.
వాషింగ్టన్ పోస్ట్ పత్రికది ఓ చరిత్ర… ఒకప్పుడు ప్రజాస్వామ్యానికి కాపలాదారుగా ఘనత… కానీ ఇప్పుడు..? తీవ్ర ఆర్థిక, విశ్వాస సంక్షోభం… పాఠకులు తిరస్కరిస్తున్నారు… సర్క్యులేషన్ భారీగా పడిపోయింది… డిజిటల్ రీడర్స్ సంఖ్యలో పతనం… ఒకే సంవత్సరం 100 మిలియన్ డాలర్ల నష్టం… అంతకుముందు సంవత్సరం 70 మిలియన్ డాలర్ల నష్టం…
ఫలితం… ఒకేసారి 300 మందికిపైగా, అంటే మూడోవంతు జర్నలిస్టులను తీసేశారు… అంటే ప్రతి ముగ్గురిలో ఒకరిని… పలుచోట్ల బ్యూరోలు మొత్తంగా మూతబడ్డాయి… తీసేయబడిన వారిలో శశిథరూర్ కొడుకు ఇషాన్ కూడా ఉన్నాడు… ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రాన్షు వర్మ కూడా..!
Ads
2020 నుండి ఆ పత్రిక 5,00,000 మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది… జనవరి 2021లో 22.5 మిలియన్ల రోజువారీ యాక్టివ్ యూజర్ల గరిష్ట సంఖ్య కాస్తా 2023 మధ్య నాటికి మూడు మిలియన్ల కంటే తక్కువకు పడిపోయింది.., ఇది భయానకమైన 90 శాతం తగ్గుదల… ఇలాంటి సమాచారం చాలా వస్తోంది పత్రిక పతనం గురించి…
2013 ఆగస్టులో 250 మిలియన్ డాలర్లకు అమెజాన్ జెఫ్ బెజోస్ దీన్ని కొన్నాడు… అమెజాన్ ద్వారా కాదు, వ్యక్తిగత పెట్టుబడిగా… అప్పటికే పత్రిక ప్రింట్ ఆదాయం క్షీణిస్తోంది… డిజిటల్ మార్పు అవసరం ఉంది… కానీ బెజోస్ దీన్ని కాపాడతాడనే నమ్మకం ఉండేది సిబ్బందిలో, జర్నలిస్టు లోకంలో…
కానీ బెజోస్ రాజకీయ ధోరణులే ఈ మీడియా సంస్థ పతనానికి ప్రధాన కారణం అని పైకి ఎన్ని విశ్లేషణలు వినిపిస్తున్నా సరే… అసలు ప్రధాన కారణాలు వేరు… ప్రపంచంలో ఎక్కడా ప్రింట్ మీడియా పరిస్థితి బాగాలేదు…
-
డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ నిలబడకపోవడం
-
కోవిడ్ బూమ్ తర్వాత భారీ రీడర్ డ్రాప్
-
ఖర్చులు విపరీతంగా పెరగడం
-
సోషల్ మీడియా & యూట్యూబ్ న్యూస్‌తో పోటీ
-
రాజకీయంగా పోలరైజ్ అయిన ఆడియన్స్
మరి బెజోస్ వచ్చిన తర్వాతే ఎందుకు ఇలా?
