Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆమె జేఆర్‌డి టాటాకు నేరుగా ఓ పోస్ట్ కార్డు రాసింది… ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ…

February 28, 2026 by M S R

.

నేను ఆ సమయంలో బెంగళూరులో చదువుకుంటూ ఉండేదాన్ని… టాటా ఇన్‌స్టిట్యూట్‌లో నా ఎం.టెక్ చేస్తూ ఉన్నాను… అంతకు ముందు, 1972లో నేను బి.ఇ. పూర్తి చేశాను — ఆ సంవత్సరం మా తరగతిలో నేను ఒక్కతే అమ్మాయి… యూనివర్శిటీలో కూడా… తరువాత అమెరికాలో పీహెచ్‌డీ చేయడం కోసం నాకు స్కాలర్‌షిప్ కూడా వచ్చింది…

ఒక రోజు హాస్టల్‌కి తిరిగి వస్తూ నోటిస్ బోర్డుపై టెల్కో (పుణే, జంషెద్‌పూర్)లలో నియామకాల ప్రకటనను చూశాను… అందులో ఇలా వ్రాయబడి ఉంది… “మంచి జీతం, మంచి శిక్షణ, యువ ఇంజనీర్లు కావాలి” — కానీ దిగువన ఒక చిన్న వాక్యం ఉంది, సిగరెట్ ప్యాకెట్‌పై హెచ్చరికను చాలా చిన్న అక్షరాల్లో వ్రాసినట్లుగా — “లేడీ స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్లై” (మహిళా విద్యార్థులు దరఖాస్తు చేయవద్దు)…

Ads

అది చదివి నాకు చాలా కోపం వచ్చింది… అప్పటికి నా వయసు 23 సంవత్సరాలు, నా మనసులో ఒక్క ఆలోచనే — ఇప్పుడు నేను నా అభిప్రాయ స్వరం వినిపించకపోతే, మరెప్పుడు..?

హాస్టల్‌కు వెళ్లి ఒక పోస్ట్‌కార్డ్ తీసుకుని J. R. D. Tata గారికి లేఖ రాశాను… ప్రతి సంవత్సరం మార్చి 15న టాటా స్థాపక దినోత్సవం సందర్భంగా వారు మా సంస్థకు వచ్చేవారు; మేము దూరం నుండి వారిని చూసేవాళ్లం — ఎంతో గంభీరమైన వ్యక్తిత్వం, మంచి అందగాడు, గ్రీకు విగ్రహంలా కనిపించేవారు… నేను వారికి ఇలా వ్రాశాను…

“మాననీయ జే.ఆర్.డి. టాటా గారికి, దేశం ఇంకా స్వాతంత్ర్యం పొందకముందే మీ గ్రూప్ కెమికల్స్, లోకోమోటివ్, ఇనుము-ఉక్కు వంటి పరిశ్రమలకు పునాది వేసింది… మీరు ఎప్పుడూ కాలానికి ముందుండేవారు… సమాజంలో స్త్రీ- పురుషులు ఇద్దరూ 50-50 శాతం; మహిళలకు అవకాశాలు ఇవ్వకపోతే, అర్ధ ప్రతిభను కోసేసినట్టే — మరి దేశం ఎలా ముందుకు సాగుతుంది? చాలా మహిళలు విద్య, ఉపాధి రెండింటిలోనూ వంచించబడుతున్నారు… మీలాంటి అగ్రగామి సంస్థ నుండి ఇలాంటి వివక్ష సరైంది కాదు…”

లేఖను జస్ట్, జేఆర్డీ టాటా, టెల్కో, బొంబాయి అనే అడ్రెస్ రాసి పోస్ట్ చేశాను… తరువాత నేను నా పనిలో నిమగ్నమయ్యాను… ఆ సమయంలో హాస్టల్‌లో ఫోన్లు ఉండేవి కాదు — మేము లేఖలు, టెలిగ్రామ్‌ల ద్వారానే వ్యవహరించేవాళ్లం… కొన్ని రోజుల తరువాత నాకు టెలిగ్రామ్ వచ్చింది: “దయచేసి టెల్కో ఫైనల్ ఇంటర్వ్యూకు పుణేకు రండి… రాకపోకల ఫస్ట్-క్లాస్ రైలు ప్రయాణ ఖర్చు మా వంతు…”

నా స్నేహితులు చాలా సంతోషించారు. “వెళ్లు, మంచి చీర వేసుకుని వెళ్లు! పూణెలో చీరలు చౌక, 30 రూపాయలకు ఓ చీర కొనుక్కుని రా” అని చెప్పారు… అందరూ కలిసి నాకు ప్రోత్సాహం ఇచ్చారు…

