Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హనుమంతుడు నేర్పిన ‘కార్పొరేట్ కమ్యూనికేషన్స్’ పాఠాలు…

February 1, 2026 by M S R

.

నేటి పోటీ ప్రపంచంలో మనకు నైపుణ్యం (Skill) ఎంత ముఖ్యమో దాన్ని ఇతరులకు వివరించే విధానం (Communication) కూడా అంతే ముఖ్యం. కార్పొరేట్ కంపెనీలు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించడానికి కోసం చాలా ప్రయాసపడుతుంటాయి.

సాఫ్ట్ స్కిల్స్ కోసం ప్రపంచం ఎగబడుతూ ఉంటుంది. ఎదుటివారిని తన మాటలతో ఎలా మంత్రముగ్ధులను చేయవచ్చో వాల్మీకి రామాయణం హనుమంతుడి ద్వారా మనకు గొప్ప ఆదర్శంగా, నేర్చుకోవాల్సిన పాఠంగా చూపించింది.

Ads

హనుమను మొదటిసారి కలిసినప్పుడు ఆయన మాట తీరును చూసి సాక్షాత్తు శ్రీరాముడే ఆశ్చర్యపోయాడు. ఆ ‘హనుమ వాక్చాతుర్యం’ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం.

1. ఫస్ట్ ఇంప్రెషన్ & బాడీ లాంగ్వేజ్

కిష్కింధ కాండలో రాముడు, లక్ష్మణుడు పంపా సరోవరం వద్దకు వచ్చినప్పుడు సుగ్రీవుడు భయపడి హనుమను పంపిస్తాడు… హనుమంతుడు ఒక సన్యాసి రూపంలో వెళ్లి వారితో మాట్లాడతాడు… ఆయన మాట్లాడి వెళ్ళిన తర్వాత రాముడు లక్ష్మణుడితో ఇలా అంటాడు:

“న ముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తథా…”

“లక్ష్మణా! ఈయన ఇన్ని మాటలు మాట్లాడినా ఆయన ముఖంలో గానీ, కళ్లలో గానీ, నుదుటి మీద గానీ ఎక్కడా అసహనం లేదు. అనవసరమైన హావభావాలు లేవు.”

మనం ఇంటర్వ్యూలలో లేదా ప్రజెంటేషన్లలో ఉన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ మన మాటల కంటే ఎక్కువ మాట్లాడుతుంది. భయం, తడబాటు, అతిగా చేతులు తిప్పడంలాంటివి మన ఆత్మవిశ్వాసం తక్కువగా ఉందని చూపిస్తాయి. హనుమలా ప్రశాంతంగా, స్థిరంగా ఉండి మాట్లాడటం గొప్ప లక్షణం.

2. సబ్జెక్ట్ నాలెడ్జ్ – పాండిత్యం

రాముడు మరో మాట అంటాడు- “ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాల్లో పట్టు లేనివాడు, వ్యాకరణం తెలియని వాడు ఇలా మాట్లాడలేడు”- అని. అంటే హనుమ మాటల్లో స్పష్టత ఉంది, తప్పులు లేవు.
ఏ రంగంలోనైనా సరే, మనం మాట్లాడే విషయంపై మనకు పూర్తి అవగాహన (Domain Knowledge) ఉండాలి. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే ఎదుటివారికి మనపై నమ్మకం కలగదు. మనం వాడే భాష ఏదైనా అది స్పష్టంగా, వ్యాకరణ దోషాలు లేకుండా ఉంటేనే మనకు గౌరవం.

3. గొంతులో హెచ్చుతగ్గులు – Tone & Clarity

రాముడు హనుమ గొంతు గురించి చెబుతూ.. “ఆయన మాటలు మరీ వేగంగా లేవు, మరీ నిదానంగానూ లేవు. కంఠం నుంచి హృదయం వరకు ఎంతో స్పష్టంగా వినిపిస్తున్నాయి” అని మెచ్చుకున్నాడు.

మనం చాలామందిని చూస్తుంటాం.. కొందరు అతి వేగంగా మాట్లాడుతూ అసలు పాయింట్స్ మిస్ అవుతారు. కొందరు మరీ నిదానంగా మాట్లాడి బోర్ కొట్టిస్తారు. హనుమ నేర్పిన పాఠం ఏంటంటే— వాయిస్ మాడ్యులేషన్ (Voice Modulation). ఎదుటివారికి అర్థమయ్యేలా, ఆహ్లాదకరంగా మాట్లాడటమే మంచి కమ్యూనికేషన్ సూత్రం.

