ఈనాడు ఏపీ ఎడిషన్‌లో ఓ చిన్న వార్త కనిపించింది ఓ మూలన… అదేమిటీ అంటే ఓ రైతు ఎర్ర బెండ పండించాడు, ఆకుపచ్చటి బెండతో పోలిస్తే ఈ ఎర్ర బెండలో పోషకాలు ఎక్కువ… మార్కెట్‌కు తీసుకెళ్తే కిలోకు వంద పలుకుతోంది… ప్రయోగాత్మకంగా ఈ బెండ పండించాడు అనేది వార్త సారాంశం… నిజానికి సమాజానికి తీవ్రంగా నష్టం కలిగించే రాజకీయ, క్షుద్ర వార్తలకన్నా ఇవే నయం, ఆసక్తికరం… ప్రయారిటీ దక్కాలి… అయితే నిజంగా ఎర్ర బెండలో పోషకాలు ఎక్కువా..? జిగట తక్కువా..? ఓసారి డిటెయిల్స్‌లోకి వెళ్దాం…
Ads
గత సెప్టెంబరులో మనం మీడియాలో ఓ వార్త చదువుకున్నాం గుర్తుందా… మియాజాకి అనే ఓ అరుదైన మామిడిరకాన్ని ఓ మధ్యప్రదేశ్ రైతు పండించాడనీ, కిలోకు 2.7 లక్షల ధర పలికిందనీ అబ్బురపడ్డాం… ఏ సైటు చూసినా, ఏ పత్రిక చదివినా, ఏ టీవీ చూసినా ఇదే వార్త… అది అరుదైనదేమీ కాదనీ, విదేశాల్లో పండించే వెరైటీయేననీ, అంత ధర ఉండదనీ నిజం చెప్పినా ఎవరూ నమ్మలేదు… చివరకు ఏం జరిగింది..? ఆ వెరైటీ మామిడి మొక్కలు అంటూ నర్సరీలు తెగ అమ్మకాలు సాగించి సొమ్ముచేసుకున్నయ్… చివరకు ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్స్ కూడా మొక్కల్ని సప్లయ్ చేసినయ్ అడ్డగోలు ధరలకు… ఇప్పుడంతా చల్లబడింది… ఇక ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు… ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది… అది ఎర్ర బెండ గురించి… రెడ్ లేడీ ఫింగర్… లాల్ బెండీ… కిలోకు 800 ధర పలుకుతోందని, అదే మధ్యప్రదేశ్‌లో ఓ రైతు పండించాడనీ వార్త… ఇదీ సెప్టెంబరులో వార్తే…
ఏ సైటు చూసినా అదే వార్త… ఏ పత్రిక చూసినా అదే… ఎవడో ఏజెన్సీ వాడు మొదట ఈ వార్త కొడతాడు, మిగతావాళ్లు గుడ్డిగా రాసిపారేస్తారు… కనీసం దాని వెనకాముందూ చెక్ చేయాలనే సోయి కూడా ఉండదు… సాధారణ బెండకాయ 40 లేదా 50 ధర అనుకుందాం… మరి దీనికి 800 దేనికి..? అదేమంటే..? ఇది బీపీకి చెక్, సుగర్‌కు షాక్, కొలెస్ట్రాల్ ఖతం, ఒబెసిటీ మాయం… అంటూ పతంజలి బాబా రాందేవ్ తరహాలో సర్వారిష్ట నివారిణి, సర్వరోగ ఔషధి అన్నట్టుగా రాసేస్తున్నారు… ఒకరిద్దరయితే కేన్సర్ కూడా ఈ ఎర్ర బెండను చూస్తే పరార్ అని రాసేశారు… కరోనా, ఎయిడ్స్‌ను మినహాయించినట్టున్నారు…
నిజమేనా ఇది..? ఈ ప్రశ్నకు జవాబు ఏమిటంటే… కొంత మాత్రమే నిజముంది… ఎందుకంటే..? వేరే కూరగాయల్లో లేనంతగా బెండలో యాంటీ ఆక్సిడెంట్లు, ఏ-సీ విటమిన్లు, ఫైబర్, ఇతర సూక్ష్మపోషకాలు ఉంటయ్… కొలెస్ట్రాల్ కారణంగా అవస్థలు పడే బీపీ, సుగర్ పేషెంట్లకు ఇది మంచిది… రాత్రి బెండ ముక్కల్ని నానబెట్టి, పొద్దున ఆ నీళ్లను తాగితే సుగర్ కంట్రోల్ అవుతుందని నమ్మేవాళ్లు కూడా ఉన్నారు… అదే సమయంలో మెట్‌ఫార్మిన్ వంటి బేసిక్ సుగర్ మందులు వాడేవాళ్లకు బెండ సూట్ కాదనే పరిశోధన ఫలితాలు కూడా ఉన్నయ్… కొందరికి కిడ్నీల్లో రాళ్ల సమస్యను పెంచే ప్రమాదమూ ఉంది… ఇదంతా సరే, మరి ఎర్ర బెండ స్పెషాలిటీ ఏమిటి..? కొత్త కాబట్టి ఓ వింత… అంతే…
(ఇది సెప్టెంబరులో వార్త)
నిజానికి మామూలు ఆకుపచ్చటి బెండకు, ఎర్రటి బెండకు పెద్దగా వ్యత్యాసం ఉండదు… కాకపోతే ఆకుపచ్చటి బెండతో పోలిస్తే జిగట తక్కువ అంటారు నిపుణులు… ఇక టేస్ట్ అనేది మనం వండుకునే పద్ధతిని బట్టి ఉంటుంది… పైగా ఈ ఎర్ర బెండ దిగుబడి కూడా తక్కువ… గతంలో మనం దిగుమతులు చేసుకునేవాళ్లం… వారణాసిలోని Indian Institute of Vegetable Research (IIVR) పరిశోధనలు చేసి, ఈ హైబ్రిడ్ వంగడాల్ని రూపొందించింది… ‘కాశిలలిమ’ అని పేరుపెట్టారు… ఆకుపచ్చ బెండలో క్లోరోఫిల్ ఉంటుంది, ఈ ఎర్రబెండలో యాంథోసైనిన్స్ ఉంటయ్, అవే ఈ రంగును తీసుకొచ్చేవి… అంతే తేడా… ((గత సెప్టెంబరులో కథనానికి ఇది అప్డేషన్))
Share this Article