ఇంటర్వ్యూలో చాలా సాంకేతిక ప్రశ్నలు అడిగారు — నేను అన్నింటికీ సమాధానాలు ఇచ్చాను. కానీ తర్వాత ప్యానెల్ ఇలా చెప్పింది: “చూడండి, మీరు మంచి ఇంజనీర్. కానీ మా ప్లాంట్లు — జంషెద్‌పూర్, పుణే — షాప్ ఫ్లోర్‌లో ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా పని చేయలేదు. ఇక్కడ షిఫ్ట్ 6 నుండి 2 వరకు ఉంటుంది, అందరూ పురుష ఉద్యోగులే ఉంటారు, మీరు ఒక్కరే మహిళ అవుతారు… అందువల్ల మీరు ఆర్ & డీ లేదా పీహెచ్‌డీ వైపు వెళ్లడం మంచిదని మేము భావిస్తున్నాం…”

అప్పుడు నేను వారితో చెప్పాను… “నా తాతయ్య చెప్పేవారు — వెయ్యి మైళ్ల ప్రయాణం కూడా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది అని… ఈరోజు మీరు మహిళలు చేయలేరని చెబితే, మరి మొదలు పెట్టేది ఎవరు..? ఎప్పటికైనా ఇది మారాల్సిందే — అయితే అది ఈరోజు నుంచే ఎందుకు కాకూడదు?”

చర్చ అనంతరం నాకు ఉద్యోగ ఆఫర్ వచ్చింది… నేను ఇంటికి వెళ్లి నా నాన్నగారికి చెప్పాను: “నేను పోస్ట్‌కార్డ్ రాసాను — నాకు ఉద్యోగం వచ్చింది!” నాన్న అడిగారు: “అయితే ఆ ఉద్యోగంలో చేరుతావా?” నేను చెప్పాను: “లేదు, నేను అమెరికా వెళ్లి పీహెచ్‌డీ చేస్తాను. లేఖ రాసింది వాళ్లకు నా అభిప్రాయం తెలియజేయడానికే — అమ్మాయిలు మౌనంగా ఉండరు; మేమూ సమర్థులమే అని…”

నాన్నగారు గంభీరంగా మారారు. “అది సరైంది కాదు. నువ్వు సమానత్వం కోరుతూ ప్రపంచం ముందు నిలబడితే, దాన్ని నిలబెట్టుకోవాలి కూడా. ఏమి చెబుతావో అదే చేయాలి — ‘వాక్ ద టాక్’. లేకపోతే చెప్పకూడదు…”

ఆ మాటలు నా మనసులో లోతుగా నాటుకుపోయాయి – రెండు- మూడు రోజులు లోతుగా ఆలోచించాను. తరువాత నా పీహెచ్‌డీ ప్రవేశాన్ని వదిలి, టెల్కో ఉద్యోగాన్ని అంగీకరించాను. ఈ విధంగా, టాటా సమూహంలో నేను తొలి మహిళా ఇంజనీర్‌గా నిలిచాను….

(ఇది ఇన్‌ఫోసిస్ సుధామూర్తి స్వయంగా కపిల్ శర్మ షోలో పంచుకున్న అనుభవమే... బాగుంది కదా...)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దురంధర్ లో బాగా పేలిన పాత్ర… బడే సాహెబ్… ఎవరీ నటుడంటే..?
  • భయం నుంచి విముక్తి – ఆ పచ్చిపుండు వేదన – దురందర్ మరో కోణం…
  • ఒకే వ్యక్తి తల్లి ప్లస్ తండ్రి..! ఈ ప్రచారం ఏమిటి..? అసలు నిజాలు ఏమిటి..?!
  • రాత్రి 10… సీఎం హఠాత్తుగా మాయం… ఒక్కడే కారులో ఎటో వెళ్లిపోయాడు…
  • మణిరత్నం పిలుపు ఓ అవకాశం మాత్రమే కాదు… ఓ గౌరవం, ఓ గుర్తింపు..!!
  • చిరంజీవి వ్యాఖ్యలపై ఇంత వ్యతిరేకతకు కారణాలేమిటి..?!
  • కొత్త సీసాలో పాత సారా..? కాదు.., కొత్త సీసా, కొత్త సారా, కొత్త రంగు కూడా..!!
  • ఇటు గరికపాటి రచ్చ… అటు భట్టి కొత్త ఆహార ప్రకటన… భలే కంట్రాస్టు…
  • హేపీనెస్ ఇండెక్స్..! ‘హేపీగా’ పగలబడి నవ్వుకునే ఓ వరల్డ్ రేంజ్ జోక్..!
  • ఇరాన్ దెబ్బ… ఇంత బతుకూ బతికి… F35 జెట్ చావు దప్పి కన్నులొట్ట…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions