.
ఇప్పుడు అమెరికాలో ఓ కొత్త డిమాండ్… ట్రంపు పగ్గాలు చేపట్టేలోపు కమలా హారిస్‌ను స్వల్పకాలానికైనా సరే అధ్యక్షురాలిని చేయాలనేది ఆ డిమాండ్… ఎలా..? ఎందుకు..? ఇదీ చర్చ…
ఎందుకంటే..? ఆమె ఫైటర్… బైడెన్ మనస్పూర్తిగా సహకరించలేదు ఆమె గెలుపు కోసం… సో, ఈ స్వల్పకాలం కోసమైనా సరే తను రిజైన్ చేస్తే… 25వ సవరణ ప్రకారం ఆమె అధ్యక్షురాలు అవుతుంది అనేది ఆ డిమాండ్ల సారాంశం…
Ads
కానీ ఆమెను రన్నింగ్ మేట్‌గా ఎంచుకున్నదీ ఆయనే… అధ్యక్ష స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిందీ ఆయనే… తమ పదవీకాలంలో ఇద్దరి నడుమ విభేదాలు కూడా ఏమీ లేవు… అంతకుమించి ఈ స్వల్పకాలానికి ఆమెను అధ్యక్షురాలిని చేయడం దేనికి..? వచ్చే ఎన్నికల్లో మరింత పోరాటస్పూర్తితో ఆమె పోరాడగలదు… ఇప్పుడే ఆమెను భావి పోరాటం నుంచి తప్పించడమా ఇది..?
సరే, ఆ చర్చ ఇప్పుడు కొత్తేమీ కాదు… అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జ్ఞాపకశక్తి, వయస్సు, సామర్థ్యం దృష్ట్యా తను తప్పుకుని కమలకు పగ్గాలు ఇవ్వాలని మూడేళ్ల క్రితమే పశ్చిమ వర్జీనియా అటార్నీ జనరల్ పాట్రిక్ మోర్సే డిమాండ్ చేశాడు… మన ప్రెసిడెంట్ పాలించలేడు గానీ వెంటనే నువ్వు పగ్గాలు చేపట్టాలని ఏకంగా కమలకే లేఖ రాశాడు…
అసలు ఏమిటీ 25వ సవరణ… నిజంగానే ఒక అధ్యక్షుడు పాలించే సామర్థ్యం కోల్పోతే, అనారోగ్యం పీడిస్తుంటే ఉపాధ్యక్ష పదవిలో ఉన్నవాళ్లు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించవచ్చు… అది బైడెన్ పాలనకాలంలోనే ఓసారి అమల్లోకి వచ్చి కమలా హారిస్ గంటన్నర సేపు ప్రెసిడెంట్‌గా వ్యవహరించింది… ఆ ఉదంతం మరోసారి తెలుసుకుందాం…
సరిగ్గా మూడేళ్ల క్రితం… ఎంతసేపు… మహా అయితే 85 నుంచి 90 నిమిషాలసేపు… అగ్రరాజ్యం అమెరికా పగ్గాల్ని తొలిసారిగా ఓ మహిళ పట్టుకుంది… యాక్టింగ్ ప్రెసిడెంటుగానే సంపూర్ణ బాధ్యతలతో వ్యవహరించింది…
అధ్యక్షుడు జో బైడెన్ ఓ చిన్న మెడికల్ ప్రొసీజర్ కోసం అనస్తీషియా తీసుకోవాల్సి వచ్చింది… అధ్యక్షుడు అపస్మారకంగా ఉండిపోయినప్పుడు అమెరికా ప్రభుత్వ పాలన నిబంధనల మేరకు వెంటనే ఉపాధ్యక్షులకు బాధ్యతలు అప్పగించాలి… అదే జరిగింది… కమలాహారిస్ అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలైంది…
గతంలో కూడా 2002, 2007లో కూడా ఇలా జరిగింది, కొత్తేమీ కాదు… కాకపోతే ఓ మహిళ తొలిసారిగా… టెంపరరీ అయినా సరే, అధ్యక్షురాలిగా వ్యవహరించడం, ఆమె భారతీయ మూలాలు మనకు కాస్త ఇంట్రస్టింగ్ వార్తగా మార్చేశాయి…
జస్ట్, ఒక్క గంటన్నర సేపటికి కూడా ఆ దేశం అధ్యక్ష స్థానాన్ని ఖాళీగా ఉంచలేదు, ఆటోమేటిక్‌గా వాళ్ల సిస్టం ‘ఆల్టర్నేట్’ను తీసుకొచ్చి పెడుతుంది… అదే మన దేశంలో అయితే… నెలల కొద్దీ ముఖ్యమంత్రులైనా సరే, ప్రధాన మంత్రులైనా సరే… సోయి లేకుండా ఉన్నా సరే, హాస్పిటల్‌లో చికిత్సలో ఉన్నా సరే, వ్యక్తి ఉన్నాడో పోయాడో తెలియకుండా, ఇంకా చికిత్స జరుగుతోందని హాస్పిటల్ వర్గాలు బుకాయిస్తున్నా సరే… వాళ్ల పేరిట వ్యవహారాలు నడుస్తూనే ఉంటయ్…
మరీ దిక్కులేకపోతే, జైళ్లలో పడితే ఇక తప్పనిసరై పెళ్లాలో, బినామీలో గద్దెనెక్కుతారు… దాన్నలా వదిలేస్తే… కొన్ని ముందుజాగ్రత్తలు మాత్రం మన ప్రొటోకాల్ సిస్టంలో కూడా ఉన్నయ్… రాష్ట్రపతి- ప్రధాని, రాష్ట్రపతి- ఉపరాష్ట్రపతి కలిసి ఒకేసారి ఒకే విమానంలో ప్రయాణం చేయడానికి వీల్లేదు, వేర్వేరు విమానాలు అయినా సరే ఒకే సమయంలో, ఒకే రూట్‌లో వెళ్లడానికి వీల్లేదు… ఏదైనా అనుకోనిది జరిగితే (దాడి కావచ్చు, ప్రమాదం కావచ్చు) దేశం ఒక్కసారిగా ‘అనాథ’గా మారిపోకూడదనేది ఉద్దేశం…
ఒకవేళ అమెరికా అధ్యక్షుడు హాస్పిటల్‌లో చికిత్సకు వెళ్లాల్సి వస్తే… అనస్తీషియా మత్తులో ఉన్నా సరే… ఉపాధ్యక్షులకు బాధ్యతలు అప్పగిస్తారు సరే, కానీ సంపూర్ణంగా నిర్ణయాధికారం ఉంటుందా..? జస్ట్, ఊరకే నామ్‌కేవాస్తే బాధ్యతలా..? లేదు… సంపూర్ణ బాధ్యతలు ఇస్తారు…
అవసరమైతే అప్పటికప్పుడు అణ్వస్త్రాలను ప్రయోగించే అధికారం కూడా ఉంటుంది… అంటే ఆ దేశ రక్షణ విభాగాలన్నింటికీ కమాండర్ ఇన్ చీఫ్ అధికారాలు… కమలాహారిస్‌కు వైట్‌హౌజ్ అధికారులు ఫుట్‌బాల్ అప్పగించారు… దాంతోపాటు బిస్కెట్ కూడా…! ఈ ఫుట్‌బాల్, ఈ బిస్కెట్ ఏమిటీ అంటారా..? సంకేతనామాలు…
అమెరికా అధ్యక్షుడు ఎక్కడున్నా సరే, వెంట ఓ ఫుట్‌బాల్ అని పిలవబడే బ్రీఫ్‌కేసు తప్పకుండా ఉంటుంది… అక్కడి నుంచే రిమోట్ పద్ధతిలో అణ్వస్త్రాలను కూడా ప్రయోగించగల పరికరాలున్న పెట్టె అది… దేశంపై దాడి జరిగితే, వెంటనే రక్షణకు లేదా ప్రతీకారానికి అధ్యక్షుడు అణ్వస్త్ర ప్రయోగాలకు నిర్ణయిస్తే, అప్పటికప్పుడు దానికి వీలు కల్పించే సదుపాయం అది… అమెరికా అధ్యక్షతనానికి అది ఓ ఫిజికల్ రిప్రజెంటేషన్ కూడా…
మరి బిస్కెట్ ఏమిటంటే..? ఆ బ్రీఫ్‌కేసు ద్వారా అణ్వస్త్రాలను ప్రయోగించడానికి చకచకా మీటలు నొక్కేస్తానంటే కుదరదు… యాక్సెస్ కావాలి… అథెంటికేషన్ కోడ్స్, యాక్సెస్ పవర్స్ ఉన్న ఓ కార్డు ఉంటుంది… అదే బిస్కెట్…
కమలాహారిస్‌కు అధ్యక్షబాధ్యతలతోపాటు కార్డు కోడ్స్ అన్నీ యాక్టివేట్ చేశారు… దాంతో ‘పవర్ ఫుల్’ ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్ అయిపోయింది, తాత్కాలికం అయినా సరే…! జో బైడెన్ హాస్పిటల్ నుంచి రాగానే… ఫుట్‌బాల్ వాపస్… కమలాహారిస్ యాక్సెస్ కార్డు కోడ్స్ వెంటనే డియాక్టివేట్ అయిపోయాయి..!!
Share this Article