4. సందర్భాన్ని బట్టి వేషం (Contextual Awareness)

హనుమ రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు సన్యాసి రూపంలో వెళ్తాడు. ఎందుకంటే అడవిలో ఉన్న రాముడికి ఒక వానరుడి కంటే సన్యాసిపై నమ్మకం కలుగుతుందని ఆయనకు తెలుసు. అదే లంకలో సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న కోతి రూపంలో వెళ్లి రాముడి కథను వినిపించి ఆమె నమ్మకాన్ని గెలుచుకుంటాడు.

మనం ఎవరిని కలుస్తున్నాం? ఏ సందర్భంలో కలుస్తున్నాం? ఎలా మాట్లాడుతున్నాం? ఏమి మాట్లాడుతున్నాం? ఏ వేషంలో వెళుతున్నాం? సందర్భాన్ని బట్టి మన మాట తీరును, ప్రవర్తనను, తగిన ఆహార్యాన్ని మార్చుకోవడం అవసరం.

5. రిజల్ట్ ఓరియెంటెడ్ టాక్ – “దృష్టా సీత”

రామాయణంలో అత్యంత ప్రసిద్ధమైన ఘట్టం ఇది. లంక నుంచి తిరిగి వచ్చిన హనుమ రాముడితో “చూశాను సీతను” (దృష్టా సీత) అని అంటాడు. నిజానికి “నేను సముద్రాన్ని దాటాను, లంకలో వెతికాను, అక్కడ సీతను చూశాను” అని చెప్పవచ్చు. కానీ రాముడు ఏ వార్త కోసం ఎదురుచూస్తున్నాడో ఆ ‘కీ-వర్డ్’ (Key Word) ను ముందుగా చెప్పి రాముడి ఆందోళనను తగ్గించాడు.

ఆఫీసుల్లో రిపోర్టింగ్ చేసేటప్పుడు సోది చెప్పకుండా, అసలు విషయం (The Bottom Line) ముందుగా చెప్పాలి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది, మన ప్రొఫెషనలిజం పెరుగుతుంది.

రాముడు చివరగా ఒక అద్భుతమైన మాట అంటాడు—”ఈయన మాటలు వింటే కత్తి ఎత్తిన శత్రువు కూడా శాంతించి ప్రసన్నుడవుతాడు…” అని. అంటే మాటతో యుద్ధాలను ఆపవచ్చు, మనసులను గెలవవచ్చు.

హనుమ నేర్పిన ఈ పాఠాలు- వినయం, స్పష్టత, సమయస్ఫూర్తి, సందర్భోచిత సంభాషణలు నేటి తరం యువతకు, ఉద్యోగులకు అత్యంత ఆవశ్యకం. ఆధ్యాత్మికంగా హనుమను పూజించడమే కాదు, ఆయనలోని ఈ వాక్చాతుర్యం కూడా మనం అందిపుచ్చుకుంటే జీవితంలో తిరుగుండదు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హనుమంతుడు నేర్పిన ‘కార్పొరేట్ కమ్యూనికేషన్స్’ పాఠాలు…
  • ఏం కష్టమొచ్చిందో గానీ… అందరితోనూ కన్నీరు పెట్టిస్తున్న ఫోటో…
  • విశ్వం విస్తరిస్తోంది సరే, కానీ ఏ ఖాళీలోకి..? అసలు గురుత్వాకర్షణ నిజమేనా..?
  • ఫోన్ కెమెరా లెన్సులకు ‘రెడ్ టేప్’… ట్యాపింగు నిరోధించగలదా..?
  • ఐఐటీ జెమ్ కిడ్… బాల మేధావి… నువ్వు గ్రేట్‌రా అబ్బాయ్…
  • ‘మేడారం జాతర ఫోటోల్ని హెలికాప్టర్ నుంచి స్పెషల్‌గా తీయిద్దామా…’
  • ప్రధాని మోడీ ఇచ్చిన కానుకలను అమెరికా అధ్యక్షుడు పారేశాడా..!?
  • రేవంత్‌రెడ్డి మార్క్ ఆట… శిక్షించనంటాడు- అలాగని ఉపేక్షించడు…
  • మేడారంలో మంత్రి సీతక్కతో డాన్స్… ఎవరామె..? ఒక్కసారిగా వైరల్..!!
  • బహుపరాక్..! అత్యంత చంచలంగా వెండి- బంగారం ధరలు…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions