ఆమధ్య తెలుగు పాట గురించి… సందర్భోచితం గురించి… పాత్రోచితం గురించి… సహజత్వం గురించి… ఏదేదో చెప్పుకుంటూ ఆగిపోయినట్టున్నాం కదా… అంతేకదా మరి… ఎహె, ఊరుకొండి సార్, తెలుగు సినిమా పాటల్లో విలువలు, ప్రమాణాల గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది..? సొట్టలు పడిన సత్తురేకు డబ్బాలో గులకరాళ్ల మోతలా ఓ ట్యూన్, చిత్రవిచిత్ర పదాల్ని అందులో పేర్చేయడం అంటారా..? అలాగని అన్నీ ఒకేగాటన కట్టేసి తీసిపారేయలేం కదా… సహజత్వం, పాత్రోచితం, సందర్భోచితాల గురించే తీసుకుంటే… పర్ సపోజ్, ఓ జానపదుడు, ఏదో ఆనందంలో కాస్త కల్లు తాగి, అదే ఊపులో గంతులేస్తూ ఓ పాట అందుకున్నాడు అనుకుందాం… తనకు అక్కడ ఓ త్యాగరాజు కీర్తనో పెడితే ఎలా ఉంటుంది..? అర్థమైంది కదా… అదే ఓ శాస్త్రీయ గాయకుడు వేదిక మీద కచేరీ చేస్తుంటాడు అనుకుందాం… అకస్మాత్తుగా ‘‘ఏక్ బార్, ఏక్ బార్, డప్పేసి స్టెప్పు మార్, ఏక్ బార్, ఏక్ బార్, దంచేయ్‌రో డాన్స్ ఫ్లోర్’’ అని పాట అందుకుంటే..? రాధేశ్యాంలో మరీ భావగర్భితమైన పదాలేవేవో పేర్చాడు రచయిత, అవే వింటుంటే… ఆమధ్య ఫేస్‌బుక్ మిత్రుడు Vijayakumar Koduri రాసిన ఓ పోస్టు యాదికొచ్చింది… ఆసక్తికరంగా ఉంది…
అది అయోధ్య… వనవాస తదనంతరం రాజ్యంలోకి అడుగుపెట్టిన రాముని రాకతో పుర ప్రజలు గొప్ప సంతోషంతో వున్నారు. ఆ సంతోష సందర్భంలో అయోధ్య రాజ్య ప్రజలు పాడుకునే పాట ఎట్లా వుండాలి ? ఆ పాటకు వాళ్ళు చేసే నాట్యాలు ఎట్లా వుండాలి ? ఇవి అర్థం కావాలంటే ‘అయోధ్య రాజ్య ప్రజలు అంటే ఎవరు?’ అనేది కూడా కొంత అర్థం కావాలి. 1950 లలో దర్శకుడు సి పుల్లయ్య గారు, అయోధ్య రాజ్య ప్రజలు అంటే కుల వృత్తుల వాళ్ళు, బహుజనులు, జానపదులు అని అర్థం చేసుకున్నారు. అలా అర్థం చేసుకున్నారు కాబట్టే, ఉత్తర రామాయణ కథ ఆధారంగా తీసిన పాత ‘లవకుశ’ సినిమాలో రాముడు రాజ్యంలోకి ప్రవేశించినపుడు, ప్రజలు పాడుకున్న పాటగా ‘రామన్న రాముడూ, కోదండ రాముడూ, శ్రీరామ చంద్రుడూ వొచ్చాడురా – హెయ్ – సీతమ్మ తల్లితో వొచ్చాడురా…’ అన్న జానపద గీతాన్ని పెట్టాడు.
