ఒక గ్రాఫిక్ ఈమధ్య బాగా వైరల్ అయ్యింది… పునీత్ మరణించాక వెళ్లి ‘పైన’ ఉన్న తన తండ్రి రాజకుమార్ వెనకగా వెళ్లి, సరదాగా కళ్లుమూస్తాడు… ‘నాన్నా, నేనూ వచ్చేశాను’ అన్నట్టుగా… అది తండ్రీకొడుకుల బంధాన్నే కాదు, వర్తమాన సమాచారాన్ని క్రియేటివ్‌గా, గుండెకు హత్తుకునేలా దృశ్యీకరించడం అన్నమాట… ఎవరు గీసింది..? చాలామందిలో ఓ ప్రశ్న… ఆయన పేరు కరణ్ ఆచార్య… నిజానికి తను గీసిన హనుమాన్ కేరికేచర్ దేశం మొత్తమ్మీద పాపులర్ అయ్యింది… ఆయన గురించి కాస్త తెలుసుకుందాం…
…………. By………. Abdul Rajahussain………….. కేరళ ఫ్రీలాన్స్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్, గ్రాఫిక్, డిజిటల్ చిత్రకారుడు, క్యారికేచరిస్ట్ .. ” కరణ్ ఆచార్య “.!! (KRN కేరికేచరిస్ట్) (Graffic ,Digital Artist,and Carrycaturist,’ Karan Acharya'(KRN Carrycaturist) from… Kerala State, India.) ఈయన అసలు పేరు ‘కిరణ్ కుమార్.’ (Kiran Kumar) కేరళ లోని కాసరగోడ్ జిల్లా ( Kasaragod district)లోని ‘కుడ్లు’ (Kudlu) గ్రామంలో జన్మించాడు. అద్భుతమైన గ్రాఫిక్ ఆర్టిస్ట్..గొప్ప క్యారికేచరిస్ట్, స్కెచెస్ వేస్తాడు. ఊహాత్మక చిత్రాలు, లైవ్ స్కెచెస్, పోర్ట్రెట్ లు కూడా… చక్కగా వేస్తాడు. ఫోటోలను ఎడిట్ చేసి, వాటికి సృజనాత్మకతను జోడించి కొత్త రూపు కల్పిస్తాడు. ప్రఖ్యాత చిత్రకారుడు రాజారవివర్మ చిత్రాలతో తాను ప్రేరణ పొందినట్లు ఆచార్య స్వయంగా చెప్పుకుంటాడు.
Ads
కృతుల రూపకల్పనలో నిమగ్నమై వుంటాడు. ఓ వ్యక్తి తనకు క్లౌడ్ ఇమేజ్ పంపి,… ‘అది వినాయకుడిలా ఉంది, దాన్ని మార్చగలవా?’ అని అడిగాడట. దానిపై కొంత పని చేసి, ఆ చిత్రాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఆ తర్వాత, దానికి మంచి స్పందన వచ్చింది. అప్పటి నుండి అభ్యర్థనలు రావడం మొదలైంది. ఖాళీ సమయాల్లో… ఫోటో ఎడిటింగ్, కొత్త రూపకల్పన పనులను చేస్తుంటాడు. వీటికి మాత్రం డబ్బులు తీసుకోడు.!
చిన్నప్పటి నుంచే..!!
చిన్నప్పటి నుంచే ఆచార్య బొమ్మలు వేసవాడు. కేరళలో ని కాసర్గోడ్లో పాఠశాల విద్యను అభ్యసించాడు.. అమ్మ కళాకారిణి కావడంతో మొదటి నుంచే ‘కళ’ అతని జీవితంలో ఓ భాగమైంది. తనకు కళ తప్ప మరేమీ తెలీదు. ప్రతిరోజూ స్కెచెస్ గీసేవాడు. కాన్వాస్ పెయింటింగ్స్ వేసేవాడు. పౌరాణిక కథలు విస్తృతంగా చదివేవాడు. అందుకే అతని బొమ్మలు చాలా వరకు పౌరాణిక నేపథ్యాలతో ముడిపడి ఉంటాయి. 2015లో వేసిన “యాంగ్రీ హనుమాన్ “(Angry Hunuman) చిత్రం దేశవ్యాప్తంగా గొప్ప సంచలనం కలిగించింది. ఆ తర్వాత వివిధ భంగిమలతో అనేక హనుమాన్ డిజిటల్ గ్రాఫిక్ చిత్రాలను వేసి చిత్రకళాభిమానుల్ని అబ్బురపరిచాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రకళకు ఓ సరికొత్త రూపు కల్పిస్తున్నాడు. 2015 లో ఆచార్య వేసిన యాంగ్రీ హనుమాన్ చిత్రం. 2017 లో విస్తృత ప్రచారం పొందింది. హనుమాన్ చిత్రం తాలూకు స్టిక్కర్లు కూడా విస్తృతంగా వచ్చాయి. అలా.. యాంగ్రీ హనుమాన్ చిత్రం ఆచార్యకు ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిపెట్టింది. దేశంలో హనుమాన్ చిత్రకారుడిగా పేరు పొందాడు.
