అప్పట్లో విఠలాచార్య తీసిన సినిమాలు ఓసారి గుర్తుకుతెచ్చుకుందాం… ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ అప్పట్లో లేదు, వీఎఫ్‌ఎక్స్ లేదు… ఐనా సరే, సినిమాల్లో ట్రిక్కుల దృశ్యాలు అనగా మన కళ్లను మాయచేసే ఎన్నో చిత్రీకరించాడు… అనేక సినిమాలు హిట్… ఈ సీన్లకన్నా కథ చెప్పే తీరుతో ఆకట్టుకునేవాడు… అంతెందుకు..? ఆదిత్య 369లో గ్రాఫిక్స్ ఏమున్నాయని..? సినిమా సూపర్ హిట్… కారణం :: కథ చెప్పే విధానమే… రోబో సినిమా గ్రాఫిక్స్ ప్రధానమే కానీ మహేశ్ నాని, సూర్య 24 టైమ్ ట్రావెల్ కథలే… రాబోయే ప్రభాస్ ప్రాజెక్టు కె కూడా టైమ్ ట్రావెల్ కథే అంటున్నారు…
ఇక ఇంగ్లిషు సినిమాలైతే టైమ్ ట్రావెల్ మీద బోలెడున్నయ్… ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతారు ఆ దర్శకులు… ఇప్పటి తరానికి తెలిసిన ప్రముఖ సినిమాలు టైటానిక్, అవతార్ ఎట్సెట్రా… అవతార్-2 అయితే టాప్ క్లాస్ గ్రాఫిక్స్… ఆ సినిమాలు హిట్ కావడానికి టెక్నాలజీ కూడా దోహదపడిందే తప్ప దాంతోనే హిట్ కాలేదు… కథాబలమే ముఖ్యం…
తెలుగులో వచ్చిన 7.11 పీఎం సినిమా చూస్తుంటే ఇవన్నీ గుర్తొస్తుంటాయి… ఫాఫం, ఈ సినిమాకు సరిపడా బడ్జెట్ సమకూరనట్టుంది… సో, దర్శకుడు కూడా ఏం చేయగలడు పాపం… ఉన్నంతలో సినిమాలో నాణ్యత కోసం ప్రయత్నించాడు, వీలుగాక ఎలాగోలా చుట్టేశాడు… కాకపోతే ఉన్నంతలో కథను కాస్త ఆకట్టుకునేలా చెప్పడానికి ప్రయత్నమైతే చేశాడు… కానీ ఎక్కడికక్కడ లోబడ్జెట్ ఆంక్షలు, పరిమితుల్లో పడి సినిమాలో టెక్నాలజీ అవసరపడే సీన్లు అంతగా రక్తికట్టలేదు… అయితే నిర్మాత, దర్శకుల అభిరుచిని, ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవాలి…
Ads
వందల కోట్లు తగలేసి తీసిన ఆ చెత్తా ఆదిపురుష్‌తో పోలిస్తే ఇలాంటి కొత్త సినిమాలు నయమే అనిపిస్తాయి… సో, టెక్నాలజీ మాత్రమే ఉంటే సరిపోదు… దాన్ని సమర్థంగా ఉపయోగించుకునే కథ, కథనం, దర్శకుడి తెలివిడి అవసరం… ఈ 7.11 పీఎం సినిమా టైమ్ ట్రావెల్‌కు సంబంధించిన కథ… సో, కథకు తగ్గనట్టు నిర్మాణ విలువలు గనుక సమకూరి ఉంటే సినిమా ఓ మోస్తరు రేంజ్ అందుకునేదేమో… పాటలు శుద్ధ దండుగ… సీరియస్ కథనానికి స్పీడ్ బ్రేకర్లు…
నటులు పెద్దగా పరిచయం లేనివాళ్లే… హీరో అనుకోకుండా ఓ బస్సు ఎక్కేస్తాడు… అదేమో టైమ్ మిషన్… తెల్లారేసరికి తను మెల్‌బోర్న్ బీచులో తేలతాడు… అదెలా అంటారా..? టైమ్‌లో ట్రావెల్ చేయడం వల్ల…! ఇలాంటి ఫిక్షన్‌కు తోడు కథలో లోకల్ రాజకీయాలు, తన ప్రేమ, తన ఊరి సమస్యలు ఎట్సెట్రా ఉంటాయ్… దాని గురించి వదిలేస్తే… ఒక సైన్స్ ఫిక్షన్ కథ రక్తికట్టేలా చెప్పడం అంత ఈజీ కాదు… ఈ సినిమాలో దర్శకుడు తడబడ్డాడు… తడబడ్డట్టు స్పష్టంగా ప్రేక్షకుడికి అర్థమైపోతూనే ఉంటుంది కూడా…
రెండు గ్రహాలు, మూడు కాలాల్లో ప్రయాణం… కథ సాగేది ఇలాగే… సైన్స్ ఫిక్షన్‌కు క్రైమ్ కలపాలనే ఆలోచన బాగున్నా సరే, ఆ ఫ్యూజన్ సరిగ్గా కుదరలేదు… చివరగా… హీరో హీరోయిన్లు ఓ మోస్తరు నటనను ప్రదర్శించారు… కానీ విలన్ బాగా చేశాడు… ఓ మూస నుంచి తెలుగు కథను బయటికి లాగే ప్రయత్నాన్ని మనం అభినందించాలి… ఎటొచ్చీ ఇంకాస్త నాణ్యత ఉంటే బాగుండు…!! వర్తమాన పోటీయుగంలో ఓ మోస్తరు సినిమా అంటే ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం లేదు… కొత్తగా తనను థ్రిల్ చేస్తే తప్ప… అంతగా ఖర్చు పెట్టినా సరే, ఆ ఆదిపురుష్ ఎలా కొట్టుకుపోయిందో చూశాం కదా…
Share this Article