బహుశా మీరట్ పోలీస్ కమిషనర్ అనుకుంటా… పేరు సెల్వకుమారి… తన ఇంట్లో పెంపుడు కుక్క (జర్మన్ షెపర్డ్)… పేరు ఎకో… అది ఎక్కడో తప్పిపోయింది… ఉగ్రవాదులు, నేరాలు, చోరీలు, అత్యాచారాలు, దోపిడీలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటయ్… కానీ పోలీస్ కమిషనర్ కుక్కపిల్ల తప్పిపోవడం ఎంత దారుణం… కదా… దాంతో సెల్వకుమారి చెప్పకుండానే సకల పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది… ఆపరేషన్ షెపర్డ్…
మొత్తం సిటీని జల్లెడ పట్టారు… సిటీలో అలాంటి పెంపుడు కుక్కలు ఉన్నవే 19… మన పోలీసుల సామర్థ్య స్థాయిని బట్టి అన్నింటినీ చూస్తే తప్ప అందులో కమిషనర్ కుక్కపిల్ల ఉందో లేదో తెలియదు… ఇంకేముంది..? 36 గంటలపాటు శ్రమించి, చెమటోడ్చి, పరుగులు తీస్తూ 500 ఇళ్లు గాలించారు… బహుశా ఏ ఉగ్రవాది గురించీ దేశంలో ఈ రేంజ్ అన్వేషణ జరగలేదేమో… ఎలాగైతేనేం, చివరకు పట్టుకున్నారు… కథ ముక్తాయింపు ఏమిటంటే… గేటు తీసి ఉంటే ఆ కుక్కపిల్ల బజారులో షికార్లకు వెళ్లిందట… ఇందరు పోలీసులకు దొరకలేదు గానీ, ఆ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటే ఆ పరిసరాల ప్రజలే తీసుకొచ్చి అప్పగించారట… గ్రేట్… యోగి సర్కారు ఇజ్జత్ నిలబడింది… (జిల్లా అటవీ సంరక్షణాధికారి సైతం స్వయంగా గాలింపు ఆపరేషన్‌లో కష్టపడ్డాడట)…
అవునూ, అప్పట్లో ఆజంఖాన్ అనే మంత్రి బర్రెలు తప్పిపోతే వందల మంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు… గుర్తుందా..? ఈ కమిషనర్‌కూ ఆ మంత్రికీ ఏమైనా తేడా ఉందా..? పోనీ, అప్పటి సీఎం అఖిలేష్‌కూ ఇప్పటి సీఎం యోగికి నడుమ ఇలాంటి విషయాల్లో ఏమైనా తేడా ఉందా..? ఎవడి చేతిలో అధికారం అనే బడిత ఉంటే వాళ్లదే రాజ్యం… వాళ్లే రాజులు… యోగి సర్కారు సదరు కమిషనర్ మీద చర్యలు తీసుకుని ఉంటే ఎలా ఉండేది… ప్చ్, ఆయన ప్రయారిటీల్లో, పాలనాంశాల్లో ఇవి కనిపించి ఉండవు…
Ads
సీన్ కట్ చేయండి… మరో కథకు వెళ్దాం… అదే ఉత్తరప్రదేశం… బులంద్ షహర్ జిల్లా… ఎస్పీ పేరు అనుకృతి శర్మ… మామూలుగా పోలీసులు, ప్రజల మధ్య సత్సంబంధాల కోసం రాష్ట్రంలో అక్కడక్కడా పోలీస్‌చౌపల్ అనే కార్యక్రమం నిర్వర్తిస్తుంటారు… ఓసారి నూర్జహాన్ అనే 70 ఏళ్ల ముసలావిడ తన ఇంట్లో ఇప్పటికీ కరెంటు లేదని చెప్పింది… అనుకృతి ఆశ్చర్యపోయింది, కదిలిపోయింది… బులావో కరెంటు అధికార్లను అని ఆదేశించింది…
ఎస్పీ గారు ఆదేశించాక కరెంటు సిబ్బంది కదలరా ఏం..? అసలే యూపీలో ఉన్నది పోలీస్ రాజ్యం… బుల్లెట్లు, బుల్‌డోజర్ల రాజ్యం… అప్పటికప్పుడు ఆ ఇంటికి మీటర్ పెట్టారు, లైట్ పెట్టారు, ఆమె ఇంట్లో వెలుగులు నిండాయి… అందరూ చప్పట్లు కొట్టారు… ఈ ఫోటోలు వైరల్, సోషల్ మీడియా ఆహా ఓహో… నిజమే, ఒక ఎస్పీ మానవీయ స్పందన గ్రేట్ అనుకుందాం… కానీ యోగి సర్కరు సిగ్గుపడకూడదా..? పాత ప్రభుత్వాలకు సిగ్గులేదు సరే… సగటు మనిషికి విద్య, వైద్యం, తిండి, గూడు, గుడ్డ ఎలా నిత్యవసరమో విద్యుత్తు కూడా అంతే కదా… ప్రతి ఇంటికీ కరెంటు అనే ఆలోచన ఎందుకు చేయలేదు..? 70 ఏళ్ల ఒక మహిళ కుటుంబం ఇన్నేళ్లూ చీకట్లోనే బతికింది…
కొన్ని రాష్ట్రాలు 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంటు అని ఎన్నికల వాగ్దానాలు ఇచ్చి వోటర్లను ప్రలోభపెడుతున్నయ్… వోట్లను కొనుగోలు చేసే స్కీముల్లో ఇదీ ఒకటి… కానీ యూపీలో ఈరోజుకూ ప్రజలు ఉచిత కరెంటు మాట దేవుడెరుగు, ముందు కరెంటు కనెక్షన్ ఇవ్వండ్రా బాబోయ్ అని మొత్తుకునే రోజుల్లోనే బతుకుతున్నారు… పిటీ… పాలకుల ప్రధాన కర్తవ్యాలేమిటో పాలకులకే తెలియడం లేదు… కరెంటు లేని ఇల్లు ఉండొద్దు అని రెగ్యులేటరీ కమిషన్లు ఎందుకు ఆర్డర్ ఇవ్వలేకపోతున్నయ్… పై రెండు కథల్లో మనం చెప్పుకునేది ఇద్దరు మహిళా ఐపీఎస్ అధికారుల మానవీయత, పెత్తనపు పోకడల నడుమ తేడా… కానీ రెండింటిలోనూ ఒకే సామ్యం… ఓ కుక్కపిల్ల కోసం మొత్తం పోలీస్ యంత్రాంగం బజార్లలో పడి, ప్రతి ఇల్లూ గాలించడం మన వ్యవస్థ వైఫల్యం… సేమ్, ఇప్పటికీ కరెంటు లేని ఇల్లు ఉండటం మరో వైఫల్యం… అదీ వ్యవస్థదే…
Share this Article