ఈ చిత్రం వెనుక కథ..!!
2015లో తన స్నేహితుల అభ్యర్థన మేరకు, ఆచార్య ఈ గ్రాఫిక్‌ను తన గ్రామంలోని వార్షిక ఆలయ ఉత్సవానికి ప్రత్యేకమైన జెండాగా రూపొందించాడు. నలుపు రంగు రూపురేఖలు, కుంకుమ పువ్వుతో కూడిన హనుమంతుని గ్రాఫిక్ ఇది. సోషల్ మీడియాలో మొదటి పోస్ట్ చేశాడు. అంతే… దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొంది Popular చిత్రంగా మారింది,. వాహనాల వెనుక విండ్‌స్క్రీన్‌లపై గ్రాఫిక్ స్టిక్కర్లను అతికించుకోవడం అప్పట్లో పెద్ద Craze గా మారింది. ట్రెండ్ సెట్టర్ అయింది. స్టిక్కర్ల తయారీదారులు ఆచార్య నుండి ఎటువంటి అనుమతిని పొందకుండానే యథేచ్చగా వాడుకున్నారు. పెద్ద ఎత్తున వ్యాపారం చేశారు. దీంతో ఆచార్య రుద్ర హనుమాన్ చిత్రానికి కాపీరైట్ చట్టం కింద రిజిస్టర్ చేయాల్సి వచ్చింది.
ఫిబ్రవరి 2017లో ఆచార్య కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లోని గ్రాండ్ ఆది యోగి ప్రతిమ విగ్రహం ఆధారంగా శివుని నీలిరంగు గ్రాఫిక్‌ని రూపొందించాడు. మరుసటి సంవత్సరం ఆగష్టు 2018లో, అతను రాముడి గ్రాఫిక్‌ను విడుదల చేశాడు. భారతదేశ ప్రధాన మంత్రి, నరేంద్ర మోడీ 2018లో ఎన్నికల ర్యాలీ కోసం మంగుళూరు నగరానికి వచ్చిన సందర్భంగా ఆచార్య పనితీరు గురించి ప్రశంసించారు. ఆ తర్వాత అదే సంవత్సరం మేలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెయింటింగ్‌ను చిత్రించాడు ఆచార్య.ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అయోధ్య ‘ఆర్ట్ ఫెస్టివల్’ కి ఆచార్య ఆహ్వానం అందుకోవడం విశేషం. సాధారణ చిత్రాన్ని కూడా అద్భుతమైన దృశ్య చిత్రంగా పునర్నిర్మించగల ప్రతిభ ఆచార్య సొంతం., వ్యక్తులను పౌరాణిక వ్యక్తులుగా, లేదా వారు కోరుకున్నట్లుగా చిత్రీకరించడంలో దిట్ట. రోజువారీ కూలీ కార్మికుల కుటుంబ చిత్రాన్ని కృష్ణుడి కుటుంబంగా మార్చాడు, ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ట్విట్టర్లో వైరల్ అయి మోత పుట్టించింది. ప్రస్తుతం ఆచార్య మంగుళూరులో వుంటున్నాడు.
వైరల్ గా ‘అప్పు’ చిత్రం..!!
ఇటీవల మరణించిన కన్నడ పవర్ స్టార్ ‘అప్పు’ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది…. స్వర్గంలో వున్న తన తండ్రి కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కళ్ళు మూస్తున్నట్లుగా వేసిన గ్రాఫిక్ ఊహా చిత్రం కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది.. ఈ చిత్రం పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కంట తడి పెడుతున్నారు. గుండె తడిని తట్టి లేపిన ఈ చిత్రంతో తిరిగి 2017 నాటి (Angry Hanuman ) సంచలనాన్ని తిరిగి నమోదు చేయబోతున్నట్లే కనిపిస్తోంది..!! కేరళ ఫ్రీలాన్స్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్, గ్రాఫిక్, డిజిటల్ చిత్రకారుడు, క్యారికేచరిస్ట్ ..” కరణ్ ఆచార్య “.!! (KRN కేరికేచరిస్ట్) కు అభినందనలు….
Share this Article