‘Two” times: భాషలో వందంటే వంద కాదు. వెయ్యంటే వెయ్యి కాదు. “శతమనంతం భవతి” అని ఒక ప్రమాణం ఉండనే ఉంది. వంద, వెయ్యి అంటే ఎక్కువ, లెక్కలేనంత అని పిండితార్థం. సహస్రనామాలు అంటే 999 తరువాత వెయ్యి అని లెక్కలు చూసుకోవడం అలవాటైపోయి…సహస్రం అంటే వెయ్యికే పరిమితమైపోయాము. అష్టోత్తర శతం అంటే సరిగ్గా 108 లెక్క సరిపోయినట్లు…సంస్కృతం, తెలుగు భాషల్లో వందకు, వెయ్యికి లెక్క సరిపోవాల్సిన పని లేదు. అందుకే నువ్ వంద చెప్పు…వెయ్యి చెప్పు…నేనొప్పుకోను అని వాడుక మాట పుట్టింది.
ఒక వెయ్యికే దిక్కు లేనప్పుడు రెండు వేలకు మాత్రం దిక్కెలా ఉంటుంది? అందుకే రెండు వేల నోటు పుట్టి…పెరిగి…ప్రాయంలోకి రాకుండానే…బుడి బుడి అడుగులు దాటకుండానే…బతికి బట్టకట్టుకుని…బయట తిరక్కుండానే పోయింది. ఎవరికీ చెప్పుకోలేక…చప్పుడు చేయకుండా…మౌనంగా పోయింది.
అంత పెద్ద నోటుకు ఎంత ఘనంగా అంత్యక్రియలు జరిగి ఉండాల్సింది?
ఎవరూ లేని అనాథ ప్రేతంలా పోయింది.
ఒక కన్నీరు లేదు. పాడె మోయడానికి నా అన్న నాలుగు నోట్లు కూడా తోడు లేవు. సానుభుతుల్లేవు. భాయీయో ఔర్ బెహనో! దేవియో ఔర్ సజ్జనో! అన్న చిటికెల పందిళ్ల సంతాప సమావేశాల వేషాల్లేవు. ఆరు లక్షల కోట్ల విలువను మోసిన నోటు ఏమాత్రం విలువ లేనిదై…బరువులేనిదై…దాని ఊపిరి అనంతవాయువుల్లో కలిసిపోయింది.
Ads
అ-ద్వి కలిపితే అద్వైత సిద్ధాంతం. అంటే రెండు కానిది- ఒకటే అని అర్థం. భారతీయ సనాతన ధర్మానికి ఈ అద్వైత సిద్ధాంతమే మూల స్తంభం. భారతీయ రిజర్వ్ బ్యాంక్- ఆర్బిఐ కూడా భారతీయ సనాతన ధర్మం చెట్టుకు ఒకానొక కొమ్మే. ఈ మధ్య భారతీయుల్లో ఒకటి కాని రెండు మీద యావ పెరిగినట్లు ఆర్బిఐ గుర్తించింది. దాంతో ఆనాడు దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఆది శంకరాచార్యులు బోధించి…ప్రచారం చేసిన తిరుగులేని అద్వైత సిద్ధాంతాన్ని మళ్లీ జాతి జనులకు బోధించి…ప్రచారం చేయాలని ఆర్బిఐ బరువెక్కిన గుండెతో నిర్ణయం తీసుకుంది.
ఆర్ బి ఐ హిత బోధ:-
1. రెండు వేల నోటు సెప్టెంబరు వరకు ఐసియులో ఎక్మో మీద ఉంటుంది.
2. దాని ఊపిరిని ఎవరూ బలవంతంగా తీయకపోయినా… ఎందుకో దానికదిగా ఊపిరి తీసుకోలేకపోతోంది.
3. బారసాల రోజే దాని జాతకంలో చావు రోజు మాకు తెలిసినా…జాతకాలను అందరూ నమ్మరని బయట ప్రపంచానికి చెప్పలేదు.
4. నోట్ల రద్దు తరువాత జనమెవరూ మళ్లీ రోడ్ల మీదికి రాకపోవడంతో మాకు నిద్ర పట్టడం లేదు. మా నిద్ర కోసం మీకు నిద్ర లేకుండా చేయాల్సి వచ్చిందంతే!
సామాన్యుల కోణం:-
1. అసలు రెండు వేల నోటు మనుగడలో ఉందా?
2. ఉంటే…సామాన్యుల దగ్గర ఎందుకు లేదు?
రాజకీయ కోణం:-
1. సరిగ్గా ఎన్నికలకు ముందే నోట్లు ఎందుకు రద్దు అవుతూ ఉంటాయి?
2. ఆరు లక్షల కోట్ల విలువయిన రెండు వేల నోట్లను సెప్టెంబరులోపు గౌరవప్రదంగా మార్చుకోవడం సాధ్యమయ్యే పనేనా?
ఆర్థిక కోణం:-
1. చేతిలో నోటుకు ఇప్పుడు విలువ ఉందా?
2. మఖలో పుట్టి పుబ్బలో పోయే నోట్ల ముద్రణకు అయిన ఖర్చెంత?
3. ఆ సో కాల్డ్ నోట్ల మార్పిడిలో పోయిన ప్రాణాలెన్ని?
4. దేశ ఆర్థిక స్వావలంబనకు అది ఉపయోగపడిందా? తూట్లు పొడిచిందా?
వైరాగ్య కోణం:-
“పుట్టినప్పుడు నోటు లేదు;
పోయేప్పుడు నోటు రాదు;
మధ్య నోటు చూడ నగుబాటు కాదొకో!”
ఇప్పుడు రెండుకు మూడింది. భవిష్యత్తులో ఎన్నింటికి మూడుతుందో ఎవరికెరుక?
ఏది రేటు?
ఏది నోటు?
ఏది కాటు?
ఏది చేటు?
ఏది సత్యం?
ఏదసత్యం?
ఏది వెలుతురు?
ఏది చీకటి?
ఓ మహాత్మా!
ఓ మహర్షీ!!
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article