పెద్ద తిమింగలం… నిన్న రెరా, హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిపితే 500 కోట్ల అక్రమ, అవినీతి సంపాదన బట్టబయలైంది… మొత్తం లెక్కింపు పూర్తయితే ఇంకా ఎన్ని వందల కోట్లో తెలియదు… ఆఫ్టరాల్, పర్మిషన్లతో సహకరిస్తేనే ఇంత సొమ్ము వెనకేసుకున్నాడు అంటే, మరి పదేళ్లలో హైదరాబాదులో భూములు, భవనాలు, క్రమబద్ధీకరణలు, కబ్జాలకు తెగబడిన అధికార పార్టీ ముఖ్యుల అరాచకాల స్థాయి ఎన్ని వేల కోట్లు..?
రేవంత్ మాటల్లో చెప్పాలంటే… బీఆర్ఎస్ హైదరాబాద్ నగరాన్నే కబ్జా చేసింది… ఈ రేంజ్ అవినీతి కనీసం ఊహించలేనంత..! ఏసీబీ ఇప్పుడు చేయాల్సింది ఈ రెరా అనకొండ సొంత అవినీతి పుట్టను బద్దలు కొట్టడమే కాదు… తను సహకరించిన పెద్ద పెద్ద బాగోతాల గుట్టు బహిరంగం చేయడం..! అవును, పదేళ్ల పాపాల పుట్టలన్నీ పగలాల్సిందే… ధరణి, కాలేశ్వరం, హైదరాబాద్ భూస్కాంల దగ్గర నుంచి అన్నీ బయటపడాల్సిందే… రేవంత్ సర్కారు తెలంగాణ సమాజానికి కేసీయార్ పాలన దుర్గంధాన్ని ప్రజలకు చెప్పగలిగితే ప్రస్తుతానికి అదే పదివేలు…
అన్ని వైఫల్యాలు, అన్ని కుంభకోణాలు కలిపి లెక్కేస్తే తెలంగాణ సమాజం ఎన్ని లక్షల కోట్లను కోల్పోయిందో..! ఇక తెలంగాణకు ఈ స్థాయిలో ఎవరూ ద్రోహం చేయలేరు… నిజమే, ఓ మిత్రుడు చెప్పినట్టు బీఆర్ఎస్ వికృత స్వరూపం కనిపిస్తే ఇప్పడు చేయగలిగింది ఏముంది..? ఛిద్ర తెలంగాణను గమనించి వాపోవడం తప్ప… ఒకవైపు చీకటి, నలుపు, వికారం ఇలా కనిపిస్తుంటే… ఏడవకండి, ఏడవకండి, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అంటూ చిన్న దొర ఊరూరా క్యాంపులు పెట్టి ప్రచారం చేస్తున్నాడు… త్వరలో మళ్లీ ఆ పాత భూతం మళ్లీ జనం మీద పడుతుందట…
Ads
‘రేవంత్ మరో షిండే అవుతాడు, త్వరలో మళ్లీ కేసీయారే సీఎం’ అన్నాడు నిన్న ఎక్కడో… ఎలా..? రేవంత్‌ను కూల్చడానికి అప్పుడే కుట్రలు మొదలు పెట్టేశారా..? కాంగ్రెస్‌లో ఆల్రెడీ కోవర్టులను యాక్టివేట్ చేస్తున్నారా..? లేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్‌ను కలిసిన ఫోటో చూసి, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందా..? ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ దాడి రెండు వైపులా మొదలైతే అసలు మా పార్టీ గతేమిటనే సందేహం పట్టుకుందా… జనం థూత్కరించి పట్టుమని నాలుగు రోజులు కాలేదు, కాల్చేస్తాం కూల్చేస్తాం అని గాయిగత్తర స్టార్ట్ చేయడం దేనికి..?
అవునూ, రేవంత్ షిండే అవుతాడనే అనుకుందాం… తను షిండే అయిపోతే కేసీయార్ సీఎం ఎలా అవుతాడు..? ఏదో ఫ్రస్ట్రేషన్‌లో తలాతోక లేని లాజిక్కులకు అందని వాదనలతో కార్యకర్తలను, ప్రజలను మళ్లీ మళ్లీ పిచ్చోళ్లను చేయడం తప్ప… మళ్లీ బీఆర్ఎస్ పేరు మార్చి, టీఆర్ఎస్ అని మారుస్తారట… ఏమైంది..? మాజీ ముఖ్యమంత్రులు వాఘేలా, గొమాంగో, కుమారస్వామి తదితరులను కొనేసి, జాతీయ స్థాయిలో ఉద్దరిస్తామని చెప్పితిరి కదా… ఎండిపోయిన ఆ చెట్లకు ఎందుకు తెలంగాణ సొమ్మును ఖర్చుపెట్టినట్టు..?
తికాయత్‌లు, ప్రకాశ్‌రాజ్‌లు, ప్రశాంత్ కిషోర్‌లు… ఏమైపోయారు..? మొత్తం విపక్షానికి ప్రచారఖర్చు నేనే పెట్టుకుంటాననేంత ధైర్యం ఏ సంపాదన సొమ్ము ఇచ్చింది..? జాతీయ స్థాయిలో అయ్యో పాపం అని జాలిపడే ఒక్క రాజకీయ గొంతు ఉందా ఇప్పుడు..? కాలం అందరికీ సమాధానం చెబుతుంది… ప్రకృతి అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది… మొన్నమొన్ననే కదా మొదలైంది..!!
Share this Article