ఎప్పటిలాగే ఈసారి కూడా పద్మ అవార్డుల మీద భిన్నాభిప్రాయాలు… వాళ్లకెందుకు రాలేదు, వీళ్లకెందుకు ఇచ్చారు అంటూ… నిజానికి గతంలోలాగా నాయకులు, బ్రోకర్ల పైరవీలు, రాష్ట్రాల సిఫారసుల మీద మాత్రమే ఆధారపడకుండా ఈసారి ప్రజాభిప్రాయం తీసుకుని ఎంపికలు జరిగాయి, పైగా సుదూరంలో ఉన్న చిన్న చిన్న రాష్ట్రాలవాసులూ మంచి పురస్కారాలే పొందారు కాబట్టి బెటరే అనుకోవాలి… పద్మ పురస్కారాలు పొందిన ప్రతి ఒక్కరి మీదా గౌరవం ఉంది… అందరూ అర్హులే అనే భావన కూడా ఉంది… కానీ కొందరికి దక్కిన ఈ పురస్కారాలు మరింత ఆనందాన్ని కలిగించాయి… వారిలో ఒకరు ట్రినిటీ సయ్యీ… గతంలో కూడా ఓసారి ఈమె గురించి మనం ముచ్చటించుకున్నట్టు గుర్తు… ఓసారి నెమరేసుకుందాం…
లకడోంగ్ అనేది మేఘాలయలోని ఓ చిన్న ఊరు… 35, 40 ఇళ్లు కూడా ఉండవు అక్కడ… 20 ఏళ్ల క్రితం ఆ ఊరితోపాటు పరిసరాల్లోని చిన్న చిన్న ఊళ్ల జనం కోల్ మైనింగుకు వెళ్లడం స్టార్ట్ చేశారు… అసలే అంతంతమాత్రంగా ఉన్న వ్యవసాయం ఈ పరిణామంతో మరింత కుంటుపడింది… తరువాత ఏదో పర్యావరణ కారణంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ మైనింగును బ్యాన్ చేసింది… ఇక దిక్కులేక మళ్లీ అందరూ వ్యవసాయం బాటపట్టారు… పట్టాల్సి వచ్చింది… అక్కడ సయ్యీ అనే ఓ టీచర్… ఆమెకు ఓసారి హఠాత్తుగా ఓ డౌటొచ్చింది… తన పూర్వీకులు తమకు పదే పదే చెప్పేవాళ్లు కదా, తమ ఊరికే ప్రత్యేకంగా చెప్పుకునే పసుపు రకాలు… అవి ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు..?
Ads
అందరూ లాచీ అనే పసుపు రకం పండిస్తున్నారు అక్కడ… ఆ వెరయిటీకి దిగుబడి తక్కువ, రేటు తక్కువ, శ్రమ ఎక్కువ, పైగా ఆ రకం పసుపులో కుర్క్యుమిన్ శాతం తక్కువ… అందుకని ముసలాళ్లను అడగసాగింది… అందరూ ఏవేవో చెప్పేవాళ్లు తప్ప ఆ పాత సీడ్ దొరికిదే కాదు, ఎలాగోలా దాచిపెట్టబడిన సీడ్ సంపాదించింది.., 2013లో లకడోంగ్ అనే తమ ఊరి పేరిట ఆ పసుపు రకం సాగు స్టార్ట్ చేసింది… మంచి దిగుబడి… అంతేకాదు, మామూలు రకాల పసుపులో మూడునాలుగు శాతం కుర్క్యుమిన్ ఉంటే ఎక్కువ… కానీ ఈరకంలో కుర్క్యుమిన్ శాతం ఏడు దాటి ఉంటోంది… ఇంకేం..? నాణ్యత బాగుండటంతో ధర కూడా బాగానే రావడం మొదలైంది… ఓసారి లెక్కేస్తే లాచీ రకంకన్నా ఈ లకడోంగ్ రకం సాగుచేస్తే మూడు రెట్ల ఆదాయం పెరిగినట్టు తేలింది… అయితే ఆమె దీన్ని తనకు మాత్రమే పరిమితం చేయలేదు… ఆ ఏరియా మొత్తం బాగుపడాలని కోరుకుంది… పది మందినీ కూడేసి, ఆ వెరయిటీ సాగు మీద శిక్షణ ఇస్తూ, ఆ సాగు పెంచసాగింది… కానీ మార్కెటింగ్ ఎలా..?
ఈ దశలో స్పైసెస్ బోర్డు సహకారం అందించింది… పసుపు ఆర్గానిక్ సాగుకు సబ్సిడీలు ఇవ్వడం మాత్రమే కాదు, గ్రేడింగ్, ప్యాకింగ్ తదితర అంశాల్లో తోడ్పడింది… ఫలితంగా దాదాపు వంద గ్రూపులు ఏర్పడి, భారీ ఎత్తున ఈ పసుపు ఉత్పత్తి పెరిగింది… దేశంలోని ప్రతి రాష్ట్రానికీ ఈరకం పసుపు చేరుతోంది ఇప్పుడు… మార్కెటింగ్‌కు కూడా ఓ సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు… నిజానికి ఈమెకు ఇప్పుడు పద్మశ్రీ ఇచ్చారు గానీ 2018లోనే వుమెన్ ఫార్మర్స్ డే సందర్భంగా ‘ఎక్సలెన్స్ ఇన్ హార్టీకల్చర్’ అని కేంద్ర వ్యవసాయ శాఖ అవార్డునిచ్చింది… ఈ లకడోంగ్ ఎంత ఫేమస్ అంటే… పలు ప్రైవేటు సంస్థలు ఈ బ్రాండ్ పేరిట తమ ఉత్పత్తులను అడ్డగోలు రేట్లు పెట్టి, ఆన్లైన్లో ఆఫ్‌లైన్‌లో అమ్ముతున్నాయి… పెద్దజోక్ ఏంటంటే, పసుపు మాత్రమే కాదు, కారం, తేనె వంటి ఇతర ఉత్పత్తులనూ అదే బ్రాండ్‌తో అమ్మడం… మరి సయ్యీ సాధించిన ఘనత మామూలుది కాదు కదా…!! గ్రామీణ వ్యవసాయానికి ఇప్పుడు ఇలాంటి సయ్యీలే కావాలి…!!!
Share this Article