అతను ఓ చరిత్రకారుడు కాదు, పురావస్తు అధికారి కాదు… కనీసం రీసెర్చ్ స్కాలర్ కూడా అసలే కాదు… సాహిత్యకారుడు కూడా కాదు… ఆ కేటగిరీల్లోని వాళ్లు చేయని పనిని, చేయలేని పనిని, చేతకాని పనిని 42 ఏళ్ల మనిమేల శివశంకర్ చేస్తున్నాడు… ఇంతకీ ఆయన ఏమిటో తెలుసా…? అయిదో తరగతి డ్రాపవుట్… ఓ గుంటూరులోని ఓ ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు ఆఫీసులో హమాలీ…
తనకున్న స్పేర్ టైమ్‌లో (దొరికేదే తక్కువ) పాత శాసనాలు, పుస్తకాలు, చారిత్రిక ఆధారాల వెంబడి పడేవాడు… లైబ్రరీలకు వెళ్లేవాడు… గుళ్లకు వెళ్లి అక్కడున్న వివరాలను చదివేవాడు… గ్రామాలు, శివారు గ్రామాల చరిత్రలన్నీ వడబోసేవాడు… తనకు ఆసక్తిగా కనిపించిన ఊరు ఎక్కడుందో, అసలు ఉందో లేదో కనుక్కునేవాడు… ఇలా ప్రయాసపడి పడీ దాదాపు 500 గ్రామాల చరిత్రల్ని వడబోశాడు… ఆ గ్రామాలు ఎలాంటివో తెలుసా..? పాత గుంటూరు జిల్లాలోని ఆ గ్రామాలు ఇప్పుడు లేవు, కనీసం రికార్డుల్లో కూడా…!
మనలో చాలామందికి తమ వంశవృక్షాల వివరాలను సేకరించడం అలవాటు… కానీ అనేక వివరాలు దొరకవు… అలాంటిది మాయమైపోయిన 500 ఊళ్ల జాడల్ని, కారణాల్ని పట్టుకోవడం అంటే మాటలా..? ఒక ఫిఫ్త్ క్లాస్ డ్రాపవుట్, ఒక హమాలీ ఆ పనిచేశాడు… ఆయన భార్య పేరు లక్ష్మిరాజ్యం… ఆమె 12 వరకూ చదువుకుంది… ఆమెతోపాటు మరో ఇద్దరి సాయం తీసుకుని ‘గుంటూరు జిల్లా అదృశ్య గ్రామాలు’ అని ఓ పుస్తకాన్నే వెలువరించాడు శివశంకర్… బాగా అభినందించాల్సిన ప్రయాసే ఇది…
Ads
ఎక్కడో ఏదో పత్రికలో చిన్న వార్త వస్తే… హైదరాబాద్ హిందుస్థాన్ టైమ్స్ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అప్పరుసు శ్రీనివాసరావు ఆయనతో మాట్లాడి, మరిన్ని వివరాలు తీసుకుని ఆరు కాలాల ఫుల్ లెన్త్ స్టోరీ ఫైల్ చేశాడు… బాగుంది… ‘‘నాకు ఎందుకు ఈ ఐడియా తట్టిందో, దీనిపై వర్క్ చేయాలని ఎందుకు అనిపించిందో సరిగ్గా చెప్పలేను, కానీ నర్సరావుపేటలోని కోటప్పకొండ గుడికి వెళ్లినప్పుడు, ఐదేళ్ల క్రితం ఇది మైండ్‌లోకి చేరి కూర్చుంది… అక్కడున్న ఓ శాసనంలో కొన్ని అదృశ్యమైపోయిన ఊళ్ల పేర్లున్నాయి…
ఇక అప్పటి నుంచి ఎప్పుడు కాస్త ఖాళీ దొరికితే అప్పుడు రోడ్ సైడ్ బుక్ షాపుల వెంబడి తిరిగేవాడిని… పాత చరిత్ర పుస్తకాల కోసం వెదికేవాడిని… గుళ్లల్లో, ఇతర ప్రదేశాల్లో ఉన్న శాసనాల్ని చదివేవాడిని… 18వ శతాబ్దపు స్కాటిష్ ఆర్మీ ఆఫీసర్ (బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ) కల్నల్ కోలిన్ మెకంజీ సేకరించిన రికార్డులను కూడా చదివాను… ఆయనే ఇండియాకు తొలి సర్వేయర్ జనరల్ అయ్యాడు… దక్షిణ భారతంలో ఇలా మాయమైపోయిన ఊళ్ల కైఫియత్ వివరాలు విస్తృతంగా సర్వే చేశాడు ఆయన… దానికి లోకల్ స్కాలర్స్ సాయం తీసుకునేవాడు… ఆయన రాతప్రతులు నాకు మాయమైపోయిన అనేక ఊళ్ల వివరాలను తెలియచెప్పాయి’’ అంటున్నాడు శివశంకర్…
బ్రిటిష్ కాలం నాటి మాన్యువల్స్, రికార్డులు, గెజిట్స్, సాహిత్యం, పాత కవిత్వాలు, పాత మ్యాపులు గట్రా పరిశీలించి వివరాల్ని నమోదు చేసుకునేవాడు… వయోవృద్ధులను అడిగి తెలుసుకునేవాడు… శివశంకర్ ఇలా ఊళ్లు మాయమైపోవడానికి 28 కారణాలను ఎస్టాబ్లిష్ చేశాడు… ఊళ్ల నుంచి జనం వలసపోవడం.., వరదలు, కరువు వంటి విపత్తులతో జనం ఊళ్లు విడిచిపెట్టడం… దెయ్యాలు వంటి మూఢనమ్మకాలు… స్థానిక ఫ్యూడల్ భూస్వాములు, పెత్తందార్ల వేధింపులు, పన్నులు… క్రూరమృగాల తాకిడి తదితర కారణాలు ఎన్నో…! నాగార్జునసాగర్, పులిచింతల వంటి కృష్ణా ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ కూడా ఓ ప్రధాన కారణమే…
ఒరిజినల్ ఊళ్లు పక్కనున్న ఊళ్లలో కలిసిపోవడం, పూర్తిగా మరెక్కడికో వలసపోయి, ఏకంగా తమ ఉనికినే కోల్పోవడం సహజమే… ‘‘పింగళి అనే ఊరు ఒకటి ఉండేది… ఈ ఇంటిపేరున్న కుటుంబాలు వేలల్లో ఉంటాయి తెలంగాణలో, ఏపీలో… విజయనగర సామ్రాజ్యంలో పింగళి సూరన్న అనే ఫేమస్ కవి ఉండేవాడు… మన జాతీయ పతాక రూపకర్త వెంకయ్య ఇంటిపేరు కూడా పింగళి… పాపులర్ తెలుగు సినిమా రచయిత పింగళి నాగేందర్రావు తదితరులు… ఇప్పుడు ఆ ఊరే లేదు… వరదలతో జనమంతా వలసవెళ్లిపోయారు…’’ అని ఓ ఉదాహరణ చెప్పాడు శివశంకర్…
‘‘శ్రీనాథుడు తన పద్యాల్లో ఉదహరించిన బొడ్డుపల్లి కూడా ఎప్పుడో మాయమైంది… శ్రీనాథుడి పద్యాల్లోనే దొరికిన హింట్స్ ఆధారంగా అది అమరావతి దరిదాపుల్లో ఉండేదని కనిపెట్టాను… అది కృష్ణాలో కలిసే గొడ్డేరు వాగు ఒడ్డున ఉండేది… ఇలా మాయమైపోయిన అనేక ఊళ్లకు విశిష్టత ఉంది… చదివేకొద్దీ, తెలుసుకునేకొద్దీ ఆసక్తికరం… నాకున్న సాధనసంపత్తి తక్కువ, నాకు చేతనైనంత నేను చేశాను… ఇంకెవరైనా పూర్తి స్థాయిలో ఈ రీసెర్చ్ చేస్తే ఇంకెన్ని విశేషాలు తెలుస్తాయో కదా’’ అని వినయంగా చెబుతున్నాడు శివశంకర్… గ్రేట్…
Share this Article