.
Ads

దాంతో పిహెచ్.డి.కి మంగళం పాడేసింది. తిరగడానికి డబ్బులు కావాలి కాబట్టి, ఆరేడేళ్లు జియాలజిస్టుగా బహమాస్, బ్రెజిల్, కజఖస్థాన్, మొరాకో లాంటి ఏడెనిమిది దేశాల్లో ఉద్యోగం చేసింది. మధ్య మధ్యలో ట్రావెలింగ్ కూడా చేసేది.
హమ్మయ్య, పర్వాలేదు అనుకున్నాక… 2018లో నెదర్లాండ్స్‌లోని ఇంటిని అమ్మేసి… ఇండియాలో దిగింది. బ్రాండ్ న్యూ బులెట్ (రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్) కొనుక్కొని… ‘బసంతి’గా పేరెట్టుకుంది. భారత దేశం సహా పాతిక దేశాల్లో 30 వేల కి.మీ. తిరిగి నెదర్లాండ్స్ వస్తే… అక్కడ సేఫ్టీ ప్రమాణాలకు సరిపోదన్న కారణంతో నెదర్లాండ్స్ ఆర్టీవో నిరాకరించింది. దాంతో లోకల్ రాయల్ ఎన్ఫీఫీల్డ్ డిస్ట్రిబ్యూటర్లతో మాటాడి… బసంతి బదులుగా కొత్త హిమాలయన్ బైక్ తీసుకుంది. ఈసారి బసంతి గుర్రం ‘ధన్నో’ పేరు పెట్టుకుంది.
ఆమె Itchy boots పేరుతో యూట్యూబ్ చానల్ నడుపుతోంది. 32 లక్షల subscribers ఉన్నారు. తన దేశ దిమ్మరి పర్యటన వివరాలన్నింటినీ… ఎప్పటికప్పుడు పోస్టు చేస్తోంది. ఒంటరి ఆడపిల్ల! భిన్న సంస్కృతులు, నేలలు, మనుషుల నడుమ ఇప్పటి వరకు 2,00,000 కి.మీ. పర్యటించింది. మధ్యలో ఓసారి బైకు యాక్సిడెంటులో కాలర్ బోన్ విరగొట్టుకుంది కూడా.
ప్రస్తుతం ఆమె రోడ్ ట్రావెలింగులో సీజన్–8 నడుస్తోంది. బసంతి, ధన్నో తర్వాత ఈ ఆరేడేళ్లలో అయిదారు బైకులు మార్చింది. ఇప్పుడయితే Frankie (Yamaha Tenere XT 600Z) మీద తిరుగుతోంది.
దేశ దిమ్మరి పర్యటన ఎందుకంటే… నొరాలి హైవేలపై తిరగదు. కంట్రీ సైడ్ రోడ్లపైనే బైక్ డ్రైవ్ చేస్తుంది. మట్టి, బురద, రాళ్లతో నిండిన కచ్చా రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకుపోతుంది అచ్చంగా బసంతి టాంగా మాదిరిగానే! ఈ ఒంటరి ఆడపిల్ల నొరాలి షూమేకర్ (Noraly Schoenmaker) గురించి ఇంకా చాలా రాయొచ్చుగానీ, ఇప్పటికే ఎక్కువైంది…
Share this Article