అనుపమ పరమేశ్వరన్… ఈ మలయాళీ నటి ఏడేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది… ఎక్కువగా తెలుగు సినిమాలే… లీడ్ రోలే కావాలని ఏమీలేదు… ఏ రోల్ ఇచ్చినా చేస్తుంది… నటన, అందం, అనుభవం ఉన్నా కానీ ఎందుకో రావల్సినంతగా పేరు, అవకాశాలు రావడం లేదేమో అనిపిస్తుంది… కార్తికేయ-2తో పాన్ ఇండియా రేంజులో పరిచయం అయ్యింది… ఇప్పుడు 18 పేజెస్ సినిమాతో అదే హీరో నిఖిల్‌తో కలిసి వచ్చింది…
నిజానికి ఆమె ఉన్నంతసేపూ ప్లజెంటుగా కనిపిస్తుంది… కార్తికేయ-2లో ఏదో కథాకథనాల బలంతో, ఆ టైమ్‌కు ట్రెండ్ సహకరించడంతో నిఖిల్ పాపులరైపోయాడు గానీ తను ఇంకా చాలా నేర్చుకోవాలి… నిష్ఠురంగా ఉన్నా సరే నిజం అదే… 18 పేజెస్ సినిమా చూస్తున్నంతసేపూ అనిపించేదీ అదే…
వాస్తవానికి ఇది ఎప్పుడో రావల్సిన సినిమా… 2019 బాపతు సినిమా… అల్లు అరవింద్, బన్నీవాసులు నిర్మాతలు, అందుకే అల్లు అర్జున్ ప్రిరిలీజ్‌కు వచ్చినట్టున్నాడు… సుకుమార్ సినిమాకు కథ రాయడమే కాదు, కొంత పెట్టుబడి కూడా పెట్టాడు… మరి ఈ పెద్దలంతా కలిసి ఏం చేశారు..? ఏమో… ఎంతకూ ముందుకు కదల్లేదు… తరువాత కథ మార్చారు… పలు సీన్లు రీషూట్ చేశారు…
Ads
దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ పనితీరు వాళ్లకు ఏమాత్రం నచ్చనట్టుంది… చివరాఖరికి చాలా కాంప్రమైజ్ అయిపోయి సినిమాను రిలీజ్ చేశారు తప్ప సినిమాలో పర్‌ఫెక్షన్ లేదు… పలుచోట్ల కథనం నీరసం… ప్రేక్షకుడిని కనెక్ట్ కాలేకపోతుంది… అల్లు అరవింద్, సుకుమార్‌లకు వేరే దిక్కులేక రిలీజుకు వోకే అన్నట్టున్నారు…
ఓ హీరోయిన్… ఫోన్ వాడదు… సోషల్ మీడియాలో ఉండదు… ఆమెకు ఓ లవ్వర్… కానీ ఆ పిల్లగాడికి తెలియనిది ఏమిటయ్యా అంటే… ఆ పిల్లకు మెమరీ లాస్ రోగం ఉంటుంది… అందుకని ఏరోజుకారోజు ఏం జరుగుతున్నదో ఓ డైరీలో రాసుకుంటుంది… ఓ డైరీలో 18వ రోజు, అంటే 18వ పేజీలో కిడ్నాప్ రికార్డవుతుంది… ఆ డైరీ ఆధారంగా హీరో ఇక కథను నడిపించాలన్నమాట…
భిన్నంగానే ఉంది కథ… కానీ అంతే భిన్నంగా ప్రజెంట్ చేయాలి… అక్కడ కొట్టింది తేడా… దర్శకుడు మరీ కొత్తేమీ కాదు… కరెంటు, కుమారి 21ఎఫ్ అనుభవం ఉండనే ఉంది… ఐనా ఎందుకిలా తడబడ్డాడు… సుకుమార్ తగినంత స్వేచ్ఛ ఇవ్వలేకపోవడంతో ఆ ఒత్తిడిలో సరిగ్గా సీన్లను ప్రజెంట్ చేయలేకపోయాడా..? మొత్తానికి మంచి ఫీల్ గుడ్ సినిమా కావల్సింది పోయి ఆ టార్గెట్ అందుకోలేకపోయింది…
ఇప్పటికీ మార్కెట్‌లో వేరే చూడబుల్ సినిమాలు ఏమీ లేవు కదా… అశ్లీలం, అసభ్యత, వెగటుతనం ఏమీ లేకుండా నీట్‌గా ఉన్న ఈ సినిమా ఒక చాయిస్… నిఖిల్‌కు తెలుగు సినిమా హీరో అవలక్షణాలేమీ పెద్దగా రుద్దలేదు… అదో రిలీఫ్… అన్నింటికీ మించి 55 ఏళు-60 ఏళ్ల హీరోలు… 30 లోపున్న హీరోయిన్లు… కలిసి పిచ్చి స్టెప్పులు వేస్తుంటే అదొక చిరాకు… ఇంతకుముందు ఫిమేల్ స్టార్లకు మేకప్ అవసరమయ్యేది బాగా… ఇప్పుడు హీరోల ముసలితనాల్ని కనిపించకుండా చేయడానికి మేకప్ మేన్ నానా కష్టాలూ పడాల్సి వస్తోంది… వాళ్లను భరించడంకన్నా అక్కడక్కడా లాజిక్ రాహిత్యాలున్నా సరే, 18 పేజెస్ నయం… నిఖిల్, అనుపమ జంట కూడా చూడటానికి బాగానే ఉంటుంది…!!
Share this Article