.
ఇద్దరు దంపతులను ప్రధాని అభినందిస్తున్న ఫోటో, ఆ వార్త కొన్నాళ్లుగా వైరల్ అవుతోంది… విషయం ఏమిటంటే… గడ్డకట్టిన మంచు కొండల సియాచిన్‌లో విధుల్లో ఉండే మన సైనికులకు అవసరమైన ఆక్సిజెన్ అందించేందుకు ఆ జంట ఓ ప్లాంటు పెట్టింది హిమాలయాల దగ్గర… సియాచిన్ తెలుసు కదా, ప్రతి అడుగూ, ప్రతి క్షణమూ ప్రాణగండమే…
అందుకని ప్రధాని మోడీ ఆ వివరాలు తెప్పించుకుని, వాళ్లను రప్పించుకుని ధన్యవాదాలు చెప్పాడని వార్త… ఇక్కడ ఓ ప్రశ్న తలెత్తడం సహజం… లక్షల కోట్ల రక్షణ బడ్జెట్‌లో ఆఫ్టరల్ 1.5 నుంచి 2 కోట్లు ఖర్చయ్యే ఆక్సిజన్ ప్లాంటును ప్రభుత్వం నిర్మించలేదా..? అదీ ప్రైవేటు వ్యక్తులు పెట్టాలా..? సియాచిన్ జవాన్ల బాధ్యత ప్రభుత్వానికి కాదా..?
Ads
సో, ఆ వార్త నిజానిజాల్లోకి వెళ్దాం ఓసారి… దేశభక్తికి ఆక్సిజెన్ రూపం: సైనికుల ‘శ్వాస‘ కోసం ఆ దంపతుల నిస్వార్థ పోరాటం!
సమస్యల గురించి విమర్శించేవారు వేలల్లో ఉంటారు… కానీ ఆ సమస్యకు పరిష్కారంలో తాము కూడా ఒక భాగమవ్వాలని అనుకునేవారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు… అచ్చం అలాంటి అరుదైన కోవకే చెందుతారు పూణేకు చెందిన మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి యోగేష్ చిత్తే, ఆయన భార్య సుమిత చిత్తే…
ఆలయానికి గంటలా.. సైన్యానికి అండగా!
మనం ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించేటప్పుడు, ఆ నిర్మాణ వ్యయం కొన్ని వందల కోట్లు ఉండవచ్చు. కానీ ఒక సామాన్యుడు తనకు తోచిన రీతిలో ఒక గంటనో, లేదా ఒక ఇటుకనో విరాళంగా ఇస్తాడు… అక్కడ ఆ వస్తువు విలువ కంటే, ఆ మహాత్కార్యంలో ‘నేను కూడా ఉన్నాను’ అనే ఆ వ్యక్తి భావన చాలా గొప్పది… సరిగ్గా ఇదే స్ఫూర్తితో చిత్తే దంపతులు సియాచిన్ సైనికుల కోసం అడుగు వేశారు…
ప్రభుత్వ బాధ్యత.. పౌరుడి భాగస్వామ్యం
లక్షల కోట్ల రక్షణ బడ్జెట్ ఉన్న దేశంలో ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ “అన్నీ ప్రభుత్వమే చేయాలి, మాకేం సంబంధం” అనుకోకుండా.. “నా దేశం కోసం, నా సైనికుల కోసం నా వంతుగా నేను ఏం చేయగలను?” అని వారు ఆలోచించారు… పైగా ఆయన ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారి…
త్యాగం: ఆ ఆలోచన రాగానే వెనుకాడకుండా సుమిత గారు తన ఒంటిపై ఉన్న నగలను తీసి ఇచ్చింది… తన భర్త రిటైర్మెంట్ పొదుపును ఆ పనికే కేటాయించాడు… తాము పునాది వేసి, ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ విరాళాలు సేకరించారు… అది కేవలం ఒక ప్లాంట్ నిర్మాణం కాదు, ఆర్మీ పట్ల సామాన్య పౌరులకు ఉన్న గౌరవానికి చిహ్నం…

ప్రధాని అభినందన: ఒక గొప్ప సందేశం
ఈ ఫోటోలో ప్రధానమంత్రి మోడీ వారిని అభినందిస్తున్న దృశ్యం… కేవలం ఇద్దరు వ్యక్తులకు దక్కిన గౌరవం కాదు… ” సమస్యలను ఎత్తిచూపడం కంటే, పరిష్కారంలో భాగమవ్వడం మిన్న” అనే సంకల్పానికి దక్కిన గుర్తింపు… దీన్ని ఆర్మీకి అప్పగించారు… మెయింటెనెన్స్ ఆర్మీయే చూసుకుంటోంది.,.. ఇన్నాళ్లు దూరం నుంచి ఆక్సిజెన్ పంపించేవారు, ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తి చేసి, జవాన్లకు అందిస్తున్నారు…
నేడు సియాచిన్ మంచు శిఖరాల్లో సైనికులు పీల్చే ప్రతి శ్వాసలోనూ.. ఈ దంపతుల త్యాగం, వారి పిలుపుతో కదిలిన వందలాది మంది భారతీయుల ప్రేమ నిక్షిప్తమై ఉంది… అది సరిహద్దుల్లో ఉన్న సైనికులకు “మా వెనుక దేశం ఉంది” అనే ఒక గొప్ప భరోసాను ఇస్తుంది… యోగేష్ చిత్తే దంపతులు మనకు నేర్పే పాఠం ఒక్కటే…
దేశం అంటే మ్యాపులో గీసిన గీతలు కాదు, దేశం అంటే మనుషులు... ఆ మనుషుల కోసం, ముఖ్యంగా మనల్ని కాపాడే సైనికుల కోసం మనం ఇచ్చేది చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు... ఇచ్చామన్న 'భావన', ఆ సంకల్పం, ఆ ప్రయత్నం ముఖ్యం...
Share this Article