Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఖలేజా ఫ్లాప్‌కు ప్రధాన బాధ్యుడు దర్శకుడు, నెక్స్ట్ నిర్మాతలే…!!

May 30, 2025 by M S R

.

ఈరోజే కదా మహేష్ బాబు హీరోగా నటించిన ఖలేజా చిత్రం రీరిలీజ్… చాలామంది చాలారకాలుగా ఆ సినిమా ఫ్లాప్ కావడానికి కారణాలేమిటో విశ్లేషించారు ఇన్నాళ్లూ… కానీ సి.కల్యాణ్ చెప్పిన విశ్లేషణ భిన్నంగా ఉంది… అది సరైందిగా అనిపించలేదు కూడా…

ఈ సినిమాకు తను సహనిర్మాత… హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో సీ కల్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఓసారి చూస్తే…

Ads

‘‘ఈ సినిమాపై భారీ అంచనాలను కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పెట్టుకొన్నారు… త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ కావడంతో గొప్పగా ఊహించుకొన్నారు… కానీ మహేష్ సినిమాలకు డిఫరెంట్ ఫార్మాట్‌లో సినిమా ఉండటంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు… దాంతో ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది… కానీ ఆ తర్వాత ఈ సినిమా ఛీ కొట్టిన అభిమానులే నెత్తిన పెట్టుకొని ప్రశంసిస్తున్నారు’’

‘‘ఖలేజా సినిమా ప్రీమియర్‌ను విజయవాడలో మిడ్‌నైట్ షోగా ప్రదర్శించాం. ఆ టైమ్‌లో మూవీని మహేష్ బాబు అభిమానులు చూడనివ్వలేదు… సినిమాకు వెళ్లిన ఫ్యాన్స్ ఏదో ఊహించుకొని వెళ్లారు… కానీ సినిమా వారి అభిరుచికి భిన్నంగా ఉంది… మహేష్ బాబు కామెడీ చేయడం వాళ్లకు అర్ధం కాలేదు… వారికి నచ్చకపోవడంతో ఛీకొట్టారు. తిట్టిన తిట్టు తిట్టకుండా మమ్మల్ని దారుణంగా ట్రీట్ చేశారు’’

‘‘ఖలేజా సినిమా ప్రీమియర్ ముగిసిన తర్వాత మహేష్ బాబు అభిమానులే సినిమా చెత్తగా ఉందంటూ వాళ్లే మెసేజ్‌లు పంపారు అందరికీ… ఆ సినిమాను వాళ్లే సర్వనాశనం చేశారు… ఈ రోజు ఆ ఫ్యాన్సే ఎంజాయ్ చేస్తున్నారు… ఆ సినిమా బిగ్ స్క్రీన్ మీద వస్తుంటే.. దానిని చూడటానికి ఆరాటపడుతున్నారు… ఈ సినిమాకు 14 సంవత్సరాల తర్వాత సక్సెస్ రావాలని రాసిపెట్టి ఉంది… ఖలేజా అప్పుడు ఫ్లాప్ కావడం వెనుక ఇది జరిగింది…’’

‘‘వాస్తవానికి ఖలేజా సినిమా ప్రీమియర్ వేయనని మొండికేశాను. ఆ సమయంలో కృష్ణ గారు నాకు ఫోన్ చేసి.. ఏంటయ్యా.. ప్రీమియర్ షో వేయనని అంటున్నావట. విజయవాడలో షో వేయండి అంటూ నాతో బలవంతంగా షో వేయించారు. ఆ షో ముగిసిన తర్వాత మహేష్ బాబు అభిమానులు ఫుల్లుగా తాగి నాకు ఫోన్ చేసి బూతులు తిట్టారు. నీకు సినిమా తీయడం తెలుసా? అంటూ నన్ను డైరెక్టర్‌ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను తిట్టారు’’….

ఫస్ట్ రిలీజ్ సమయంలో భారీగా నష్టాలు మూటగట్టుకున్న ఈ సినిమా రీరిలీజ్ రెవిన్యూతో నిర్మాతలకు కాస్త రిలీఫ్ ఇస్తుందేమో ఇప్పుడు… ఐతే కల్యాణ్ మాటల్లో నచ్చనిది కృష్ణను తన విమర్శల్లోకి లాగడం… ప్రీమియర్ షో ఓ తండ్రిగా, ఓ సీనియర్ హీరోగా, ఓ నిర్మాతగా తన అభిప్రాయం చెప్పాడు కృష్ణ… పైగా తన సినిమాలకు బెజవాడ ప్రధాన కేంద్రం… తన సెంటిమెంట్ కూడా… తను ప్రీమియర్ వేయాలని అడగడంలో తప్పేముంది..?