ఆ పాటలో రాజ్య ప్రజలు స్వేచ్చగా నాట్యం చేయడం కనిపిస్తుంది. రాజును ‘అన్న’ అనీ, రాణిని ‘తల్లి’ అనీ ప్రజలు సంబోధిస్తున్నట్టు చూపిన హృదయమున్న పాట అది! కట్ చేస్తే —
Ads
దాదాపు 50 యేళ్ళ తరువాత..,
యువరత్న బాలకృష్ణ గారికి తమ తండ్రి గారు నటించిన ఆ ‘లవకుశ’ను బాపు గారితో మళ్ళీ తీయాలనిపించింది. తెలుగు ప్రేక్షకులుగా మనకు తెలుసు గదా … శైవ సాంప్రదాయ పద్ధతిలో సినిమా తీయాలంటే విశ్వనాథ్ గారు, వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో సినిమా తీయాలంటే బాపు గారు తప్ప మరెవరూ లేరని!
సరే – ఆ పాత ‘లవకుశ’ను ‘శ్రీ రామరాజ్యం’ పేరుతో తీసారు. పాత సినిమాలోలాగే, రాముడు వనవాసం నుండి తిరిగి వొచ్చినపుడు ఆ సంతోషంలో అయోధ్య ప్రజలు పాడుకునే పాట వుండాలి కదా ! బాపు, బాలకృష్ణ, ఇళయరాజా ఇతర బృందం బా…గా ఆలోచించినట్టున్నారు. ప్రజలు పాడుకునే పాట కొత్తగా వుండాలని భావించినట్టున్నారు. ఫలితం — మంద్రంగా సాగే సంక్లిష్ట పదబంధాల పాట – ‘జగదానంద కారకా .. జయ జానకీ ప్రాణ నాయకా … శుభ స్వాగతం … ప్రియ పరిపాలకా!’… (ఇది జొన్నవిత్తులతో రాయించినట్టున్నారు)
పాట వింటూ వుంటే, రాజు గారి ఆస్థాన కవులు రాసిస్తే, ఆస్థాన శాస్త్రీయ సంగీత విద్వాంసుడు స్వరపరిస్తే , ఆస్థాన గాయకులు పాడినట్టు లేదూ ? అదే కాదు, పాట తెరపై చూస్తే కూడా, ప్రజలు ఆ పాటకు పెదాలు కదుపుతూ, ఆస్థాన భరత నాట్య / కూచిపూడి కళాకారిణి రూపొందించిన నృత్య భంగిమల ప్రకారం డాన్స్ చేసినట్టు వుంటుంది తప్ప, అభిమానించే రాజు రాజ్యానికి వొచ్చినపుడు ఉత్సాహంతో స్వేచ్చగా నాట్యం చేసినట్టు వుండదు. అట్లా అని ఈ కొత్త పాట బాగా లేదా ? భలే వారే ! చాలా బాగుంది… యూట్యూబులో ఇప్పటికీ దానికి వ్యూస్ వస్తూనే ఉంటాయి…
ఇదీ ఆ పోస్ట్…. జగదానంద కారకా పాట బాగానే ఉండవచ్చుగాక… కానీ రామన్న రాముడూ, కోదండరాముడూ అనే ఆ పాత పాట ఆపాతమధురం… సహజం… లవ్లీ, లైవ్లీ… అది జనం పాట… జనంలోకి బలంగా వెళ్లిన పాట… జనం మూడ్ ఆవిష్కరించే పాట… అందుకే ఒక రాతగాడు ఏదో రాసేస్తే సరిపోదు, ఓ పాటగాడు అది పాడేస్తే సరిపోదు, ఓ సంగీతకారుడు ఓ మంచి ట్యూన్ కంపోజ్ చేస్తే సరిపోదు, అది నాలుగు కాలాలపాటు సహజంగా, సజీవంగా ఉండాలంటే… పాటకు సందర్భశుద్ధి ఉండాలి, సాహిత్యశుద్ధి ఉండాలి, సంగీతశుద్ధి ఉండాలి, గాత్రశుద్ధి ఉండాలి… అన్నింటికీ మించి దర్శకుడికి ఆ పాటలో ఏముండాలో తెలియాలి… టేస్టుండాలి..!!
Share this Article