మాంచి థగడా కేరక్టర్ ప్రత్యర్థిగా మారితే కదా తెలిసేది మనం వీరులమో, బీరువులమో… శివసేన బాస్ ఉద్దవ్ ఠాక్రే పరిస్థితి దీనికి సరిగ్గా సరిపోతుంది… ఇన్నాళ్లూ తను ఠాక్రే కొడుకు, వారసత్వంగా శివసేనకు బాస్… అంతే… ఎప్పుడైతే ఏకనాథ్ షిండే అనబడే ఖతర్నాక్ కేరక్టర్ ఎదురుతిరిగిందో, ఇంకేముంది..? ఒక్కొక్కరూ వరుసకట్టి తన వెనుక నిలబడుతున్నారు… ఠాక్రే దురవస్థ ఖడ్గతిక్కనే అయిపోతోంది…
తాజా ఉదాహరణ ఏమిటంటే..? థానే మున్సిపల్ కార్పొరేషన్… ముంబై కార్పొరేషన్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న కార్పొరేషన్ థానే… ఆ పాలకమండలిలో శివసేనకు 67 మంది కార్పొరేటర్లు… తాజాగా 66 మంది బుధవారం రాత్రి వెళ్లి షిండేకు జై అనేశారు… ఇక తరువాత ‘‘ఆపరేషన్ ముంబై కార్పొరేషన్’’ ఉంటుందట… ముంబై కార్పొరేషన్ మీద పెత్తనం అంటే మహారాష్ట్ర మీద సగం పెత్తనంతో సమానం…
నిజానికి థానే ముఖ్యమంత్రి షిండే అడ్డా… తను చెప్పిందే నడుస్తుంది అక్కడ… ఏళ్లుగా పాతుకుపోయాడు… తను చెప్పినవాళ్లకే మున్సిపల్, జిల్లా పరిషత్ ఎట్సెట్రా టికెట్లు… దాదాపు తను స్వయంగా బరిలో ఉన్నట్టుగానే వాళ్లకు ప్రచారం చేస్తాడు… సో, 67 మందిలో 66 మంది షిండే వెనుక చేరిపోయారంటే పెద్దగా ఆశ్చర్యపడనక్కర్లేదు…
Ads
ఆల్‌రెడీ 18 మందికిగాను 12, 13 మంది ఎంపీలు షిండేకు సపోర్టుగా ఉన్నారు… కానీ ఇంకా బయటపడటం లేదు… 56 మంది ఎమ్మెల్యేలకు గాను 40 మంది ఆల్‌రెడీ జంప్… 20 మంది వరకూ మాజీ ఎమ్మెల్యేలు కూడా షిండేయే మా నాయకుడు అంటున్నారు… రాష్ట్రంలో ఇతర చోట్ల మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తుల్లో కూడా ఈ విధేయత ప్రకటనల పర్వం సాగబోతోంది… ఇదెక్కడివరకు దారితీయబోతోంది..?
ఒకవేళ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు కూడా షిండేకు జై అంటే… శివసేన పార్టీ, ఎన్నికల గుర్తుతో సహా షిండే పరమవుతుంది… ఇప్పుడు షిండేకు తొందరేముంది..? తక్షణ ప్రమాదం ఏమీ లేదు… మెల్లిమెల్లిగా బలాన్ని సమీకరించుకుంటూ, ఠాక్రే క్యాంపును నిర్మానుష్యం చేసే దిశలో వెళ్తున్నాడు… చివరకు మిగిలేది ఎవరు..? ఉద్దవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే… తోడుగా సంజయ్ రౌత్… అంతేనేమో…!
Share this Article