ప్లస్ ఫ్యాన్స్‌ వల్లే సినిమా ఫ్లాపయిందని తేల్చేయడం కూడా తప్పే… బహుశా నిజంగానే అప్పట్లో తన ఫోన్ నెంబర్ తెలిసిన వీర ఫ్యాన్లు తిట్టి ఉంటారేమో… అవి మనసులో మండుతున్నట్టున్నాయి ఇంకా… గుర్తు చేసుకుంటున్నాడు… మహేష్ ఫ్యాన్లే సినిమా చెత్త అని ప్రచారం చేసేసరికి అది సినిమాకు బాగా నెగెటివ్ అయిందనే తన విశ్లేషణ కూడా కొంతవరకే నిజం…

సినిమా చెత్తగా ఉంటే ఫ్యాన్లు ఏమీ చేయలేరు… సక్సెస్ చేయలేరు, ఫ్లాప్ చేయలేరు… ఒక సినిమా సక్సెస్ అనేది మొదటిరోజు సినిమా చూసిన ప్రేక్షకుల మౌత్ టాక్ మీద ఆధారపడుతుంది… మొదటి రెండుమూడు రోజులు థియేటర్లలో ఎవరూ కనిపించకపోయినా తరువాత పుంజుకుని హిట్టయిన సినిమాలున్నాయి…

ఈ సినిమాలో త్రివిక్రమ్ ఏం చెప్పాలనుకున్నాడో ప్రేక్షకులకు అర్థం కాలేదు… మహేశ్ నోటి నుంచి బొంగు వంటి పదాలు వినిపించడం ఎవరికీ నచ్చలేదు… పదే పదే అనుష్క పిక్కల మీద వ్యాఖ్యలు కూడా కొంత వెగటు… కథను రాజస్థాన్ దాకా ఎందుకు తీసుకుపోయాడో అర్థం కాదు… అక్కడ నీళ్లు విలువైనవే కానీ మంచి నీటి సీసా కోసం భీకరమైన ఓ యాక్షన్ పెట్టడమూ నచ్చలేదు…

కాకపోతే మహేశ్ రొటీన్‌కు భిన్నంగా మంచి కామెడీ టైమింగ్ చూపించాడు… తనకు నిజంగానే ఓ డిఫరెంట్ రోల్… మనిషిలో దేవుడు ఉన్నాడు అనే ఓ తత్వాన్ని కమర్షియల్, యాక్షన్ కామెడీ జానర్‌లో చెప్పాలని అనుకున్నాడు గానీ త్రివిక్రమ్ అందులో సక్సెస్ కాలేదు… మనిషిలో దేవుడున్నాడు అని గాకుండా ఆ మనిషినే దేవుడిని చేసి చూపించాడు… రెంటి నడుమ తేడా ఉంది… సినిమా ఫ్లాప్‌కు ప్రధాన కారకుడు త్రివిక్రమే…

నటీనటుల దగ్గర నుంచి 24 క్రాఫ్ట్స్ అందరూ బాగా పనిచేశారు… ఎటొచ్చీ కథే జీర్ణం కాలేదు ఎవరికీ… నిర్మాతలకు కాస్త సోయి ఉంటే సినిమా నిర్మాణదశలోనే ఈ కథ ఎటో పోతోందని అర్థం చేసుకుని ఉండాల్సింది… ఆహా, భలే డిఫరెంటుగా వస్తోంది అని మీరే కదా సంబరపడిపోయారు… సో, కల్యాణం బాబూ, నిందించాల్సింది ఫ్యాన్లను కాదు… నీకు నువ్వే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాధన్ పండిట్… అబ్బో, కేఏ పాల్ గారికే పెద్దన్నలా ఉన్నాడు…
  • కేటీయార్ హేపీ… 2034 తరువాతనైనా సీఎం చాన్స్ దొరకొచ్చు…
  • మస్క్ పక్కన సమస్థాయిలో ఆమె… ఓ నమ్మశక్యం కాని గ్రాండ్ సక్సెస్ స్టోరీ…
  • శతృ సంతానం..! పాత జన్మ పగవాళ్లే ఈ జన్మలో పిల్లలుగా పుట్టి…!!
  • స్మి’తత్త్వమసి’… పాప్, ర్యాప్ అయిపోయాయి… ఇక తత్వ యాత్ర…
  • సరిహద్దుల్లో ఓ సైలెంట్ ఛేంజ్… India also Ready for AI War…
  • ‘మై జల్‌మురి ఖా రహాథా…’ బెంగాల్ గెలుపుపై అమెరికాలో సంబురాలు
  • ‘కాల్పనిక అమ్మతనం’… ఊహల ఉయ్యాలవే మనసా… మాయల దెయ్యానివే…
  • కేడీ, ది డెవిల్… ప్చ్, కంట్రవర్సీ ఎక్కువ- కంటెంటు తక్కువ…
  • అమెరికాలో ఆదానీ కేసు సెటిల్‌మెంట్..! ఆరోపణలన్నీ ఉఫ్…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions