Prasen Bellamkonda………… తెలుగు నాట జర్నలిజంలో పేజ్ 3, పేజ్ వన్ లోకి తోసుకొచ్చి ఎంత కాలమైంది… ? ఒకప్పుడు తన తల్లి మరణ వార్తను ప్రముఖంగా ప్రచురించవద్దని నిర్ణయించుకున్న పత్రికా యజమాని పేపర్లోనే ఆయన మనవరాలి పెళ్లి వార్త మూడు ఫుల్ పేజీలకు వ్యాపించింది. రెండు ఫుల్ పేజీల ఫోటోలు, పేజ్ వన్‌లో పావు పేజీ, రెండో పేజీలో అర పేజీ, వెరశి కొంచెం కాదుగానీ చాలా ఎక్కువే… సరే, లోపలి పేజీల్లో ఓకే అనుకున్నా మరీ పేజ్ వన్‌లో, అదీ 13 ప్రతిపక్ష పార్టీలు దేశం మతోన్మాదం పెరుగుతోందని ప్రజలకు రాసిన లేఖ వార్తకంటే పెద్దగా..!! వాటే న్యూస్…? పైగా జీలకర్ర బెల్లం పెట్టారట. మంగళ వాయిద్యాలు మోగాయట. మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారట. ఇంకే పెళ్ళిలోనూ ఇవన్నీ జరగనట్టు…. ఆ పత్రికలో నిత్యం వచ్చే భాషను మించిన సంస్కృతంలో వార్తారచన…
8 రూపాయలు పెట్టి పాఠకుడు కొనుక్కుంటున్న పత్రికలో, కరోనా దెబ్బకు పేపర్లన్నీ బక్కచిక్కిన కాలంలో, టాబ్లాయిడ్లు గల్లంతయిన వేళ ఇది చదువరికి ఇంత విస్తృతంగా అవసరమా అని అడిగితే తప్పు కాదేమో… ఉప రాష్ట్రపతులు, ముఖ్య మంత్రులు వచ్చారు కనుక పెద్ద వార్తే అనుకుంటే, వాళ్ళు రావడం వార్తా? వాళ్ళు వచ్చిన పెళ్లి వార్తనా?
Ads
సెలబ్రిటీల ప్రయివేట్ వ్యవహారాల పట్ల ఆసక్తి ఎవరికైనా ఎక్కువే కనుక అది కచ్చితంగా అమ్ముడు సరుకే. అయితే హద్దులు ఎంత వరకు అన్నదే ప్రశ్న. సన్ పత్రిక పేజ్ 3 తీసేయాలనుకుని సర్వే నిర్వహిస్తే అందరూ అది పాఠకులకే వదిలెయ్యాలి, వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు, అది నచ్చితే పత్రిక అమ్ముడవుతుంది, లేకుంటే లేదు, అదే కొలమానం అని చెప్పారట… ఇప్పుడూ అంతే అనుకోవాలి బహుశా…పత్రికలు తమ ఉద్దేశ్యాలను, ఆలోచనలను, ప్రయోజనాలను ప్రజల మీద రుద్దడం మనకు కొత్త కాదు. రాసింది చదువు, చూపింది చూడు, చరిత్ర అడక్కు అన్న మీడియా నిరంకుశత్వానికి ఇలాంటి ఉదాహరణలెన్నో… మనం పేజ్ 3 పాఠకులమా పేజ్ వన్ పాఠకులమా అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకుని పేజీలు మళ్లేయడమే అసలు సిసలు పరిష్కారం కావచ్చు…
((ఈ పెళ్లికి జగన్ వెళ్లినట్టు లేదు… ఫోటోల్లో కనిపించలేదు… తప్పకుండా పిలిచే ఉంటారు… వెళ్లి ఉండాల్సిందేమో… ఎంతటి మారీచ మీడియా అయినా, తనకు పడని పత్రికే అయినా సరే… మర్యాద పాటించినట్టు ఉండేది… గతంలో తను వెళ్లి కలవలేదా..? గతంలో ఏదో ఫంక్షన్‌కు వెళ్లలేదా..? రాజకీయాలు, ప్రత్యర్థితనం మాటెలా ఉన్నా… పెళ్లికూతురి తల్లి శైలజ, జగన్ భార్య నడుమ సత్సంబంధాలు, స్నేహం ఉన్నట్టు గుర్తు… తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక రంగాల అతిరథ మహారథులు హాజరైన కల్యాణం… సదరు మీడియా సంస్థ తీసుకున్న రాజకీయ ధోరణితోనే తనకు సమస్య తప్ప, మిగతా అంశాల్లో గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటామని చెప్పినట్టు ఉండేదేమో… ప్రత్యర్థి మీడియా అయినా సరే — ముచ్చట…))
Share this Article