అప్పట్లో తమిళనాట ఎంజీఆర్… ఆంధ్రలో ఎన్టీయార్… కన్నడంలో రాజకుమార్… సూపర్ స్టార్లు… తిరుగులేని ప్రజాదరణ… ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చాడు… సీఎం అయ్యాడు… ఎన్టీయార్ కూడా ఆ బాటలోనే… సీఎం అయ్యాడు… హిందీ సూపర్ స్టార్ అమితాబ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు… కానీ రాజకుమార్ మాత్రం రాజకీయాల్లోకి రాలేదు… ప్రజల్లో ఉన్న ఆదరణను రాజకీయంగా వాడుకోవాలని, పీఠాలు ఎక్కాలని అనుకోలేదు… ఎందుకు..? ఇదెప్పుడూ ఓ ప్రశ్నే… నిజానికి ఓ దశలో ఆయన్ని ఎలాగైనా ఒప్పించి 1978 లోక్‌సభ బైపోల్స్‌లో నిలబెట్టాలని జనతా పార్టీ విశ్వప్రయత్నం చేసింది… చికమగళూరులో ఏకంగా ఇందిరాగాంధీ మీదే పోటీకి నిలబెట్టాలని అనుకుంది… ఒక్కసారి కలిస్తే చాలు, ఎలాగోలా ఒప్పించాలని భావించింది… కానీ రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేని రాజకుమార్, ఒక్కసారి వాళ్లను కలిస్తే ఇక ఎలాగోలా ఒప్పిస్తారనే సందేహంతో… సైలెంటుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు… నిజంగా సొసైటీకి తన సేవలు అవసరమనే భావనతో గాకుండా ఇందిరాగాంధీ మీద ఓ ఆయుధంగా వాడుకోవాలని భావించింది జనతా పార్టీ… అదీ రాజకుమార్‌కు నచ్చలేదు… దాంతో అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు… అదొక ఆసక్తికర కథ…
బెంగుళూరులోనో, మైసూరులోనో తన ఇంట్లో లేదా తన ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నాడనుకుని జనతా పార్టీ నేతలు, రాజకుమార్ శ్రేయోభిలాషులు ప్రతి ఇంటికీ వెళ్లారు… మరీ సన్నిహితుల ఇళ్లల్లోనైతే ప్రతి గదీ, చివరకు బాత్రూంలు కూడా చెక్ చేశారు… ఈ అదృశ్యం వాళ్లకు అంతుపట్టలేదు… నిజానికి రాజకుమార్ ఈ ఒత్తిళ్లు తప్పించుకోవడానికి కర్నాటకనే వదిలాడు కొన్నిరోజులు… తమిళనాడుకు జారుకున్నాడు… రాణిపేట దగ్గర ఒక ఫామ్ హౌజుకు వెళ్లిపోయాడు… చెన్నైకి అది వంద కిలోమీటర్లు… అది ఎప్పుడూ ఖాళీగా ఉండేది… ఎవరో రచయిత ఒంటరిగా ఉండి, ఏదో రాసుకుంటానని అడిగితే కొన్నిరోజులు ఉండటానికి అనుమతించాను అని చెప్పాడు దాని ఓనర్ తరువాత ఎప్పుడో…!
నిజానికి ఆ ఓనర్ ఆ రచయిత ఎవరో అడగలేదు, చూడలేదు, తనకు తెలిసినవాాళ్లు చెబితే ఇచ్చేశాడు, కానీ రాణిపేట పట్టణానికి దూరం కదా, ఎక్కడ తింటాడు అని అడిగాడట… ఆయన తిప్పలేవో ఆయన పడతాడులే అని చెప్పారట రాజకుమార్ తరఫున ఆ ఫామ్ హౌజ్ తీసుకున్నవాళ్లు… రాణిపేట నుంచి ఆ మార్గంలో వెళ్లే బస్సు ఎక్కేవాడు ఓ వ్యక్తి ప్రతిరోజూ… మధ్యలోనే దిగిపోయి, అక్కడక్కడే వేచి చూసే రాజకుమార్‌కు అప్పగించి, రిటర్న్ బస్సులో రాణిపేట వెళ్లిపోయేవాడు… నామినేషన్ల దాఖలు గడువు అయిపోయేదాకా ఇంతే… తరువాత అంతే సైలెంటుగా ఇంటికొచ్చేశాడు… ఒంటరితనం, ఒత్తిడి రాజకుమార్‌కు కొత్త కాదు, అందుకే వీరప్పన్ చెరలో 108 రోజులున్నా ఎప్పుడూ డిప్రెషన్‌కు గురికాలేదు…
Ads