బెజోస్ వచ్చిన తొలి సంవత్సరాల్లో డిజిటల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ పెట్టుబడులు, గ్లోబల్ రీచ్ ఇవన్నీ పెరిగాయి… కానీ జర్నలిజాన్ని టెక్ కంపెనీలా స్కేల్ చేయొచ్చు అన్న భావన, “గ్రోత్ వస్తుంది” అన్న అంచనా ప్రస్తుత మీడియా సిట్యుయేషన్ రియాలిటీకి సరిపోలేదు… పేలిపోయింది…
ఇంకా చెప్పాలంటే…? మీడియా వ్యాపారానికి బహుముఖ దాడి.., ప్రింట్ & టీవీపై డిజిటల్ దాడి… ప్రింట్ మీడియా ఇప్పటికే క్షీణిస్తోంది… టీవీ న్యూస్‌పై యూట్యూబ్, ఇండిపెండెంట్ జర్నలిస్టులు దాడి చేస్తున్నారు… డిజిటల్ న్యూస్ మీడియాపై ఇప్పుడు — సోషల్ మీడియా, ఇన్‌ఫ్లూయెన్సర్లు, అల్గోరిథమ్స్ దాడి చేస్తున్నాయి…
ఫలితం… వార్తను తయారుచేసే సంస్థకు ఆదాయం తగ్గుతోంది, వార్తను షేర్ చేసుకునే ప్లాట్‌ఫాంలే లాభపడుతున్నాయి… వాషింగ్టన్ పోస్ట్ దీనికి స్పష్టమైన ఉదాహరణ…
రాజకీయ వైఖరి – మీడియాకు బూమరాంగ్
ఒకప్పుడు: “ఏ పత్రిక ఏ పక్షానికి దగ్గరగా ఉందో తెలుసు, అయినా చదువుతాం”
ఇప్పుడు: “నువ్వు నా రాజకీయ అభిప్రాయానికి 100% సరిపోకపోతే, నేను నిన్ను వదిలేస్తా”
ఇదే అసలు మార్పు… ఇది కొందరి విశ్లేషణ… కానీ…
వాషింగ్టన్ పోస్ట్ విషయంలో…
డెమోక్రాట్ పాఠకులు: “ట్రంప్‌కి వ్యతిరేకంగా గట్టిగా నిలబడలేదు” అంటున్నారు
కన్జర్వేటివ్ పాఠకులు: “లిబరల్ ఎలైట్ పేపర్” అంటున్నారు
ఫలితంగా రెండు వైపులా పాఠకుల నష్టం…. ఇదొక సంక్లిష్టమైన స్థితి… పాఠకుడు నిజంగా ఏం కోరుకుంటున్నాడో తేల్చుకోలేని స్థితి…
ఓ విశ్లేషణ ప్రకారం ఇండియాలో పరిస్థితి ఇంకా ప్రమాదకరం
ప్రతి మీడియా సంస్థ — ఒక రాజకీయ పక్షం
నేషనల్ మీడియా
రీజినల్ మీడియా
డిజిటల్ పోర్టల్స్
అన్నీ స్పష్టంగా ఏదో ఒక రాజకీయ శిబిరానికి దగ్గరగా కనిపిస్తున్నాయి.
తెలుగు రాజకీయాల్లో అయితే మరీ ఎక్కువ
టీవీ చానెల్ = ఒక పార్టీ
పేపర్ = మరో పార్టీ
యూట్యూబ్ ఛానెల్ = ఇంకో నాయకుడు
ఇక్కడ జర్నలిజం కాదు, అచ్చంగా రాజకీయ ప్రచారం నడుస్తోంది.
సోషల్ మీడియా కొత్త రాజ్యం
ఇప్పటి పాఠకుడు/వీక్షకుడు వార్త కోసం పత్రిక కొనడం లేదు, చానెల్ కోసం టీవీ ఆన్ చేయడం లేదు… ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్‌లో తన అభిప్రాయానికి సరిపడే కంటెంట్ మాత్రమే చూస్తున్నాడు… ఇదే ఎకో-చాంబర్ జర్నలిజం…
వాషింగ్టన్ పోస్ట్ ఎందుకు హెచ్చరిక?
ఎందుకంటే: అది ప్రపంచ స్థాయి బ్రాండ్
భారీ పెట్టుబడి ఉన్న సంస్థ
డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసిన పత్రిక
అలాంటిదే కూలిపోతే, భారతీయ మీడియా ఎంత సేఫ్? అన్న ప్రశ్న తలెత్తుతుంది…
పాఠం ఏంటి?
1️⃣ రాజకీయ పక్షపాతం = తాత్కాలిక లాభం, దీర్ఘకాల నష్టం
2️⃣ నమ్మకం పోతే, సబ్‌స్క్రిప్షన్ పోతుంది
3️⃣ జర్నలిజం స్థానంలో యాక్టివిజం వస్తే, పాఠకుడు సోషల్ మీడియాకు వెళ్లిపోతాడు
4️⃣ మీడియా బతకాలంటే — న్యూస్, విశ్వసనీయత, లోతైన విశ్లేషణ తప్ప మరో మార్గం లేదు… ఇది ఇంకో వాదన…
ఇప్పటికైనా మీడియా “నేను ఎవరి తరఫున మాట్లాడుతున్నాను?” కాకుండా “నేను ప్రజలకు ఎంత నిజం చెబుతున్నాను?” అని ఆలోచించకపోతే — వాషింగ్టన్ పోస్ట్ ఈరోజు, మన మీడియా రేపు...! ఇది మరొక విశ్లేషణ...
Share this Article