ఒక మమ్ముట్టిని… ఒక మోహన్‌లాల్‌ను మెచ్చుకుంటే… ఓ మలయాళ సినిమాను మెచ్చుకుంటే… మనవాళ్లలో చాలామందికి కోపం… ఏం..? మనవాళ్లు మంచి సినిమాలు తీయరా..? మన హీరోలకున్న పాపులారిటీ వాళ్లకు ఎక్కడిది..? మనం ఎప్పుడో ఇంటర్నేషనల్ రేంజుకు వెళ్లిపోయాం… ఆఫ్టరాల్ మలయాళ మేళం అని ఈసడించుకుంటారు… కానీ నవ్వొచ్చే నిజం ఏమిటంటే..? మన పేద్ద పేద్ద స్టార్ హీరోలకు కూడా ఆ మలయాళ హిట్ సినిమాలే కావాలి… వాటిని రీమేక్ చేసుకోవాలి… అర్థమైంది కదా…
మరోసారి మోహన్‌లాల్ గురించి చెప్పుకోవాలి… కథ నచ్చితే ఎలాంటి పాత్రనైనా అంగీకరించేస్తాడు… చేసేస్తాడు… సూపర్ డూపర్ ఫార్ములా ఇమేజీ, మన్నూమశానం, తొక్కాతోలూ ఏమీ ఆలోచించడు… బోలెడన్ని డిష్యూం డిష్యూంలు… భీకరమైన బిల్డప్పులు గట్రా ఏమీ అక్కర్లేదు… తాజాగా 12th మ్యాన్ అని ఓ సినిమా రిలీజైంది… నేరుగా హాట్‌స్టార్ ఓటీటీలో పెట్టేశారు… ఈ సినిమా మీద ఎందుకు ఇంట్రస్టు ఏర్పడిందీ అంటే… అది మోహన్‌లాల్ ప్రధాన పాత్ర చేస్తున్నందుకు కాదు… దీనికి జీతూ జోసెఫ్ దర్శకుడు కాబట్టి… దృశ్యం, దృశ్యం సీక్వెల్ తీసిన ఆ దర్శకుడే దీనికీ దర్శకుడు కాబట్టి…
నిజానికి దృశ్యం సినిమాతో పోలిక తప్పు… అన్నీ అలా కుదరాలని ఏమీ లేదు… ఆ సినిమాతో పోలిస్తే ఈ పన్నెండో వ్యక్తి బాగా నిరాశపరుస్తాడు… అందుకే ఏ పోలికలూ అక్కర్లేకుండా, జీరో మైండ్‌తో చూడాలి… ఇది ఒకేరోజు నడిచే కథ… 11 మంది చేసుకునే ఓ బ్యాచ్‌లర్ పార్టీ… మరి ఈ పన్నెండో వ్యక్తి ఎవరు..? తాగుబోతుగా కనిపించే మోహన్‌లాల్ ఎవరు..? ఓ హత్య జరుగుతుంది..? అది హత్యా..? ఆత్మహత్యా..? చివరకు ఏం తేలుతుంది..? ఇదీ కథ… ఒక థ్రిల్లర్ సినిమాను ఎలా గ్రిప్పింగుగా నడపొచ్చో మలయాళం వాళ్లకు బాగా తెలుసు…
Ads
నిజానికి ఇది జీతూ జోసెఫ్ సొంత కథేమీ కాదు… 2016లో ఓ ఇటాలియన్ మూవీ వచ్చింది… దాని పేరు పర్‌ఫెక్ట్ స్ట్రేంజర్స్… దానికి ఇది అనధికారిక రీమేక్… పార్టీకి వెళ్లిన పదకొండు మందిలో నలుగురు దంపతులు… ఒకామె భర్తతో విడిపోయిన మహిళ… మరో ఇద్దరు కాబోయే జంట… మొబైల్ ఫోన్స్‌తో ఓ గేమ్ స్టార్ట్ చేస్తారు… అకస్మాత్తుగా ఒక రహస్యం బయటపడుతుంది… దాంతో ఆ గ్రూపులో సందేహాలు, గందరగోళం… సడెన్‌గా ఒకరి అనుమానాస్పద మరణం… ఒక్కొక్కరు తమ హిడెన్ సీక్రెట్స్ బయటపెట్టడం… అప్పుడే ఓ నిజం… అంతలోనే అబద్ధం అని తేలిపోవడం… ఇలా ఇలా సాగిపోతుంది కథ…
నిజానికి ఇక్కడ సినిమా ఏదో గొప్పగా ఉందని చెప్పుకోవడం లేదు… డిఫరెంటుగా ఉంది… హీరో కోసం ఏ బిల్డప్పులూ లేకుండా కేవలం కథే హీరో కావడం బాగనిపిస్తుంది… పెద్ద పెద్ద ట్విస్టులు లేకపోయినా సరే కథను గ్రిప్పింగుగా నడిపే విధానం బాగనిపిస్తుంది… బీభత్సమైన బీజీఎం ఉండదు… కథనానికి నప్పేలా ఉంటుంది… నటీనటుల్లో ఎవరిదీ ఓవరాక్షన్ ఉండదు… పాత్రకు ఎంత కావాలో అంతే… చివరగా… దృశ్యం సినిమాతో పోల్చుకుని చూడకపోతే సినిమా వోకే… జస్ట్ వోకే… దృశ్యం సినిమాకున్నంత దృశ్యం మాత్రం లేదు..!! ఇది వేరే దృశ్యం..!!
Share this Article