తండ్రి బాటనే కొడుకులూ అనుసరించారు… ఎక్కడా రాజకీయాల వాసన తగలకుండా జాగ్రత్తపడ్డారు… కానీ ఒకే ఒక సందర్భంలో ఆ ఇంటిని రాజకీయాలు ఆవహించకతప్పలేదు… రాజకుమార్ పెద్ద కొడుకు శివ రాజకుమార్ భార్య గీత… శివ కూడా నటుడే, ఇండస్ట్రీలో తండ్రి వారసత్వంలో కొనసాగాడు… ఈ గీత ఎవరో కాదు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప బిడ్డ… 2014లో శివమొగ్గ లోకసభ స్థానం నుంచి యడ్యూరప్ప మీద జేడీఎస్ తరఫున పోటీచేసింది… రాజకీయాల్లో తండ్రి వారసత్వ బాటలో నడవాలని అనుకుంది ఆమె, కానీ ఓడిపోయింది… అంతే… ఇక ఎప్పుడూ ఆ కుటుంబం రాజకీయాలకు దూరంగానే ఉండిపోయింది… ఓసారి ఓ విలేఖరి అడిగితే… ‘నన్ను కన్నడ ప్రజల హృదయాల్లో ఓ చక్రవర్తిగా ప్రతిష్టించుకున్నారు, కిరీటం పెట్టారు, అంతకుమించి ఏం కోరుకోగలను నేను..?’ అని ఎదురు ప్రశ్నించాడు రాజకుమార్…
మొన్న మరణించిన పునీత్‌ను కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ పలుసార్లు ప్రయత్నించింది… రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డికే శివకుమార్ ఆ విషయాన్ని వెల్లడించాడు… తన వదిన పోటీచేసిన స్థానంలో కూడా పునీత్ ప్రచారం చేయలేదు… రాజకీయాలకు అంత దూరంగా ఉండిపోయాడు… 2019లో సుమలతా అంబరీష్ తరఫున ఎంత అడిగినా సరే మాండ్యాలో ప్రచారం చేయడానికి అంగీకరించలేదు… కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ఫ్రీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేవాడు… కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని బ్రాండ్), రైట్ టు ఎడ్యుకేషన్ (సర్వశిక్షా అభియాన్) సహా ఏ ప్రభుత్వ కార్యక్రమానికి రమ్మన్నా వెళ్లేవాడు… 2014 లోకసభ, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం తరఫున వోటు హక్కు వినియోగంపై సాగిన చైతన్య ప్రచారాల్లో పాల్గొన్నాడు… కరోనా వేక్సినేషన్ మీద ఫ్రీ యాడ్స్ అంగీకరించాడు… బెంగుళూరు సిటీ పోలీసులు అనేక వీడియోల్లో పునీత్‌ను వాడుకున్నారు… అంతా ఫ్రీ సర్వీసే… తన అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, పిల్లల చదువులు గట్రా సోషల్ సర్వీస్‌కు ఇవన్నీ అదనం…
ఆయన తండ్రి రాజకుమార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా… కన్నడ ఆత్మగౌరవ, కన్నడ సంస్కృతి సంబంధ అంశాల్లో చురుకుగా పాల్గొనడానికి ముందుకొచ్చేవాడు… అందులో ముఖ్యమైంది గోకక్ ఉద్యమం… ప్రభుత్వ సిలబస్‌లో, కొలువుల్లో కన్నడానికి ప్రాధాన్యం ఇవ్వాలని 1980 ప్రాంతంలో జ్ఙానపీఠ్ అవార్డు గ్రహీత గోకక్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఓ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది… కానీ అప్పటి ప్రభుత్వం దాన్ని తేలికగా తీసుకుంది… ప్రభుత్వ అలసత్వానికి వ్యతిరేకంగా సాహితీవేత్తలు, రచయితలు, కవులు, మేధావులు, సామాజికవేత్తలు ఆందోళనలకు దిగినా సగటు జనం ఏమీ పట్టించుకోలేదు… తరువాత రాజకుమార్ ఆ ఉద్యమంలోకి ప్రవేశించగానే మొత్తం కన్నడ సినిమా ఇండస్ట్రీ సహా సగటు జనం కూడా పాల్గొనడం స్టార్టయింది…
ఒత్తిడి పెరిగి ప్రభుత్వానికి ఆ నివేదికను ఆమోదించక తప్పలేదు… 1983లో గుండూరావు ప్రభుత్వ పతనానికి ఈ ఉద్యమం వల్ల వచ్చిన వ్యతిరేకత కూడా ఓ కారణమే అంటారు… ‘రాజకీయాలు ఆ తండ్రికి సరిపోవు, తను అంతర్ముఖుడు.., విశ్వాసరాహిత్యం, మొరటు స్వార్థం తనవల్ల కావు… అందుకే రాజకీయాలకు రాజకుమార్ దూరం… తండ్రి బాటలోనే కొడుకులు కూడా…’ అంటారు తనను తెలిసిన సీనియర్లు… ఇంట్రస్టింగు… చిన్నాచితకా సెలబ్రిటీలు కూడా సీఎంలు అయిపోయి, రాజకీయాల్ని దున్నేద్దామని కలలు గనే ఆ ఇండస్ట్రీలో ఇంత కంట్రాస్టుగా బతికే రాజకుమార్‌లు, ఆయన కొడుకులు కూడా ఉంటారు..!! గుడ్…!!
Share this Article