కొంత మంది మీద జాలిపడాల్సిన అవసరమే లేదు… ప్రత్యేకించి తమ గేజ్ మరిచి వ్యవహరించేవారిపై… ఈ వార్త అలాంటిదే… బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తూ, బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు తెలుసు కదా… తను నటించిన ఏదో హిందీ డబ్బింగ్ సినిమాకు కోట్లకుకోట్ల వ్యూస్ వచ్చాయట… ఇక నాకేం తక్కువ అనుకున్నట్టున్నాడు… అసలు యూట్యూబ్ వ్యూస్ అనేవి పక్కా ట్వీకింగ్ ఫిగర్స్ అని తెలియదా..? తను అలా చేస్తేనే కదా ఆ కోట్ల వ్యూస్ వచ్చాయి…
ఆ సంఖ్యను చూసి బలుపు అనుకుంటే ఎలా..? అది కేవలం వాపు…! హిందీలో ఫాలోయింగ్ అంటే అంత మామూలు యవ్వారం కాదు… చిన్న హీరో అయితేనేం, పెద్ద హీరో అయితేనేం… కాంతారతో రిషబ్ శెట్టి, చార్లి 777 రక్షిత్ శెట్టి పాన్ ఇండియా హీరోలు కాలేదా..? కేజీఎఫ్‌కన్నా ముందు యశ్ ఏపాటి హీరో… అంతెందుకు..? బన్నీ, నిఖిల్ లు కూడా పుష్ప, కార్తికేయ సినిమాలతో హిందీ బాక్సాఫీసును కొట్టలేదా..? అనే సమర్థనలు ఆలోచించదగినవే… అయితే…
Ads
ఛత్రపతిని రీమేక్ చేయాలనీ, దాంతో హిందీలో అడుగుపెట్టాలని ఆలోచించడమే తప్పు… ఎందుకంటే..? బేసిక్‌గా బెల్లంకొండకు నటనలో బేసిక్స్ కూడా తెలియవు… ఆల్‌రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో కూడా కాదు… తను ప్రభాస్ చెప్పుల్లో కాళ్లు పెట్టాలని అనుకోవడమే ఓ పెద్ద టాస్క్… నిజానికి ఆ సినిమా టైమ్‌కు ప్రభాస్ కూడా నటనలో వీక్… కానీ రాజమౌళి తోమీ తోమీ తనకు కావల్సిన ఎఫెక్ట్ వచ్చేదాకా విడిచిపెట్టడు… అది ప్రభాస్‌కు కూడా యూజ్ అయ్యింది… సినిమా హిట్టయింది…
బాహుబలి తరువాత ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా ఓ ఇమేజీ వచ్చింది… పాన్ ఇండియా హీరోగా కుదురుకున్నాడు… తరువాత సాహో, రాధేశ్యామ్ కూడా హిందీ ప్రేక్షకుల్లో ప్రభాస్ పేరు సెటిల్ చేసింది… అంటే మరిచిపోకుండా చేశాయి ఆ సినిమాలు… ఇప్పుడు ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే ఎట్సెట్రా పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నయ్… సో, ప్రభాస్ అంటే ప్రభాసే… పైగా బాహుబలి తరువాత ఛత్రపతి డబ్బింగ్ వెర్షన్‌ను హిందీ లోకల్ చానెళ్లు విరివిగా ప్రసారం చేశాయి… జనం బాగా చూడటంతో వాటికి మస్తు వ్యూస్ కూడా రికార్డయ్యాయి…
సో, ఛత్రపతి సినిమా ఆల్రెడీ హిందీ ప్రేక్షకులకు తెలుసు… పైగా ఆ పాత్రలో ప్రభాస్‌ను చూశారు… ఇక అందులో బెల్లంకొండను చూడగలరా..? ఈ స్థితిలో ఆ సినిమాను బెల్లంకొండ హీరోగా తీస్తే టికెట్లు పెట్టుకుని ఎవరు చూడాలనేదే పెద్ద ప్రశ్న… ఈమధ్య ట్రైలర్ రిలీజ్ చేస్తే, అదీ పెద్దగా ఎవరికీ కనెక్ట్ కాలేదు… డబ్బు ఖర్చు పెట్టినా పెద్దగా ట్వీక్ చేయలేకపోయారు వ్యూస్ సంఖ్య భారీగా రికార్డ్ కావడం కోసం…
ఇవన్నీ గమనిస్తున్న బయ్యర్లు నవ్వుకుని, ఛత్రపతి వైపు తొంగి కూడా చూడటం లేదు… ఇక ఏం చేస్తారు..? పెన్ స్టూడియోస్ వాళ్లే సొంతంగా రిలీజ్ చేసుకోవాలి… ఇక్కడ మరో సమస్య ఉంది… ఈ సినిమాకు రమారమి వంద కోట్ల వరకూ ఖర్చయిందట… ప్రస్తుతం బయ్యర్స్ నిరాసక్తత కూడా గమనించి ఓటీటీలు, శాటిలైట్ టీవీలు కూడా లైట్ తీసుకుంటున్నాయి…
థియేటర్ వసూళ్లు పెద్దగా వచ్చే స్థితి లేదు… నాన్ థియేటరికల్ రెవిన్యూ కూడా పెద్దగా వచ్చేట్టు లేదు… వెరసి ఏమర్థమవుతోంది..? ఔట్ పుట్, రెవిన్యూ ఎస్టిమేట్స్ సరిగ్గా వేసుకుని గానీ నిర్మాణవ్యయాన్ని అదుపులో పెట్టుకోవాలి… ఏం ఆలోచించి 100 కోట్లు పెట్టారు..? అదీ అసలు ప్రశ్న… దీనికి సమాధానం ప్రస్తుతం ఈ సినిమా నిర్మాతల వద్ద లేదు… తెల్లమొహాలు తప్ప…!!
Share this Article