Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

త్వరలో లోకేష్‌కు పగ్గాలు..? మరి చంద్రబాబు..? మరి జనసేనాధిపతి..?!

February 27, 2026 by M S R

.

త్వరలో నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడా..? తొందరపడుతున్నాడా..? మరి చంద్రబాబు ఏం చేయాలి..? అసలు దీనికి పవన్ కల్యాణ్ అంగీకరిస్తాడా..? లోకేష్ నాయకత్వంలో పనిచేస్తాడా..? కూటమిలోని బీజేపీ ఏం చెబుతుంది..?    ఇదుగో ఈ చర్చ రీసెంటుగా జోరుగా సాగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో… దేశం కూడా చూస్తోంది… ఎందుకంటే..? టీడీపీ సపోర్టుతోనే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోంది, అందుకే టీడీపీ రాజకీయాలపై అందరికీ ఆసక్తి…

1) పవన్ కల్యాణ్ అంగీకరిస్తాడా..? ఈ ప్రశ్నకు సమాధానం… ‘తన అంగీకారంతో పనిలేదు’… చంద్రబాబు గనుక వారసుడి పట్టాభిషేకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాక, టీడీపీ శాసనసభాపక్షం లోకేష్‌ను ఎన్నుకున్నాక పవన్ కల్యాణ్ అంగీకరించినా అంగీకరించకపోయినా ఆగేదేమీ ఉండదు… ఒకవేళ కోపంతో, అసంతృప్తితో కూటమి నుంచి బయటికి వస్తే నష్టపోయేదీ తనే… తనెలాగూ జగన్‌తో కలిసి రాజకీయం చేయలేడు, కేవలం బీజేపీ ప్లస్ జనసేన కలిసి ప్రయాణించినా టీడీపీకి పెద్దగా నష్టమూ లేదు… లోకేష్‌తో సమన్వయం చేసుకుంటూ తన డిప్యూటీ సీఎం హోదాలో పనిచేయాల్సిందే… ఆ కెమిస్ట్రీ తప్పదు… (లేదంటే దాసరికి, చిరంజీవికి గతంలో కేంద్రంలో చాన్స్ ఇచ్చినట్టు పవన్ కల్యాణ్‌ను కూడా ఢిల్లీకి రప్పించి, కేంద్ర మంత్రి పదవి ఇస్తారేమో…)

Ads

2) మరి చంద్రబాబు ఏం చేయాలి..? ఇదే అసలు ప్రశ్న… 75 ఏళ్లొచ్చినా చంద్రబాబు మంచి ఆరోగ్యంతో ఉన్నాడు… చురుకుగా ఉన్నాడు… తను అధికారం లేకుండా, యాక్టివ్ పాలిటిక్స్ లేకుండా ఉండలేడు… కరుణానిధి, ఫరూక్ అబ్దుల్లా, ములాయంసింగ్ తదితరులు మరీ ముసలితనం పైనబడ్డాక గానీ కొడుకులకు పగ్గాలు ఇవ్వలేదు… బిజూ పట్నాయక్ వంటి నేతలు మరణించాక గానీ కొడుకు రాజకీయాల్లోకి రాలేదు… చాలా ఉదాహరణలున్నయ్…

పోనీ, లోకేష్‌కు టీడీపీ ప్లస్ ప్రభుత్వ పగ్గాలు ఇచ్చేసి (నిజానికి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో ఇప్పటికే లోకేష్ యాక్టింగ్ సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు తీసేసుకున్నాడు) ఢిల్లీకి ఏ రాజ్యసభ సభ్యుడిగానో వెళ్తే..? వెళ్లి ఏం చేయాలి మరి..? అక్కడేమీ ఖాళీలు లేవు, ఉత్త రాజ్యసభ సభ్యుడిగా తను చేయగలిగేదీ ఏమీ లేదు… ఉపరాష్ట్రపతి పదవి భర్తీ జరిగి చాన్నాళ్లు కాలేదు…

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవీకాలం వచ్చే ఏడాది జూలై దాకా ఉంది… పోనీ, అప్పటిదాకా ఆగి, చంద్రబాబును రాష్ట్రపతిని చేసి, అప్పుడు లోకేష్‌కు అధికారికంగా పగ్గాలు ఇచ్చే ప్లాన్ ఏమైనా ఉందా..? అదేనా ఈ రీసెంటు చర్చ వెనుక సారాంశం..? కానీ రాష్ట్రపతి పదవి లెక్కలు వేరే ఉంటాయి, అదంత సులభమేమీ కాదు… ఏమో, మోడీ వర్సెస్ మోహన్ భగవత్ రాజకీయ సమీకరణాల్లో చంద్రబాబును మరేదైనా కీలక పదవిలోకి అకామిడేట్ చేస్తారా..?

చంద్రబాబు పొలిటిషియన్‌కన్నా గుడ్ మేనేజర్… అవకాశాల్ని సరిగ్గా వాడుకుంటాడు… ఎవరితో ఎప్పుడు ఎలా వ్యవహరించాలో, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినవాడు… ఒకప్పుడు కేంద్రంలో చక్రాలు తిప్పినా, ఇప్పుడు కేవలం విభజిత ఏపీకే పరిమితమై, కాలానికి తగినట్టు తగ్గి ఉంటున్నాడు… జనాకర్షణ శక్తి, మంచి వాగ్దాటి లేకపోయినా తన లౌక్యం, మేనేజింగ్ ప్రతిభలతోనే నెట్టుకొస్తున్నాడు… మామ నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని కాజేసినా, జనంలో వ్యతిరేకత రాకుండా మేనేజ్ చేసుకోగలిగాడు… కానీ లోకేష్ మేనేజింగ్ సామర్థ్యం…? ఏమో, వేచి చూడాల్సిందే… పార్టీ నాయకులు లోకేష్ నాయకత్వాన్ని సంపూర్ణంగా యాక్సెప్ట్ చేస్తారా అనేదీ సందేహమే… కాకపోతే తను గతంలో పప్పు ఇమేజ్ ఉన్న నాయకుడు మాత్రం కాదు, అన్నింట్లోనూ ఆరితేరుతున్నాడు… ఆల్రెడీ పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసం కోసం ప్రత్యేకంగా విందులు, ఫ్యామిలీలకు పట్టుచీరెలు గట్రా ఓ తంతు స్టార్ట్ చేశాడు కూడా…

3) కొన్నేళ్ల క్రితం కేసీయార్ కూడా కేటీయార్‌కు ప్రభుత్వ పగ్గాలు ఇచ్చేసి, తను తప్పుకుందామని ఆలోచించినట్టు వార్తలొచ్చాయి… ప్రధాని మోదీ కూడా ఏదో సభలో వెల్లడించినట్టు గుర్తు… కానీ తనకు పార్టీలో, ప్రజల్లో యాక్సెప్టెన్స్ అంతగా ఉందానే డౌట్ కేసీయార్‌ను వెనక్కి లాగిందేమో… ప్రస్తుత దారుణ పరిస్థితుల్లో కూడా కేసీయారే పార్టీ అధినేతగా ఉన్నాడు… తన పేరే పార్టీకి తారకమంత్రం, కేసీయార్ రాజకీయాలు వదిలేస్తే (అఫ్‌కోర్స్, వదిలేసినట్టే) బీఆర్ఎస్ ఇప్పుడున్నట్టు కూడా ఉండలేదు… (కేటీయార్‌కన్నా హరీష్‌రావుకు పార్టీలో యాక్సెప్టెన్స్ ఎక్కువ)… సేమ్, టీడీపీ కూడా ఓ కుటుంబ పార్టీయే కదా, కుటుంబ ఆస్తి వ్యవహారాల్లాగే లోకేష్‌‌కు పగ్గాలు ఇవ్వాలని అనుకుంటే… తనకు నిజంగా జనంలో యాక్సెప్టెన్సీ ఉందా..? లభిస్తుందా..? ఇదీ డిబేటబుల్…

4) మరి బీజేపీ..? పెద్దగా పట్టించుకోకపోవచ్చు… జగన్‌తో కలిసి ప్రయాణించలేదు… సొంత బలం లేదు, ఉన్నంతలో టీడీపీకి తోకగా ఉండటం మినహా..! గత ఎన్నికల కూటమి మేనిఫెస్టోతో విభేదించినా, కలిసి వోట్లు అడగక తప్పలేదు… ఒకవేళ చంద్రబాబు గనుక గ్రీన్‌సిగ్నల్ ఇస్తే బీజేపీ హైకమాండ్ వోకే అనకుండా, చేయగలిగేది కూడా ఏమీ లేదు..! మొత్తానికి ఇలాంటి చర్చలు, విశ్లేషణలు జోరుగానే సాగుతున్నాయి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • త్వరలో లోకేష్‌కు పగ్గాలు..? మరి చంద్రబాబు..? మరి జనసేనాధిపతి..?!
  • ఆఫ్టరాల్ శెట్టి గ్యాంగ్..! తెలంగాణా కోడలా… తలెగరేసి ఇలాగే బతికెయ్..!!
  • అగ్రదేశపు యుద్ధనౌక… టాయిలెట్లతో యుద్ధం… చెప్పలేని అగచాట్లు…
  • న్యాయం ఓ ప్రశ్నార్థకం..! ఈ ఇద్దరు తల్లుల పోరాటానికి అభివందనం..!!
  • పని చేయడానికే జీవితమా..? జీవితంలో పని కేవలం ఓ భాగమా..?
  • నయా రాజరికం..! అంతటి రాజవంశ సింధియా కూడా హాశ్చర్యపోయాడు..!!
  • ఏపీ మంత్రి వ్యాఖ్యలపై… బీఆర్ఎస్ నుంచి ఉలుకూ పలుకూ లేదు…
  • లుకవుట్ జారీ..! కానీ సరిపోదు… ముందు వాడి బలుపుకి కత్తెరపడాలి..!!
  • ఈరోజు మ్యాచులో ఈ అంపైర్ గనుక ఉంటే… ఇండియా ఇక ఇంటికేనా..?
  • అసలే బాలయ్య, ఆపై విజయశాంతి… మాంచి కమర్షియల్ మాస్ మసాలా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions